కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు 14 మంది అగ్ర నాయకులతో సహా 287 మంది నక్సలైట్లను హతమార్చాయని, 1,000 మందిని అరెస్టు చేశాయని, ఒక సంవత్సరంలో 837 మంది లొంగిపోవడానికి వీలు కల్పించాయని ప్రకటించాడు. గత దశాబ్దంతో పోలిస్తే భద్రతా సిబ్బందిలో మరణాల సంఖ్య 73 శాతం తగ్గిందని, పౌర మరణాలలో 70 శాతం తగ్గుదల ఉందని అన్నాడు.

రాష్ట్రంలో నక్సల్ హింసలో మరణించిన 1,399 మంది భద్రతా సిబ్బంది స్మరణలో నిర్మించిన జగదల్‌పూర్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద షా మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం చేపట్టిన ఆర్థికపర చొరవల గురించి నొక్కిచెప్పాడు; హింసకు గురైన కుటుంబాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 15,000 కంటే ఎక్కువ ఇళ్ళను – వాటిలో 9,000 కంటే ఎక్కువ ఇళ్ళను బస్తర్‌లో నిర్మిస్తున్నామని చెప్పాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి “ఈ ప్రాంతాల పట్ల సానుభూతి” ఉందని షా స్పష్టం చేశాడు. కానీ తిరుగుబాటుదారులపై జరుగుతున్న యుద్ధంలో అమాయక ప్రజలు మరణించారనే ఆరోపణలతో పెరుగుతున్న ఫిర్యాదుల గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు.

మొత్తం మావోయిస్టుల హత్యల సంఖ్య 14 రెట్లు పెరిగిందని, 2024లో 287 మందిని చంపేస్తే , 2023లో కాంగ్రెస్ పాలనలో కేవలం 20 మందిని మాత్రమే చంపారని లెక్కలు చెబుతున్నాయి. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు తీవ్రతరం అయ్యాయి; ఛత్తీస్‌గఢ్‌లోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో (బలహీనమైన షెడ్యూల్డ్ తెగలు నివసించే స్వయంప్రతిపత్తి ప్రాంతాలు) పెరుగుతున్న కార్పొరేట్ ప్రయోజనాలకు సమానంగా సైనికీకరణ ఉంది. 2019 నుండి బస్తర్‌లో 250 వరకు సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేసారని అంచనా. అదేవిధంగా, 2000లో ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో పారామిలిటరీ దళాల బెటాలియన్ల సంఖ్య 5 నుండి 60కి పెరిగింది.

నక్సల్ వ్యతిరేకంగా కొనసాగుతున్న  కార్యకలాపాలలో  అధికారికంగా చెబుతున్న లెక్కల  ఖచ్చితత్వం, అమాయక గ్రామస్తులను రక్షించడానికి అమలుచేయాల్సిన ప్రామాణిక నిర్వహణా విధానాలను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) అనుసరిస్తున్నారా లేదా అనే విషయాలు హక్కుల కార్యకర్తలలో ఆందోళనలను రేకెత్తించాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవులలో భద్రతా దళాలు, మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య జనవరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నెలల పసికందు తూటాలకు బలయ్యింది, తల్లి గాయపడింది. ఈ విషాదం కలతపెట్టే నమూనాలో భాగం; ఇటువంటి ఘటనలు చాలా తరచుగా జరగడం ఆందోళనను కలిగిస్తోంది.

మారుమూల ఉన్న సంఘర్షణలతో నిండిన ప్రాంతమైన అబూజ్‌మాడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలలో కేవలం ఒక్క డిసెంబర్‌ నెలలోనే కనీసం నలుగురు పిల్లలు గాయపడ్డారు; ఏడుగురు మావోయిస్టులను చంపినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే, మరణించిన ఏడుగురిలో ఐదుగురు అమాయక గ్రామస్తులు అని ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ బైజ్‌తో సహా స్థానిక నివాసులు వాదించారు. భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపడాన్ని ఖండించారు.

గాయపడిన పిల్లలలో ఒకరైన రామ్లీ ఓక్సామ్ మెడలో బుల్లెట్ లోతుగా దూసుకుపోయింది. సి-1 వెన్నుపూస దగ్గర తూటా ఉన్నట్లు ఎక్స్-రేతో సహా వైద్య నివేదికలు చూపుతున్నాయి. మరో చిన్నారి సోను ఓయం తలపై తూటా దూసుకెళ్లడంతో ప్రాణాంతక గాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు. తనను కాల్చే ముందు తన తండ్రిని కాల్చి చంపటం చూశానని గాయపడిన సోను ఓయం ఆసుపత్రిలో విలేకరులకు వివరించాడు.

బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ విజ్ఞప్తి చేసాడు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని నొక్కిచెప్పాడు. నక్సలిజాన్ని నిర్మూలించడానికి నిర్దేశించిన “అవాస్తవిక గడువులను” తిరిగి అంచనా వేయాలని పిలుపునిచ్చాడు. అమాయక జీవితాలను ప్రమాదంలో పడేసే చర్యలను ఆపమని హెచ్చరించాడు.

గతంలో రమణ్ సింగ్ ప్రభుత్వ 15 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో బూటకపు ఎన్‌కౌంటర్‌లు, చట్టాతీత హత్యలు జరగడం వల్ల  ఇటువంటి ఉద్దేశిత ఎన్‌కౌంటర్‌లు దర్యాప్తు పరిధిలోకి వచ్చాయి. “నక్సల్స్‌‌తో బలగాలు పోరాడుతున్నప్పుడు ఈ పిల్లలు ఎలా గాయపడ్డారు? ఇది నిజంగా ఎన్‌కౌంటరా లేక అమాయక ప్రజలను చంపడమా? బూటకపు ఎన్‌కౌంటర్‌లకు సంబంధించి బిజెపి ప్రభుత్వానికి పేలవమైన రికార్డు ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి, ”అని బాఘేల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో రాశాడు.

నక్సలైట్లు పిల్లలను మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారని బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి. సుందర్‌రాజ్ అన్నాడు. కానీ  స్థానిక గ్రామస్తులు తమపై కాల్పులు జరిగినప్పుడు తాము పొలాల్లో పనిచేస్తునామాని చెప్పారు.

భద్రతా బలగాలకు “విస్తృతమైన అధికారాలు” ఇచ్చారని, వాటిని వారు జవాబుదారీతనం లేకుండా ఉపయోగిస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసుల హక్కుల కోసం కృషి చేసిన ప్రముఖ గాంధేయవాద కార్యకర్త హిమాంశు కుమార్ అన్నారు. “గత కాంగ్రెస్ పాలనలో కూడా, బలగాలు మానవ హక్కులను ఉల్లంఘించాయి. కానీ ఇప్పుడు ఈ ధోరణి చాలా రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ఒక పిల్లవాడిని చంపడంతో ప్రారంభమైంది. పిల్లలకు తూటాల గాయాలతో బాధపడ్డారు. ఈ మధ్య కాలంలో 250 మందికి పైగా ఆదివాసీలను చంపారు; వారిలో 14 ఏళ్ల మూగ బాలిక, అనేక మంది మైనర్లు ఉన్నారు” అని కుమార్ అన్నారు. “ఇటీవల, ఇద్దరు మైనర్ బాలికలను 15 రోజులకు పైగా పోలీసు కస్టడీలో ఉంచారు, తరువాత ఒకరిని కల్పిత కేసులో జైలులో పెట్టారు. సంవత్సరం మొత్తంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి.”

“ఆదివాసీ సముదాయానికి పనికిరాని ఆర్థిక అభివృద్ధి నమూనాను రాజ్యం రుద్దుతోంది. స్థానిక సహజ వనరుల దోపిడీని సులభతరం చేయడానికి రోడ్డు,  రైల్వే సదుపాయాలను నిర్మిస్తున్నారని ఆదివాసీలు అర్థం చేసుకున్నారు. అందువల్ల, వారు దానిని వ్యతిరేకిస్తున్నారు. రాజ్యం వారి వ్యతిరేకతను, ప్రతిఘటనను నక్సలిజంగా ముద్రవేసింది; ప్రజలను జైలులో పెడుతోంది ”అన్న కుమార్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ‌ఎ) దాడులను ప్రశ్నించారు.

“పెరుగుతున్న సైనిక శిబిరాలు, రోడ్లు, రైలు మౌలిక సదుపాయాల విస్తరణ కారణంగా, ఆదివాసీలు తమ భూమిని కోల్పోతున్నారు. వారి లీజుకు తీసుకున్న భూమిని కూడా ఏజెన్సీలు బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నాయి,” అని ఆయన ఆరోపించారు, ఇది పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం- 1996 లేదా పేసా; షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) సవరణ చట్టం; షెడ్యూల్డ్ తెగలు  ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (హక్కుల గుర్తింపు) చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్)- 2006; భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం-2013 వంటి చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని నొక్కి చెప్పారు.

“ఈ చట్టాల ప్రకారం, రాజ్యం ఆదివాసులను రక్షించాల్సి ఉంది. కానీ ఇక్కడ రాజ్యమే నేరస్థుడు,” అని ఆయన అన్నారు, “ఛత్తీస్‌గఢ్‌లో రాజ్యం కార్పొరేట్ ప్రయోజనాలను సైనికీకరణ మార్గాల ద్వారా నెరవేరుస్తూ, ప్రజాస్వామిక కార్యకలాపాలను తీవ్రవాద వ్యతిరేక చట్టాల కింద నేరంగా పరిగణించే ఇబ్బందికరమైన ధోరణిపట్ల మరింత తీవ్రమైన ఆందోళన కలుగుతున్నది.”

షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీలకు భూమి, అటవీ సంబంధిత విషయాలపై సమ్మతిని లేదా భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉండటానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి; కానీ ఇటీవల చట్టాలలో జరిపిన సవరణలు భద్రతా సంబంధిత మౌలిక సదుపాయాల ఏర్పాటు సంబంధిత అంశాలను అటవీ, పర్యావరణ అనుమతుల నుండి, ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉన్న ప్రాంతాలలో మినహాయించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో కార్యనిర్వాహక చర్యలు తరచుగా చట్టపరమైన శూన్యతలో పనిచేస్తాయి. బ్రిటిష్ కాలం నాటి  పోలీస్ చట్టం-1861 ఎలాంటి మార్పులు లేకుండా అమలవుతోంది. అందులోని నిబంధనల ప్రకారం, పోలీసు బలగాల మోహరింపుపై ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు మాత్రమే విచక్షణాధికారం ఉందని వారు అన్నారు.

నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి చర్చలో పాల్గొనడం, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని ప్రోత్సహించడం, నక్సల్ హింసకు ప్రతిగా దృఢంగా స్పందించడానికి రాజ్య యంత్రాంగాన్ని మోహరించడం అనే మూడు అంశాల వ్యూహాన్ని ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్. సింగ్ దేవ్  నొక్కిచెప్పాడు. స్థానిక ఆదివాసీ సముదాయాల అభిప్రాయాలు, ఆకాంక్షలను ఎల్లప్పుడూ గౌరవించాలి.

 “ ఏదైనా అభివృధ్ధి కార్యకలాపాలను ఆరంభించే ముందు వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.  గౌరవించాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. “దురదృష్టవశాత్తు, ప్రస్తుత ఆర్థిక అభివృద్ధి నమూనా సాధనాల కంటే తుది ఫలితానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది;  అభివృద్ధిని సాధించడం కోసం ఆమోదయోగ్యం కాని ఎలాంటి  పద్ధతినైనా సమర్తించవచ్చని ఇది సూచిస్తుంది; ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. స్థానిక సముదాయాల  హక్కులు, ఆకాంక్షలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభించే ముందు వారి సమ్మతి తప్పనిసరి” అని ఆయన అన్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల గురించి స్థానిక ఆదివాసులు చేస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

భూమి షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలోకి వస్తుంది కాబట్టి పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టాన్ని లెక్కచేయకుండా, గనుల తవ్వకాల కోసం తీసుకోవాల్సిన స్థానికుల అనుమతిని ఫోర్జరీ పత్రాల ద్వారా పొందారని సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల్లోని పర్సా బొగ్గు గనుల తవ్వకాలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఛత్తీస్‌ఘడ్ స్టేట్ ట్రైబల్ కమిషన్) ఇటీవల జరిపిన దర్యాప్తు  తరల్ మెట్ట కొండ ప్రాంతాన్ని తవ్వడానికి ఇచ్చిన లీజుకు వ్యతిరేకంగా దంతేవాడ జిల్లాలోని అలనార్ గ్రామానికి చెందిన ఆదివాసీ సముదాయాలు ఈ సంవత్సరం జూలైలో నిరసన తెలిపాయి. తమ పర్యావరణ, సాంస్కృతిక వారసత్వానికి ఉన్న ముప్పుగురించి ఆందోళన చెంది, ఒక ర్యాలీని నిర్వహించి లీజును రద్దు చేయాలని అధ్యక్షుడు ద్రౌపది ముర్మును కోరుతూ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

 భద్రతా శిబిరాల పెరుగుదలను డ్రోన్ దాడులు, గ్రెనేడ్ కాల్పులు, చత్టాతీత హత్యల పెరుగుదలతో“భద్రత- అభద్రతపై పౌరుల నివేదిక, బస్తర్ డివిజన్” అనే 2024లో జరిగిన నిజనిర్ధారణ అధ్యయనం,  అనుసంధానిస్తుంది. 2024 ప్రథమార్థంలో కనీసం 141 ఎన్‌కౌంటర్లు విజయవంతమైన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలుగా రిపోర్టు అయ్యాయని, కానీ వీటిని ధృవీకరించడానికి ఎటువంటి ఎఫ్‌ఐ‌ఆర్‌లు నమోదు చేయడం లేదా విచారణ చేయడం కానీ జరగలేదు అని నివేదిక పేర్కొంది. “మరణించినవారిలో చాలా మంది సాధారణ పౌరులేనని, పథకం ప్రకారం జరిగిన ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపారని గ్రామస్తులు చెప్పారు” అని  పేర్కొంది.

సెక్యూరిటీ క్యాంపుల అసలు ఉద్దేశ్యం కార్పొరేట్ ప్రయోజనాలు, ముఖ్యంగా గనుల తవ్వకాలు అనీ   రాజ్యం బస్తర్‌లోకి లోతుగా చొచ్చుకుపోవడానికి వీలు కల్పించడమూ అని నివేదిక వాదిస్తుంది. ఈ ప్రాంతంలో మైనింగ్ కంపెనీల మీద చాలా తక్కువ పర్యవేక్షణ ఉన్నదని, అవి తరచుగా పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది. క్యాంపుల చుట్టుపట్ల జరుగుతున్న విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలను నివేదిక ఎత్తి చెబుతుంది; ఆదివాసీలు వాటిని వ్యతిరేకించడానికి ఇది ఒక ప్రధాన కారణమని వివరిస్తుంది. లాఠీ ఛార్జీలు చేయడం మొదలుకొని  నిరసన స్థలాలను తగలబెట్టడం, ప్రదర్శనకారులపై కాల్పులు జరపడం వరకు శాంతియుత నిరసనలపట్ల  ఎలా వ్యవహరించారో లేదా హింసాత్మకంగా అణచివేశారో మరింతగా వివరిస్తుంది.

ఆదివాసీ సముదాయాల దైనందిన జీవితాల భద్రతను ఈ నివేదిక ఎత్తి చూపిస్తుంది; పనిచేయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తిరిగి సక్రియం చేయడం, ఉప కేంద్రాలను పనిచేయించడం  వంటి ఆరోగ్యపర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి బదులుగా ప్రభుత్వం భద్రతా శిబిరాలలో ఆరోగ్య సేవలను అందిస్తున్నది. అంతేకాకుండా ఆదివాసీ సముదాయాలకు కీలకమైన వనరు అయిన వారపు సంత పోలీసుల నియంత్రణలోకి వచ్చిందని పేర్కొంది.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసుల హక్కులను సమర్థించే స్థానిక కార్యకర్తలు, సంస్థలపైన అణిచివేత అమలవుతోంది. సైనికీకరణ ప్రభుత్వమూ తిరుగుబాటు గ్రూపుల మధ్య చర్చలు జరగకపోవడం పట్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. “ముఖ్యంగా సైనిక మోహరింపుల వల్ల కలిగే గణనీయమైన నష్టాలు, అమాయక ప్రాణాల విషాదకరమైన నష్టాన్ని దృష్టిలోకి తీసుకుంటే, నక్సల్స్‌తో శాంతి చర్చలు ప్రారంభించడంలో ప్రభుత్వం విఫలమవడం ఆందోళనకరం” అని ఛత్తీస్‌గఢ్ స్థానిక దినపత్రికలో ఒక సంపాదకీయం పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్‌లో తిరుగుబాటు నిరోధక చర్యల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ఇచ్చే  పరిహారం విధానాలకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. రాష్ట్రంలో జరిగిన వివిధ రకాల ఘటనలను బట్టి పరిహారం మొత్తాలు మారుతూ ఉంటాయి. 2024 ప్రారంభంలో బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరు నెలల శిశువు మరణించిన సందర్భంలో, జాతీయ మానవ హక్కుల కమిషన్ తల్లిదండ్రులకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకు తీసుకువెళ్ళిన సుప్రీంకోర్టు న్యాయవాది రాధాకాంత త్రిపాఠి ఈ సిఫారసుకు సంబంధించిన వివరాలను ఇచ్చారు.

తాను ఇప్పటికే రూ.7 లక్షలు అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కి తెలియజేసినప్పటికీ, “బాధితురాలికి అందించిన వైద్య చికిత్సలో జరిగిన నిర్లక్ష్యాన్ని గమనించిన కమిషన్  బాధిత కుటుంబానికి అదనంగా రూ.1 లక్ష ఎందుకు సిఫార్సు చేయకూడదని అడుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది” అని త్రిపాఠి అన్నారు. తద్విరుద్ధంగా, 2024 నవంబర్‌లో, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అడవి జంతువుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారాన్ని రూ.8 లక్షల నుండి రూ.25 లక్షలకు పెంచడం అనేది వివిధ సందర్భాలలో నష్టాన్ని, బాధలను ఎలా అంచనా వేస్తారనే దానిలో జరుగుతున్న అసమానతలమ పట్ల దృష్టి సారించేలా చేస్తుంది.

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామిక కార్యకలాపాలకు, శాంతియుత నిరసనలకు అవకాశాలు  తగ్గిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం-2005 కింద హక్కుల కార్యకర్తలు,  సమూహాలపై న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీసుకున్న చర్యను అనేక పౌర సమాజ సంస్థలు వ్యతిరేకించాయి. 2024 అక్టోబర్ 30నాడు రాష్ట్ర ప్రభుత్వం మూలవాసి బచావో మంచ్‌ను నిషేధించింది; మంచ్‌ను ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద “చట్టవ్యతిరేకమైన సంస్థ”గా పేర్కొంది. తరువాత ఒక గెజిట్ నోటిఫికేషన్‌లో, నిషేధానికి రెండు కారణాలను పేర్కొంది: ఒకటి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ మద్దతు ఉన్న అభివృద్ధి పనులను వ్యతిరేకించడం, రెండు, భద్రతా శిబిరాలకు వ్యతిరేకంగా ప్రజల ప్రతిఘటనను సమీకరించడం. నిషేధిత సంస్థ సభ్యుల ప్రకారం, న్యాయపరమైన నిర్ధారణ లేదా మంచ్ నిషేధాన్ని వ్యతిరేకించడానికి  ముందస్తు అవకాశం లేకుండానే ఈ సంస్థను నిషేధించారు.

డిసెంబర్ ప్రారంభంలో న్యూఢిల్లీలో క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి రాజ్యఅణచివేతను విమర్శించింది. ఈ సందర్భంగా, మంచ్  ఏర్పాటు మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో ఎలా భాగమో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రాజకీయశాస్త్రం బోధించే, ఫోరమ్ అగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్‌లో భాగమైన సరోజ్ గిరి  ఎత్తి చూపారు. ఆదివాసీ సముదాయాల ప్రయోజనాలను విస్మరించే ఆర్థిక విధానాలను విమర్శిస్తూ, “రాష్ట్రం ఆదివాసీలకు రెండు ఆచరణాత్మక ఎంపికలను మాత్రమే అందిస్తుంది – పేదరికంలో మునిగిపోయి పని కోసం పెద్ద నగరాలలో ఉండే  మురికివాడలకు వలస వెళ్లడం లేదా మరణాన్ని ఎదుర్కోవడం.” అని అన్నారు.

 కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువును ప్రస్తావిస్తూ, “దేశంలోని ఉక్కు ఉత్పత్తిలో 20 శాతం ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి చేస్తుంది. 2026 మార్చి 31 నాటికి మావోయిజంను నిర్మూలిస్తామని అమిత్ షా చెప్పడం వాస్తవానికి ఈ దోపిడీని, ఆదివాసీలపై జాతి విధ్వంస యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి గడువు” అని అన్నారు.

బస్తర్‌లో భద్రతా బలలు చేసే అతిక్రమణల గురించి మీడియాకు అవగాహన కల్పించడానికి మంచ్ గతంలో అనేక నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. అలా చేసినందుకే ప్రభుత్వం నిషేధించిందని చాలామంది నమ్ముతారు. “మంచ్ కేవలం మూడు సంవత్సరాల క్రితం ఏర్పడింది. రాజ్యం చేస్తున్న వాదనలకు విరుద్ధంగా, ఇది సిలంగేర్ ఉద్యమానికి నాయకత్వం వహించలేదు. దీనిని ప్రజలు తమంతట తామే నడిపించారు, దానిలో భాగమయ్యారు ” అని తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు.

ప్రస్తుత భద్రతా స్థావరానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ భూమిలో మరో సైనిక క్యాంపుని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ 2021 మే లో, సుక్మా జిల్లాలో సిలంగేర్ గ్రామంలోని ఆదివాసీ ప్రజలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. సాయుధ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇది విషాదకరంగా మారింది. కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన దక్షిణ బస్తర్ అంతటా విస్తృత తిరుగుబాటుకు దారితీసింది. సైనిక శిబిరాన్ని తొలగించాలని, ఖనిజ వెలికితీత కోసం ఉద్దేశించిన విశాలమైన రహదారి నిర్మాణాన్ని నిలిపివేయాలని, అకారణ హింసకు కారణమైన వారు జవాబుదారీ వహించాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నివాసితులు డిమాండ్ చేశారు.

ఈ ఘటన తర్వాత, రాష్ట్రంలోని రెండు ప్రముఖ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల ప్రతినిధులు సిలంగేర్‌కు వెళ్ళారు. విస్తృత ప్రజా ఆగ్రహానికి ప్రతిస్పందనగా, భూపేశ్ బాఘేల్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణను ప్రకటించవలసి వచ్చింది. అయితే, అప్పటి నుండి దర్యాప్తులో పెద్దగా పురోగతి లేదు.

బస్తర్‌లోని ఆదివాసీ గ్రామాలపై రాజ్య బలగాలు డ్రోన్‌లు, ఫైర్ రాకెట్ లాంచర్ల నుండి బాంబులు వేస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. “ఆదివాసీలు తమ వరి పొలాలను సాగు చేయడానికి లేదా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారిని చంపుతారు లేదా అరెస్టు చేస్తారు” అని ఆయన అన్నారు. రైల్వే ట్రాక్‌లు, రోడ్లు   ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న పాఠశాలలు లేదా ఆసుపత్రులు లేవని ఆయన ఎత్తి చూపారు. ఉన్న కొన్ని పాఠశాలలు కూడా ఎక్కువగా నిరుపయోగంగా ఉన్నాయని, తరచుగా సాయుధ బలగాలు ఆక్రమించుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, అమరవీరుల స్మారక సభలో అమిత్ షా తన ప్రసంగంలో, రాష్ట్ర ప్రభుత్వం బస్తర్ గ్రామాలను మార్చడానికి భారీ ప్రచారాన్ని ప్రారంభించిందని, పాఠశాలలు, ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నాడు.

1910లో బ్రిటిష్ రాజ్‌పై జరిగిన భూమ్కల్ తిరుగుబాటుకు, బస్తర్‌లోని ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న పోలికను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కామన్ టీచర్స్ ఫోరం సభ్యుడు ఎన్ సచిన్ ఇలా వివరించారు: “ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారనే వాస్తవంలోనే కాకుండా వారు ఎందుకు ప్రతిఘటిస్తున్నారనే దానిలోనూ సారూప్యత పాతుకుపోయింది. అదే సామ్రాజ్యవాద దోపిడీ, సహజ వనరులను దోచుకోవడం ఇప్పటికీ కొనసాగుతోంది.”

అతని అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, రాజ్యాంగ రక్షణల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఆదివాసీలను రక్షించడంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ , జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ వంటి మానవ హక్కుల సంస్థలు విఫలమయ్యాయని హిమాంశు కుమార్ విమర్శించారు. “గత దశాబ్దంలో, భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితుల్లో గణనీయమైన క్షీణత కనిపించింది. ఆదివాసీ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణ లోతైన సమస్యకు ప్రతిబింబం – ధనవంతులు, శక్తివంతులకు అనుకూలంగా వక్రీకరించిన ఆర్థిక నమూనా” అని ఆయన జెనీవాకు చెందిన గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉదాహరణను ఎత్తి చూపారు; ఇది ఇటీవల వరుసగా రెండవ సంవత్సరం జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తింపును వాయిదా వేసింది.

 ది హిందు  దిన పత్రిక నుంచి…

Published : Jan 02, 2025 15:26 IST – 13 MINS READ

Leave a Reply