ఏ వివాదానికైనా పరిష్కారం ఉండవలసిందే. అసలు వివాదమే లేనప్పుడు పరిష్కారం వెతకడం వృధా ప్రయాస.  భారతదేశానికి ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. యోగి పాలనలో ఏం జరుగుతోందో  తెలిసిన విషయమే. గుజరాత్ నమూనా తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రయోగం కొనసాగుతోంది. ప్రజల దైనందిక జీవనంలో జోక్యం ఎక్కువవుతోంది. ఈ జోక్యం బహురూపాలలో వ్యక్తం అవుతోంది.  ఈ నమూనా భారతదేశం అంతటా విస్తరించవచ్చు. భారతదేశ పని సంస్కృతిలో ఉన్న సంబంధాన్ని విడదీసే ప్రయత్నం యోగి ప్రభుత్వం చేస్తోంది. క్షురక, దర్జీ వృత్తులలో ఉన్న పురుషుల దగ్గరకు స్త్రీలు వెళ్ళకూడదు. స్త్రీలు తమ అవసరాల కోసం స్త్రీల దగ్గరికి వెళ్ళాలి. ఇదొక రకం విభజన.  స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన విభజనకు ఇదొక సూచిక . వృత్తి పనులలో  జెండర్ తేడా ముగిసి చాలా కాలం గడిచింది. దీనిని కాలం రుజువు చేసింది. వివిధ వృత్తులలో జెండర్ బేధం లేకుండా అనేకులు ప్రవేశిస్తున్నారు. తమ సామర్థ్యాన్ని నిరూపణ చేసుకుంటున్నారు. దీన్ని కొందరు అంగీకరించడం లేదు . ఒక పురోగమనాన్ని అడ్డుకునే  వితండవాదం ఇది. తద్వారా ఒక ముఖ్యమంత్రి దేనిని సాధిస్తారు అనేది ఒక ప్రశ్న.

ఉత్తరప్రదేశ్ వర్తమానంలోనే ఉంటుంది . తొంభైల తర్వాత భారతదేశ రాజకీయాలలో ముఖ్య భూమిక వహిస్తున్నది.  భౌగోళికంగా రాష్ట్రం పెద్దది కావడం వలన రాజకీయాల ఆట ఉండవచ్చు. అయితే ఆ రాజకీయాల ప్రతిస్పందనలు ప్రజల కేంద్రంగా ఉండాలి.

ఆలయాలు, మసీదు వివాదాలు ఉత్తరప్రదేశ్ లో పరంపరగా వస్తుంటాయి. గడిచిన శతాబ్దాలలో ఏం జరిగింది ? ఏఆధిపత్య సంస్కృతిలో ఏగుడి కాలగర్భంలో కలిసిపోయింది? ఏ మసీదు నిర్మాణమైంది?  ఇదొక గతించిన చరిత్ర . వర్తమానంలో ఈ కాలం నుండి మనుషులు చాలా దూరం జరిగారు. విశ్వాసాల పునాది ఉంటుంది . కానీ చరిత్రలో జరిగిన విధ్వంసాలకు ఈనాటి ప్రజలు జవాబు దారులు కారు. ఇది గతించిన  చరిత్ర. ఈ చరిత్రకు వర్త  మానానికి సంబంధం లేదు. ఇక్కడి నుండి చాలా దూరం నడిచింది. విశ్వాసాల పునాదిని గడిచిన కాలం నుండి అంచనా వేయలేం.

అయోధ్య అధ్యాయం ముగిశాక  సంఘ్ పరివార్ ఆనేక దారులు వెతికింది. శతాబ్దాల క్రితం గుడిని కూల్చి మసీదులు నిర్మించారని సంఘ పరివార్ అంటున్నది. కాబట్టి ఆ స్థలాన్ని హిందూ ధార్మిక సంస్థలకు కేటాయించాలి అనేది దాని నిర్ణయం. సుప్రీం కోర్టు  అనుకూల తీర్పు ఉండనే ఉంది. సర్వే చేసి మా స్థలాన్ని మాకు కేటాయించాలి. ఇక్కడే పేచీ మొదలవుతుంది. మెజారిటీ ప్రజలలోకి ఈ స్థలం మనదే అనేది నిదానంగా చేరుతుంది.   ఇక్కడ మతం, దేవుడు , రాజకీయాలు ముఖ్య భూమికను  పోషిస్తాయి. వివేచనతో, తర్కంతో పనిలేదు . చరిత్ర అనేది అంతిమ నిర్ధారణ కాదు. గడిచిన కాలమంతా రక్తగాయాల విధ్వంస, విస్తాపిత చరిత్ర. మానవుల  ఆలోచనల దారిలో గతం తాలూకా పరివేదన వుంది. ప్రపంచం ఒక దేశ భిన్నత్వాన్ని గౌరవించడం వెనుక ఈసహన సంస్కృతి ఏదో ఒక దశలో ఇమిడి ఉన్నది.

ముస్లింలకు, హిందువులకు అత్యంత ఆరాధనా స్థలం అజ్మీర్ దర్గా. ఒక శివాలయాన్ని కూల్చి అజ్మీర్ దర్గాను నిర్మించారని ఒక వాదన ముందుకు వచ్చింది. రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా పురాతనమైనది. భారతీయులు మతాలకతీతంగా దర్శించుకునే దర్గా. హిందుత్వ ప్రయోగం మసీదుల నుండి దర్గాల వరకు కొనసాగుతుంది. ఈ విశ్వాసం ఈదేశపు బహుళత్వానికి ఆలంబన. చరిత్రలో ఏం జరిగిందో సాక్షాలు లేవు. అంతా ఊహాజనితం. శతాబ్దాల జీవన సంస్కృతిలో విశ్వాసాల ఆధారంగా భారత సమాజం రూపొందింది. అనేక  విశ్వాసాలు భారతీయులందరినీ సమానం చేసాయి. ఒక నాగరిక సమాజాన్ని ఎలా అంచనా వేస్తాము? శాస్త్ర, విజ్ఞాన నైపుణ్యాన్ని మానవ ప్రగతికి సూచికగా చూస్తాము. గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటి వెనుక ఉన్న చలన సూత్రం ఒకటే. ఈ నే లను ఎలా స్వీకరించావు? రేపటికి ఈ నేలను ఎలా సిద్ధం చేస్తాం!  అజ్మీర్ దర్గా కింద పురాతన శివాలయం ఉందనే చర్చ అర్ధరహితం. ఈ అనవసర వాదన భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం మానవ వికాసంపై పడుతుంది. అంతిమంగా ప్రజల మధ్య అగాధం నెలకొంటుంది. భయకంపిత  భారత సమాజం రూపుదిద్దుకుంటుంది. జ్ఞానవాపి , సంభాల్, అజ్మీర్  వీటి కింద హిందూ దేవుళ్ళ అస్తిత్వం ఉంది కాబట్టి  సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి  తిరిగి సర్వే చేయాలని న్యాయ స్థానాలలో అనేక కేసులు వేస్తున్నారు . ఇది ఒక చెడు సాంప్రదాయం. ఈ కారణంగా అనైక్యతల భారతసమాజం ఏ వైపుకు వెళుతుంది?

1947 అనంతరం ఏం జరిగింది  అనే దగ్గర ఆగుదాం.  ప్రార్ధనా మందిరాల పట్ల యధాతధ స్థితిని కొనసాగించాలని ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపి ఈ ఒప్పందానికి అనుకూలంగానే వున్నాయి.  ఈ కాలం మన ముందటి కాలం . చరిత్ర లో ఏం జరిగింది? ఏ మసీదు కింద ఏ దేవుడు అనే చర్చకు అవకాశం లేదు. సంఘ పరివార్ భారత సమాజాన్ని బ్రాహ్మణ భావజాల నిర్మితి ఉన్నది. భక్తి, మతం, దేవుడు ఈ భావవాద పునాది నుండి ప్రజలను సమీకరించడం తేలిక. ఇంకా అర్థం కాకుంటే చరిత్ర అనేక పాఠాలు నేర్పింది. చరిత్ర నుండి చాలా దూరం నడిచి వచ్చాము. ఆ దారిలో చీకటి వెలుగులు ఉన్నాయి. చీకటిని వెలుగును సమానంగా స్వీకరిస్తూనే వర్తమానాన్ని అంచనా వేసుకోవాలి.

విశాలమైన భారతదేశంలో అనేక వివాదాలు ఉంటాయి. అవి గ్రామాల నుండి నగరాల వరకు విస్తరిస్తాయి. అయితే మనుషులు విశాలం కావడానికి ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలు రాజకీయాలు అతీతంగా పని చేయాలి. మానవ సమాజం ఎలా ఉండాలి దాని చుట్టూ ఉన్న భౌతిక ఆవరణ  కీలకమైన విషయం. పిల్లలు ఆడుకునే క్రీడా స్థలాన్ని బహుళ అంతస్తులను నిర్మించాలనే భావన వెనుక పిల్లల ఆవేదన ఉంటుంది. తమ క్రీడాస్థలం అదృశ్యం కావడం వెనుక ఏశక్తులు ఉన్నాయి అన్న ఆలోచన ఆ చిన్ని హృదయాలకు చేరడానికి చాలాకాలం పట్టవచ్చు. అయితే ఒక క్రీడాస్థలం లేకపోవడం వలన ఆ పసివాళ్ళ మానసిక శారీరక  వికాసం ఏమవుతుంది? కాలం మనుషులని కలిపి ఉంచుతుంది. మతం, కులం రంగు, ఆర్థికం  వీటి మధ్య ఒక పెనుగులాట నుండి వికాసం చెందుతుంది. శ్రామిక సంస్కృతి నుండి విశాలమవుతుంది. సహన సంస్కృతి నుండి మరింత బలపడుతుంది. ఎన్ని అవరోధాలున్నా భిన్న విశ్వాసాల మధ్య సామరస్యం నుండి తిరిగి  మొలకెత్తుతుంది.

సంభాల్ లో  పోలీసు కాల్పులలో ఐదుగురు మరణించారు. వారి ప్రాణాలను ఏభారత ప్రజాస్వామ్యం తిరిగి ఇవ్వగలదు?  మందిరాలను దాని వెనుక దాని కింద ఉన్న శిధిలాలను తిరిగి చూడడంలో హింస వున్నది.  దేవుడు ఒక నమ్మకం .సైన్స్, టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో అభౌతిక స్వరానికి స్థానం లేదు.  తిరిగి ఆస్థానాన్ని చేరే వారికి నాగరిక సమాజపు ఆవరణలో జీవించడానికి అర్హత ఉన్నదా?

మన కాలంలో ఫాసిజం సంబంధించిన చర్చ నడుస్తుంది. స్త్రీల నుండి పురుషులను వేరు చేసే క్రమం. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి . రాజ్యాధికారం ఇవన్నీ విశ్వా సాలలో భాగం.  తేనె తుట్టను కదిలించారు మనుషులను చేరి అవి కుడుతున్నాయి. మానవుడు మాత్రం తేనెను ఆస్వాదించాలని ఆశిస్తాడు. అలా అని తేనెటీగల  సంహరణ అతనిలో  లేదు . మానవ స్వభావంలో ఆర్ధత, కరుణ ,దాగి ఉన్నాయి. సంపూర్ణ రాజ్యాధికారం కోసం ఏఅడుగైనా వేయవచ్చు. ఆ పాదం విశ్వాసాలపై నడిచే అణచివేతగా ఉండకూడదు.

ఇవాళ భారతీయ ముస్లిం అడుగుతున్నట్లుగానే బంగ్లాదేశ్ లో హిందువులు కూడా అభ్యర్థిస్తున్నారు. జీవనం కంటే విశ్వాసం ముఖ్యం ఆయింది . ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ కృష్ణ దాస్ బంగ్లాదేశ్ హిందువులుపై దాడిని పట్టించు కోవడం హిందూత్వ వాదుల  నుండీ  వినబడుతుంది.  ఈ ఆరోపణ క్రమంలో ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న కీలకం.ప్రపంచం అనేక  దొంతర్ల పై ఉన్నది. ఇక్కడ చాలా సున్నితమైన విషయాలు అత్యంత హింసాత్మకంగా మారుతాయి. ఇవాళ బంగ్లాదేశ్ కావచ్చు రేపు ఇంకే దేశమైనా.

ప్రపంచం ఇవాళ అగ్ని గుండం .సామ్రాజ్యవాదం, హిందుత్వ వంటి అంశాలు సంస్కృతి రూపంలో మనుగడలోకి వస్తున్నాయి. ఇది ప్రమాదకర సంకేతం. వీటిని దాటి చాలాదూరం నడిచివచ్చాము. పెట్టుబడి, సామ్రాజ్యవాదం వీటిని మోసే అధికార వ్యవస్థ ప్రజల్ని అనేక ముక్కలుగా విభజించాలని ప్రయత్నం చేస్తున్నది. దీనిని ఏదో ఒక దశలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి, జీవన విధానం ద్వారా సమాధానం చెప్పగలగాలి. భారత సమాజం శతాబ్దాలు ప్రయాణంలో అనేక అవరోధాల మధ్య నడిచింది. ఇది కాదనలేం. భిన్న విశ్వాసాల ప్రయాణంలో ఈ దేశంలోని జీవనదులు సముద్రంలో కలిసినట్లే అనేక విశ్వాసాలు, మతాలు, మనుషులు భారతదేశపు  పునర్ నిర్మాణంలో శ్రమ సంస్కృతిని వ్యాప్తి చేశారు ఇది వాస్తవం.

Leave a Reply