ఎర్ర మల్లెలు, వాక్యం పాతదైనప్పటికి యి పుస్తక ముఖచిత్రం మాత్రం ఆకర్షించే విధంగా చదవాలని ఆత్రుత పెంచే విధంగా, ముఖ్యంగా యీ కాలపు జనరేషన్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ముందుగా యి పుస్తకం నవలగా మారిందా అనే సందేహం చదివింతరువాత కలిగింది నాకు. సరే అది చివరకు మాట్లాడుకుందాం.
కథలో ప్రధాన పాత్రలు మూడు. వారి చుట్టూతా తిరుగుతుంటుంది కథ. అయితే కథ వస్తువు కొత్తదేమీ కాదు. అయినప్పటికీ ఆ కథని చెప్పే విధానంలో రచయిత్రి గారికి మార్కులు వేయొచ్చు. నేనేమీ మాష్టారు కాదు, ఆవిడ రాసింది పరీక్షా కాదు, కానీ తిన్న తిండి మీద కట్టుకున్నా బట్ట మీద ఎలాగైతే అభిప్రాయం చెప్తమో ఇది కూడా అంతే.
ఇప్పుడు కొత్త కథలేమి లేవు. అసలు నన్నడిగితే కొత్త కథలేవి లేవు. ఉన్నవన్నీ మనకు తెలిసినవే. మనకు జరిగినవే. కానీ వాటిని చెప్పే తీరును బట్టి కొత్త పాత అని విలువలు కడుతుంటారు. భ్రమలో ఉంటారు.
ఇకపోతే యీ కథలోని ముఖ్యపాత్రలో ఒకరు “తార” యీ పుస్తకం చదివిన తరువాత తార మీద నాకున్న అభిప్రాయమేమంటే తాను ఎపుడు కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఏదో అనాలని ఇంకేదో చెయ్యాలని ఇంతకుముందే చేసేసానేమో అనే అయోమయంలో ఉంటుంది. మచ్చుకి ఒక మాట ( నిబంధనల వల్ల ఒకే మాట ).
‘ బాధతో బస్టాప్ కి వెళ్లి కూర్చుంది, దియ, హేమంత్ కార్లో వెళ్లిపోవడం చూసాక తానుకూడా బస్ ఎక్కి ఇంటికి వెళ్లిపోయింది’ అని రచయిత్రి గారు చెప్పారు కానీ తార ఏం చెప్పిందంటే..
“ కార్లో ఇద్దరు పోవడం చూసావా” అని పోలీసు అధికారి అడిగారు
“ కార్లో పోయిందిచూశాను కానీ అందులో ఇద్దరూ ఉన్నారా ఒక్కరే ఉన్నారా అనేది గమనించలేదు సార్, ఇద్దరూ ఉన్నారనే అనుకున్నా”
ఇది పాత్ర చెప్పిన మాట. ఇలాంటివి కొన్ని ఇంకా పుస్తకంలో ఉన్నాయి.
ప్రతి కథ కామన్ కాదు, కొన్ని కథల్లో జీవితం ఉంటుంది. జరిగిన సంఘటన ఆధారంగా రాసిన కథ ఇది అనిపిస్తుంది ఒకవేళ కావచ్చేమో! వందశాతం పురుషుల్లో ఎక్కువ మోతాదు స్త్రీల వంక మోహంగా చూసేవారే యినాటికి ఏనాటినుంచో. అయితే పాత కాలంలో వేశ్యలు తక్కువ గాను, ఉంపుడు గత్తెలనే ( ఒకరికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండడం వారిని భార్యల లెక్కల కింద జమ చెయ్యకపోవడం ) పేరుతొ ఎక్కువ గాను ఉండేవారు. కానీ మారుతున్నా కాలం ప్రకారంగా నడుస్తున్న పరిస్థితుల కారణంగా వేశ్యలు ఎక్కువగాను, అత్యాచారాలు అతి తీవ్రంగాను పెరిగాయి. భయం వల్ల అవి హత్యాచారాలుగా కూడా మారాయి. ఇలాంటి నేరాల్లో అతి తక్కువ న్యాయం జరుగుతుంటుంది. కారణం కులం కూడా కలిసుండడం వల్ల స్త్రీలు చాలా వరకు దళితులు అవ్వడం వల్ల. అది ఎవరికి తెలియనంత వరకు ఒకల పరివర్తనం చెందుతుంది పోనీ అందరికీ తెలిసినా కూడా ఒక శిక్ష కూడా వెయ్యారు కనీసం జీవిత ఖైదు కూడా వెయ్యరు. సరే బట్టబయలు నడి దేశంలో అందరికీ కనిపించే విధంగా ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తున్నా కూడా ఏమి మాట్లాడారు అది ఎవరికి తెలియదు అనుకుందాం, తెలిసినా తరువాత కూడా వారిని వారి కేసులను అలాగే వదిలేశారే. ఇలా ఉంటుంది ఇక్కడి న్యాయస్థానం. న్యాయ దేవత అని పిలవబడే ఆవిడ కళ్లె కాదు సమస్త దేహాన్ని కుల మత గుడ్డలతో కప్పేశారు. ఆ తరాజులో ఒకపక్క కులం మతం మరోపక్క న్యాయం సాక్ష్యం ఉంచితే ధర్మ ముళ్ళు నిటారుగా కూడా కాకుండా కులమతాల వైపే మొగ్గుతుంది కాదు కాదు నెట్టబడుతుంది.
ఇంక కథలోకి వస్తే ఆ మధ్య కరోనా కాలంలో ఆన్లైన్ లో ఒక వెబ్ సిరీస్ వ చ్చింది సిన్ (SIN) దాని పేరు. అందులో కూడా ప్రధాన పాత్ర హీరో అయిన పురుషుడు పెళ్లి చేసుకుని తన భార్యను ఆ ఆవిడ అనుమతి లేకుండా సంభోగం చేస్తూ ఉంటాడు. అదే రేప్ గా పరిగణించబడుతుంది. నెలసరి సమయంలో కూడా వదలకుండా పశువులాగ ప్రవర్తిస్తాడు. ఇంట్లో వాళ్ళు చెప్పారని ఇలా చేస్తేనే గర్భం దాలుస్తారని అది ఒక సాకుగా వాడుకుని అతని మోహం తీర్చుకుంటాడు.
అసలు గత చరిత్ర చూస్తే ఒక పురుషుడికైనా స్త్రీ లకైన ఇతరులను తిట్టడానికి బూతులు అని చెప్పబడే మాటలు అనడానికి స్త్రీ లోకువ గా దొరికిన ఒక పదార్థం లా వాడుతుంటారు. అసలు స్త్రీ ప్రస్తావన లేనిదే ఒక బూతు మాట కూడా మాట్లాడ లేని స్థాయి కి చేరుకుంది. ఆనాటి కాలమైనా ఈనాటి ఆధునిక కాలమైనా ఆ పదార్థం ఇంకా సమాజంలో అలాగే ఉంది. ఎంత AI టెక్నాలజీ వచ్చిన కూడా ఇందులో ఇంకా స్త్రీ పాత్ర అలాగే ఉంటుంది. ఇది మారాలి. పిల్లలు పుట్టలేదు అంటే నీ గర్భాశయం లోనే ఏదో సమస్య ఉందని ఆయుర్వేదిక్ అంటూ చెట్ల పసరు తాగించి మనిషిని నాశనం చేస్తారు. ఆడపిల్ల నీ కడుపులో ఉందంటూ గర్భాన్ని తొలగిస్తారు. సమాజంలో మానవత్వం పరిమళించాలి. మనుషుల్ని మనుషులుగా చూడాలి.
యి కథలో పాత్ర కూడా అటువంటి వాడే . అయితే కథంతా చదివితే ఒక సంభాషణ లాగే కనిపిస్తుంది నాకు. ఎలాంటి హడావిడి ఉండదు. ఒక మనిషికి బాధ ఉంటే దానికి కారణం ఇంకో మనిషి కావొచ్చు. కానీ మానసికంగా కృంగిపోవడం ఆత్మహత్యలకి కారణం మాత్రం ఎక్కువ ఈనాటి సమాజమే కారణం. అందులోని వర్గ సంఘర్షణ లే కారణం.
నాకు ఆ బండ రాయుని మొక్కడం ఇష్టం లేదంటే నువ్వసలు మనిషివే కాదంటారు. నాకసలు ఆ అమ్మాయితో పెళ్లి ఇష్టం లేదంటే నువ్వసలు మగాడివేనా అంటారు,
నాకిప్పుడే పిల్లల్ని కనాలని లేదంటే నువ్వసలు ఆడదనివేనా అంటారు. ఇలా వారి స్వార్థానికి తప్ప మన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వరు.
కానీ యి పుస్తకం ఆ స్వేచ్ఛకు నిదర్శనంగా నిలిచింది. సమాజంలో పెళ్లిలో ప్రేమని, మోహాన్ని విడదీసి చూసే వారి చెంప చెళ్ళుమంది.
అయితే ఇందులో ఇంకా చర్చించవలసిన అంశాలు, చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇద్దరి మధ్య సంఘర్షణలు జరిగితే బాగుండేది. చదివే పాఠకులు చదివేటప్పుడు ఏడుస్తూ, ప్రేమిస్తూ, స్ఫూర్తి పొందుతూ ఉండాలి. ఎందుకంటే వస్తువు అలాంటిది. కేవలం ఒకేవైపు కాకుండా మగవారు అనుభవించే కష్టాలు సమాజంలో మగవారి పరిస్థితి వల్ల ఇంట్లో ఎలా నడుచుకుంటున్నారో దాని వల్ల స్త్రీలు ఎలా ప్రభావితమవుతున్నారో చర్చించుకుంటే వెళితే బాగుండు. దాని గురించి హెచ్చరిస్తూ సమాజానికి సంఘానికి దీటుగా ధైర్యంగా సమాధానం చెప్పే విధంగా ఉండాలి.
మొత్తంగా పుస్తకం మొదలు, తుదలు కాకుండా మధ్యాలోదంత ఒక ఇంటర్వ్యూ లాగ అనిపించింది. అందుకేనేమో నవల రూపం ఇంకా దాల్చవల్సి ఉందని అనిపించింది.
మర్చిపోయాను మరీ ముఖ్యంగా పుస్తకం అచ్చు వేసిన పబ్లిషర్ గారిని నాదో విన్నపం. యీ పుస్తకంలో అచ్చు తప్పులతో పాటు వాక్యాలు తారు మారు అయ్యాయి. కొన్ని వాక్యాలు కింద మీద అయ్యాయి దాంతో మాటలు ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత లేదు. లేఔట్ కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి. తదుపరి పుస్తకానైనా మంచిగా వెయ్యండి.
చివరిగా ఓ స్త్రీవాది వాక్యాలతో ముగిస్తా . ఇవి రచయిత్రి గారికి అర్థం అవుతాయని అనుకుంటూ.
“ భర్త నీచుడైతే ఆ సంగతి గుర్తించని భార్య అంతకన్నా నీచురాలు,
ఆ సంగతి గుర్తించి ఆ నీచత్వంలోంచి బయటకు తీసుకురాలేని స్త్రీ వ్యర్ధురాలు,
ఎంత బయటకు తీసుకొచ్చి ఆ భర్త మారకపోతే ఇంకా అతనికే లోబడే స్త్రీ వ్యభిచారి.”