అరుణతార జులై కథల సంచికలోని పాణి కథ ‘విస్తరణ’సమకాలీన ప్రపంచంలోని జీవన సంఘర్షణలను చిత్రించింది. విధ్వంసం, నిర్మాణం, విస్తరణ అనేవి విరుద్ధ శక్తుల దృక్పథాలను బట్టి ఉంటాయి. వాటిని వర్తమాన జీవితంలోని అనుభవాల నుంచి, ఉద్వేగాల నుంచి, అవగాహనల నుంచి చిత్రించిన తాజా కథ ఇది.
దేశంలో వివిధ రూపాలలో వేళ్ళూనుకుంటున్న ఫాసిజం తనకు అడ్డుగా నిలుస్తున్న ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలే లక్ష్యంగా దేశాన్ని హిందూ కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్ మొదలు పెట్టింది. ఆ తర్వాత వేగవంతమైన కార్పొరేటీకరణకు అనుగుణంగా హిందుత్వ శక్తుల చేతిలో అది ఆపరేషన్ సమాధాన్‌గా మారింది. నిర్విరామంగా కొనసాగుతున్న ఈ యుద్ధం మొన్నటి ఎలక్షన్లలో ఆపరేషన్ కగార్‌గా మారి మధ్య భారత దేశంలోని ఆదివాసీ ప్రాంతాలపై చేస్తున్న ముప్పేట దాడి నేపథ్యంలో కామ్రేడ్ పాణి ‘విస్తరణ’ కథ రాశారు. ఎన్నికల వేళ కాస్తైనా ప్రజాస్వామ్యయుతంగా నటించే రాజకీయ పక్షాలకు భిన్నంగా బిజెపి నాయకుల ప్రకటనలు, వారు చేస్తున్న యుద్ధం చూస్తుంటే యూరోపియన్, అమెరికా దేశాల అండతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానవీయ దాడి కళ్ల ముందు కనిపించక మానదు. అక్కడ సుమారుగా పన్నెండు వేలమంది పసిపిల్లల హత్యకు గురయ్యారు. మొత్తంగా ముప్పై ఐదు వేల మంది ప్రజలను చంపేశారు. లక్షల మంది ప్రజలు నిర్వాసితులైనారు. అదే తీరుగా ప్రజాస్వామ్యవాదులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య భారతంలో చేస్తున్న అమానవీయ సైనిక వైమానిక దాడుల కగార్ తరుణంలో అరుణతార ప్రత్యేక కథా సంకలనంలోని పాణి కథ విస్తరణ మనల్ని అనేక ఆలోచనలకు గురిచేస్తుంది. ఇది చదువుతుంటే హిందుత్వ, కగార్ కలగలసిపోయిన తీరు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
రాజ్యం పెద్ద ఎత్తున డ్రోన్ కెమెరాల సాయంతో దండకారణ్యాన్ని జల్లెడపడుతూ విప్లవకారుల ఆచూకీ పేరుతో ఆదివాసీ గూడాలలోకి చొరబడి స్త్రీల స్నానపు దృశ్యాలను చిత్రీకరిస్తూ వారి ఫోటోలను చూపెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నది. గత ప్రభుత్వం ఆకాశ యుద్ధం ఆరంభిస్తే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం దాన్ని అంతిమ యుద్ధంగా మార్చేసింది. ఇది మొదలయ్యాక ఇప్పటికి 150 మందికి పైగా ఆదివాసీ యువకులు, స్త్రీలు, పిల్లలు మరణించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎన్నడూ లేనంత హింసకు పాల్పడుతోంది బుల్డోజర్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి దినం సంఖ్యాపరంగా ఎంత ఎక్కువగా హత్యలు జరిగితే అంతగా గోడీ మీడియా ప్రచారం చేస్తుంది తప్ప అక్కడ మరణించిన వారి వివరాలు పోలీసుల ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నిజానికి పత్రికలు, మీడియా ఆదివాసుల గురించి, వారు అనుభవిస్తున్న హింసను గురించి చెప్పకపోగా తక్కువ చేసి చూపడం జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి సూచిక చాంతాడంత పెరిగిపోతున్నదని ప్రచారం విరివిగా చేస్తున్నాయి.
అడవుల్లో జరుగుతున్నట్లు కనిపించే ఈ హిందుత్వ కార్పొరేట్ విధ్వంసం ఆదివాసుల సమస్య అని, అంతిమ యుద్ధంగా సాగుతున్న కగార్ మావోయిస్టుల సమస్య అని బయటి వాళ్ళు అనుకొనే ప్రమాదం ఉంది. కానీ ఇది దేశ ప్రజలందరి సమస్య అని, మానవ జీవితంలోని సున్నిత విలువల, భావోద్వేగాల, సంబంధాల సమస్య అని చెప్పడం ‘విస్తరణ’ కథ ప్రత్యేకత.
ఈ కథలో కథ, కథనం రెండు పార్శ్వాలుగా సాగుతాయి. ఒక వ్యక్తి పరిచయస్తుల్లో ఒకరు ఉద్యమ నాయకుడుగా, మరొకరు పెట్టుబడిదారుగా మారిపోతారు. ఈ క్రమంలో వారి దృక్పథాల, విలువల, వైఖరుల మధ్య వైరుధ్యాన్ని చిత్రిస్తుంది. వారి వారి నేపథ్యాల తీరులో వారు ఎలా మారిపోయారో కళ్ళకు కట్టినట్లు రచయిత చూపిస్తారు.
సుంకులు అనే విప్లవకారుడు కగార్ యుద్ధంలో చనిపోయాడన్న వార్తతో కథ మొదలవుతుంది. దీనికి సమాంతరంగా మరో కథ ఉంటుంది. ఇందులో మరో స్నేహితుడు శివరాం పరిణామం ఉంటుంది. అతను మొదట్లో పావురం గాయపడినా తల్లడిల్లి పోయేవాడు. క్రమంగా పెట్టుబడిదారునిగా మారి తన భాగస్వామ్యంతో ఊరి ప్రజలకు మృత్యువుగా మారిన ఫార్మా కంపెనీ స్థాపించి మోడీకి మద్దతుదారుడిగా మారుతాడు. ఒకరు ఆస్తి లేని జీవితాన్ని కోరుకొని విప్లవకారుడైతే, మరొకరు ఆస్తులు పోగేసుకొని దానికి అవసరమైన మత, రాజ్య భావజాలానికి మద్దతుదారుడిగా మారిపోయాడు. ఇటీవలి కాలంలో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను కథ రూపంలో మన ముందు ఉంచారు రచయిత.
అజ్ఞాత విప్లవోద్యమంలో వున్న తమ వారి పట్ల బయట వున్న కుటుంబ సభ్యుల మానసిక సంఘర్షణ సుంకులు సహచరి వైపు నుంచి ఈ కథ చిత్రించింది. ఆ భావోద్వేగాలను ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చే వార్తలతో వాళ్లు పడే మానసిక హింసను తీవ్రస్థాయిలో కథలోకి రావడం చూస్తాం. రచయిత వాస్తవిక జీవితాన్ని సరైన దృక్పథంతో కథను నడిపిన తీరు వల్లనే ఇది సాధ్యమైంది. కథలోని శివరాం పాత్ర నేడు అత్యంత వేగంగా, దురుసుగా మారిపోతున్న మానవ వైరుధ్యాలకు సాక్ష్యం. ఇతను ఒకప్పటి తన మానవీయ మనస్తత్వానికి భిన్నంగా తనకు దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని స్థానిక రాజకీయ దోపిడీదారులతో కలిసి పెట్టుబడిదారునిగా మారిపోయాడు. జీవితంపట్ల వైఖరులు మారిపోతే అప్పటి దాకా పైకి కనిపించే మానవతపోయి సంపాదన అలవాటవుతుంది. కనీసం తన చుట్టూ వున్న ప్రజల పట్ల చూపాల్సిన మానవత లేకుండా లేకుండా ఈ పాత్ర మారిపోతుంది.
దీన్నంతా కథ ఎన్నికల నేపథ్యంలో చెప్పడం వల్ల కథను చదువుతున్నంత సేపు ఒక సజీవ డాక్యుమెంటరీలోని మానవ సంబంధాల సంఘర్షణను చూస్తున్న ఫీలింగుకు లోనవుతాం. యుద్ధం, విషాదం, విధ్వంసం నేపథ్యంలో ఉన్నందు వల్ల కథలోని అనుభవానికి చాలా గాఢత వచ్చింది. ఈ స్థితిలో ముస్లిం వ్యతిరేకత ఒక ముఖ్యమైన అంశం. ముస్లిం ప్రజల పట్ల మెజారిటీ హిందువులు లేక తటస్థంగా వున్న ప్రజలు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేయడం మనం అడుగడుగునా చూస్తున్నాం. శివరాం తన సోషల్ మీడిీయా పోస్టులో ‘‘భూపతన్నా, ఈ ముస్లిం కొడుకులు నిన్ను ఓడిస్తారు. జాగ్రత్త’’ అని పోస్టు పెడతాడు. ఇది చాలు.. ఇలాంటి వాళ్ళను ఎంతగా బీజేపీ భావజాలం ఎంత ప్రభావితం చేస్తున్నదీ చూసి సురేష్ దిగ్భ్రాంతి చెందుతాడు. ఇది మనకందరికీ అనుభవంలో వున్న ఆందోళనకరమైన అంశం.
కథ ఒకవైపు రచయిత టోన్‌లో నడుస్తున్నట్టుగానే సాగుతూ అనేక అంశాలను కలుపుతూ కథనం కొనసాగడం వలన ఆసాంతం చదివాక ఇంకా వివరంగా వుండాల్సింది అనిపిస్తుంది. కానీ కథ నిడివి పరిమితుల దృష్ట్యా రచయిత ఎక్కడికక్కడ ఎడిట్ చేసుకున్నారని తెలియవస్తుంది. సంఘటనల పట్ల వెనువెంటనే స్పందనగా వచ్చే కవిత్వంలా కథ కూడా రావడం నేటి అవసరాన్ని రచయిత బాధ్యతగా తీసుకున్నారనిపిస్తుంది. గత దశాబ్ద కాలంగా పెరిగిన జీడీపీ, స్టాక్ బ్రోకర్ల వ్యాపార పురోగతినే అభివృద్ధిగా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటూ రామమందిరాన్ని మాడెల్‌గా చూపిస్తూ మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చే మాటలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్న తరుణంలో దానికి వెనుక ఉన్న విషయాలను కథగా చెప్పడల్చుకున్నారు. దాని వెనుక రెండు విరుద్ధ శక్తులు విస్తరణ కోసం ఘర్షిస్తున్నాయి. అవి మానవ జీవితం మొత్తానికి సంబంధించిందని చెప్పడం రచయిత ఉద్దేశం. తద్వారా మొన్నటి ఎన్నికల వెనక వున్న జీవిత సత్యాన్ని మన ముందుంచారు పాణి.
అలాగే ఇటీవలి ఎదురుకాల్పులలో మరణించిన కాంకేర్ అమరులకు జోహార్లు చెపుతూ వచ్చిన పార్టీ ప్రకటనలోని పేర్లను చూసి సుంకులు భార్య సురేష్‌తో ‘ఇదేం బాగా లేదు సర్, చాలా కష్టంగా వుంది’ అంటుంది. ఇట్లా భర్త మరణించాడా? ఉన్నాడా? అని వెతుక్కోవడం ఆమెకు బాధగా వుంటుంది. ఈ మాట అంటూనే ‘‘మనోళ్ళకు కష్టంగా ఉందంట కదా. అయినా నిలబడతామని రాసిండ్రని మావాడు చదివినాడు…’’ అన్నది పార్టీ ప్రకటనను ఉద్దేశించి. ఆ మాట ఆమె ఉత్సాహంగా చెబుతుంది. కథలో ఇది చదివినప్పుడు ఉద్యమంలో వున్న వారి కుటుంబ సభ్యుల మానసిక స్థితిని కూడా తెలియ చేస్తూ వారికి ప్రజల పట్ల వున్న బాధ్యతను ఎరుకలోకి తెస్తుంది. తమ వాళ్ళ పట్ల వున్న ఆందోళనతో పాటు ప్రజలెదుర్కొంటున నష్టాన్ని కష్టాన్ని కూడా తమదిగా గుర్తించడం వారి రాజకీయ సంసిద్ధతను తెలియ చేయడం ఈ కథలోని ప్రత్యేకత.
అలాగే ప్రజలు కార్పొరేట్ పెట్టుబడి విస్తరణను సూచిస్తూ శివరాం స్థాపించిన ఫార్మా కంపెనీ వంటి వాటివలన ప్రజలు ఎదుర్కొంటున్న నష్టాన్ని కనీసం పట్టించుకోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ లాభార్జన కోసం ఎంతకయినా తెగించడం కథలో చూస్తాం. ప్రజలు కూడా అంతే తెగువతో రోడ్లపైకి రావడం చూపిస్తారు. ఎక్కడికక్కడ నిరసనలు ద్వారా ప్రజలు ఎంతగా వీటీకి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా కొనసాగుతున్న కంపెనీలు, కార్పొరేట్ దోపిడీ ఒకవైపు, రామమందిరం నిర్మాణంతో తమకు తిరుగులేనీ మెజారిటీ ఖాయమనుకున్న మోదీ పక్షానికి ప్రజలు అంతే కోపంతో అయోధ్యలో ఓడిరచిన తీరును కథలో ప్రస్తావించడం ద్వారా వాస్తవ పరిణామాల్లోంచే మార్పు పట్ల ఆశావహ దృక్పథాన్ని కథ ప్రకటిస్తుంది.
మొత్తంగా కథలో ప్రజల కొరకు తన జీవిత కాలాన్ని త్యాగం చేసిన మనిషి ఒకరైతే, క్షుద్ర రాజకీయాల వైపుగా మరలి తనకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అలవడిన డబ్బును పెట్టుబడిగా పెడుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఫార్మా కంపెనీ స్థాపించి కోట్లకు పడగ ఎత్తాలని చూసే మనిషి మరోవైపు. మానవ సంబంధాల, విలువల, ఉద్వేగాల రూపంలో చిత్రించిన ఈ సంఘర్షణ హిందుత్వ కార్పొరేట్ కగార్‌ను జీవితం వైపు నుంచి అర్థం చేసుకోడానికి ఈ కథ దోహదం చేస్తుంది. తద్వారా పాఠకులకు మంచి అనుభవం కలుగుతుంది. అ కనీస సామాజిక మానవీయ స్పందనకరువైన నేటి స్థితి మధ్య భారతంలోని ఆదివాసీల నిర్మూలనే లక్ష్యంగా విస్తరిస్తున్న రాజ్య హింసాత్మక యుద్ధం ఒకవైపు, దానిని అడ్డుకునేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతూ పోరాడుతున్న ప్రజా సైన్యం ఒకవైపు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా స్పందించాలని ఆశతో రచయిత ఈ విస్తరణ కథను రాశారు. మనం పత్రికలలో చదువుతున్న దానికీ ప్రజలు తమ నెత్తుటితో లిఖిస్తున్న చరిత్రకూ ఉన్న తేడా ఉంటుందని కథ చెబుతుంది. దీన్ని లూషన్ మాటలతో గుర్తు చేసుకోవడం బాగుంటుంది . “Lies written in ink cannot disguise facts written in blood”.
విస్తరణ కథ చదివాను కానీ వర్మ గారు గుర్తించిన అంశాలను నేను పట్టుకోలేక పోయాను. చాలా చక్కని విశ్లేషణ. పాణికి, వర్మగారికి అభినందనలు.
Thank you Sir