పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య హింస, సామూహిక నిర్వాసిత్వం, వదలివేయబడటం వంటి తీవ్రమైన ప్రమాదాలతో వారు పోరాడుతున్నప్పుడు 8వ తేదీ వారికి ప్రాముఖ్యతలేని వేడుక అవుతుంది. తమ పనిలో వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నప్పటికీ, ముందు వరుసలో నిలబడి ప్రతికూలతను తట్టుకు నిలబడేవారి  కథనాలను పంచుకోవడం, వారి బాధలకు సాక్ష్యమివ్వడం పైనే వారి దృష్టి ఉంటుంది.

ముట్టడి – ప్రభావం

ఏ యుద్ధంలోనైనా భయానక అనుభవాలు అనుభవించడం ఒక అసమానమైన పరీక్ష.

ఏదేమైనా, ఆ యుద్ధ స్వభావం సైనిక శక్తిని కలిగినవారు దశాబ్దాలుగా ఆక్రమణ, ముట్టడిలో ఉన్న జనాభాను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశ్యం అయినప్పుడు కష్టాలు మరింత దారుణంగా వుంటాయి. ప్రజలు ఇప్పటికే ఆకలి, వ్యాధి, నిరాశ నిస్పృహలతో మరణిస్తున్న

గాజా విషయంలో, ఇజ్రాయెల్ తనకు కావల్సినంత సమయాన్ని తీసుకుంటుంది; పాశ్చాత్య శక్తుల మద్దతును ఉపయోగించుకుంటుంది; గట్టిగా బిగించిన ఆక్రమిత ప్రాంతంలో నెలల తరబడి యుద్ధాన్ని పొడిగిస్తుంది.

జర్నలిస్టులుగా మనకు ఎలాంటి రక్షణ లేదు. గాజాలోని మనమందరం ఇజ్రాయెల్‌కు నులివెచ్చని రక్తం మాత్రమే. నిరంతర మరణ ముప్పు, ఆశ్రయం, ఆహారం, మందుల కొరత, వివిధ రకాల భయాలను, నిర్లక్ష్యాన్ని, ఊహకందని బాధలను అనుభవిస్తున్న ప్రజలు; గతేడాది అక్టోబరు నుంచి గాజాలో ఇదే వాస్తవం.

ఇజ్రాయెల్ సైన్యానికి ప్రత్యక్ష లక్ష్యంగా వున్నప్పటికి, దుర్భర పరిస్థితుల ఎదురైనప్పటికీ, గాజాలోని ధీర జర్నలిస్టులు ఈ నీచ యుద్ధాన్ని పట్టుదలతో నిత్యం రికార్డు చేసి, వాస్తవాలను పంచుకోకపోయి ఉంటే, ఈ బాధాకరమైన వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేవి కాదు.

ప్రపంచం ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో, గాజా లోని పలువురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ రకాల కష్టాల గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది.

పాలస్తీనా జర్నలిస్టులు, మహిళలు, పురుషులకు కూడా ‘ఆక్రమణ నేరాల’నుండి ఎటువంటి ప్రామాణిక రక్షణ హామీ వుండదు.

ముందు భాగాన వుండి రిపోర్టు చేయడం : గాజాలో మహిళా జర్నలిస్టుల దుస్థితి

ఆక్రమణ వల్ల కలిగే ప్రమాదం ఉన్నప్పటికీ, పాలస్తీనా మహిళలు పాత్రికేయ వృత్తిని ఎంచుకోవడం, తమ వృత్తి పట్ల అచంచలమైన నిబద్ధతను కలిగివుండడం పాలస్తీనా మహిళల ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యానికి, పాలస్తీనా మీడియా దృశ్యాన్ని రూపొందించడంలో వున్న వారి మార్గదర్శక పాత్రకు నిదర్శనంగా వున్నాయి.  జర్నలిస్టు రంగంలో పాలస్తీనాలోని మహిళా జర్నలిస్టులు, ముఖ్యంగా పాలస్తీనా భూభాగాలలో ఇజ్రాయెల్ ఆక్రమణతో ఘర్షణల సమయంలో ప్రముఖ పాత్ర పోషించారు. అల్-అక్సా మసీదు నిరంతర ఆక్రమణలు, జెనీన్ శరణార్థి శిబిరం పైనా, నాబ్లూస్ నగరం, అలాగే పశ్చిమ తీరంలోని ఇతర నగరాలపై జరిగిన దాడుల గురించి  వారు బయటి ప్రపంచానికి సమాచారమందించారు. గాజాపట్టి లోని ప్రజలకు వ్యతిరేకంగా 2023 అక్టోబరు 7వ తేదీ నుండి జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం గురించి వారు చురుకుగా రిపోర్టు చేసారు. గాజా ప్రజలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని నేరుగా రిపోర్ట్ చేస్తున్నారు.

ఈ ఘోరమైన నేరం కొనసాగుతున్న కొద్దీ, సార్వత్రిక మానవ విలువలగా ప్రచారం చేయబడిన వివిధ సూత్రాలు వేగంగా క్షీణించడాన్ని ప్రపంచం చూస్తూంది; వాటిలో ప్రధానమైనది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం జీవించే, స్వేచ్ఛ, భద్రతల హక్కు.

రక్షణ లేని స్వరాలు- పాలస్తీనా జర్నలిస్టుల  ప్రమాద స్థితి :

పాలస్తీనాలో జర్నలిజం వృత్తికి రక్షణ, మద్దతు లేకపోవడం గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, ఇతర ఘర్షణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు విరుద్ధంగా వీరి నిబద్ధత కొనసాగుతోంది. పాలస్తీనా జర్నలిస్టులు, పురుషులు, మహిళలు కూడా, ఆక్రమణ నేరాల నుండి ఏ విధమైన ప్రామాణిక రక్షణను పొందే హామీ లేని వాస్తవాన్ని అనుభవిస్తున్నారు.  కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (జర్నలిస్టుల రక్షణా కమిటీ) నివేదిక ప్రకారం, గాజాపై కొనసాగుతున్న యుద్ధం జర్నలిస్టులకు ఇప్పటివరకు జరిగిన యుద్ధాలన్నింటికన్నా “అత్యంత ప్రాణాంతకం”గా ఉంది. 2023 చివరి రెండు నెలల్లో ఒకే ప్రాంతంలో, చాలా తక్కువ వ్యవధిలో అత్యధిక సంఖ్యలో మీడియా సిబ్బంది మరణించారు. కమిటీ, పాత్రికేయులపై దాడులను పర్యవేక్షిస్తున్న ఇతర సంస్థల సూచనల ప్రకారం ఈ ధోరణి 2024లో కూడా దిగ్భ్రాంతి కలిగించే తీవ్రతతో కొనసాగింది.

ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బలవంతంగా తరలించే సమయంలో వృత్తికి సంబంధించిన ముఖ్యమైన కొంత సామగ్రిని కోల్పోవడం వల్ల అనేక మంది మహిళా జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

ఈ ప్రమాదాలు కనిపించే అంకెల కంటే చాలా ఎక్కువగా వుంటాయి. పాలస్తీనా మహిళా జర్నలిస్టులు కేవలం తమ విధినిర్వహిస్తున్నందుకు నిరంతరం బెదిరింపులు, వేధింపులు, భయాందోళనలు, శారీరక దాడుల వంటి నిరంతర ముప్పులను ఎదుర్కొంటున్నారు. తమ సముదాయాల స్వరాలను విస్తరించాలనే, సత్యాన్ని బహిర్గతం చేయాలనే బాద్యతా భావం వారి ధైర్యాన్ని, సంకల్పాన్ని మరింతగా పెంచుతుంది. వారి అంకితభావం పాలస్తీనా పౌర ప్రతిఘటనకు ఒక శక్తివంతమైన సాక్ష్యం. మహిళా జర్నలిస్టులందరికీ ఒక శక్తివంతమైన ఉదాహరణ.  మరింత సమాచారాన్ని సేకరించడంలో, న్యాయమైన ప్రపంచాన్ని రూపొందించడంలో జర్నలిస్టులకు వున్న కీలక పాత్రను మనకు గుర్తు చేస్తారు.

కాల్పుల మధ్య జర్నలిజం: గాజాలో అత్యంత ప్రమాదకరస్థితిలో సమాచార సేకరణ

గాజా పట్టీలో మహిళా జర్నలిస్టుల దుస్థితిని వివరిస్తూ “నేను జర్నలిస్ట్‌ను మాత్రమే కాదు, తల్లిని, భార్యని, చెల్లెలిని కూడా. నిరాశ్రయమూ, సురక్షిత ప్రాంత అన్వేషణల్లో నా హృదయం ముక్కలైపోయింది. అయినప్పటికీ నేను నా పాత్రికేయ పనిని కొనసాగించేందుకు ఎంచుకున్నాను” అని అల్-శార్క్ టీవీ కోసం పని చేసే జర్నలిస్టు నూర్ అల్-స్వీరీ అంటారు.  ఆక్రమణ సైన్య కార్యకలాపాలు, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లకు సంబంధించిన తమ సాహసోపేత గాధను వివరించారు.

గాజా లోని భయంకరమైన జీవన పరిస్థితులు మహిళా జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని  అల్-సవేరి ఎత్తి చూపారు.  విశ్రాంతి తీసుకోవడానికి లేదా కోలుకోవడానికి గోప్యత గల స్థలం లేకపోవడం పరిస్థితిని మరింత యిబ్బందికరంగా చేసింది.

యుద్ధ రంగంలో పనిచేసే చాలామంది ప్రాథమిక రక్షణ లేదా వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా భయమూ, గందరగోళాల సుడిగాలి మధ్యలో కాలిబాటలపై, బహిరంగ ప్రదేశాలలో టెంట్‌లో నిద్రపోవాల్సి వస్తుంది. యుద్ధం ఆరంభ మూడు నెలల కాలంలో మహిళా జర్నలిస్టులకు తమ పిల్లలను చూడడానికి కూడా వీలుకాలేదు.

అదే సందర్భంలో, గాజా లోని మహిళలు, ప్రత్యేకించి మహిళా జర్నలిస్టులు అనుభవించే లోతైన మానసిక వేదనలను అల్-సవేరి వివరించారు. ఈ నిరాశ శాశ్వతంగా మానసికంగా దెబ్బతీస్తుంది. సురక్షితమని ప్రకటించిన ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులను తీవ్రతరం చేయడంతో,  వారి కుటుంబాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం వల్లనూ,  తమ జర్నలిస్టు విధులను నిర్వర్తించడానికి వారాల తరబడి యుద్ధ రంగంలో చిక్కుకుపోవడం వల్లనూ యుద్ధ ప్రారంభ మూడు నెలల్లో చాలామంది మహిళా జర్నలిస్టులు తమ పిల్లలను చూడలేకపోయారు. మహిళా జర్నలిస్టుల పనిని సులభతరం చేయడానికి సాపేక్షంగా అనుకూలమైన పని పరిస్థితులను అందించడానికి అనేక స్థానిక సంస్థలు సమన్వయ ప్రయత్నాలు చేస్తున్నాయి.

భయంకరమైన పరిస్థితి, సైనిక దురాక్రమణ, ఆకలిమంటలు :

గాజా పట్టీలో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు ఇజ్రాయెల్ చేస్తున్న ఆకలి యుద్ధంతోనూ గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేపడుతున్న నిరంతర దాడులతోనూ విడదీయరానివి అని నవా నెట్ వర్క్ జర్నలిస్ట్ అయిన మోనా ఖదర్ నొక్కిచెప్పారు. సురక్షితమైన జర్నలిజానికి అనువైన ప్రదేశాలను నాశనం చేసింది. ప్రత్యేకించి యుద్ధ సమయంలో 160 రోజులకు పైగా నిరంతర విద్యుత్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ అంతరాయాలు ఉన్నాయి. ఈ విపత్తు గురించి ఖాదర్ ఇలా అన్నారు: ” సురక్షితమైన స్థలం కోసం మేము గాజాలోని అనేక ప్రాంతాల్లో తిరిగాం కానీ ఎక్కాడా దొరకలేదు. గాజాలో ఎక్కడా సురక్షితమైన స్థలం లేదు,  జర్నలిజం అనే కవచం లేదా దాని హెల్మెట్ ఏ రక్షణను కలిగించదు. “

“గాజాలో ఆసుపత్రులు, రెడ్ క్రెసెంట్ సొసైటీలు వంటి సురక్షిత ప్రదేశాలలో నిరంతర దాడుల కారణంగా మహిళా జర్నలిస్టులు పనిచేసే, నివసించే వాతావరణంలో అస్థిరత వుంటుంది” అని ఖదర్ వ్యాఖ్యానించారు. మహిళా జర్నలిస్టుల పనిని సులభతరం చేయడానికి సాపేక్షంగా అనుకూలమైన పని పరిస్థితులను అందించడానికి అనేక స్థానిక సంస్థలు సమన్వయ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె వివరించారు. ఇటువంటి కార్యక్రమాలలో ఒకటి “ఫిలిస్టినియట్ ఫౌండేషన్”, ఇది విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలతో  కూడిన ప్రత్యేక టెంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏర్పాటు నిర్వాసిత శిబిరాల్లో వారి పనిని సులభతరం చేస్తుంది.

అదే సందర్భంలో, ముఖ్యంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బలవంతంగా తరలించే సమయంలో ముఖ్యమైన కొన్ని పాత్రికేయ పరికరాలని కోల్పోవడం వల్ల పత్రికా పనిలో నిరంతరతను నిరోధించే భౌతిక, ఆర్థిక సవాళ్ళను ఖదర్ వివరించారు. స్థానిక సంస్థలు, మీడియా ప్రాజెక్టుల్లో పనిచేసే మహిళా జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితికి దారితీసింది . పాత్రికేయులకు ఎలాంటి రక్షణ లేదు. ఇజ్రాయెల్‌కు గాజాలోని మనమందరం కేవలం నులి వెచ్చని రక్తం మాత్రమే.

వారు తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో మరణించిన వారిలో తమ స్వంత కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారనే విషాదకర నిజాన్ని కనిపెట్టడం మహిళా జర్నలిస్టులపై తీవ్ర మానసిక ప్రభావాన్ని కలిగించింది. సంఘర్షణ ప్రాంతాల్లోని రిపోర్టర్లకు ఇటువంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. వృత్తిపరమైన బాధ్యతతో ఈ వ్యక్తిగత విషాద కలయిక జర్నలిజంలో ఒక ప్రత్యేకమైన, బాధాకరమైన సవాలును సూచిస్తుంది.

గాజాలో మహిళా జర్నలిస్టులు- కష్టభరిత జీవితం, అసాధ్యమైన పని:

“ఓరి దేవుడా, మరీ యింత భరించలేం! కేవలం ఒక బాటిల్ నీళ్ళ కోసం  10 గంటలపాటు క్యూలో నిలబడటమా?“

ఈ మాటలతో, గాజా పట్టీలో ఉత్తరభాగాన చిక్కుకున్న స్వతంత్ర జర్నలిస్టు అమ్నా ముస్తహా తాను, ఇతరులు ఎదుర్కొంటున్న విషాద పరిధి విస్తృతిని వివరించారు. ఈ యువ జర్నలిస్ట్ తన క్షేత్రస్థాయి పని,  తన కుటుంబ ప్రాధమిక అవసరాలను తీర్చడానికి లైన్లలో నిలబడటం మధ్య జరిగే ఘర్షణ సుడిగాలిలో జీవిస్తున్నానంటుంది. ముఖ్యంగా షుజా’యియా పరిసరాల్లోని తమ ఇంటిపై ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా దాడి చేసి ఇద్దరు సోదరులను హతమార్చిన తరువాత వాస్తవ కఠినత మరింతగా తీవ్రమైంది.

గాజాకు సంబంధించి, ఆక్రమణ విషయంలో ఇజ్రాయెల్ తన కవసరమైనంత సమయాన్ని తీసుకుంటుంది, పాశ్చాత్య శక్తుల మద్దతును ఉపయోగించుకుంటుంది, పట్టు బిగించిన   ప్రాంతంలో నెలల తరబడి యుద్ధాన్ని పొడిగిస్తుంది, ఇక్కడ ప్రజలు ఇప్పటికే ఆకలి, వ్యాధి,  నిరాశ నిస్పృహలతో మరణిస్తున్నారు.

ప్రస్తుతం అల్-షిఫా మెడికల్ కాంప్లెక్స్ సమీపంలో ఒక టెంట్‌లో నివసిస్తున్న ముస్తహా తన దురవస్థను వివరించింది. గాజా వీధుల్లో, తాత్కాలిక ఆశ్రయాలలో మహిళలు ఎదుర్కొంటున్న విపరీత బాధలను వివరించింది. గాజాలోని మహిళా జర్నలిస్టులు, బలవంతంగా తరలించబడిన మహిళల బాధలను వివరించారు. చివరగా ఆమె ఒక దీర్ఘ నిట్టూర్పు విడుస్తూ, “నేను ఇప్పుడు ఒక మంచి భోజనం తినడం లేదా అంతులేని క్యూలో నిలబడకుండా ఒంటరిగా బాత్‌రూమ్‌కు వెళ్లగలగడం గురించి మాత్రమే కలలు కంటున్నాను” అంటుంది.

గాయపడిన గర్భిణీ స్త్రీని చేతితో నిమురుతూ తన దాయాది  బాధాకరమైన ప్రసవ వేదన దృశ్యాన్ని గుర్తుచేసుకుంటుంది. గాజా నగరంలోని అల్-రిమాల్ పరిసరాల్లో ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఆమెకు ప్రసవనొప్పులు మొదలయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూసిన తరువాత కలగబోయే బిడ్డ కోసం, ఒక సురక్షిత స్థలానికి వెళ్ళి కనాలనే ఎంతో ఆశతో  రక్తస్రావంతోనే ఎంతో దూరం నడిచింది. కానీ విషాదమేమంటే ఎలాంటి మద్దతు, సహాయం దొరకని ఆమె బిడ్డను కోల్పోయింది.

అనేకమంది పాలస్తీనా మహిళలు జర్నలిజం వృత్తిని కొనసాగించేందుకు తీసుకున్న  నిర్ణయం, ఆక్రమణలో అంతర్లీన ప్రమాదాలు ఉన్నప్పటికీ తమ వృత్తిపట్ల కలిగిన అచంచలమైన నిబద్ధత పాలస్తీనా మహిళల స్ఫూర్తికి, పాలస్తీనా మీడియా ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో వారి మార్గదర్శక పాత్రకు నిదర్శనం.

గాజాలో, ఇజ్రాయెల్ యుద్ధ యంత్రాంగం 13 మంది పాలస్తీనా మహిళా జర్నలిస్టుల ప్రాణాలను తీసుకుంది, వీరందరూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. అక్టోబర్ 7 నుండి నేరుగా లక్ష్యంగా నిలిచి హత్యకు గురైన 133 మంది జర్నలిస్టులతో పాటు వందలాది మంది పాలస్తీనా మీడియా బృంద సభ్యులు గాయాలపాలయ్యారు, నిర్వాసితులయ్యారు.

పాలస్తీనా జర్నలిస్టుల సిండికేట్‌తో సహా అనేక అంతర్జాతీయ, స్థానిక మానవ హక్కుల సంస్థలు గాజాలోని జర్నలిస్టులను, వారి ఇళ్లను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ధృవీకరించాయి. ఇది పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయెల్ పౌర విధ్వంసం విధానానికి అనుగుణంగా ఉంటుంది. అనేక మంది పాత్రికేయులను వారి ఇళ్లలో, వారి కుటుంబాల మధ్య ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకున్న కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, గాజాలోని 50 మీడియా సంస్థలు, ప్రెస్ సంస్థలను వ్యవస్థాపరంగా నాశనం చేసారు, జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, సంబంధిత వ్యక్తుల రక్షణను ఆదేశించే అన్ని అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను పట్టించుకోలేదు.

ఈ యుద్ధం గాజాపై జరిపిన సమగ్రమైన, విస్తృతమైన విధ్వంసాన్ని వినాశనాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దళాలు పౌర జీవితంలోని అన్ని వనరులను క్రమపద్ధతిలో దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ సమాజం సాక్షిగా, సుమారు రెండు దశాబ్దాలుగా ముట్టడిలో ఉన్న జనాభాపై ఈ చర్యలు అమలవుతున్నాయి. ఆక్రమణ దళాలపై ఇజ్రాయెల్ చేసిన క్రూరమైన చర్యల్లో మహిళా, పురుష జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు ఇందులో ఉన్నాయి.  ఈ ఘోరమైన నేరం కొనసాగుతున్న కొద్దీ, సార్వత్రిక మానవ విలువలగా ప్రచారం అయిన వివిధ నియమాలు వేగంగా క్షీణించడాన్ని ప్రపంచం చూస్తుంది. వాటిలో ప్రధానమైనది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం జీవితం, స్వేచ్ఛ, భద్రతల హక్కు.

పశ్చిమ దేశాల ప్రభుత్వాలు తాము సమర్థిస్తున్న న్యాయ, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి సూత్రాలను గాలికి వదిలేయడంతో పాటు గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధానికి నిస్సందేహమైన భౌతిక, నైతిక మద్దతును అందిస్తున్నాయి.

పాలస్తీనాలోని మహిళా పాత్రికేయులకు, ఈ సంవత్సరం మహిళా హక్కుల దినోత్సవం జరుపుకోవడం వెనుకంజ వేస్తుంది, ఎందుకంటే వారు ఈ యుద్ధ కఠిన వాస్తవికతలను ఎదుర్కొంటున్నవారికి, జాతి నిర్మూలన, నిర్వాసిత్వం, ఉపేక్షలాంటి  ప్రమాదాలతో పోరాడుతున్నవారికి మార్చి 8  ప్రాముఖ్యత అంతగా వుండదు.

2024 మార్చి 14

https://institute.aljazeera.net/en/ajr/article/2591

Leave a Reply