ప్రజాకళాకారుడు ఉన్నవ నాగేశ్వరావు ఆకస్మికంగా మరణించాడు. తీవ్రమైన అనారోగ్యాన్ని దాచుకొని భూమిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఒక మనిషి భౌతిక నిష్క్రమణ చుట్టూ ఉన్న సమాజానికి అక్కరలేదు. రక్త సంబంధాలు, అభిరుచులు, కళా, సాహిత్య  సాహచర్యంలో వున్నవారికి ఆందోళన కలిగిస్తాయి.  ఈ ఆవేదన జీవితం కొనసాగింపులో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కామ్రేడ్ నాగేశ్వరరావు విప్లవ రాజకీయాలలోకి వచ్చిన కాలం నుండి మరణం వరకు ఆ రాజకీయాలకు వాహికగా పనిచేశాడు . కళారంగం ద్వారా తాను చేయదగిన పనిని నిర్వర్తించాడు. 1997లో ఏర్పడిన ప్రజా కళా మండలి లో చేరి మరణించే నాటికి కోశాధికారిగా ఉన్నాడు.

ఉన్నవ నాగేశ్వరరావుది గుంటూరు జిల్లా సత్తెనపల్లి అనే చిన్న పట్టణం.  ఆట, పాట, డప్పు చేతబట్టి సాంస్కృతిక రంగాన పనిచేయడమే కాదు ప్రగతిశీల రాజకీయాలలో మమేకమైనాడు. మూడు దశాబ్దాల సాంస్కృతిక జీవనం ఉంది .అదే సమయంలో రాజకీయ కార్యకర్తగా కూడా పనిచేశారు. గాయకుడిగా ఉంటూనే విప్లవోద్యమ భావజాల ప్రచారంలో విస్తృతంగా పనిచేసిన  శ్రామిక జన గాయకుడు. ప్రజాకళామండలి మూడు దశాబ్దాల పయనంలో నాగేశ్వరరావు వంటి కళాకారులు చూపిన చొరవ రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రజా కళా మండలి ఎదుగుదలకు చోదకశక్తి అయింది. వర్తమానకాలంలో ప్రజా కళా మండలిపై  వచ్చిన నిర్బంధంలో ఎక్కడా తలవంచక పాటను మరింతగా పదునెక్కించిన వారిలో నాగేశ్వరావు ఒకరు.

 బీదరికపు అంచుల నుండి నాగేశ్వరరావు కళారంగం లోకి వచ్చారు. పాటైనా, మాటైనా, రచన అయినా కమ్యూనిజం పట్ల విశ్వాసం ఉంది . తన ప్రసంగాల, పాట ద్వారా  మానవ విముక్తి మార్గం మార్క్సిజం అని నమ్మాడు. ఫలించబోయే స్వప్నం కోసం తనకు నచ్చిన కళారంగాన్ని సాధనంగా చేసుకున్నాడు. కళారంగాన్ని మానవ హృదయ స్పందనలను విడదీసి చూడలేం. ఈ రెండిటిని కలిగి ఉన్న సృజనాత్మక జీవిని చూసినప్పుడు ఎంత అద్భుతమనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లను, బీదరికాన్ని అధిగమించి ప్రజా కళారంగానికి ఎలా ఆకర్షితులైనారు? దీని వెనుక ఉన్న మోటివ్ ఏమిటి?

అంతరంగంలో ఏ అలజడి, ఏ విశ్వాసం మనిషిని రాజకీయ సాంస్కృతిక యోధుడిగా మలిచింది. ఏ స్థానం దగ్గర నాగేశ్వరావు కృషిని అంచనా వేయాలి?

 విప్లవోద్యమం ఎదుగుదల అది వేసిన ప్రభావాలు ఒకవైపు. రెండోవైపున భారత ప్రజాస్వామ్యపు భరోసా సన్నగిల్లడం.  భారతదేశం శిధిలగృహం కావడం వెనుక గల రాజకీయ కారణాలును వెతికే పనిలో నాగేశ్వరావుకు కళారంగం ఆలంబనైంది. వ్యక్తిగత జీవితంలోని శూన్యత మరింతగా కళారంగాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి కారణం. కనీస జీవీకకు భరోసా లేదు. కేవలం అభినివేశమే సరిపోదు. విప్లవోద్యమ ప్రచారకుడిగా పాట ,ఆట రచన నాగేశ్వరావుకు కళాయుధమయింది.

తెలుగునేలపై ఏ కార్యక్రమం జరిగినా  ప్రజా కళా మండలి  తరుపున రాణి, నాగేశ్వరరావు  కంఠం తప్పక వినబడేది. వేదిక ఎవరిది? అనేది లేకుండా ప్రగతిశీల భావజాలం ఉంటే చాలు . ఎక్కడా తన గాత్రాన్ని వాణిజ్య విలువగా నాగేశ్వరావు భావించలేదు. పాటను కేంద్రం చేసుకుని జీవితంలో ఎగబాకాలనే స్వార్థ చింతనను దరి చేరనీయలేదు . ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల పరంపరలో మానవుని పాట్లు మాత్రమే అతని గానం . ప్రజా ఉద్యమాలకు పాట ఊతమివ్వాలని ఆకాంక్ష ఉండేది. పరిశీలన, అధ్యయనం నుండి తనని తాను నిర్మించుకున్నాడు. సమిష్టి తత్వంలో వ్యక్తిగా కాకుండా ప్రజా కళా మండలి గా గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేశాడు .ఒక కళాకారుడి జీవనకాలం విశ్లేషించే క్రమంలో జీవితం, కళారంగం, భావజాలం ఈ మూడింటి అనుసంధానం లేకపోతే ఎక్కడో ఒకచోట తనలోని గాయక తత్వం ఆగిపోతుంది.

 జీవితం, దాని రాపిడి సహజం. నాగేశ్వరరావు మరణించిన  మరుక్షణం  ప్రజాసంఘాల మిత్రుడు సరైన  వైద్యం అందక నాగేశ్వర రావు చని పోయాడు అన్నాడు.   

రెండు వారాల  క్రితమే నెల్లూరు  కగార్ వ్యతిరేక మీటింగులో ఆడి పాడిన వాడు ఇంతలో ఎలా  నిష్క్రమిస్తాడు. తనలోని అనారోగ్యాన్ని దాచుకున్నాడు. ఈ అనారోగ్యం శారీరకమైనదా! మానసికమైనదా! సరిగ్గా ఏడాది  క్రితం 2023 అక్టోబర్ 1వ తేదీన ఉదయం నాగేశ్వరావు ఇంటిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నది. ఏడాది తర్వాత నాగేశ్వరరావు శవంగా మారాడు .ఎన్నడూ లేనంతగా ప్రజా కళా మండలిపై నిర్బంధం ఎక్కువైంది. సాంస్కృతిక రంగంలో పాటకు నిర్బంధం కొత్త కాకున్నా ఇది మానసికంగా, శారీరకంగా నాగేశ్వరరావుని వేధించింది. మానసిక వేధింపులు   అనారోగ్యానికి దారిచేసాయి. తన శారీరక రుగ్మతలు గుర్తించడంలో విఫలమైనాడు.  లేదా నిర్లక్ష్యం చేశాడు .విఫలం అనే మాటను రాజకీయ విశ్వాసం నుంచి చూడాలి. ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మరింతగా ప్రజా ఉద్యమాలలో భాగం అవ్వడం వెనక లక్ష్య సాధన వుంది.

నాగేశ్వరరావు జీవించిన చివరి పది సంవత్సరాలు విప్లవోద్యమ శిబిరానికి పరీక్షాకాలం. ఈ కాలంలో నిర్వర్తించిన భూమిక ఏమిటి? నిర్బంధ వ్యతిరేక  వేదికలలో ప్రజా కళా మండలి పక్షాన నాగేశ్వరరావు ఉన్నారు. పోలీస్ వేధింపులు విచారణలో దాడుల మధ్య ఒక కళాకారుని జీవనం గడిచింది.  ఈ ఆకస్మిక మరణం వెనుక రాజ్య స్వభావం ఉన్నది. వెంటాడి, వేటాడి  వేధింపుల కారణంగా ఈ అమరత్వాన్ని అంచనా వేయాలి. రాజ్యహింసలో భాగంగా  ఈ మరణాన్ని చూడాలి. నిత్య చలనశీలిగా ఉంటూ రాజ్య ధిక్కారాన్ని వినిపించిన గాయకుడు ఊపిరితిత్తులు  పనిచేయక పోవడంతో మరణించాడు .అత్యంత వేగంగా మరణానికి చేరువైనాడు .చివరకు వైద్యులు కూడా న్యాయం చేయలేక పోయారు .ప్రజా కళాకారుల్ని రక్షించుకోవడం లో పొరపాట్లు ఉన్నాయి. ఇటీవల ప్రజా కళా మండలి సభ్యుల వరుస మరణాలు ఒక  ఉదాహరణ. సత్తెనపల్లిలో సరైన వైద్య సౌకర్యాలు  లేకపోవడం గుంటూరు మెడికల్ హాస్పిటల్ లో  మృత్యువుకు చేరువు కావడం ఇవన్నీ వేగంగా జరిగిపోయాయి. మొత్తం వ్యవహారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వున్నాయి.

ప్రజా కళాకారుని చివరి వీడ్కోలుకు రెండు రాష్ట్రాల నుండి ప్రజాసంఘాల మిత్రులు హాజరైనారు. సత్తెనపల్లిలో జనవాహిని మధ్య నాగేశ్వరరావు  చివరి యాత్ర ముగిసింది. మౌనంగానే మట్టిలోకి చేరిపోయాడు. ఎర్రటి  జెండా,  ఉద్యమ గీతాన్ని ఆస్వాదించాడు. గాత్రం, శరీరం మట్టిలో  కలిసిపోయాయి.

నిర్బంధ కాలంలో అనేకసార్లు కలిసి సహచర్యం పొందిన ఉద్యమ సహచరులకు నాగేశ్వరరావు భౌతిక నిష్క్రమణ బాధాకరమే. ఆ గాయకునికి కుటుంబం ఉంది. నాగేశ్వరావు, రాణి ,  నైనా ఈ ఆపద  సమయాన్ని ఎలా అధిగమిస్తారు.  ఈ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు?  ఆయన  నిష్క్రమణ తర్వాత మరింత  పదునుగా ప్రజా కళా మండలి పనిచేయగలగాలి. కుటుంబాన్ని భాగం చేయగలగాలి. దానికి తగిన వాతావరణాన్ని  ప్రజా కళా మండలి మాత్రమే కాదు విప్లవ శిబిరం  ఆలోచన చేయాలి. విప్లవోద్యమం తయారు చేసిన కళాకారుడు.ఈ ఎరుక, రాజకీయ స్పష్టత నాగేశ్వరావులో  వుంది.  కళారంగంలో ప్రజా కళా మండలి స్థానాన్ని   సుస్థిరం చేయాలనే భావన ఉంది .

ఆయన కళ, రాజకీయాలు కలగలిసిన సాంస్కృతిక రాయబారి.  అలసట ఆందోళన లేని జీవి. అయితే మానసిక  అంతరంగాన్ని  ఎవరు ఒడిసి పట్టగలరు.  రాజ్యదాడి కూడా మానవ జీవితాన్ని  హరింప చేస్తుంది. నలుగురిలో నడయాడిన స్వరం నిష్క్రమించడం వెనుకు కారణాలు రాజ్యం లోనే ఉన్నాయి. ప్రజా కళాకారుల జీవితాన్ని  ధ్వంసం చేసే అనేక కుటిల యత్నాలకు రాజ్యం ఒక కేంద్రం.  ఇవాళ దేశంలో అమలవుతున్న పాసిజం మూలాలు మనుషులందరి    వరకు నడిచి వచ్చాయి.  ఇదొక విధ్వంసపు సాంస్కృతిక రాజకీయ క్రీడ. ఈక్రీడలో  ఫాసిజం దాగి వుంది.  నాగేశ్వరరావు మరణం వెనుక ఫాసిజం ఉంది . రాజ్య  నిర్బంధం ఉంది . ఇవి బైటికి కనపడకుండా ఆయనను హత్య చేశాయి .  దేశంలోని ఏ ప్రజా కళాకారుని ఆకస్మిక మరణమైనా కళారంగంపై మోపుతున్న  ఉక్కు పాదంగా చూడాలి. అప్పుడే ప్రజా కళాకారుల అర్థాంతర మరణం వెనుక దాగిన వాస్తవికత బయటపడుతుంది.

ప్రజా కళా మండలి నాగేశ్వరావు మరణ సమయంలోనైనా,  ఫాసిజం అది విస్తరిస్తున్న అనేక మార్గాలపై చర్చ జరగాలి. ఒక ఆరోగ్యవంతమైన కళాకారుడు అర్ధాంతర భౌతిక నిష్క్రమణ వెనుక అతను పడిన మానసిక సంఘర్షణ పాసిజంలో మిళితమై ఉన్నది. బహుశా పైకి కనపడని ఛాయలు ఉండవచ్చు. పదేళ్ల కాలంలో అనేక మరణాల వెనుక భారతీయ జనతా పార్టీ అమలపరుస్తున్న పాసిజం  అనేక రూపాలలో వ్యక్తమౌతుంది.

Leave a Reply