ధర్నా
6 అక్టోబర్ 2024 సోమవారం ఉదయం 11 గంటల నుంచి
ఒంగోలు కలెక్టరేట్ వద్ద
అడవిని, ఆదివాసులను, పర్యావరణాన్ని కాపాడుకుందాం
ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించి తొమ్మిది నెలలు దాటింది. చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పేరుతో మారణకాండ నడుస్తోంది. ఇది ఈ నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేర్వేరు రూపాల్లో విస్తరిస్తున్నది. మధ్యభారతదేశంలో ఆరంభమైన ఆపరేషన్ కగార్ దేశంలో అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలన్నిటికీ చేరుకుంటున్నది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ యుద్ధానికి పాల్పడుతున్నది.
ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి ఉత్పాదకతను పెంచుకోడానికి భారీ ఎత్తున వనరులు అవసరం అయ్యాయి. దీని కోసం భూమ్మీద ఉండే ముడి ఖనిజాలన్నిటినీ ప్రభుత్వాలు వెలికి తీస్తున్నాయి. మన దేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొర్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను తీసుకొచ్చాయి. కార్పొరేటీకరణను ప్రభుత్వాలు తమ అధికార రాజకీయార్థిక విధానంగా అమలు చేస్తున్నాయి. దేశ ప్రజలందరికీ చెందిన వనరులను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి తగిన వాతావరణాన్ని కల్పించడమే పాలనగా మారిపోయింది. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే అభివృద్ధి విధాననం ప్రజలకు పూర్తి విధ్వంసాన్నే మిగుల్చుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఇది స్పష్టంగా అర్థం కనిపిస్తున్నది. అభివృద్ధి పేరుతో వనరులను కొల్లగొట్టడానికి అడవును నరికేస్తున్నారు. ఆదివాసీ గూడేల మీదిగా రోడ్లు వేస్తున్నారు. భారీ ఎత్తున ఆదివాసీ గూడేలను విస్తాపనకు గురి చేస్తున్నారు. మొత్తంగా అటవీ ప్రాంతాల్లోని వనరులను కొర్పొరేట్లకు ఇవ్వడమే ప్రభుత్వాలు అభివృద్ధిగా చెప్పుకుంటున్నాయి.
అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ విధ్వంసాన్ని ఆదివాసులు అంగీకరించడం లేదు. భారత రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రత్యేక రక్షణ చట్టాలను ఉల్లంఘించడాని వీల్లేదని, తమ జీవించే హక్కును కాలరాయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని ఆదివాసులు అంటున్నారు. అడవిని, పర్యావరణాన్ని నాశనం చేయడమంటే తమ జీవన అస్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రకృతిని ధ్వంసం చేయడమని ఆదివాసులు ప్రకటిస్తున్నారు. భారత ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ అనేక ప్రాంతాల్లో పోరాడుతున్నారు. అడవిని, పర్యావరణాన్ని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోడానికి ప్రాణాలకు తెగించి ఆదివాసులు చేస్తున్న పోరాటం కార్పొరేట్ వ్యతిరేక పోరాటంగా బలపడుతున్నది.
కార్పొరేట్ల తరపున నిలబడి ఉన్న ప్రభుత్వం ఆదివాసుల ప్రతిఘటనను సహించడం లేదు. వాళ్ల శాంతియుత, రాజ్యాంగబద్ధ పోరాటాలను అణచివేయడానికి అడవుల్లోకి లక్షలాది సైనికులను దించింది. దేశ రక్షణకు సరిహద్దుల్లో ఉండాల్సిన సైనిక దళాలు ఇప్పుడు మధ్య భారతదేశంలోని అడవుల్లోకి చేరుకున్నాయి. అడవులు కార్పొరేట్ల, భారత సైనికుల ఉక్కుపాదాల కింద ధ్వంసమైపోతున్నాయి. దేశ రక్షణ అనే సైనిక కర్తవ్యం ఇప్పుడు కార్పొరేట్ సంరక్షణగా మారిపోయింది. గనుల తవ్వకాలను, రోడ్లు, వంతెలన నిర్మాణాలను అంగీకరించమని ఆదివాసులు చేస్తున్న పోరాటాలను అణచివేయడానికి ప్రభుత్వం బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నది. కార్పొరేట్ అభివృద్ధి పేరుతో సాగుతున్న విధ్వంసకర నిర్మాణాలకు కొనసాగింపే సైనిక క్యాంపుల నిర్మాణం. రకరకాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్, గత సల్వాజుడుం పేరు మార్చుకొని కొనసాగుతున్న డిఆర్‌జి, బస్తర్ ఫైటర్స్ మొదలు నేరుగా దేశ సరిహద్దుల్లోని సైనిక బలగాలు ఆదివాసుల మీద దండయాత్ర చేయడానికి, కార్పొరేట్లకు రక్షణ కల్పించడానికి అడవుల్లో అందుబాటులో ఉండటానికే ఈ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని గోదావరి తీరం నుంచి మధ్య భారతదేశమంతా విస్తృతంగా క్యాంపులు ఉన్నాయి. ఒక్క చత్తీస్‌ఘడ్‌లోనే ఇటీవలి సాధారణ ఎన్నికల నాటికి 295 సైనిక క్యాంపులు ఉండగా తాజాగా మరో 36 ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి ప్రకటించారు.
ఈ క్యాంపుల నుంచి రాకెట్ లాంచర్లను ఉపయోగించి ఆదివాసీ గూడేల మీద దాడులు చేస్తున్నారు. ఆకాశంలోంచి డ్రోన్లతో బాంబులు వేస్తున్నారు. ఇండ్లలో ఉన్నవాళ్లను, పొలాల్లో పని చేసుకుంటున్నవాళ్లను చంపేస్తున్నారు. ఈ ఇదంతా ఆదివాసులను భయపెట్టడానికి. అడవుల నుంచి తరిమేయడానికి. అటవీ భూములను కాజేయకుండా, అక్కడి వనరులను కొల్లగొట్టకుండా కార్పొరేట్ వ్యవస్థ బతికిబట్టకట్టే పరిస్థితి లేదు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసులను నిర్మూలించడానికి ఇప్పటికే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నాయి. ఆదివాసులను అడవి నుంచి తరిమేసి అడవిని కార్పొరేట్లకు ఇవ్వడానికి పెద్ద ఎత్తున సైనికీకరణను చేపట్టాయి. ఈ కార్పొరేటీకరణ, సైనికీకరణ భారత రాజ్యాంగ ఆదర్శాలకు పూర్తి విరుద్ధమైనవి. అయినా ప్రభుత్వం బరితెగించి కార్పొరేటీకరణను, సైనికీకరణను ఆదివాసీ ప్రాంతాల్లో నానాటికి తీవ్రం చేస్తున్నది. మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోనేకాక మణిపూర్‌లో, కశ్మీర్‌లో కూడా కార్పొరేటీకరణను, సైనికీకరణను కేంద్ర ప్రభుత్వం ఉధృతం చేసింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో ఆదివాసులపై యుద్ధ వ్యూహాల శిక్షణ శిబిరాల ఏర్పాటుకు 1,34,778 ఎకరాల భూమిని సేకరించేందుకు ఆమోదం ప్రకటించింది. దేశ ప్రజలపై, ముఖ్యంగా ఆదివాసులపై యుద్ధం చేయాల్సిన సైన్యానికి శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందు కోసం సరిహద్దుల్లోని సైనిక బలగాలేగాక యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు కూడా మధ్యభారతదేశంలోని అటవీ ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదంతా ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్‌గా మార్చేసి కార్పొరేట్ ఇండియాగా తీర్చిదిద్దడానికే.
వికసిత్ భారత్ అనే పేరుతో ప్రధాని మోదీ ప్రకటించిన న్యూ ఇండియాలో ఆదివాసులకు చోటు లేదు. వాళ్లను పూర్తి స్థాయిలో నిర్మూలించే ఈ పథకంలో ఆదివాసుల్లాగే మిగతా పీడిత ప్రజా సమూహాలన్నీ బలైపోయేవే. ముస్లింలను, దళిత బహుజనులను, స్త్రీలను, కార్మికులను తొలగించి కార్పొరేట్ల రాజ్యంగా ఈ దేశాన్ని తయారు చేయడానికి ఇంత పెద్ద ఎత్తున దేశ ప్రజల మీద ప్రభుత్వం యుద్ధానికి తెగబడిరది. అందుకే దీన్ని ప్రభుత్వం ఆపరేషన్ కగార్ లేదా అంతిమ యుద్ధంగా ప్రకటించింది. అయితే ఇది తక్షణంగా ముగిసేది కాదని కూడా ప్రభుత్వానికి తెలుసు. కార్పొరేటీకరణను గత ప్రభుత్వాలకంటే వేగవంతం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఆదివాసీ నిర్మూలనకు దీర్ఘకాలిక పథకాన్ని తయారు చేసింది. ఇందులో భాగంగా దండకారణ్యాన్నంతా సువిశాల యుద్ధ శిక్షణ కేంద్రంగా, యుద్ధ భూమిగా మార్చేయదల్చుకుంది.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీని ప్రారంభించిన ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే దాదాపు రెండు వందల మందిని ప్రభుత్వం చంపేసింది. గత నెల నుంచి జరుగుతున్న ఘటనలనే పరిశీలిస్తే ఆగస్టు 29వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ముగ్గురు మహిళను చంపేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం సుకుమా జిల్లా కుంట బ్లాక్ జేగురుకుంట`సింగవరం వద్ద రాకెట్ లాంచర్‌నో, డ్రోన్‌లనో వినియోగించి దాడి చేశారు. ఆ ప్రాంతంలోనే ఇద్దరు ఆదివాసీ యువకులను తీసికెళ్లి కాల్చేశారు. మూడో తేదీ మధ్యాన్నం దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని లోహగావ్ పురంగెల్ ఆండ్రి అటవీ ప్రాంతంలో 9 మందిని కాల్చేశారు. ఈ నెల 24న చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకగూడ గ్రామాన్ని అర్ధరాత్రి 3 గంటలకు పోలీసులు, డిఆర్‌జీ జవాన్లు చుట్టుముట్టి కోవాసి భీమా అనే ఆదివాసీని కాల్చి చంపారు. మడావి భీమా, కోవాసి బండిని పట్టుకెళ్లారు. అంతక ముందు రోజు మూలవాసీ బచావో మంచ్ అధ్యక్షుడు రఘును పోలీసులు అరెస్టు చేసి ఒక పూట అదుపులో ఉంచుకొని విచారణ పేరుతో వేధించారు. ఇట్లా దాదాపు ప్రతి రోజూ ఆదివాసీ ప్రాంతాల్లో హత్యలు, అరెస్టులు, దాడులు ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి.
కార్పొరేటీకరణ మధ్య భారతదేశంలో ఉధృతంగా ఉన్నట్టే మణిపూర్‌లో కూడా చూడవచ్చు. చాలా కాలంగా ఆరని జ్వాలగా మణిపూర్ రగిలిపోతుంది. అక్కడ ఉన్న అపారమైన సహజ వనరులను కార్పొరేట్లకు ఇవ్వడానికి ప్రభుత్వమే ఈ మారణకాండను నడిపిస్తోంది. సరిగ్గా ఇదే పరిస్థితి కశ్మీర్‌లో చూడవచ్చు. తాజాగా తెలంగాణలో వెలుగులోకి వచ్చిన దామగుండం అడవుల్లోని 2900 ఎకరాల్లో ప్రభుత్వం భారత నావికా దళం రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరంలో, మూసీ నది తీరంలో పెద్ద ఎత్తున అడవులను ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అడవుల మీద ప్రభుత్వం కన్నేసినా, కార్పొరేట్లు పాగా వేసినా మొదట చెట్లు నేల కూలుతాయి. దామగుండం అడవుల్లో సుమారు పన్నెండు లక్షల చెట్లను ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయదల్చుకున్నది.
బస్తర్‌లో, హస్‌దేవ్ అడవుల్లో, దామగుండంలో జరుగుతున్న విధ్వంసం పర్యావరణానికి హానీ చేస్తుంది. మానవాళి మనుగడను సంక్షోభంలో పడేస్తుంది. ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు. తాను అభివృద్ధి పేరుతో చేపట్టిన కార్పొరేట్ విధానాన్ని ముందుకు తీసుకపోవడమే లక్ష్యంగా పని చేస్తున్నది. రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఇచ్చిన హక్కుల కాలరాస్తూ ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామికవాదులు ఆదివాసీ జాతి హననాన్ని ఖండిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ వేదిక ఒంగోలు పట్టణంలో ధర్నా తలపెట్టింది. దీన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నాం.