గోరఖ్‌పూర్ జైల్లో ఆవిరైన నా *పరదేశీ స్వప్నం*: వాలెంటిన్ హెనాల్ట్
ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతతో మజీద్ మఖ్బూల్ ఇంటర్వ్యూ
(ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన భారత పర్యటన, తాను పాల్గొన్న అంబేద్కరిస్ట్ ప్రజా పాదయాత్ర ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ సెంట్రల్ జైలులో నెలరోజుల జైలు శిక్షకు దారితీస్తుందని ఊహించలేదు. దళిత భూ హక్కుల కోసం జరిగిన ఆ యాత్రలో పాల్గొన్నందుకు, అతను ఉంటున్న హోటల్ నుండి అరెస్ట్ చేసి, ఫారినర్స్ యాక్ట్ కింద వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
2023 అక్టోబర్‌లో జైలులో గడిపిన కాలం—కిక్కిరిసిన బ్యారక్‌లు, వ్యవస్థీకృత హింస, వివక్ష—ఆయన “భారతీయ కల”(ఇండియన్ డ్రీమ్)ను ఛిన్నాభిన్నం చేసి ఒక సజీవ పీడకలగా మార్చింది. జైలులో ఉన్నప్పుడు తాను చూసిన వాటిని రహస్యంగా కాగితపు ముక్కలపైన రాసుకున్నారు. 2024 మే లో ఆయనకు దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి దొరికింది. ఆయన జ్ఞాపకాలు “నాకో భారతీయ కల ఉండేది: గోరఖ్‌పూర్ జైలు నరకంలో” (“J’avais un rêve indien: Dans l’enfer de la prison de Gorakhpur”) అనే పుస్తక రూపంలో ఫ్రెంచ్ భాషలో ప్రచురితమైంది. 16 అధ్యాయాలుగా ఉన్న ఈ జ్ఞాపకం జైలులో తన అనుభవాలను నిష్కపటంగా వివరిస్తుంది. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో, వాలెంటిన్ హెనాల్ట్ తన అరెస్టు, కిక్కిరిసిన గోరఖ్‌పూర్ జైలు లోపల జీవితం, మరిన్ని విషయాల గురించి మాట్లాడుతాడు-మజీద్ మఖ్బూల్)
ప్రశ్న: అట్టడుగు వర్గాల కథనాల పట్ల ఆకర్షితులయ్యే డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా, 2023లో జరిగిన మీ భారత పర్యటన గురించి; మీ అరెస్టుకు, గోరఖ్‌పూర్ జైలులో నెల రోజుల జైలు శిక్షకు దారితీసిన పరిస్థితుల గురించి చెబుతారా?
సమాధానం: ప్రారంభంలో నేను కేవలం ప్రయాణం గురించి మాత్రమే ఆలోచించాను. నేను ఊహించిన విధంగా భారతదేశాన్ని అన్వేషించాలనుకున్నాను; దానినే నా పుస్తకంలో “భారతీయ కల” అని పిలిచాను: అవి ఆధ్యాత్మికత, అధి భౌతికవాదం. నేను ముఖ్యంగా సాధువుల రూపాలకు ముగ్ధుడిని అయ్యాను. వారణాసిని, హిమాలయ దృశ్యాలను ఊహించుకున్నాను. భారతదేశం ఒక వేరే ప్రపంచమని, అక్కడ నేను నన్ను నేను మరిచిపోయి, బహుశా వేరే వ్యక్తిగా మారవచ్చని అనుకున్నాను. కొత్తదనం కోసం తపించే చాలా మంది పాశ్చాత్యులను భారతదేశంలో ఆకర్షించే అంశం ఇదే.
కానీ ఆ పరదేశీ స్వప్నం త్వరగానే ఆవిరైపోయింది. నన్ను నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది అక్కడి అధికార సమీకరణలు. కొందరు వ్యక్తులు ప్రపంచంలో చాలా సులభంగా, ఆత్మవిశ్వాసంతో తిరుగుతుంటే, మరికొందరు తలదించుకుని, భారం మోస్తున్నట్లుగా ఉండడం స్పష్టంగా కనిపించింది. నాతో మాట్లాడే భారతీయులలో ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎక్కువ మంది సాపేక్షంగా ఉన్నత కుల నేపథ్యాల నుండి వచ్చినవారని నేను గ్రహించాను; వారు తరచుగా కులానికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించి చెప్పేవారు. దళితులు చాలా శక్తిమంతులని, అనేక అధికారాలను అనుభవిస్తున్నారని బ్రాహ్మణులు వాదించడం కూడా నేను విన్నాను. అదే సమయంలో, దళితులు వారి ఇళ్లను శుభ్రం చేయడం నేను చూశాను. నాకు చెప్పిన విషయాలను నేను నమ్మలేదు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపైన, ముఖ్యంగా దళిత మహిళలపైన జరుగుతున్న అకృత్యాల సుదీర్ఘ జాబితాను చూసినప్పుడు నా సినిమా ఆలోచన రూపుదిద్దుకుంది. భారతదేశం వెలుపల ఎవరూ పట్టించుకోని ఒక ప్రధాన మానవ హక్కుల సమస్య ఇది అని నాకు అనిపించింది.
ప్రశ్న: అంబేద్కర్ జన్ మోర్చా పాదయాత్రలో రైతాంగ మహిళల నేతృత్వంలో జరిగిన దళిత భూ హక్కుల నిరసనలో మీరు పాల్గొన్నారని, అలాగే మీ బిజినెస్ వీసా నిబంధనలను ఉల్లంఘించారని ఉత్తరప్రదేశ్ పోలీసులు మీపై ఆరోపణలు చేశారు. 2023లో జరిగిన మీ అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని మీరు చెప్పారు. దాని గురించి వివరిస్తారా?
సమాధానం: నేను ఆ నిరసనలో పాల్గొన్నాను—అది ఎక్కువగా దళిత మహిళా రైతులు చేసిన శాంతియుత ధర్నా. నేను ఒక పరిశీలకుడిగా అక్కడికి వెళ్లాను. చట్టబద్ధంగా, ఒక ఫ్రెంచ్ ప్రొడక్షన్ కంపెనీ పేరు మీద జారీ అయిన నా బిజినెస్ వీసాలో, నేను అక్కడ ఉండకూడదు అని నిరోధించే అంశాలేవీ లేవు. నేను ఏ నిబంధనను ఉల్లంఘించాననే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఛార్జ్ షీట్లో ఎన్జీఓల (ప్రభుత్వేతర సంస్థల) నుండి అక్రమ నిధులు అందాయని పేర్కొన్నారు, కానీ అసలు అక్కడ నిధులూ లేవు, ఏ ఎన్జీఓల ప్రమేయమూ లేదు.
నిరసన నుండి తిరిగి వస్తున్న నన్ను గోరఖ్‌పూర్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు, వారిలో ఒక రకమైన ఆందోళనను గమనించాను. నేను వారిని చూసి ఎంత భయపడ్డానో, వారు కూడా నన్ను చూసి అంతే భయపడుతున్నట్లు అనిపించింది; ఒక విదేశీయుడి ఉనికి ఏదో ఒక ముప్పు అన్నట్లుగా వారు భావించారు. పోలీస్ స్టేషన్లో వారు దూకుడుగా ప్రవర్తించారు. నేను సినిమా తీయాలనుకుంటున్నానని వారు నిందించారు. “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ దేశంలో ఉన్న సమస్యల సంగతి మీరు ఎందుకు చూసుకోరు? ఈ ప్రజలు, దళితులు చాలా బాగున్నారు!” అని కమిషనర్ నాతో అన్నారు. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఆయన ఫ్రాన్స్ లో నేను చదువుకున్న అదే స్కూల్ ‘సైన్సెస్ పో’ (Sciences Po) లోనే చదువుకున్నారు.
అరెస్టు అయింది నేను ఒక్కడినే కాదు. ఆ ఉద్యమంలోని పలువురు సభ్యులను కూడా నాతోపాటు ‘హత్యాయత్నం’ వంటి అసంబద్ధమైన ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. నా దృష్టిలో, వీసా నిబంధనల ఉల్లంఘన అనేది కేవలం ఒక సాకు మాత్రమే. తర్వాతి రెండు రోజుల్లో వార్తాపత్రికలు, స్థానిక టీవీ ఛానెళ్లు పదేపదే ప్రసారం చేసిన విషయాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. నన్ను ఒక ఉగ్రవాదిగా, ఒక “అర్బన్ నక్సలైట్”గా, ఒక అంతర్జాతీయ కుట్రలో భాగస్వామిగా చిత్రీకరించారు. దళిత ఉద్యమాన్ని విదేశాల నుండి నడిపిస్తున్నారని చూపించడం ద్వారా ఆ ఉద్యమ ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యం. విదేశీ కుట్రదారుడు అనే పాత ముద్రను వాడుకుని చేసిన ఒక మీడియా స్టంట్ ఇది.
ప్రశ్న: మీరు మీ జ్ఞాపకాలలో గోరఖ్‌పూర్ జైలులోని విచారణ పూర్వ నిర్బంధం; కుల సోపానక్రమం గురించి రాశారు.
సమాధానం: అక్కడ అత్యంత స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే, జైలులో ఉన్న అమాయకుల సంఖ్య. చాలా కాలం పాటు, నేను ఈ పుస్తకానికి “అమాయకుల జైలు” అని పేరు పెట్టాలనుకున్నాను. మొదట నేను: ‘ అమాయకుడివి, త్వరలోనే బయటకు వెళ్తాను’ అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నా తోటి ఖైదీలలో చాలా మంది కూడా అమాయకులే అని నాకు అర్థమైంది. లవ్ జిహాద్, అంతర్కుల వివాహాలు, నోరు నొక్కాల్సిన పాత్రికేయులు, డబ్బు వసూలు చేయడం.. ఇలా.. ఒకరిని కటకటాల వెనక్కి నెట్టడానికి లెక్కలేనన్ని చెడు కారణాలు ఉన్నాయి. బయట ఉన్న “బాధితులు” చాలా మంది ఖైదీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ‘నాకు ఇంత డబ్బు ఇవ్వు, నేను నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటాను’ అని ఒప్పందం చేసుకునేంత సరళంగా ఉండేది.
నిజానికి, జైలు ఒక సమాంతర ప్రపంచం. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్లారంటే, ఒక అంధకారంలో పడిపోయినట్లే. గోరఖ్‌పూర్‌కు చెందని కొన్ని కుటుంబాలకు తమ వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వారు చనిపోయారని కూడా అనుకుని ఉండవచ్చు. వ్యవస్థ మొత్తం విచారణ పూర్వ నిర్బంధంపైనే నడుస్తుంది కాబట్టి, ఒక్కసారి లోపలికి వెళ్తే, ముఖ్యంగా వనరులు లేని పక్షంలో బయటకు రావడం చాలా కష్టం. కేవలం కొద్దిమందికి మాత్రమే శిక్ష పడింది. మిగిలిన వారందరూ ఒక రకమైన అనిశ్చితిలో చిక్కుకుని వేచి చూస్తున్నారు. ప్రజలు ఒక రకమైన మానసిక క్షోభను అనుభవిస్తారు: వారు అక్కడ కొన్ని వారాలు ఉంటారో లేదా ఏళ్ల తరబడి ఉండాల్సివస్తుందా అనే విషయం వారికి తెలియదు.
ఇక జైలులో కులం విషయానికి వస్తే, ప్రతి బ్యారక్‌లోనూ ‘జంధ్యం’ ధరించే వారే కేంద్రస్థానంలో ఉంటారు; వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ కులాలకు చెందిన వారు టాయిలెట్ల దగ్గర ఇరుక్కుని ఉండాల్సి వస్తుంది. నాకు తెలిసినంతవరకు, అక్కడ ఊడ్చే వారంతా దళితులు లేదా ముస్లింలే. డబ్బు లేని తక్కువ కులాల ఖైదీలు ఇతరుల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఒక ఆదివాసీ మసాజ్ చేయడంలో నిపుణుడు. మరొకరు బట్టలు ఉతికేవారు. ఒక యువ ముస్లిం ఖైదీలందరికీ వాటర్ బాటిళ్లు నింపేవాడు. అదే సమయంలో, ఒక ముఖ్యమైన ఖైదీ—నేను ‘డాక్టర్ సాబ్’ అని పిలిచే ఒక మాజీ హాస్పిటల్ డైరెక్టర్, ఒక శక్తివంతమైన ఒబిసి కులానికి చెందిన వ్యక్తి—ఎప్పుడూ తన బెడ్‌పైన పడుకునే ఉండేవాడు, కనీసం వార్తాపత్రిక తీసుకోవడానికి కూడా లేచేవాడు కాదు.
జైలులో ఎప్పుడూ ‘కులం’ గురించి అడుగుతుంటారు. నా విషయంలో అది సులభం. నా కులం: ‘విదేశీ’!
ప్రశ్న: ఒక విదేశీయుడిగా, భాషా సమస్య వల్ల తోటి ఖైదీలతో మాట్లాడటానికి ఇబ్బంది అయిందా? వారు మొదట్లో మీతో మాట్లాడటానికి వెనుకాడారా? మీరు వారి నమ్మకాన్ని ఎలా పొందారు? ఏ వ్యక్తిగత కథలు లేదా అనుభవాలు మీకు జ్ఞాపకం ఉండిపోయాయి?
వాలెంటిన్ హెనాల్ట్: జైలుకు వెళ్లడానికి ముందు నేను రెండేళ్లపాటు హిందీ నేర్చుకున్నాను. ఇంగ్లీష్ మాట్లాడే ముగ్గురు నలుగురు ఖైదీలతో నేను సన్నిహితంగా ఉండేవాడిని; మిగిలిన వారితో హిందీలో సాధారణ మాటలు మాట్లాడగలిగేవాడిని. వారు చెప్పేది కూడా నేను ఎంతో కొంత అర్థం చేసుకోగలిగేవాడిని, అది నాకు చాలా ఉపయోగపడింది.
నేను ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు చాలా ఉన్నాయి. నా పుస్తకంలో వాటి గురించి వివరంగా రాశాను: తన అన్న చేసిన నేరాలను తనపై వేసుకున్న అర్జున్; అస్పృశ్యతను తిరస్కరించి, ఇతర కులాల వారిని తన పక్కన పడుకోనిచ్చిన ఒక బ్రాహ్మణ వ్యక్తి; రవీంద్ర- అతని విషాద ప్రేమకథ; ‘లవ్ జిహాద్’ పేరుతో అక్కడ ఉన్న సుల్తాన్ అనే చిన్న కుర్రాడు; నేను ‘దెయ్యం’ అని పిలిచే ఒక ఖైదీ. జైలు జీవితం కష్టంగా ఉన్నప్పటికీ, అది ఒక నిజమైన సాహసం. అది ఎప్పుడూ కొత్త వ్యక్తులను కలవడం; వారితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడంతో సాగింది.
ప్రశ్న: అతి తక్కువ స్థలంలో 300 మంది ఖైదీలు కిక్కిరిసి ఉన్న బ్యారక్ల గురించి మీరు వివరించారు.
వాలెంటిన్ హెనాల్ట్: అవును. కొన్ని బ్యారక్‌లలో స్థలం ఎంత తక్కువగా ఉంటుందంటే, కనీసం వెల్లకిలా పడుకోవడానికి కూడా వీలుండదు. కేవలం ఒక పక్కకు తిరిగి మాత్రమే పడుకోవాలి. కానీ ఖైదీలు ఇక దీని గురించి ఫిర్యాదు చేస్తున్నారని నేను అనుకోను. గతంలో గోరఖ్‌పూర్ జైలులో తిరుగుబాట్లు జరిగాయని నాకు తెలుసు, ఆ తిరుగుబాటులో పాల్గొన్న ఎవరికైనా ‘అల్లర్లు’ చేసారనే పేరుతో ఇంకా భారీ శిక్షలు విధిస్తారు. ఎదురుతిరగడం అంటే జీవితాంతం జైలులోనే గడపడం అని అర్థం; అందుకనే ఎందుకని ప్రజలు నిశబ్దంగా ఉంటున్నారో నాకు అర్థమైంది. ఫిర్యాదులు చేసే బదులు, ఖైదీలు తమ పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకునే మార్గాలు వెతుక్కుంటారు: ఉదాహరణకు నీడవచ్చే బ్యారక్‌లోకి లేదా కొంచెం తక్కువ రద్దీగా ఉండే చోటికి మారడం లేదా జైలు కోసం పనిచేసే ‘రైటర్’గా మారడం; దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలు లభిస్తాయి; అయితే అ మూడు కోసం మీరు సరైన కులానికి చెందినవారై ఉండడం కూడా అవసరం.
ప్రశ్న: భారతీయ ఖైదీలతో పోలిస్తే, విదేశీయుడవడం వల్ల మీకు మంచి ఆహారం లేదా సౌకర్యాలు లభించాయా? ఇతర ఖైదీలతో, జైలు సిబ్బందితో మీ సంబంధాలపైన ఎలాంటి ప్రభావం చూపింది?
వాలెంటిన్ హెనాల్ట్: అవును, కేవలం విదేశీయుడిని కావడం మాత్రమే కాదు (అక్కడ అఫ్గానీలు, నేపాలీలు కూడా ఉన్నారు), జైలులో నాకు ‘శ్వేతజాతీయుల ప్రత్యేక వెసులుబాటు’ లభించిందని నేను స్పష్టంగా చెప్పగలను. ఒకటి, ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కలిసే ‘ములాఖాత్’ సమయాల్లో గార్డులు చేసే వసూళ్ల నుండి నన్ను మినహాయించారు. ఫోన్ కోసం లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండేది కాదు. రెండు వారాల తర్వాత, నాకు హాస్పిటల్ వార్డులో బెడ్ ఇచ్చారు. అయితే ఆ హాస్పిటల్ వార్డు జబ్బు పడిన వారి కోసం కాదు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారికి లేదా డబ్బు, పలుకుబడి ఉన్నవారికోసం మాత్రమే అనే విషయాన్ని తెలుసుకోవాలి. జైలు అధికారి నాకు ఒక ఉచిత వాటర్ బాటిల్ ఇస్తూ (అది అక్కడ గొప్ప విషయం), “అతిథి దేవో భవ” అన్నారు. నన్ను ఒక అతిథిలా అక్కడ ఉంచినట్లు ఆయన భావన. ఇతర ఖైదీలతో కలిసి మేము దీనిపై చాలా నవ్వుకున్నాం. “వెల్కమ్ టు ఇన్క్రెడిబుల్ ఇండియా” అని కొందరు ఖైదీలు జోకులు వేసేవారు.
భారతదేశం అంతటా లభించిన ఈ గౌరవ మర్యాదలు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అది నాకు తరచుగా ఇబ్బందిగా అనిపించేది. రైల్వే స్టేషన్లో లేదా ఎక్కడైనా, ఒక తెల్లజాతి వ్యక్తి లైన్లో ఉంటే, ప్రజలు తరచుగా వారిని అందరికంటే ముందుకు వెళ్లమని కోరుతుంటారు. దీనిని ‘వలసవాద ప్రభావం’ అని పిలుస్తారని నేను భావిస్తున్నాను.
అయితే, దీనికి మరో ఇబ్బందికరమైన కోణం కూడా ఉంది: జైలులో ఒక తెల్లజాతి వ్యక్తిగా ఉండటం వల్ల నేను ఎప్పుడూ నిఘా నీడలోనే ఉన్నాను. నేను తింటున్నా లేదా స్నానం చేస్తున్నా, ఏదో ఒక వింత జీవిని చూసినట్లు కొందరు ఖైదీలు చూస్తుండేవారు. జైలు మధ్య ఆవరణలో నేను రెండు అడుగులు వేయాలన్నా జనం నన్ను చుట్టుముట్టేవారు; ఏదో ఒక వీధి కళాకారుడు ప్రదర్శన ఇస్తున్నట్లుగా నన్ను చూసేవారు. వారి కుతూహలం అంతులేనిదిగా అనిపించేది.
ప్రశ్న: ముస్లింలను ఇరుకైన ప్రదేశాలలో కలిపి ఉంచేవారని, అదే సమయంలో ‘అగ్రవర్ణ’ ఖైదీలు కేంద్ర ప్రాంతాలను ఆక్రమించేవారని మీరు పేర్కొన్నారు. కుల లేదా మతపరమైన వివక్షకు సంబంధించి మీరు ప్రత్యక్షంగా చూసిన అత్యంత దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ ఏమిటి?
వాలెంటిన్ హెనాల్ట్: అత్యంత దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ ఫోన్ సౌకర్యం. సాధారణంగా ఖైదీలకు ఫోన్ మాట్లాడుకునే హక్కు ఉంటుంది, కానీ అది అందరికీ సులభంగా లభించదు. అది పూర్తిగా జైలు అధికారుల ఇష్టాయిష్టాలపై, మీ పట్ల వారు చూపే పక్షపాతంపై ఆధారపడి ఉంటుంది. నా కుటుంబంతో మాట్లాడటానికి నేను స్వయంగా జైలు అధికారికి రాతపూర్వక విన్నపాలు సమర్పించాల్సి వచ్చింది, కొన్నిసార్లు వేడుకోవాల్సి వచ్చింది. ముస్లింలకు ఒక పద్ధతి ప్రకారం ఫోన్ సౌకర్యాన్ని నిరాకరిస్తారనే విషయం అందరికీ తెలుసు. ఒక ముస్లిం ఖైదీ ఏడాది కాలంగా జైలులో ఉన్నా, ఒక్కసారి కూడా ఫోన్ వాడుకోవడానికి అతనికి అనుమతినివ్వలేదు.
ప్రశ్న: మీ నిర్బంధ కాలంలో, తక్కువ కులాలకు చెందిన ఖైదీలు, ముస్లింల వంటి మతపరమైన మైనారిటీలతో పంచుకున్న అత్యంత భయంకరమైన, దిగ్భ్రాంతికరమైన కథనాలు లేదా అనుభవాలు ఏమిటి?
వాలెంటిన్ హెనాల్ట్: పర్వేజ్ పర్వాజ్ అనే ఖైదీ పరిస్థితి నన్ను తీవ్రంగా బాధించింది. అతను ఇప్పుడు తన నీడలా మాత్రమే మిగిలిపోయాడు కాబట్టి అతన్ని నేను నా పుస్తకంలో “స్పెక్ట్రే” (స్పెక్టర్ – నీడలాంటి వాడు) అని పిలిచాను. అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. అతనికి కంటి శుక్లాలు ఉన్నాయి, కానీ జైలు యంత్రాంగం అతనికి చికిత్స చేయించుకోవడానికి అనుమతినివ్వలేదు. అతను పలు అత్యాచార కేసుల్లో నిందితుడు; ఇప్పటికే ఒక కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు, కానీ అతను త్వరగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అతని ప్రధాన “నేరం” ఏమిటంటే—2007 అల్లర్ల తర్వాత యోగి ఆదిత్యనాథ్‌పై ఫిర్యాదు చేయడం. ఆ అల్లర్ల సమయంలో యోగి విద్వేషపూరిత ప్రసంగం చేసాడని, ఆ విషయాన్ని అతనే స్వయంగా టెలివిజన్‌లో అంగీకరించారని పర్వేజ్ ఆరోపించాడు. పర్వేజ్ ప్రతిఘటించే వ్యక్తి; ఇప్పుడు జైలులోనే మరణానికి చేరువలో ఉన్నాడు.
ఖైదీలను చావుకు వదిలేసే తీరు కూడా భయంకరమైనది. ఒక వ్యక్తి మా బ్యారక్‌లో రాత్రంతా నరకం అనుభవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసాను. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి తలుపులు తీయడానికి ఎవరూ రాలేదు. అంతకంటే దారుణం ఏమిటంటే, గార్డులు ఎప్పుడూ తీసే సమయం కంటే ఆలస్యంగా తలుపులు తీశారు. ఉదయాన్నే తోటి ఖైదీలు “ఖతం!” (అయిపోయింది) అన్నారు. అతను చనిపోయాడు. జైలులో చాలా మంది ఇలాగే చనిపోతారు. ఆ జైలులో ఉన్న మరొక ఏకైక పాశ్చాత్యుడు (అమెరికన్ ఖైదీ) తరచుగా అనేవాడు: “ఈ ప్రదేశం ఒక మరణ యంత్రం”.
ప్రశ్న: మిమ్మల్ని మానసిక స్థితి సరిగా లేనివారిని ఉంచే సెల్లో కూడా ఉంచారు. అక్కడ మీరు ఏమి గమనించారు?
వాలెంటిన్ హెనాల్ట్: అవును, మేము ఆ సెల్‌ని ‘పాగల్పూర్’ (పిచ్చోళ్ల ఊరు) అని పిలిచేవాళ్లం. అక్కడ ఇప్పటికీ ఖైదీలను కర్రలతో కొట్టడం వంటి శారీరక శిక్షలు అమల్లో ఉన్నాయి. ఖైదీలను కొడుతున్నప్పుడు నేను చూడలేక కళ్లు మూసుకునేవాడిని. వారు నొప్పితో కేకలు పెట్టేవారు. “పిచ్చివారు” అని ముద్ర వేసిన ఖైదీలకు ఇంజెక్షన్ల ద్వారా మందులు ఇచ్చేవారు; దాని కోసం వారు ప్రతి సాయంత్రం లైన్లో నిలబడాల్సి వచ్చేది. వారు ఎప్పుడూ మత్తులో ఉన్నట్లు కనిపించేవారు.
నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపైన నేరాన్ని మోపడం చాలా సులభం కాబట్టి వాస్తవానికి అక్కడ ఉన్న చాలా మంది ఖైదీలు నిర్దోషులని చెబుతుంటారు. వారికి బయట నేల మీద కూచోబెట్టి గంజి వంటి ఆహారాన్ని పెట్టేవారు; అది ఇతర ఖైదీలకు ఇచ్చే దానికంటే చాలా దారుణంగా ఉండేది. అయినప్పటికీ, జైలు గోడల బయట వారి కోసం వేచి ఉన్న లోకం ఎంత క్రూరమైనదంటే, చాలా మంది అక్కడే ఉండటానికి ఇష్టపడేవారు. జైలు వెలుపల సమాజంలో ఉన్న హింస స్థాయి గురించి ఇది చాలా విషయాలు చెబుతుంది.
ప్రశ్న: మీరు జైలులో ఉన్నప్పుడు, అత్యంత నిరాశకు లేదా మానసిక వేదనకు గురైన క్షణాలు ఏవైనా ఉన్నాయా?
వాలెంటిన్ హెనాల్ట్: నేను చాలా భయపడ్డాను, నా ప్రాణాల మీద ఆశ వదులుకున్నాను. వార్తాపత్రికలు నన్ను “ఉగ్రవాది” అని పిలవడం చూసినప్పుడు, నాపైన ఉపా (యుఎపిఎ- చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం) కింద కేసు పెడతారని, నేను పదేళ్లపాటు ఆ మురికి జైలులోనే ఉండి నా యవ్వనాన్ని కోల్పోతానని అనుకున్నాను. మీరు అర్థం చేసుకోవాలి: అక్కడ అంతా వారి మాటే చెల్లుతుంది. వారు ఎలాంటి అసంబద్ధమైన అబద్ధాన్నైనా చెప్పగలరని, మిమ్మల్ని ఏమైనా చేయగలరని అందరికీ తెలుసు.
ఇదిలా ఉండగా, ఫ్రెంచ్ రాయబార కార్యాలయం నా కోసం ఏమీ చేయడానికి ఇష్టపడలేదు. భారతీయ అధికారులతో వ్యవహరించడానికి వారు భయపడుతున్నారని నాకు ఎప్పుడూ అనిపించేది. బహుశా వారు నోరు తెరిస్తే ఏదైనా ఆయుధ ఒప్పందం రద్దు అవుతుందేమోనని భయపడి ఉండవచ్చు. భారతదేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఫ్రాన్స్ పట్టించుకోవడం లేదు; హిందుత్వ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న చైతన్యవంతమైన ప్రజాస్వామిక సమాజాన్ని వదిలేస్తోంది. దానికి బదులుగా, దౌర్జన్యంపైన ప్రజల విజయాన్ని చాటే ‘బాస్టిల్ డే’ వేడుకలకు నరేంద్ర మోదీని మేము ఆహ్వానిస్తున్నాము. ఇది చాలా ఘోరమైన విషయం, కానీ ఇదే నిజం. వారి ముందు నేను చాలా అల్పుడిని, వారు నన్ను ఏమి చేసినా అడిగేవారు లేరు.
నేను ఇంత త్వరగా బయటకు రాగలగడాన్ని ఒక అద్భుతంగా భావిస్తాను. నేను రాత ద్వారా ఆ పరిస్థితులను ఎదిరించాను. మొదటి రోజు నుండే, చిన్న చిన్న కాగితపు ముక్కలపై రాస్తూ, వాటిని కుప్పలుగా చేసి నా లోదుస్తులలో దాచుకునేవాడిని. నేను అక్కడ ఒక సాక్షినని, ప్రతి విషయాన్ని నమోదు చేయాలని, ఏదో ఒక రోజు ఈ కథను ప్రపంచానికి తెలియజేయాలని నాకు నేను చెప్పుకున్నాను.
ఆ తర్వాత, వ్యంగ్యం నాకు శక్తిని ఇచ్చింది. ఈ జైలులో ఇలా చిక్కుకుపోవడం, శిక్షా బ్యారక్ కింద చొక్కా లేకుండా స్నానం చేయడం వంటివి ఒక రకంగా నాకు వింతగా, నవ్వు తెప్పించేవిగా అనిపించాయి. పరిస్థితి అంత అసంబద్ధంగా ఉండేది. ఒకప్పుడు ఎన్నో ఆశయాలు ఉన్న నేను, ఇప్పుడు లోదుస్తులతో ఒక గిన్నెడు గంజి కోసం లైన్లో నిలబడటం… అది చూసి కొన్నిసార్లు నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చేది. ఈ బాధా సముద్రంలో, ఆ అసంబద్ధమైన, నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా నేను ఈ పుస్తకాన్ని హాస్యాస్పదంగా మలచడానికి ప్రయత్నించాను.
2026 మార్చి 1
అజీద్ మక్బూల్ కశ్మీర్ లో ఉండే ఒక స్వతంత్ర జర్నలిస్టు.
తెలుగు: పద్మ కొండిపర్తి




