ఆమె నవ్వు
చింత చెట్లపై
మిణుగురు పువ్వులా
విరబూస్తుంది

ఆమె తన
పెన్ను
ఇన్సాస్ రైఫిల్ ను
వారసత్వంగా వదిలి
వెళ్ళింది

ఆమె ఇన్నేళ్లు
గెరిల్లా యోధగా
ఏమని తలపోసింది
అమ్మలకు అక్కలకు
భూమ్యాకాశాలలో
సగం హక్కు
కావాలని పోరాడింది

ఆమె కడవండి
బిడ్డగా మొదలై
AOB నుండి
బస్తర్ వరకు
జీవించిన కాలమంతా
ఆదివాసీ ఆడబిడ్డల
ధైర్యవచనమైంది

ఆమె రేణుక నుండి
చైతూగా మారి
దమయంతిగా
భానూ దీదీగా
అడవి బిడ్డల
కొంగు ముడి అయింది

ఆమె తెరచిన
కనులు చూసి
వాడికొకటే భయం
అరణ్యమిప్పుడు
మరల మిడ్కో
వెలుతురుతో
భగ్గుమంటుందని!!

కెక్యూబ్
01-04-2025

One thought on “ఆమె ధైర్యవచనం

  1. ఆమె తెరిచిన కన్నులు చూస్తే వాడికి భయమే

Leave a Reply