మన సమాజంలో  మహిళ నిర్మాణమయ్యె క్రమం ప్రత్యేకమైనది. పురుషుడి నిర్మాణ క్రమానికి భిన్నమైనది.  పురుషుడితో సమానమైన స్వేచ్ఛ, సొంత అభిప్రాయాల ప్రకటన ఈ నిర్మాణక్రమంలో నిషేధం. అణచివేతలు, ఆంక్షలు ఈ నిర్మాణక్రమానికి ఉన్న ప్రత్యేకతలు. సహజంగానే సమాజంలోకి వచ్చిన ప్రతి మహిళా ఈ నిర్మాణ క్రమం నుండి వేరుపడదు. వేరుపడాలని ప్రయత్నించినా సమాజం అంగీకరించదు. కానీ అట్లాంటి నిర్బంధ క్రమాన్ని బద్దలు కొట్టే సామాజిక చైతన్యం తెచ్చుకున్న స్త్రీలు సమాజంలో ఉంటారు. వీరే సమాజాన్ని నూతన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు.  ఏ ఆంక్షలు లేని ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి తీవ్రమైన సంఘర్షణ పడతారు. ఆ ప్రయాణంలో భాగంగా నూతన మానవులుగా పరిణామం చెందుతారు. అట్లా పరిణామం చెందిన ఒక మహిళ పేరు కామ్రేడ్ మిడ్కో. కామ్రేడ్ మిడ్కో తెలంగాణ రాష్ట్రం కడవెండి ప్రాంతంలో పుట్టింది. రేణుకగా మొదలెట్టి అసాధారణ ప్రయాణం చేసి కామ్రేడ్ మిడ్కోగా మార్పు చెందింది. పుట్టుక ఇచ్చిన స్థానం కంటే పుట్టిన ప్రాంతం ఇచ్చిన త్యాగ పరంపరనే వారసత్వంగా తీసుకుంది. అక్షరాలు నేర్చుకుని కడవెండి నేలతో, అక్కడ కారిన నెత్తురుతో మాట్లాడింది. శాంతి పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చిన చరిత్ర ఆ ప్రాంతంది. దొరతనాలపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటంలో మొదటి తుపాకీ పేలిన నేల,  మొదటి వీరుడు ఒరిగిన నేల ఆది. భూమి కోసం నెత్తురు ఇచ్చిన నేల నుండి వచ్చింది కాబట్టే నెత్తురు పోయేవరకు భూమితో సంభాసిస్తూనే ఉంది. ఆ సంభాషణలను సృజనాత్మకంగా తన రచనలో వ్యక్తీకరించింది. నూతన మనిషిగా పరిణామం చెందిన ఒక స్త్రీ తాను ప్రపంచాన్ని అర్థం చేసుకున్న అనేక కోణాల నుండి ఈ వ్యక్తీకరణ చేసింది. విప్లవం ఒక సుదీర్ఘ లక్ష్యం. ఒక మహోన్నత ఆశయం. దాన్ని సాధించడానికి చేసే ప్రయాణం మహాప్రస్థానం అంతటి గొప్ప ప్రయాణం. ప్రపంచాన్ని ఎత్తు, వంపులు లేకుండా సమానంగా చేయాలని అనుకున్న ఎంతో మంది ఆ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రయాణంలో ఉన్న సౌందర్యాన్ని అనుభవించారు. తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వచ్చిన అమరత్వాన్ని కూడా స్వీకరించారు. కానీ కొంతమంది ప్రయాణాన్ని మొదలుపెట్టి చివరి వరకు వెళ్లలేకపోయారు. కొన్ని మెట్లు ఎక్కాక ఆగిపోయారు. మరికొంత మంది దిగజారిపోయారు. అలా ఆగిపోయిన ఒక వ్యక్తి కథే మెట్ల మీద అనే కథ. ఈ కథలో రచయిత కామ్రేడ్ మిడ్కో అట్లా మధ్యలో ఆగిపోవడం ఎంత కష్టమైన విషయమో, ఆగిన దగ్గరి నుండి చుట్టూ ఉన్న సమాజాన్ని చూడడం ఎట్లాంటి అనుభవాలను ఇస్తుందో, ఆ అనుభవాలలో ఎంత గాఢత ఉంటుందో చెప్పింది.

 మెట్ల మీద కథ విప్లవోద్యమాన్ని ప్రేమించిన మాజీ విప్లవకారుడి గతం అతన్ని వర్తమానాన్ని ఎట్లా ప్రభావితం చేసింది, ఎట్లాంటి ప్రశ్నలను తన ముందు ఉంచింది అనే విషయాలను చర్చించింది. రవీందర్ ఒక ప్రాంతంలో విప్లవ విత్తనాలు నాటినవాడు. తన లాంటి ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసిన వాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఉద్యమం నుండి బయటికి వచ్చి అదే ప్రాంతానికి వెళ్లడంతో కథ మొదలవుతుంది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, వెంటాడిన జ్ఞాపకాలతో కథ నడుస్తుంది. రచయిత మహిళా దృక్పథంతో రాసింది కాబట్టి బలమైన స్త్రీ పాత్రలు కథలో కనిపిస్తాయి. ప్రతీ పాత్ర విప్లవోద్యమం గురించి సమాజంలో జరిగే ఒక్కో చర్చకు ప్రతినిధిగా కనిపిస్తుంది. సరోజ, లలిత, యాదమ్మ, సుశీల, సౌజన్య లాంటి బలమైన  పాత్రలను కామ్రేడ్ మిడ్కో మెట్ల మీద కథలో రాసుకుంది. తన జీవితంతో సహా తనకు ఎదురైన ప్రతీ జీవితాన్ని సృజనాత్మకంగా సాహిత్యంలోకి తీసుకువచ్చింది.  రవీందర్ తల్లి సరోజమ్మ పాత్రలో  విప్లవంలోకి వెళ్ళిన కొడుకులను కన్న ప్రతీ తల్లి కనిపిస్తుంది. ఆమె లాగ పార్టీలో కొడుకులను చూసుకున్న ఎంతో మంది తల్లులు ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. కామ్రేడ్ మిడ్కో ఉద్యమంలో అవసరంగా చేరే వారికి, ఆదర్శంగా చేరే వారికి మధ్య ఉండే తేడాను ఈ కథలో చర్చించింది. రవీందర్ ఉద్యమాన్ని ఆదర్శంగా ఎంచుకున్నాడు. కానీ అతని చెల్లెలు లలిత, ఆయిలయ్యలు మాత్రం అవసరంగా ఎంచుకున్నారు. లలిత పెళ్లి చేసుకుని భర్త చేతిలో తీవ్రమైన అణచివేతకు గురైంది. చివరకు పార్టీ ఇచ్చిన చైతన్యంతో, పార్టీ చేసిన సహాయంతో బయటపడింది. కానీ తనలాంటి ఎంతో మందికి ఆ పార్టీ అవసరాన్ని గుర్తించింది. అందుకే తనకు లభించిన శాంతిని తన లాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఇవ్వడానికి తను కూడా ఉద్యమంలో భాగమైంది. రవీందర్, ఆయిలయ్యలు ఇద్దరూ ప్రజల కోసం పని చేయడానికి పోరాటంలోకి వెళ్లారు. కానీ ఆయిలయ్య రవీందర్ లాగా వెనక్కి రాలేదు. రవీందర్ కి ఉన్న ఆర్థిక, సామాజిక వెసులుబాటు అయిలయ్యకు లేదు. అందుకే అమరుడయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. వ్యక్తులకు ఉన్న వెసులుబాటులు వాళ్ళ నిబద్ధతలో ఊగిసలాటను సృష్టిస్తాయని రచయిత ఈ పాత్రల ద్వారా చిత్రించింది. కొడుకులు ఉద్యమంలోకి వెళ్ళి అమరులైతే వాళ్ళ తల్లులు పడే మానసిక ఘర్షణ యాదమ్మ పాత్రలో కనిపిస్తుంది. కొడుకును ఉద్యమం నుండి దూరం చేయమని గతంలో రవీందర్ ను అడిగిన సుశీల, తన కొడుకు నమ్మిన సిద్ధాంతం యొక్క బలం తెలుసుకుని తను కూడా తన కొడుకు బాటలోనే నడుస్తుంది. ఈ కథలోకి  మిడ్కో తీసుకువచ్చిన అన్ని జీవితాలు, ఆ జీవితాలలో పాత్రలు  పడే సంఘర్షణలు, ఆ పాత్రల ద్వారా కథ చేసే చర్చలు అన్నీ ఉద్యమానికి కొనసాగింపు అవసరాలే. సామాన్యులు అసామాన్యులుగా మారే క్రమం ఒకటి విప్లవోద్యమం తీసుకువచ్చింది. ఈ కథలో ఆ క్రమాన్ని స్పష్టంగా రాసుకుంది రచయిత కామ్రేడ్ మిడ్కో. ఇందులో ఉన్న ప్రతీ పాత్ర అట్లా అసామాన్యులుగా మారే క్రమంలో ఉన్నవారే. రచయిత రవీందర్ పాత్రను కథలో ముగించలేదు. ఆ పాత్ర ఆలోచనలు, అభిప్రాయాలను, అనుభవాలను పాఠకుల ముందు ఉంచింది. అలానే ఆ పాత్రను దిగజార్చలేదు. ఆ పాత్ర ఉద్యమానికి ద్రోహం చేసే ఆలోచన చేయలేదు. ప్రభుత్వం లొంగుబాటుకి ప్రతిగా ఇచ్చే డబ్బును అంగీకరించలేదు. ఉద్యమం వలన తాను సంపాదించిన వ్యక్తిత్వాన్ని స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనుకోలేదు. తన చెల్లెలు పోరాటంలోకి వెళ్తున్నప్పుడు వద్దనలేదు. ఆగిపోయిన వ్యక్తి అనుభవాల కేంద్రంగానే కథ నడిచింది. ఈ ఆగిపోవడాన్ని అర్ధం చేసుకునే పరిపక్వత కూడా ఈ కథ మాట్లాడింది. ఉద్యమంలో ఉన్నప్పుడు తనను ఆదర్శంగా చూసిన కోడలు, బయటికి వచ్చాక అవమానకరంగా చూస్తున్నప్పుడు లలిత మాటల్లో కనిపించిన పరిణతిని మనం ఈ విధంగా అర్ధం చేసుకోవచ్చు. లొంగిపోయిన వాళ్లందరూ దిగజారిపోయిన వాళ్ళు కాదు అనే అవగాహనను అనుభవంతో మాత్రమే నేర్చుకోగలం. లొంగుబాటు వార్తలు వింటున్నప్పుడు అసంకల్పితంగానే కలిగే అభిప్రాయాన్ని ఈ కథ నేర్పిన అవగాహన మార్చివేస్తుంది. లొంగిపోయిన వాళ్లందరూ ఉద్యమ ద్రోహులు కాదనే సత్యాన్ని స్వీకరిస్తుంది. వాళ్ళు పడే మానసిక వేదనను పాఠకుల ముందు ఆవిష్కరిస్తుంది. ఉద్యమంలో దీర్ఘ కాలం కొనసాగి అక్కడే మరణించ మనుషులపై ప్రేమను పెంచుతూనే, దిగజారిపోకుండా ఆగిపోయిన వారి నిర్ణయంపై గౌరవాన్ని కలిగిస్తుంది. నిర్బంధం పెరిగి లొంగుబాటులు ఎక్కువైన ప్రస్తుత కాలంలో ఈ అవగాహన అవసరం అనిపించింది. సామాజిక ఆచరణలో ఆనందాన్ని చూసిన వారు  వైయక్తిక ఆచరణలోకి రావడం ఎంత ఇబ్బందికరమైన విషయమో ఈ కథ మాట్లాడింది. అందుకే ఉద్యమం నుండి బయటికి వచ్చిన రవీందర్ ప్రశాంతమైన జీవితాన్ని అందుకోలేకపోయారు. నిత్యం గత, వర్తమానాల ఘర్షణల మధ్య బందీగా మిగిలిపోయాడు.

రచయిత మిడ్కో రాసిన కథలు మెట్ల మీద కథలుగా ప్రచురితమయ్యాయి. తాను భాగంగా ఉన్న ఉద్యమం, ఆ ఉద్యమం సమాజాన్ని చూసే దృక్పథమే కథా వస్తువులుగా ఈ రచనలు చేసింది. వస్తువు ప్రధాన రచనలే అయినా అందమైన శిల్పం ఈ కథల్లో ఉంది. కథ చదువుతుంటే పాత్రలు కళ్ళ ముందు కనిపించే శిల్పం ఆమెది. చాలా సంక్లిష్టమైన వస్తువును, అవగాహనను సరళంగా పాఠకులకు అందించే శైలిలో రచయిత కథలు రాసింది. కామ్రేడ్ మిడ్కో పాఠకులకు కేవల రసానుభూతిని అందించడం కాకుండా తాను చూస్తున్న జీవితాలను సాహిత్యంలో వ్యక్తీకరించడమే లక్ష్యంగా సాహిత్య సృజన చేసింది. కథలో ఉన్న జీవితాలను అన్ని పార్శ్వాల నుండి వ్యక్తీరించడం మూలాన కథల విస్తృతి కూడా ఎక్కువగా ఉంది. అన్ని పాత్రలు కృత్రిమ పాత్రలుగా కాకుండా చుట్టూ ఉన్న సమాజంలో మనుషులుగా  సజీవంగా కనిపించడంలో ఆమె రచనా నైపుణ్యం ఉంది. ఈమె కథలు మట్టికి, మనిషికి ఉండే సంబంధాన్ని స్త్రీ గొంతులో వ్యాఖ్యానిస్తాయి. స్త్రీ దృక్పథంతో విశ్లేషిస్తాయి. మెట్ల మీద ఆగిపోయే ప్రయాణాలను ఇంకొన్ని మెట్లు ఎక్కించే చర్చలు చేస్తాయి.  ఇంకో ప్రయాణం మెట్ల మీద ఆగకుండా ఉండవలసిన సైద్ధాంతిక అవగాహనను అందిస్తాయి.

బొడ్డుపల్లి అఖిల్,

పరిశోధక విద్యార్థి,

ఉస్మానియా విశ్వవిద్యాలయం,

9550096177

Leave a Reply