నువ్వు పట్టాభూమిని దున్నుతవు
పరంపోగును దున్నుతవు
నీ కర్రు గట్టితనం గొప్పది
బయటి బాపతులు
ఇంటిదాక వచ్చి
పొయిల ఉప్పు పోసినా
చిటపొట చిచ్చు రేగినా
ఇంటా, బయటా తెల్వకుండా
బహురూపుల విన్యాసాలు ఎన్నో
ఇది తెలిసిన వారికి తెల్క పిండి
తెలువని వారికి గానుగ పిండి
రెండూ ఒకటేనని
బైరాగి చేతిలోని తంత్రి తల నిమురుతుంది.
ఇసుకలో నూనె పుట్టించడం
ఇరుసుకు కందెన రాయకుండానే
నడిపించే ఉపాయం నేర్పడం
నీకు తెలుసు
పత్రికల్లో వచ్చిన
పతాక శీర్షికలను
పేర్చి కూర్చితే అది కవిత్వం కాదు
సంపుటాల కుంపట్లు ఎన్ని వెలిగించినా
అగ్గి లేకుంటే
అది కుమ్మై కూలుతుంది
గూడ పోయి యాతం వచ్చింది
యాతం పోయి మోట వచ్చింది
మోట పోయి రాటు వచ్చింది
రాటు పోయి ఆయిల్ ఇంజన్ వచ్చింది
ఆయిల్ ఇంజన్ పోయి అంటుకుంటేనే
మాడి మసై పోయే
కరంటు మోటర వచ్చింది.
గూడ కాడ గుంజీలు తీసుకుంటూ
రాటుతోని రణం చేస్తనంటవు
బొడ్డుతాడు ఊడకుంటే
భూమ్మీద ఎట్ల పడుతం
తల్లి కొంగు విడువకుంటే
తరతరాల బానిసత్వం బరువు
తలమీది నుంచి ఎట్లా దించుకుంటం
వాస్కోడాగామ సముద్రాల సాహస యాణం
ప్రపంచాన్ని పల్లెటూరును చేసింది
ఆఫ్రికాలో పుట్టిన మనుషులు
అన్ని ఖండాలను అలుముకున్నరు
మధ్య ఆసియా నుండి వచ్చిన పశు పోషకులు
మనువాదులై కూసున్నరు
రాజకీయం ఎంతా?
రణనీతి ఎంతా?
అర్థం అర్థమయిందా ?
నువ్వు పచ్చగడ్డిలో పసిరికవు
గురి చూసి నీ గూటిలోని పిల్లలనే
కాటు వేస్తున్నవు
ఒక్కరొక్కరిని కాల్లబొవుడకు
అకారణంగానే సాగనంపుతున్నవు
ఊరికి పోయేటోన్ని విడిచిపెట్టి
ఏర్గ పోయేటోనికి సద్ది కడుతున్నవు
నువ్వు వేదికల మీద విప్లవకారునివి
కిందికి దిగినంక కూకటి పామువు
నీ మాటల మంటల రాగాలకు
ముందు పడితే
ముంత పొగ దిక్కైతది
నువ్వు ఒడ్డు మీదుండి
ఒయ్యారాలు పోతవు
కవి ప్రతిపక్షంలో ఉండాలంటవు
ఉండ్రాళ్ళ పండగ వచ్చినపుడు
నాలుగు ఫైరవీల గుండ్రాళ్ళను విసిరేస్తవు
ఏదైనా ఒక గుండు తాకి
ఒక గువ్వ పిట్ట రాలినపుడు
పదిమందిలో ముట్టుకోకుండా
పచ్చి అహింసా మూర్తివైతవు
ఉడికిచ్చే కాడికి ఉరికి
ఉడికీ ఉడకనిదీ ఊదుకొని తింటవు
కార్పోరేట్ బాధ్యతకు
కాపలా దారువైనవు
ఏ వస్తువైనా అమ్ముకోవడమే
నీతి అయిన కాడ
నిగరానీ నాదంటవు
డబ్బెంత తెచ్చింది
కీర్తెంత వచ్చింది
అని కొలుసుకొనే కాలంలో
ఒక కీర్తి కాముకుని కొమ్ము కాస్తున్నవు
సేవా కోసం రెండెకరాలు కొని
పదెకరాలు మింగిన వాడే
నీకు పసందైన ప్రాణ సఖుడు
వారీ ! ఊసరవెల్లీ !!
నీ రాతలు ఉట్టిపోయిన స్థనాలు
దవడలు ఊడిన బక్కది
సొప్పబెండ్లు నమిలినట్టుంటది
బక్కెద్దు పెండ
దొడ్లో ఉన్నా
ముడ్లో ఉన్నా ఒక్కటే
నీ బొచ్చె మీద నిచ్చెనలేసి
ఎక్కేంత నిధులు లేవని
అందరికీ తెలుసు
అయినా ఆ సదురుడు ఆగుత లేదు
ఆ వదురుడు ఆగుత లేదు
నిన్ను దిస మొలలతోని
నడిబజార్లో నిలబెట్టక ముందే
నీ గారడి తనాన్ని ఆపు
నీ జారుడు తనాన్ని ఆపు.
Related