నేనెప్పుడూ కవిత్వం రాయను
కాగితం మీద మంటలతో మండిస్తాను
ప్రతి పదం డైనమేటై
ఎముకలు విరిగిన
కవుల ముఖాల మీద పేలుతుంది
చైతన్యంతో రగలాలనీ
లేకుంటే మౌనంగా కుళ్ళి చావాలనీ
నాకవిత్వం ప్రకటిస్తుంది
దుమ్ము కొట్టుకుపోయిన బాలుడు
శూన్యపు కళ్ళతో చూస్తుంటే
అతని ఆకలిని నా అక్షరాల్లో ప్రకటిస్తాను
యుద్ధం క్లాస్ రూమ్ ను మింగేస్తే
నా పెన్నును ప్రతిఘటనతో చెక్కుతాను
నువ్వు రాస్తావా
నీ అక్షరాలు ప్రతిఘటనను పదునెక్కిస్తాయా
లేక పగిలిన పింగాళీ కప్పులో
సారహీనమైన ఉపమానాల్ని చప్పరిస్తావా
పాలస్తీనియులు రక్తమోడినప్పుడు
రోహింగ్యాలకు ఊపిరాడనప్పుడు
ఆఫ్రికా అమ్మాయిలు గుక్కెడు నీళ్ళ కోసం
శీలాన్ని ఫణంగా పెట్టినప్పుడు
నువ్వు నదుల మీదా
గులాబీ పువ్వుల మీదా
కవిత్వం రాస్తావా
ప్రాణం లేనిది, ప్రేమలేనిది
ఇదే నా కవిత్వం
కవీ.. మౌనంగా ఉండిపోతే
నువ్వు కవివి కావు..ప్రజాద్రోహి వి
"కవిత్వంలో రాజకీయాలు వద్దు" అని
ఎవడైనా అంటే
నాలుక తెగ్గో సేయండి
రాజకీయం
ప్రజల రక్తం
వాళ్ళ బాధ ,చెమట, పోరాటం
మౌనంగా మిగిలిపోవటమే
కవిత్వం అయితే
పీడితుల దుఃఖాన్ని ఎత్తిపెట్టే
సమస్త సంకలనాలను తగలెయ్యండి
కవిత్వం అంటే
హిపోక్రసీని చీల్చి చెండాడడమే
మోసాలను ఎండగట్టకపోతే
కవిత్వమే ఒక పెద్ద మోసం
మతఛాందసానికి భయపడితే
మనిషే ఒక నిశ్శబ్ద టెర్రరిస్టు
నేనిలా రాస్తాను
"మతం కాదు ..ప్రేమ ముఖ్యం
యుద్ధంగాదు ..మానవత్వం ముఖ్యం"
ఓ శ్రామికుడి చీలిన మడమ
నా కవితకు ముందు మాట
ఓ రిక్షావాడి దగ్ధ స్వప్నం
నా వాక్యాన్ని చెక్కే ఉలి
కూలందని మహిళ కడుపాకలికి
చిరిగిన చీర చెరుగులకి
శరీరం మీద పేరుకుపోయిన ఉప్పుటేర్లకీ
నా కవిత్వపు లయ కొట్టుకుంటుంది
ఇక్కడే
చరిత్రని నిర్మించి
చరిత్రలో తుడిచిపెట్టుకుపోయిన
అనాధుల ఆక్రందనల్ని వింటావు
నవీన కవీ
నువ్వు కవివి కావాలనుకుంటే
పెన్నును ఆయుధంగా మల్చు
నీ అక్షరాలు ప్రతిఘటనాస్త్రాలుగా మార్చు
నీ వాక్యాలు నిరసనరూపాలై
ప్రేమ విప్లవాన్ని రగల్చనీ
భయం వద్దు
సాహిత్యం మెప్పుకోలుకు గాదు
చరిత్రను పునర్ నిర్మించే మహత్తర సాధనం
ఉదయాలను స్వాగతించే వాళ్ళం
పువ్వుల్ని మంటలు విసిరేయలేం.
నిశ్శబ్దపు గోడల్ని బద్దలు కొట్టడానికే
కవిత్వం రాస్తాం
సత్యం తలెత్తినిటారుగా నిలబడే
నిఖా ర్సైన సాహిత్యాన్ని సృష్టిస్తాం
నేను కవిని, ఆయుధాన్ని ,మానవత్వాన్ని
***
M.R Tipu..bengal poet
Related