స్త్రీ అంటే శరీరం కాదు అనుభవించే హృదయం, ఆలోచించే మెదడు ఉన్న మానవజీవి అని నమ్మే  వ్యక్తుల, సంస్థల తీవ్ర  నిరసనల మధ్య మరే ప్రజోపయోగ కార్యక్రమాలు లేవన్నట్లు తెలంగాణ ప్రభుత్వం  హైద్రాబాద్ లో ఈ ఏడాది మే7 నుండి  72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించ తల పెట్టింది. దీనిని తెలంగాణకు ఆదాయం తెచ్చిపెట్టగల ఉత్సవంగా చూస్తూ 200కోట్ల పెట్టుబడి పెట్టటానికి సిద్ధం అయింది. ఈ సందర్భంలో అందం గురించిన, శాస్త్రీయమైన , మానవీయమైన అవగహన కోసం  నిత్య వ్రాసిన “అందం – ఆదర్శం”  అనే కవితను పరిచయం చేయాలనిపించింది. 

నిత్య కలం పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణకుమారి. బడిలో చేరినప్పుడు నిర్మల అయింది.విప్లవ విద్యార్థి రాజకీయాలలోకి వచ్చి అక్కడినుండి దండకారణ్య విప్లవ అవసరాల కోసం ప్రభాత్ పత్రికకు పనిచేస్తూ  మధ్య భారతంలో అనేక చోట్లకు మారుతూ రహస్య జీవితం గడిపింది. ఆ కాలం లోనే మధ్యప్రదేశ్ జీవాధారమైన నర్మదా నది పేరును తన పేరుగా స్వీకరించింది. అప్పటికే విప్లవ రాజకీయాలలో పనిచేస్తున్న కిరణ్ ఆమె జీవిత సహచరుడు. నిర్మల అన్న తన పేరులోని మొదటి అక్షరాన్ని కిరణ్ అసలుపేరైన సత్యం లోని రెండవ అక్షరాన్ని కలిపి ‘నిత్య’ కలం పేరుగా చేసుకొన్నది.  దండకారణ్య మహిళా ఉద్యమ అవసరాల కోసం 1996 నుండి పోరుమహిళ పత్రిక బాధ్యతలను చేపట్టింది. 2019లో అరెస్ట్ అయింది. సరైన వైద్యం అందక కాన్సర్ తో బాధపడుతూ 2022 ఏప్రిల్ 9న మరణించింది. ఈ ఏప్రిల్ కు  ఆమె అమరురత్వానికి మూడేళ్లు. 

అందం అనాది నుండి నేటివరకూ కవితావస్తువు అవుతూనే ఉంది. అది ప్రకృతి అందం కావచ్చు ..స్త్రీ అందం కావచ్చు…అయితే భూస్వామ్య రాచరికాలలో  అనుభవ యోగ్యమైన వస్తువు అయిన స్త్రీ అందం పెట్టుబడిదారీ సమాజంలో వ్యాపార వస్తువు అయిం ది. వస్తువినిమయ సంస్కృతిలో మార్కెట్లో వస్తువులను ప్రమోట్ చేయటానికి  అందమైన ఆడవాళ్లు అవసరం అయినారు. అందాల పోటీలు ఆ క్రమంలోనే ప్రాముఖ్యానికి  వచ్చాయి. 1996 లో  భారతదేశంలో తొలిసారి బెంగుళూరులో  అమితాబ్ బచ్చన్  కార్పొరేషన్ కంపెనీ ఈ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించింది. వీటిని వ్యతిరేకిస్తూ ఆనాడు దేశంలో మహి ళలు ఉద్యమాలు చేశారు. అందానికి కొలతలు, మేకప్, అలంకరణ సామగ్రి ప్రమాణాలు కావటంలోని రాజకీయాలను చర్చిస్తూ కరపత్రాలు, బుక్ లెట్స్ ప్రచురించారు. ఈ నేపథ్యంలో నిత్య కూడా ప్రపంచ సుందరి పోటీల చరిత్ర గురించి తెలుసుకొనటానికి, తెలియ చెప్పటానికి ప్రయత్నించినట్లు తెలిపే  అసంపూర్తి రచనలు రెండు లభిస్తున్నాయి. ఒకటి సామ్రాజ్యవాద సంస్కృతి. ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’ పాట తనకు చాలా ఇష్టమని రేడియోలో ఎప్పుడు ఆ పాట వచ్చినా వెర్రి ఆనందంతో వినేదాన్ని అని చెప్పుకొంటూ  నిత్య ఆ వ్యాసం ప్రారంభించింది.  ఇటీవలికాలంలో అందాల పోటీలపై వెల్లువెత్తిన నిరసన, జరుగుతున్న చర్యల నేపథ్యం తనను అందం గురించిన ఆలోచనలో పడేసింది అని  అంటుంది. సీరియస్ విషయాలను క్యాజువల్ గా తీసుకొని బతికెయ్యటం గురించి ఆందోళన కూడా పడింది. 

నిత్య పేర్కొన్న అందాలపోటీల నిరసన ఉద్యమం 1996 లో బెంగుళూరులో జరిగిన ప్రపంచసుందరి పోటీల సందర్బం లోనిదే. ఆ పోటీలు అయిపోయాక కూడా ఆ సమస్య ఆమెను వేధిస్తూనే ఉంది అనటానికి ఆధారాలు ‘ప్రపంచసుందరి’ అనే శీర్షికతో ఉన్న రచనలో ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆమె ‘అందం – ఆదర్శం’ అనే కవిత వ్రాసి ఉంటుంది. ఈ కవిత ‘పోరు మహిళ’  మార్చ్ 2005- ఫిబ్రవరి 2006 సంచికలో ప్రచురించబడింది. అంటే ప్రపంచసుందరి పోటీలు జరిగిన పదేళ్లకు వచ్చిందన్నమాట. ఆ కవిత చూడండి. చదవండి.  

 అందం – ఆదర్శం 

నుదుట మీద చిన్న బొట్టు 

చెవులకు ఒంటి ముత్యపు టాప్స్ 

వేలికి పగడపు ఉంగరం 

మెడలో సన్నని బంగారు గొలుసు 

కుడి చేతికి రిస్టు వాచీ 

ఇదీ 

మా అమ్మద్వారా నేను విన్న 

ఐ ఏ ఎస్ అమ్మణి అందం 

అందానికి ఆ తరం నిర్వచనం 

చిన్నప్పటి నా ఆదర్శం 

**********

1969

శ్రీకాకుళం తర్వాత 

నుదుటి నిండుగా గుండ్రని సింధూరం 

ఎడమపాపిడి 

చెదరని జుట్టు 

ముడిచిన కొప్పు 

బోసిమెడ -చెవులు 

నేస్తాల ద్వారా నేను విన్న 

విప్లవకారిణి పంచాది నిర్మల అందం 

మొన్నటి నా ఆదర్శం 

      ****************

పట్టింపుల్లేని చింపిరి జుట్టు 

చెమట బిందువులతో మెరిసే నుదురు 

భుజానికి కిట్టు 

కుడిభుజానికి ఎస్ ఎల్ ఆర్ 

ఎడమ భుజానికి వేళ్ళాడే సంచి 

తల మీద ఇనుప క్లేమోర్ 

అవసరానికో పలుకు 

పలకరింపుకో చిరునవ్వు 

అడ్వాన్స్ కాషన్ కు ఎవరెడీ 

 కోరాపుట్ ఆమె చిరునామా 

డౌలా ఆమె స్మరణ 

ఇది నిన్నటి ‘కరుణ’ అందం 

ఆ ‘మోతి’ నేటి ఆదర్శం 

( మే 17 నాడు డౌలా దాడిలో ‘కరుణ’ అమరత్వపు కబురు విన్నప్పుడు కళ్ళముందు నిలిచిన కరుణ (మోతి) రూపానికి అక్షర రూపం.) 

డౌలా  దాడి ఘటన పూర్వాపరాలు తెలియదు. మే 17 న జరిగింది అన్న ఆధారం ఒక్కటే ఉంది. కవిత మార్చ్ 2005 –  ఫిబ్రవరి 2006 పోరుమహిళ సంచికలో రావటం వలన ఆ ఘటన 2004  మే 17 న జరిగిందా? 2005 మే 17 న జరిగిందా అన్న ప్రశ్న వస్తుంది. 2004 లో జరిగిందంటే ఆ వార్త ఆమెకు ఆలస్యంగా తెలిసి ఉండాలి. ఆలస్యానికి అవకాశాలు సాధారణమే. ఆమెకు తండ్రి మరణ వార్త ఏడాది తరువాత తెలిసింది అంటే ఆ మాత్రం ఊహించవచ్చు. 2005 మే 17 న జరిగినా 2006 ఫిబ్రవరిలో సంచిక వచ్చింది కనుక వార్త తెలిసి నిత్య ఈ కవిత వ్రాయటానికి వీలుంది.  ఘటన ఎప్పుడు ఎక్కడ ఎలా  జరిగినా మొత్తం మీద రాజ్యంతో చేస్తున్న పోరులో విప్లవ పార్టీ నిర్మాణంలో ఆచరణలో భాగమైన  కరుణ అనబడే మోతి అమరురాలైంది అన్నది సత్యం. నిత్యకు బాగా తెలిసిన  వ్యక్తిత్వం కావటం వల్ల మరణంలోనూ మోతి  చలన చైతన్యాల రూపమే ఆమె కళ్ళకు కట్టింది. ఆ రూపాన్నే అక్షరంగా చెక్కింది. 

ఒక రకంగా ఇది స్మృతి కవిత. అంతమాత్రమే కాదు. అమరత్వం గురించిన వాస్తవం బాధాకరమే అయినా కారణ ఔన్నత్యం వలన ‘అమరత్వం రమణీయమైనది’ అంటూ అందులో  సౌందర్యాన్ని దర్శించి చెప్పటం విప్లవోద్యమ  కవిసమయం. నిత్య కు కూడా కరుణ అమరత్వం గురించి వినగానే ఆ ‘రమణీయత’ స్ఫురించి ఉంటుంది.  అది పదేళ్లుగా తనలో  నలుగుతూనే ఉన్న అందం గురించిన ఆలోచనా తలాన్ని తాకటం వలన కలిగిన ఒత్తిడి నుండి  కవితగా ఇలా ఆవిష్కృతమై ఉంటుంది.  

మామూలు మరణాలు సహజ అసహజ మరణాలు ఏవైనా మరణాలే . ఒక ఆదర్శాన్ని ఆచరణ వాస్తవం చేయటం కోసం ఉన్న ఊళ్లను, కన్నవాళ్ళు ఇచ్చిన పేరును, భౌతిక లౌకిక సౌకర్యాలను, సౌఖ్యాలను, భద్రజీవితాన్ని, బంధుమిత్రులను వదిలేసి పోరాడే క్రమంలో  మరణం ‘అమరత్వం’ గా ఉదాత్తీకరణ చెందుతుంది. రమణీయత అంతా ఆ ఉదాత్త ఆదర్శంలో ఆచరణలో ఉంది. అందువల్ల అమరత్వం రమణీయమైనది అవుతుంది. ఇది స్పష్టపడ్డాక కరుణ సంస్మరణ అందం గురించిన కొత్త నిర్వచన రూపం తీసుకున్నది.

అందం – ఆదర్శం అనే ఈ కవితలో మూడు భాగాలు ఉన్నాయి. మనుషులకు వాళ్ళవాళ్ళ నేపథ్యాలను బట్టి, వాతావరణ ప్రభావాలను బట్టి, సామాజిక సంబంధాలను బట్టి చిన్నవో పెద్దవో ఆదర్శాలు ఉంటాయి. ఆదర్శాలు స్థిరంగా ఉండవు. మారటానికి అవకాశం ఉంది. ఆదర్శమే అందం విలువకు గీటురాయి అని ఈ మూడు భాగాలు పూర్తయ్యే సరికి అంచలంచెలుగా మన అవగాహనకు అందుతుంది. 

 ఈ కవితలో. మొదటి సందర్భం  తల్లి  ఒక ఐఏఎస్ అమ్మణి  గురించి తన చిన్నతనాన చెప్పిన మాటలతో మొదలవుతుంది. 

  “నుదిటి మీద చిన్న బొట్టు 

 చెవులకు ఒంటి ముత్యపు టాప్స్ 

వేలికి పగడపు ఉంగరం 

మెడలో సన్నని బంగారు గొలుసు  

కుడి చేతికి  రిస్టు వాచీ”  ఈ   మాటలు అందం అంటే  నిరాడంబరత అన్న అవగాహనను ఇస్తాయి.  దానితో పాటు

“మా అమ్మద్వారా నేను విన్న 

            ఐ ఏ ఎస్ అమ్మణి అందం 

           అందానికి ఆ తరం నిర్వచనం 

చిన్నప్పటి నా ఆదర్శం” అన్న కవితా పంక్తులు మధ్యతరగతి తల్లులు  స్త్రీకి అందాన్ని ఇచ్చేవి ఉన్నత విద్య, ఉన్నతోద్యోగం అని భావిస్తూ దానినే బిడ్డలకు ఆదర్శంగా చూపటం గమనించవచ్చు . అందువల్ల కవికి అదే  చిన్నప్పటి ఆదర్శం అయింది.  

ఇక రెండవ సందర్భం విప్లవరాజకీయాల సంబంధంలోది. 1969 శ్రీకాకుళ ఉద్యమం గురించి వింటూ తెలుసుకొంటూ ఉన్న క్రమంలో అంతవరకు అందానికి నిర్వచనంగా తనలో ముద్రపడిన  ‘నిరాడంబరం’గా ఉన్న ఐఏఎస్ అమ్మణి స్థానంలోకి పంచాది నిర్మల వచ్చి చేరింది. 

 “ నుదిటి నిండుగా గుండ్రని సింధూరం

ఎడమపాపిడి 

చెదరని జుట్టు 

ముడిచిన కొప్పు 

బోసిమెడ – చెవులు  ఇది పంచాది నిర్మల కట్టూ బొట్టు తీరు, ఆమె తనకు ఆదర్శం అయ్యేసరికి ఆ కట్టూ బొట్టూ తీరే అందానికి నిర్వచనం అయినాయి. 

శ్రీకాకుళం సెట్ బ్యాక్ తరువాత 70వ దశకంలో  అది నూతన వ్యవసాయిక విప్లవోద్యమంగా తెలంగాణలో నివురూదిన నిప్పై మండుతుంటే 1990 తరువాత సాయుధ  దళాలలోకి విరివిగా చేరుతూ  దండకారణ్య విప్లవోద్యమాన్ని నడిపిస్తున్న మహిళ కవికి ఆదర్శం. అలాంటి మహిళలకు ప్రతినిధి  మూడవ కవితాఖండికలోని కరుణ. ఆ కరుణకే మరొక పేరు మోతి. కరుణ ల నిర్ణయం , మోతీల ఆచరణ ఆదర్శం అయ్యాక అందం గురించిన కొత్త దృష్టి అనివార్యం.   

 “ పట్టింపుల్లేని చింపిరి జుట్టు

చెమట బిందువులతో మెరిసే నుదురు 

భుజానికి కిట్టు 

కుడిభుజానికి ఎస్ ఎల్ ఆర్ 

ఎడమ భుజానికి వేళ్ళాడే సంచి 

తల మీద ఇనుప క్లేమోర్ 

అవసరానికో పలుకు 

పలకరింపుకో చిరునవ్వు 

అడ్వాన్స్ కాషన్ కు ఎవరెడీ”  ఇది ఇప్పటి మురిపించే అందం. 

ఇందులో ఒక గెరిల్లా మహిళ శరీరం,  ఆయుధం, ముందుకు దూకే సంసిద్ధత కలిసి అందం అయింది. అందమంటే శరీరాన్ని రకరకాల క్రీములతో నునుపెక్కించటం, మెరిపించటం కాదు. శరీరానికి వ్యాయామం ఇయ్యటం. నిత్య సంచారంలో ఎక్కే గుట్టలు , దాటే అరణ్యాలు విప్లవ మహిళ నుదుటిని చెమట బిందువులతో అలంకరిస్తాయి.  కనురెప్పల నుండి , తలజుట్టు వరకు అన్నీ శ్రద్ధగా రకరకాల రంగులను, షాంపూలను, నూనెలను, క్రీములను ఉపయోగిస్తూ అదే పనిగా పోషించటం కాదు. నిత్య సంచారంలో , కర్తవ్య నిమగ్నతలో జుట్టు దువ్వుకొనే అవకాశం లేని విప్లవ మహిళది పట్టింపులేని చింపిరి జుట్టు. జుట్టు రాలిపోతున్నదా ? తెల్లబడుతున్నదా? రేగిందా? చిక్కులు పడిందా – ఇలాంటి పట్టింపులేవీ విప్లవ మహిళకు ఉండవు. రోజువారీ అత్యవసర వినియోగ సామగ్రితో కూడిన కిట్టు ,ఎస్ ఎల్ ఆర్ ( సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ ) ఆమె శరీరంలో భాగాలుగా అమరిపోయి ఉంటాయి. ఎడమ భుజానికి వేళ్ళాడే సంచీ సరే  దాని తో పాటు తలమీద ఇనుప క్లెయిమోర్ ఆమె వేషంలో భాగం. 

 యుద్ధంలో ఉన్నప్పుడు శత్రువును దరి జేరనీయని వ్యూహ రచనలో భాగం చుట్టుపక్కల మందుపాతరలు పెట్టటం. అందువల్ల గెరిల్లా దళాలకు ఇనుప క్లెయిమోర్ లు నెత్తిన పెట్టుకు వెళ్ళటం కూడా ఒక అవసరం. అందాల పోటీలలో విజేతలకు కిరీటం పెట్టి గౌరవిస్తారు. విప్లవ మహిళ నెత్తిమీద మోసే ఆ ఇనుప క్లెయిమోర్ ను కవితలో ప్రస్తావించటం ద్వారా నిత్య  సమాజంలో మార్పు కోసం , సమాజాన్ని సమానత్వ సూత్రం ప్రాతిపదికగా మార్చటం కోసం శత్రువు మీద విజయం లక్ష్యంగా ఇనుప క్లెయిమోర్ ను నెత్తిన మోస్తూ వెళ్లే విప్లవమహిళ సౌందర్యాన్ని తారస్థాయిలో నిలబెట్టినట్లయింది.  అందం శరీరపు ఒడ్డూ పొడుగును బట్టి కటి, నడుము, వక్షోజాల కొలతలను బట్టి నిర్ణయించే పెట్టుబడిదారీ విలువ సిద్ధాంతాన్ని త్రోసిరాజని పని సంబంధంలో, విప్లవ సమాజ నిర్మాణప్రాధాన్యతతో పునర్నిర్వచించటం ఈ కవిత ప్రత్యేకత.అందం నిరపేక్ష అంశం కాదు. ఆదర్శాల సాపేక్షతలో అది విలువను సంతరించుకొంటుంది. అందం కోసం అందం, పెట్టుబడిదారీ వస్తూత్పత్తుల వినియోగంతో ఆ వస్తూత్పత్తుల వినిమయాన్ని పెంచి లాభాలు సంపాదించటం కోసం జరిగే కృత్రిమ సృష్టి అవుతుంది.  పీడితులైన అధిక సంఖ్యాక సామాన్య జన సౌఖ్యాపేక్షతో కష్టభూయిష్టమైన విప్లవ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తున్న అనేకమంది మహిళల  ఆచరణలో   అందమే అసలైన అందం అని అనన్యంగా స్థాపించింది ఈ కవిత . ఆదర్శమే అందం కానీ అందం సాధించవలసిన ఆదర్శం కాదు అన్నది ఈ కవిత సారం.

Leave a Reply