ఆ రోజు మే 22 సమయం ఐదు గంటల 30 నిమిషాలు. కాలేజీ నుంచి అలసిపోయి ఇంట్లోకి అడుగు పెట్టిన  నన్ను చూసిన మరుక్షణం  ఒక్కసారిగా ఎదురుగా ఉరికి వచ్చి  మాబాబు డింపు (చార్వాక) హత్తుకొని బోరున ఏడ్వటం ప్రారంభించారు.  ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదు. వాడి జీవితంలో అంతగా ఏడ్చింది ఇదే మొదటి సారి కావచ్చు. మొన్న నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇక బ్రతకను అని డాక్టర్ చెప్పిన సందర్భంలో కూడా వాడట్లా ఏడవలేదు. ఇంట్లో ఏం జరిగిందోనని ఆందోళన పడ్డాను. అర్థంకాక ఆలోచిస్తూ, ఎందుకు తనని అట్లా ఏడిపిస్తున్నారని మా పాప ప్రకృతి వైపు కోపంగా చూసి, వెంటనే కోపం అర్థం కాకుండా ఉండడం కోసం సున్నితంగానే “ఎందుకు ఏడిపిస్తున్నారు తల్లీ” అంటూ అడిగానో లేదో  తాను కూడా ఒక్కసారి గాఢంగా నన్ను హత్తుకొని బోరున ఏడ్చింది. ఇద్దరు పిల్లలు ఏడుస్తుండే సరికి, ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని నా మనసు నా సహచరి అనురాధ వైపు మళ్ళింది. ఏమన్నా అన్నదా అని, ఆలోచించేలోపే అనురాధ  బెడ్ రూమ్ నుండి మెల్లగా ఏడుపు వినబడ్డదో లేదా, నా మాట వినబడ్డదో, కానీ బయటికి వచ్చింది. తనకు ఏమైందో అర్థం కానట్టుగానే ఉంది. “ఏమైందిరా అనురాధ” అన్నాను. తాను ఏమీ అర్థం కానట్టుగా నిలబడి చూస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. “స్పష్టంగా చెప్పండి ఏం జరిగిందో?” అని ఒకసారి గట్టిగా అరిచాను. గాఢంగా హత్తుకున్న డింపు (చార్వాక) కౌగిట నుంచి విడిపించుకోకుండానే అట్లానే ఏడుస్తున్నాడు. పాప ప్రకృతి కూడా అట్లానే ఏడుస్తుంది. ఏమీ అర్థం కాక అనురాధ కూడా బిత్తర పోయి చూస్తుంది. నేను తనవైపు చూస్తున్నాను. “ఏమైందిరా?” అని అడిగాను. తనకు ఏమీ తెలవదు అనే మాట అనలేదు కానీ తన చూపులకు అర్థం అదేనని తెలుసుకున్నాను.

“ప్లీజ్ తల్లి ఏమైందో ఒకసారి చెప్పండి. కనీసం చెప్పాకా  ఏడవండి” అనగానే ప్రకృతి నోటి వెంట నాన్న… “ ’అనగనగా’ సినిమా చూశాము. అందులో నువ్వే క్యారెక్టర్…… మన ఫ్యామిలీనే డబ్బింగ్ కొట్టి ఎవరో సినిమా తీశారు” అన్నది. ఒక్కసారి నా మనసు శాంత పడింది అమ్మయ్య అని.

“సినిమా చూసే ఇంత ఏడవాలా?” అని అన్నాను. “అది సినిమా కాదు నాన్న నీ ఆలోచనా సరళి.  మా చదువుల కోసం మన కుటుంబం పడ్డ గొడవలు, వేదన. నువ్వు, అమ్మ పడ్డ ఘర్షణ. చదువు చెప్పడంలో హింస, అహింసల మధ్య సంఘర్షణ. ఎప్పుడూ నువ్వు చెబుతావే అమ్మకానికి చదువులు పెట్టి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టం ఉందని, సరిగ్గా అదే సినిమా. ఇంకా చెప్పాలంటే మన జీవితమే ఒక సినిమాగా వచ్చిందని చెప్పాలి.  ఆ సినిమా చూస్తే గానీ  నువ్వు ఎంత వేదన పడ్డావో అర్థం కాలేదు నాన్న. మా దరిదాపుల్లోకి చదువులో హింస రాకుండా నిలబెట్టడం కోసం, మమ్మల్ని మమ్మల్నిగా  అర్థం చేసుకోవడం కోసం నువ్వు  పడ్డ తపన. అంతరంగంలో పడ్డ హృదయ వేదన అర్థమైంది” అనేసరికి మనసు కుదుటపడి చక్కగా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. నాతో పాటు బాబు, పాప ఇద్దరూ  వచ్చి నన్ను కూడా సినిమా చూడమని లాప్టాప్ ముందు పెట్టారు. సినిమా చూసే మూడ్ లేదు. కానీ ఏం చేయను? పిల్లలు అంతగా ఎందుకు ఏడ్చారో తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంది. కానీ  సినిమా మూడు గంటలు కదా. “ నేను చూడలేను తల్లి. ప్లీజ్ ట్రై టు అండర్ స్టాండ్  మీ” అన్నాను. “లేదు నాన్న! నువ్వు చూడాల్సిన సినిమా. అమ్మ, నువ్వు ఇద్దరూ చూడండి” అంటూ లాప్టాప్ ఓపెన్ చేసి సినిమాను నా ముందు పెట్టారు. “తలనొప్పిగా ఉంది, తల్లి! ఒక చాయ్ పెట్టిస్తావా? కొంచెం అల్లం ఎక్కువ” అని అడిగానో  లేదో ఎక్కడ సినిమా చూడనో అని “సరే డాడీ అంటూ కిచెన్ కి వెల్లి గరం చాయ్” అంటూ ముందు వాలింది. ఇక తప్పదని మూడు గంటలు అదే సినిమా ప్రపంచంలోకి అనురాధ, నేను వెళ్ళిపోయాము. సినిమా నడుస్తున్నంతా సేపు మధ్య మధ్యలో జరిగిన సన్నివేశాలను చూసి ఇద్దరం మా జీవితంలో జరిగిన సన్నివేశాలు చూస్తూ పోల్చుకోవాల్సి వచ్చింది. “చూసావా ఎన్ని తప్పులు చేశాము. పిల్లల చదువుల విషయంలో” అని నేనంటే, తనని ఉద్దేశించి అన్నానని “అది సినిమాలోని పనికొస్తుంది మామయ్య” అంటూ సమాధానం చెబుతూనే ఉంది. అక్కడక్కడ అభిప్రాయాలు పంచుకోవాల్సి వచ్చింది. సినిమా నడుస్తూనే ఉంది.  సెల్ నా పక్కనే ఉండేసరికి ఏదో మెసేజ్ వచ్చిందని చూశాను. ఇంతలోకే వదిన నుండి “హ్యాపీ మ్యారేజ్ డే రవి అండ్ యువర్ ఫ్యామిలీ” అనుకుంటూ మెసేజ్ వచ్చింది. “థాంక్యూ వదిన” అని రివర్స్ మెసేజ్ పంపిన వెంటనే. హ్యాపీగా గడుపుదాం అన్నా గడపలేని స్థితిని వదినకు తెలియజేస్తూ ఎన్కౌంటర్ సందర్భంగా మిత్రుడు పంపిన చిన్న మెసేజ్ ని కూడా పంపానో, లేదో ఒక్కసారి నా ఆలోచన వెనుక్కుమళ్ళీ  ముందు రోజుకి వెళ్ళింది.

మే 22 మా మ్యారేజ్ డే. కాబట్టి పిల్లలు ఈసారి కొంచెం గ్రాండ్ గా  వాళ్లకు నచ్చిన తీరుగా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు.  నాతో ఏమి పంచుకోలేదు కానీ నాకు అర్థమైంది. వాళ్ళ ప్రవర్తన చూసి  వాళ్లని డిసప్పాయింట్ చేసే ఉద్దేశం లేక నేనేమీ మాట్లాడకుండానే యధావిధిగా 21వ తారీకు కాలేజీకి వచ్చాను. వచ్చిన తర్వాత సెల్ ఫోన్  చూస్తున్న క్రమంలో ఒక స్టూడెంట్ స్టేటస్ లో ఈరోజే రామకృష్ణ, నాగేశ్వర్ రావు హంటర్ రోడ్ లో మరణించిన రోజు అని అర్థమైంది. “నిజంగా అమరత్వం ఎంత గొప్పది. ఎప్పుడో నలబై సంవత్సరాల క్రితం చనిపోయిన ఇద్దరు భగత్ సింగ్ వయసంత యువకుల మరణాన్ని గుర్తు చేస్తూ నేటి యువత కూడా ఒక స్టేటస్ గా పెట్టుకోవడం. చరిత్రను ఎవరూ చెరుపలేరు” అని అనుకున్నాను.  అప్పుడప్పుడు యువత విప్లవంవైపు ఆలోచిస్తలేరు అనే వాళ్ళ మాటలు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. వెంటనే గుర్రం జాషువా రాసిన  “రాజు మరణించే  నొక తార రాలిపోయే/ కవి మరణించే నొక తార గగన మెక్కె/రాజు జీవించే రాతి విగ్రహముల యందు/ కవి  జీవించే ప్రజల నాలుకల యందు” అనే  పద్యం గుర్తొచ్చింది. ఇక్కడ కవి కాక వీరుడు అని అర్థం చేసుకుంటే సరిపోతుందఅని మనసులో అనుకొని మళ్లీ కాలేజీలో నా పనిలో నేను నిమగ్నమయ్యాను. సమయం ఒంటిగంట అనుకుంటాను. అశోకన్న నుంచి ఫోన్ వచ్చింది. “అన్నా! టీవీ5 వాళ్ళు ఫోన్ చేశారు. ఏమన్నా ఎన్కౌంటర్ జరిగిందా!” అని అడిగేసరికి “నేను న్యూస్ ఫాలో కాలేదన్నా”  అని చెప్పేసరికి తన నుండి “గంగన్న మరణించాడట. ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి తన గురించి ఏమైనా మాట్లాడమంటున్నారన్న” అని చెప్పేసరికి నమ్మశక్యం కాని “నేను ఇది నిరంతరం జరిగే పనేగా అన్నా!” అంటూ కొట్టి పారేసి ఫోన్ పెట్టేసాను. ఎందుకైనా మంచిదని సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి సోషల్ మీడియాలో వార్త రానే వస్తుంది. వెంటనే అశోక్ అన్నకు ఫోన్ చేసి “ఇప్పుడే వార్తలు చూశాను. మీరన్నట్లు వస్తుందన్న” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

మళ్లీ గంట సమయం గడిచిందో లేదో సోషల్ మీడియా అంతా ఎన్కౌంటర్ గురించే  అరుస్తుంది. ఏది నిజమో ఏది అబద్దమో నమ్మలేని నిస్సహాయ స్థితిలో మనసు రోదిస్తుంది.   ఇది నిజం కాకూడదని మనసులో అనుకుంటున్నాను.  అయినా ఎక్కడో ఏదో అనుమానం.  నిజమయితే….? ఊహ కూడా భరించలేని స్థితి.  చెప్పలేని బాధ.  తమ జీవితాలను ప్రజల కోసం అంకితం చేసిన వీరులు నక్సల్బరి కాలం నుండి ఎందరో….?  చారుమజుందార్ నుండి ఉన్నత సమాజం కొరకు  తమ త్యాగాలతో ప్రజా ఉద్యమాలను నిర్మించిన వీరులెందరో..?  ఈ రోజు ఆ వీరుల దారిలో గంగన్న…?   ఇది అని చెప్పలేని అవ్యక్త స్థితిలో  నా సహచర అధ్యాపకులతో కలిసి  వెహికల్ లో మూడు గంటల ప్రయాణం చేస్తూనే సెల్ ఫోన్ లో మునిగిపోయాను.

ఏం జరిగిందో, జరుగుతుందో తెలియని గందరగోళంతోనే, ఆందోళనతోనే ఇంటికి చేరుకున్నాను. ఒకసారి తనివి తీరా ఏడవాలని అనిపించింది. ఏకాంతంగా ఏడుద్దాం అని పక్క గదిలోకి వెళ్లేసరికి నా సహచరి అనురాధ కనిపించింది.  తన్నుకొస్తున్న దుఃఖాన్ని తనకు  కనబడకుండా – అనురాధతో  “విలువలతో జీవితాన్ని నిలబెట్టిన వారు క్రమక్రమంగా ఒక్కొక్కరు చంపేయ పడుతున్నార్రా..” అంటున్నానో లేదో నా కళ్ళ నుండి కారే కన్నీళ్ళను పరిశీలిస్తుందని వెంటనే అదిమి పట్టుకున్నాను.  “పాపను  టీ పెట్టి ఇస్తావారా?” అని చెప్పి సెల్ ఫోన్ లో మునిగి పోయాను.

వాట్సాప్ లో నాగేశ్వరన్న నుండి నుండి

“రవి

ఏమిటి

ఈ దారుణం

మనసు మూగగా రోదిస్తుంది

కళ్లకు నిజమే అని తెలుస్తున్న ఎక్కడో అబద్ధమైతే బాగుండు” అనిపిస్తుందని  పంపిన  మెసేజ్ లో తానెంతగా రోధిస్తున్నాడో అర్థమయ్యేటట్టుగా ఉంది.

మావోయిస్టు పార్టీ నాయకుడు, సుదీర్ఘకాలం ఉద్యమమే  జీవితంగా  బతికిన వ్యక్తి ఆ మాత్రం మనుషుల మీద ప్రభావం వేయకుండా ఎట్లా ఉంటాడని అనుకుంటూనే అమరత్వం సహజం అని అనుకొని

“అన్నా!

మూగగా రోదిస్తున్న

నీ మనసు

కోట్లాది  కన్నీటి అణువులను ప్రవహింపజేస్తుంది.

నీ ఎదపై

ఎన్ని వేల టన్నుల బరువును

మోస్తున్నావో నాకు మాత్రమే తెలుసు.

నీ హృదయం

ద్రవీభవనం చెంది

లక్షలాది అక్షరాలను

అల్లి

మంటల్ని రాజేస్తుంది.

ఆ మంటల్లో ఈ రాజ్యం కాలిపోక తప్పదు”  అంటూ నాలో ఉన్న కసిని కవిత్వంగా మలిచి తిరిగి తనకు వాట్సాప్ మెసేజ్ పంపుతూ  “బాధలు లేని సమాజం కోసం  వేదన తప్పదన్నా”  అని రాసి పంపాను. ఈ వార్త తెలిసినప్పటి నుంచి చాలామంది మిత్రుల నుండి ఫోన్లు రావడం ఓదార్చడం, బాధపడడం జరుగుతూనే ఉంది.

సినిమా చూస్తూ బాబు ఏదో అడుగగానే మనసు మళ్లీ వర్తమానంలోకి వచ్చింది.

ఇరువైమూడు సంవత్సరాల జీవితంలో ఒక్కసారి కూడా నా సహచరి భావాలకు అనుగుణంగా మ్యారేజ్ డే జరుపుకోలేని నిస్సహాయ స్థితిలో జీవితం గడిచింది.  కారణం నేను నమ్ముకున్న రాజకీయ విశ్వాసాలే కావచ్చు. భూస్వామ్య అవశేషాలే కదా ఈ మ్యారేజ్ డేలు, బర్త్ డేలు.  ఇది నా విశ్వాసం. నా విశ్వాసంను నా సహచరి గౌరవించింది. నన్ను, నా రాజకీయ విశ్వాసాలను అర్థం చేసుకుంది.  అందుకే ఏ రోజు నా మీద ఒత్తిడి తేలేదు.  అనురాధ ఓపికకు, సహనానికీ  ఒక్కొక్క సారి ఆశ్చర్యం కలుగుతుంది నాకు.   అందరిలా తనతో మ్యారేజ్ డేలు, బర్త్ డేలు జరుపుకోకపోవడం వల్ల తను ఎంత ఇబ్బంది పడుతుందో….?  ఒకవేళ చేబితే కాదనే స్థితి నాకుందా?…ఇలా ఆలోచిస్తుండగానే అధికారికంగా ప్రభుత్వ ప్రకటన వచ్చింది.  గుండెలో ఏదో మూల ఉన్న ఆశ కూడా ఆవిరైపోయింది.

“ఎన్కౌంటర్ అంటే కేవలం మనుషులు చనిపోవడమే కాదు కదా. క్రమక్రమంగా మహోన్నతమైన వ్యక్తులు ఏర్పరిచిన సంస్కృతిని కూడా ధ్వంసం చేయడమే కదా!  మనుషుల పట్ల రాజకీయాల పట్ల మనం ఏర్పరచుకున్న ప్రేమే మనల్ని ఈ విధంగా దుఃఖానికి లోను  చేస్తుంది. మనుషులు   అనేక సంతోషాలు కోల్పోవాల్సి వస్తుంది. దు:ఖాలను అధిగమించాల్సి వస్తుంది. ఎవరూ లేకపోయినా బిగ్గరగా ఏడవాలని ఉన్నా ఏడవలేని ఒక నిస్సహాయ స్థితి ఉంటుంది” అని మనసులో అనుకుంటూ ఉన్నానో  లేదో ఈ లోపే ఇంతలో ఎదురింట్లో ఉన్న డాక్టర్ నవీన్ “అంకుల్” అనుకుంటూ తలుపుతట్టారు. లేసి బయటికి వస్తున్న నన్ను చూసి ఇంట్లోకి వస్తూ వస్తూనే “హ్యాపీ మ్యారేజ్ డే సార్” అంటూ  పలకరించాడు. మ్యారేజ్ డే అని వాళ్లకు ఎట్లా తెలిసిందా అనుకునే లోపే రమ్య బెడ్ రూమ్ లోకి వెళుతూ “అక్క ఏమిటి ఇట్లా ఉన్నారు. పెళ్లిరోజు కదా” అని అడగగానే అనురాధ “ఆరోగ్యం బాగాలేదు రా.” అన్నది.  రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ఉన్న స్థితి ముఖంలో అర్థమయ్యే విధంగా కనబడుతుంది. అట్లా ఉండగానే తాను తెచ్చిన చీర ఒకటి అనురాధకి చేతిలో పెట్టి ఇద్దరూ కలిసి “హ్యాపీ మ్యారేజ్ అక్క, మామయ్య” అంటూ ఆప్యాయంగా పలకరించారు. మన వాళ్లు అనుకున్న వాళ్లు కొందరు దూరం అవుతున్నా,  ఏమీ కారనుకున్నవారు ఈ విధంగా ఫ్యామిలీలో కలిసిపోవడం సంతోషించదగ్గ విషయమని అనుకున్నాను. కాసేపు ముచ్చట నడుస్తున్న క్రమంలో అనురాధ చేసిన ముద్ద గారెలు తీసుకొచ్చి పెట్టింది. తలా రెండు తిని మాట్లాడుకుంటున్నాము. వెంటనే ఏదో ఫంక్షన్ అంటూ రమ్య, నవీన్ సెలవు తీసుకున్నారు.

అప్పటికే ఆలస్యం కావడం మూలంగా ఎవరి బెడ్ రూమ్ కి వాళ్ళం  వెళ్లిపోయాం. నిద్ర పట్టక మళ్లీ నేనే పిల్లల బెడ్ రూమ్ లోకి వచ్చాను. ఇంకా పిల్లలు  సినిమా గురించే చర్చిస్తున్నారు.   “అర్ధ వలస అర్ధ భూస్వామ్య సమాజాన్ని రక్షించే ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి సంబంధాలు మారకుండా విద్యా విధానం మారదు.  అర్ధ వలస అర్ధ భూస్వామ్య సమాజాన్ని రక్షించే ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి సంబంధాలు మార్చడానికే కదా గంగన్న లాంటి వాళ్ళు ప్రజలతో కలిసి నడుస్తున్నది.  ప్రజలు విజయం సాధించినప్పుడే విద్యా విధానం  మారుతుందని, అప్పటివరకు  ఈ స్థితి ఇలానే ఉంటుందని ఎలా చెప్పాలి. ఎలా అర్థం చేయించాలి?” అనేక ఆలోచనలు చుట్టుముట్టగా పిల్లలను లైట్ ఆపి పడుకొమ్మని మళ్ళీ    బెడ్ రూమ్ వెళ్లేసరికి అనురాధ తన ప్రశాంతత కోసం తాను రెగ్యులర్ గా  చదువుకునే కథలు చదువుతూ సెల్ ఫోన్ లోకి  వెళ్ళిపోయింది. నా మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని కావచ్చు. మనసులో ఏదో అడగాలని ఉన్న అడగలేక పక్కకు తిరిగి పడుకుంది. తన అనారోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని నా మనసు ప్రశాంతత కోసం హృదయ వేదనను తగ్గించుకోవడం కోసం కవిత్వమో, పాటనో రాయడంకోసం సెల్ ఫోన్ లో రాయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అట్లా రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా చేసింది రాజ్యం. ఆ విధంగా 22 మే తెల్లారిపోయింది. ఇట్లా నా ఒక్కడి జీవితమే కాదు కోట్లాది కుటుంబాలలో ఇలాగే జరిగి ఉంటుందని , నేను అర్థం చేసుకోగలను. అది యదార్ధం కూడ.

 భగత్ సింగ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఉన్నత శిఖరాలెక్కిన నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు అలియాస్  గంగన్న, అతని సహచరులు గుండె కోట్ లో వేసిన త్యాగలబాటలో సాగినప్పుడే, ఆ విప్లవం విజయవంతం  చేసుకున్నప్పుడే మన చదువులు “అనగనగా” సినిమాలో చూపినట్టుగా స్వేచ్ఛగా, హింస లేని చదువులుగా, చదవంటే ఒక ఆటగా , ఒక పాటగా, అంగట్లో చదువులు అమ్మకానికి దొరకని విధంగా ఉండగలవని,  ఆ సినిమాను అందరిని చూడమని చెప్పాలి. 

One thought on ““అనగనగా” సినిమా కాదు జీవితం

  1. వాస్తవానికి ఇది ఒక మంచి కథ… వెబ్సైట్ నిర్వాహకులు చదవకుండానే సినిమా సమీక్ష విభాగంలో ఈ కథను చేర్చడం తప్పిదంగా గుర్తించి కథల విభాగంలో చేర్చాలని సాగర్ ను కోరుతున్నాను

Leave a Reply