ఉదయ్ కిరణ్ నాలుగు కవితలు
1 మల్లయోధులం నాడు మా బలమైన భుజాలపై ఈ దేశ మూడు రంగుల జెండాను గర్వంగా ఒలంపిక్స్ నుంచి ఢిల్లీ నడి వీధుల్లోకి మోసినప్పుడు మీ పొగడ్తలకు పొంగిపోయి మేము గెలిచిన పతకాలను చూసినప్పుడు మేము ఈ దేశంలో భారతమాతలమైనాము నేడు మాపై జరుగుతున్న లైంగిక దాడులపై న్యాయపోరాటం చేస్తుంటే మీలో రవ్వంతైనా చలనం కలగకపోవడం కాషాయ నీడలు ఎంతలా కమ్ముకున్నాయో, రాజకీయ మతోన్మాదం కాళ్ళ కింద నలుగుతున్న మీరే సాక్ష్యం పార్లమెంటు ముందు పోలీసులు మమ్మల్ని హింసాత్మకంగా ఈడ్చుకెళ్ళి జైల్లో బంధిస్తుంటే ఈ దేశ రక్షణ, గౌరవం ఎప్పుడో బంధించబడ్డాయని మాలో ధైర్యం నిప్పంత నిబ్బరాన్ని రగుల్చుకుంది










