ఖైదీల రోజువారీ వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సవరణను ప్రకటించినప్పుడు .. నైపుణ్యం కలిగిన పనులకు రూ. 620, పాక్షిక నైపుణ్యం కలిగిన పనులకు రూ. 560, నైపుణ్యం లేని పనులకు రూ. 530 గా నిర్ణయించింది. జైలు గోడల వెనుక సంస్కరణలను ప్రోత్సహించడమూ; శ్రమ గౌరవాన్ని పెంపొందించడమూ ఈ చర్య ఉద్దేశ్యంగా భావించారు. అయితే, ఒకప్పుడు విచారణా ఖైదీగా రోజుకు రూ. 20 కంటే తక్కువ వేతనం పొందిన టి.కె. రాజీవన్ వంటి వారికి, ఈ వార్త ఒక పరాకాష్టగా, చేదు వ్యంగ్యంగా అనిపించింది.

ఎడక్కర మావోయిస్టు కేసులో ఐదవ నిందితుడిగా ఉన్న రాజీవన్, ఒకప్పుడు అమల్లో ఉన్న కనీస వేతనం రూ. 63; గరిష్ట వేతనం రూ. 168 కోసం నేటికీ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయన, వియ్యూర్ హై సెక్యూరిటీ జైలులో గడిపిన కాలాన్ని తనపై మోపబడిన అభియోగాల కంటే, తన కారాగార వాసం వల్ల ఛిన్నాభిన్నమైన కుటుంబాన్ని ఆదుకోవడానికి చేసిన సుదీర్ఘ, అలసటతో కూడిన పోరాటం కోసమే గుర్తుంచుకుంటారు.

నవంబర్ 2020లో మావోయిస్ట్ పార్టీ సభ్యుడనే ఆరోపణపై అరెస్టయిన రాజీవన్‌ను తొలుత కన్నూర్ సెంట్రల్ జైలులో ఉంచి, జూన్ 2021లో వియ్యూర్‌కు తరలించారు. ఆయన అరెస్ట్ సమయంలో, అతని కుమారుడు నాలుగో తరగతిలో ఉన్నాడు. ఆదివాసీ మహిళ అయిన ఆయన భార్య అప్పటికే ఇంటిని నడపడానికి తీవ్రంగా కష్టపడుతోంది. “త్వరలోనే బెయిల్ వస్తుందని అనుకున్నాను, కానీ కోవిడ్ రావడంతో విచారణలో జాప్యం జరిగి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది” అని రాజీవన్ గుర్తు చేసుకున్నారు.

2023 చివరి నాటికి, ఎటువంటి ఆదాయం లేక, భార్యాబిడ్డల గురించి ఆందోళనలు పెరగడంతో, రాజీవన్ జైలు లోపల ఏదైనా చిన్న పని కోసం జైలు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు. అది విఫలమవ్వడంతో, ఆయన కొచ్చిలోని ఎన్.ఐ.ఏ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. 2024 జూలైలో, ఆయనకు పని కేటాయించాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

సదరు ఉత్తర్వులు కార్యరూపం దాల్చడానికి మరో ఎనిమిది నెలలు పట్టింది. 2025 మార్చి లో, రాజీవన్‌కు ‘నెట్టిపట్టం’ (ఏనుగుల నుదుటి ఆభరణం) తయారీ పనిని అప్పగించారు. రెండు రోజుల శిక్షణ తర్వాత, ఆయన పని ప్రారంభించారు. ఆ నెలలో 24 రోజులు పనిచేసి 12 ఆభరణాలను సిద్ధం చేశారు. ఒక్కోటి సుమారు 22×7 అంగుళాల పరిమాణం కలిగి ఉండి, బయట మార్కెట్లో ఒక్కోటి సుమారు రూ. 300 కు అమ్ముడవుతుంది.

 “కనీసం ఇంటికి పంపించడానికి సరిపడా డబ్బు సంపాదిస్తానని అనుకున్నాను,” అని ఆయన అంటారు. కానీ దానికి బదులుగా ఆయనకు ఆ నెల మొత్తానికి అందింది కేవలం రూ. 441… అంటే రోజుకు సుమారు రూ. 18. 2025 ఏప్రిల్‌లో, 21 రోజుల పని తర్వాత ఆయనకు రూ. 347 చెల్లించారు. 2025 మార్చి నుండి ఆగస్టు  వరకు ఆయన వేతనాలు ఇదే పద్ధతిలో కొనసాగాయి. ఈ లెక్కలు అర్థం కాక, రాజీవన్ మరోసారి కోర్టు తలుపు తట్టారు, ఈసారి కనీస వేతనం కావాలని వేడుకున్నారు.

వార్తా పత్రిక సేకరించిన కోర్టు రికార్డుల ప్రకారం, రాజీవన్ రోజుకు రెండు నెట్టిపట్టాలు తయారు చేస్తేనే రోజుకు రూ. 63 అప్రెంటిస్ వేతనానికి అర్హులని వియ్యూర్ జైలు సూపరింటెండెంట్ ఎన్‌ఐఎ కోర్టుకు తెలిపారు. మార్చిలో ఆయన 24 రోజులు పనిచేసినప్పటికీ, ఆశించిన 48 కు బదులుగా కేవలం 14 మాత్రమే తయారు చేయగలిగారు  కాబట్టి దానికి అనుగుణంగా చెల్లింపులు జరిగాయి. రాజీవన్ దీనితో ఏకీభవించడం లేదు. “నేను చేయగలిగింది చేశాను. రోజుకు రూ. 18తో ఎవరైనా ఎలా బతుకుతారు?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

జైలు బయట జీవితం కూడా ఆయనకు పెద్దగా ఊరటనివ్వలేదు. బెయిల్ నిబంధనలు ఆయనను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఆయన బెయిల్ నిబంధనల ప్రకారం ఆయన వయనాడ్‌లోకి ప్రవేశించకూడదు, ప్రతి వారం ఎన్‌ఐఎ ఆఫీసుకి హాజరు కావాలి; తరచుగా కోర్టుకు వెళ్లాలి. కొచ్చిలోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో, ఆయనకు పని దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది. “నా భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నా కొడుకు ఇప్పుడు తొమ్మిదో తరగతిలో ఉన్నాడు. నేను వారిని కనీసం స్వేచ్ఛగా చూడలేను, ఆర్థికంగా ఆదుకోవడం సంగతి దేవుడెరుగు,” అని ఆయన అంటారు. “నేను స్నేహితుల దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నాను.”

రాజీవన్ కథ ప్రభుత్వ విధానాలకు మరియు వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అగాధాన్ని ప్రతిబింబిస్తోంది. కొందరికి, సంస్కరణల వాగ్దానం చాలా ఆలస్యంగా అందుతుంది … లేదా అసలు అందదు. ప్రతి గణాంకమూ, వేతన సవరణ వెనుక ఒక మనిషి జీవితం ఉంటుంది. రోజులను, నాణేలను లెక్కపెట్టుకుంటూ, న్యాయం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కు కూడా అని ఆశిస్తూ ఉంటుంది.

2026 పిబ్రవరి 1

(తమిళనాడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రిక నుంచి)

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply