ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త కలాలను, గళాలను తెలుగు నేలకు పరిచయం చేసింది. కలాలు నడిపే సంవాదం కవితాత్మకం. గళాలు చేసే సంభాషణ కళాత్మకం. లలిత కళల్లో కవిత్వం ప్రథమ స్థానంలో ఉంటుంది. సహజంగానే కవిత్వం రాసే వారికి గుర్తింపు ఎక్కువ. మేధో సంబంధ కార్యకలాపంగా కవిత్వాన్ని పరిగణించడం సాహిత్యంలో మునుపటి నుంచి వస్తుంది. కవిత్వ పాఠకుల స్థాయి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కనుక కవితా కళకు పరిమితులు ఉన్నాయి. పద్యకవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం కొందరికే కమ్యునికేట్ అవుతుంది. ఏ మినహాయింపులు, షరతులు లేకుండా శ్రోతలందరికి ఏకశృతిలో చేరుకునేది పాట కవిత్వమొక్కటే. పాటలో సంగీత సాహిత్య విలువలు సమపాళ్లలో ఉంటే ఇకదాని విశ్వరూప దర్శనాన్ని అనుభవించి తీరవలసినదే.
తెలంగాణ ఉద్యమం మౌఖిక సాహిత్య రూపాల్లోనే ఎక్కువగా వ్యక్తమయింది. వందేళ్లుగా జరిగిన తెలంగాణ పెనుగులాటకు సాహిత్యం ఒక పరికరంగా పనిచేసింది. పాటనే తెలంగాణ ఆరాట పోరాటాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇక్కడి అల్లిక వారసత్వం పాటను సుసంపన్నం చేస్తూ వచ్చింది. నిజాం వ్యతిరేకపోరాటం, నక్సల్బరీ విప్లవం, కుల అస్తిత్వ వేదన, ప్రత్యేక తెలంగాణ సాధనోద్యమంలో పాటనే ప్రధాన ఆకరంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలో కవిత్వం గురించిన చర్చ పాట లేకుండా పరిపూర్తికాదు. ఇక్కడి పాటలన్నింటిని సంపూర్ణంగా సేకరించే పనిచేస్తే బృహత్ గ్రంథాలే అవుతాయి. ఆ పని మిగిలే ఉంది.
తెలుగు నేల మీద పాటలను అల్లినవారు, పాడినవాళ్లు తొంభై శాతానికి పైగా దళిత కులాల నుంచి ఎదిగివచ్చిన వారే. వారి ప్రతి సామాజిక చలనంలో పాటే ప్రాణంగా బతికారు. పాట లేకుండా దళితుల సాంస్కృతిక సమ్మేళనాలు సంపూర్ణం కాలేవు. డప్ప్పు, కొమ్ము, జమిడికె, కిన్నెర మొదలైన సాంస్కృతిక ప్రతీకలన్ని సంగీతాన్ని ఆశ్రయించి ఉంటాయి. సామాజిక ప్రదర్శనల్లో దళితుల వాద్యాలు ప్రధాన ఘట్టంగా కనిపిస్తాయి. ఆకలి, అంటరానితనం, అవమానం కలగలిసిన మనుషులు సాంత్వనకోసం పాటను, చర్మ వాద్యాలను ఆశ్రయిస్తారు. ఇది చరిత్ర పొడుగునా సాగుతూ వస్తుంది.
అలా ఒక పాలమూరు మాదిగ పిలగాడు డప్ప్పుకు, భజనకు, డోలక్‌కు దగ్గరయ్యాడు. తల్లి పాడే బొడ్డెమ్మ పాటలు, తండ్రి ఆలపించే కోలాటం పాటలు ఆ పిలగాని బాల్యాన్ని చుట్టేసాయి. వినసొంపైన గొంతుతో భజన పాటలను వినిపించటం అతనికి అలవాటుగా మారి, మెల్లగా అక్షరాలకు దగ్గరయ్యాడు. వాటి మాధుర్యాన్ని అనుభవించాడు. పాఠశాల పిల్లలతో కలిసి ఆడిపాడి పాటను శ్వాసగా మార్చుకున్నాడు. కళాశాలకు వచ్చే నాటికి యవ్వనపు కలలేకాదు, ఆశయాలు రూపొందాయి. ఏవేవో ఆలోచనలు మెదడును తొలిచి, వెతుకులాట మొదలయింది. అప్ప్పుడప్ప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వ్యాపిస్తున్నది. ఒక రోజు తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో పాలమూర్ పట్టణంలో ఉన్న తెలంగాణ చౌరస్తాలో గద్దర్ పాట ఆ పిలగాడి చెవున పడింది. గద్దర్‌ను చూసే అపురూపమైన సందర్భం అతనికి లభించింది. టీపీఎఫ్ భూషణ్ పరిచయంతో అతడు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. తెలంగాణ విద్యార్థి వేదికలో సభ్యుడై, నాయకుడైనాడు. కవిగా, గాయకుడిగా రూపొందాడు.
ఆ పాలమూరు పిలగాడే ఇదిగో మనముందుకు ఈ పాటల పుస్తకంతో వస్తున్న చంద్రశేఖర్. మిత్రులందరూ ఆత్మీయంగా చందు అని పిలుచుకుంటారు. రాజ్యం విసరిన నిర్బంధంలో చాలా మంది కకావికలమయ్యారు. కానీ చందు తనను తాను నిలబెట్టుకున్నాడు. యాభై ఏళ్ల విరసం సభల్లో సంస్థ సభ్యుడిగా చేరాడు. తనకు ఇష్టమైన పాటలతో తెలుగు సమాజానికి తెలిసిన చందు ఇపుడు కవిగా మన ముందుకు వస్తున్నాడు. సన్నని, మధురమైన గొంతుతో టీవీవీ కార్యకర్తలతో కలిసి ఎన్నో వేదికల మీద చందు తన పాటలను వినిపించాడు. గాయకులు పాటలు రాస్తే వాటి మాధుర్యం ఎలాగుంటుందో చందు పాటలను విని తీరవలసినదే. ఆయన ఈ పాటలకు మోదుగుపూల సవ్వడి అని పేరుపెట్టాడు. ఇదొక ప్రాకృతిక సౌందర్యం, ఈ వసంత కాలంలో ప్రకృతినంతా తన అందంతో ఎరుపెక్కించే చందమామ మోదుగుపువ్వు. ‘పూరువులు, కొండగోగులు పూయకముందర పూసే మోదుగలు
ఉప్పొంగి’ అని నన్నెచోడుడు చెప్పినట్లు చందు తన కలంతో ఈ సంక్షోభ సమయంలో, ఆకురాలు కాలంలో మోదుగు పూల సవ్వడిని విన్పిస్తున్నాడు.
ఈ పుస్తకంలో కవి తన బాల్యపు గుర్తులను నెమరువేసుకున్నాడు. నిప్ప్పులు కురిసే నిర్బంధాన్ని పాటల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడు. తనకు ఇష్టమైన సాయిబాబా, కాశీంలను రాజ్యం ఉపా కేసులు మోపి ఖైదు చేస్తే చందు తన పాటలతో ఆకాశమంత ఎత్తుకు అరిచి నిరసించాడు. పాటలకే సర్వనామమైన గద్దర్ అమరుడైతే అక్షరనివాళి అర్పించాడు. దేశాధినేత కార్పొరేట్ తంత్రంతో, కాషాయమంత్రంతో పాలిస్తున్న తీరు తన పాటల్లో వ్యక్తం చేసాడు. కోవిడ్ కాలంలో పొట్ట చేత పట్టుకొని కన్నఊరును, కన్నతల్లిని వదిలిపెట్టిన బిడ్డల గోసను గొంతెత్తి పాడాడు. నడిచి నడిచి కాళ్లు బొబ్బలెక్కి పుండ్లుగా మారి రక్తం స్రవిస్తున్న పాదాల గురించిన ఆర్తిని పాటలలో ప్రవహింపచేసాడు. ఉద్దానం, బస్తర్, దండకారణ్యంలో ఒరిగిపోతున్న వీరుల స్మృతి తన పాటల్లో కన్పిస్తుంది, విన్పిస్తుంది.
చందు కేవలం రాజకీయాలను మాత్రమే చెప్పే వస్తువాశ్రయవాది కాదు, చెప్పే విషయాలను కళాత్మకంగా వ్యక్తం చేసే శిల్ప నైపుణ్యాన్ని కూడా సాధించాడు. సాహిత్య ప్రకటనలో మొరటుదనం వ్యక్తమవుతున్న సందర్భంలో చందు లాంటి సున్నిత భావాలు కలిగిన కవి విరసంలో ఉండటం ఈ కాలానికొక వాగ్దానం. యువ రచయితలు, కవులు, కళాకారులు సృజనాత్మకంగా కొత్త సాహిత్య శిల్పంతో రాస్తున్నారు. ఈ నాటి అవసరాలకు తగిన నైపుణ్యాలను పొంది రచనలో వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో చందు సంస్థకు అసెట్. ముఖ్యంగా చెరబండరాజు తర్వాత విరసంలో పాటలు రాసే కవుల కొరత ఉంది. ఈ యాభై ఏళ్లలో వచన కవిత్వానికే విరసం పరిమితం అయింది. కనుక పాట కవిత్వం రాసే వారిని సమీకరించవలసిన అవసరం కూడా ఉంది. ఎంత నైపుణ్యంతో రాసినా వచన కవిత్వానికి అనేక పరిమితులు ఉన్నాయి. దాని పాఠకులు కూడా పరిమితంగానే ఉంటారు. విరసం తన ప్రణాళికలలోనే రాసుకున్నట్లు మౌఖిక ప్రజాకళారూపాలే విప్లవ ప్రచారానికి ప్రధాన ఆకరాలు. అందులో పాట అగ్రగామిశక్తిగా ఉంటుంది.
“పూచే పువ్వులై… వీచేగాలులై
ఎగిరే చేపలై… ఎత్తేటి జెండలై
ఉద్దాన యుద్ధమైనారా
ఉదయించే సూర్యులైనారా
మాకంటి పాపలైనారా
మా ఇంటి వెలుగులైనారా”
ప్రజలతో, పోరాటంతో మమేకం కావడం స్నేహభావం అనే ఊహ చందు పాటలో ఉంది. వీరులు ప్రజలను ప్రేమించడం, వాళ్ల కోసం త్యాగం చేయడం పతాకస్థాయి. ఈ నేపథ్యంలో వచ్చిన పాట నడకను చూస్తే కవి నైపుణ్యం అర్థమవుతుంది.
“స్వతంత్ర దేశమా… చదువులు కొనడమా
ప్రజాస్వామ్య దేశమా… పాలన మీ సొంతమా
భారత దేశమా… బతుకు విచిత్రమా”
అనే పాట ఈ దేశంలో చదువుల సారాన్ని, ఉద్యోగ కల్పనల తీరును మన ముందు ఉంచింది. పాటను రాసిన కవి ఆ పాటను తన గొంతుతో పాడితే పాటకు విస్తృత ప్రచారం లభిస్తుంది. చెరబండరాజు పాక్షికంగాను, గద్దర్, గోరటి ఎంకన్న, గూడ అంజన్న, జయరాజు తమ పాటలను అద్భుతంగా పాడటం వలన వాటికి బహుళ ప్రాచుర్యం లభించింది. చందు కూడా తాను రాసిన పాటలను తన గొంతుతో ఒడుపుగా పాడగలడు. కనుక చందు వినసొంపైన పాట కవిగా రాణించాలని కోరుతూ మోదుగుపూల సవ్వడిలోకి మీకు ఆహ్వానం.
11 జనవరి, 2026




