పచ్చని ఆకుల రాలడం కాదు
పచ్చని చెట్ల మొదళ్లు
కూల్చివేతలు కాదు
ఆకులనీడన వున్న యెన్ని జీవితాలు
ఎండుతాయో లెక్కెట్టు
జీవితమంటే ఆకురాలిన సెట్టుదైనా
వయసు పెరిగిన మనిషిదైనా
వొకటేకదా!
కూల్సడమంతా సులువు కాదు
ఆకులో పత్రహరితాన్ని నింపడం
జీవితమూ అంతే....!
నాలుగాకుల్ని తెంపడమంటే
నాలుగు జీవితాలెండడమని
బోధపడదీ ఆధునిక మానువుడికీ.
యిప్పుడంతా ప్లాస్టిక్ ఆకుల్నే ప్రేమించేదీ
సజీవ పసరుదనం ఎక్కడుంటుందీ ..?
ఇప్పుడు ఆకులు పూయాల్సిన ప్రతిచోటా
ఆకుల యంత్రంపుట్టుకొచ్చింది
యిక మనుషుల్లో మాత్రం పసరు పుడుతుందా.!
పుట్టదు
పుట్టదుగాక పుట్టదు
ఒకేళ పుట్టినా యంత్రంలో దాని ఛాయవొస్తుందే తప్పా
గిల్లితే కన్నీరు కార్చే ఆకులనెవరూ సృష్టించలేరు..!
రాలిన ఆకుల కొమ్మ నుంచి మరొ పత్రం పుట్టినట్లు
రాల్చేసిన జీవితాల్లోని మళ్ళా ఒకజీవితానెందుకు
పుష్పింపనివ్వరూ
ఈ ఆధునిక యంత్రాలు..!
ఆకురాలిన దృశ్యం
ఒకటి
దర్శనమిస్తుంది
పుష్పించే జీవితాలు కొన్నైతే
దాన్ని వికసింపనీ తోడేళ్ళు యింకొన్ని
రాలుతున్న ఆకులకు గొడుగు కాసేవీ కొన్నైతే
గొడుగుల్నీ అడ్డంగా చీల్చేవీ యింకొన్ని ముళ్ళులూ..!
వెలుగు కోసం ఉదయతారలో జీవానికి
సిద్దమయ్యేవి కొన్నైతే
ఆకుల్ని ఎదగనీకుండా తామసి మబ్బు కోరలతో
విషం చిమ్మే తాసుపాములెన్నో మరి..!
తనదీ ఆ జీవితమనే విశ్వసత్యాన్నెందుకు
విస్మరిస్తారో ఇసుమంతైనా బోధపడదు..!
నాలుగాకులు కలిస్తే గుప్పెడు నీడొచ్చినట్లూ
నలుగురు కలిసుంటే భుజాల బలమనీ
తెలినీ యంత్రాలు ఈనాటీ మోడ్రన్ మనుషులు
మనుషుల మనుషుల్లో నిండిన మనీ తలపులు
ఆకురాలడమూ
మనిషి జీవితం రాలడమూ
రెండూ వొకటే
ఒకరిది నిత్యం
రెండోది వైకల్పికం
ఇంక మీదట కాలమంతా
మనుషులు కూల్చిన ఆకులసంగతి కాదు
రాలిన ఆకుల కింద మనిషి గమనమేంటో.!
చెట్ల మొదళ్ళు కూల్సినంతా
సులువు కాదు
దాన్ని నిలపడమంటే...!
మనిషి జీవితం కూడా అంతే
అందుకే
ఆకురాలిన దృశ్యం అనిర్వచనీయమైన వాస్తవ దృశ్యం
వయసు సడలిన ప్రతి మనిషి జీవితంలోనూ
రాలుతున్న ఆకులలోని అంతరార్థం ప్రత్యక్షంగా అగుపిస్తుంది.
వయసు ముదిరిన దశలో మనిషికి విలువ లేనట్టే
సారమైపొయి రాలే ఆకుకు ఒకటే వర్తమాన రేఖ
అది నిస్సందేహంగా నిస్సారరేఖ
అందుకే నాగరిక సమాజమా...!
రాలిపోయే ఆకులకు కొన్ని నీటి చుక్కలు
రాలబొయే వృద్ధులకు యింకొన్ని వాత్సల్య పిలుపులైనా
అందించి వికసించనివ్వండి
మొదటిదికి
జీవకారుణ్యమైతే
రెండోది జన్మకారుణ్యం
Related