ఇదే నేను ఇదే నా జీవితమనుకో…’

అంటూ వొకచోట..ఇంకిపోని ఊట బావిలాంటిదే ఈ దేహం/ఇదికూడా వో సామూహిక కన్నీటి సమీకరణ కేంద్రమే..అంటూ మరొకచోట కవిత్వాన్ని జీవితానికి మిళితం చేసి రాస్తున్న కవి వైష్ణవిశ్రీ. తెలుగు కవిత్వంలో సీరియస్‌గా కవిత్వం రాస్తున్న కవుల జాబితాలో ఉన్నారు. అనతికాలంలోనే తనకంటూ సాహిత్యలోకంలో వొకపుటను ఏర్పరచుకున్నారు. కవిత్వాన్ని ప్రేమగా ప్రేమిస్తుంది. ఆమె కవిత్వంలో గాఢత, లౌల్యం కలగలసి కనబడతాయి. సమాజాన్ని చూసేకోణం వొక్కొక్కరిది వొక్కో విధంగా వుంటుంది. సమాజం పట్ల స్పష్టమైన దృక్ఫథం కలిగి వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న ప్రతీదాన్ని వస్తువుగా తీసుకుని ప్రగతిశీలతను చాటుతుంది. కొన్ని చోట్ల కవిత్వాన్ని మంటల్లా మండిస్తే,  మరికొన్నిచోట్ల మంచుపూల పరిమళాల్ని వెదజల్లుతుంది. దశాబ్దకాలంగా కవిత్వం రాస్తున్నారు. తను తీసుకొచ్చిన కవిత్వ సంపుటాలు మూడే అయినా కవిత్వపాఠకుల హృదయాలు తట్టేలా దగ్గరైంది. వైష్ణవిశ్రీ ఇటీవల నాల్గవ కవిత్వ సంపుటిగా “రెండు ప్రపంచాల మధ్య”  అనే కవిత్వం తీసుకొచ్చింది. సమకాలీన జీవితం, సమకాలీన సమస్యలు, సమాజం ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను కవిత్వంగా మనముందుంచుతుంది. సహజంగా సామాజిక సమస్యల మూలాన సగటు మనిషి జీవితం నిప్పులమయమౌతుంది. జీవితం అతలా కుతలమవుతుంది. కన్నీటి సుడిగుండమవుతుంది. అవి వైష్ణవిశ్రీ కవితలకు వస్తువులై ఆమె చేతిలోని కలమనే ఉలితో చెక్కబడతాయి. ఆమె కవిత్వసౌందర్యమెలాగుంటుందో చూద్దాం..

‘లోలోపల దాచుకున్న బడబాగ్నిని కూడా/ముట్టుకుని చూడాలని తెగ ఆశపడుతుంటారు’ నిజమే కదా మనిషి లోపలి లోలోపలి అంతరాల్లో తనకు తానే నిక్షిప్తం చేసుకున్న బడబాగ్నిని వీక్షించడమేమిటి? ఆశ్చర్యం కదూ.. కవి దృష్టి కోణం సామాన్యుల దృష్టికోణం ఎప్పటికీ భిన్నంగానే ఉంటుంది. సారూప్యత ఉండదు. కవికి మంటలు మంచుబిందువులుగా కనబడవచ్చు. మంచుబింవులు బడబాగ్ని జ్వాలలుగా కనబడవచ్చు. దృష్టికోణం అలాంటిది. అందరికీ లతలు లతలుగానే కనబడితే కాళిదాసుకు లతలు వధువులుగా కనబడ్డాయి. ఈమె బడబాగ్ని చూడాలనే మనిషి ఆశపడతాడని చెబుతుంది. అంతరంగాల్లో ప్రయాణిస్తుంది.

సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వ స్వరూపం మారిపోయింది. కవిత్వానికేనిర్మాణ సూత్రాలక్కర్లేదంటూ కవిత్వాన్ని  చాలా మంది కవులు రాస్తూ ఉన్నారు. కొన్ని నిర్ధిష్టమైన నిర్మాణసూత్రాలతో కవిత్వం రాస్తే ఆ కవిత్వం మరింత బలమౌతుంది. అది కొంతమందే చేయగలుగుతున్నారు. వైష్ణవిశ్రీ  రాసిన ఈ కవిత్వంలో రూపము సారము రెండూ కనబడ్డాయి. ఈ మాట చాలా విస్తృతమైనదే. కవిత్వాన్ని విమర్శకులిటీవల రూపం సారంతో పోలుస్తున్నారు. కవిత్వ వాస్తవికతలో రూపం-సారం ఐక్యంగానే వుంటాయి. వాటిని వేర్వేరుగా చూడలేం. వాటిని ప్రాణం-శరీరంతో పోలుస్తారు. రూప-సార సమన్వయంతో వాస్తవికతను సౌందర్యాత్మకంగా వంటబట్టించుకోవడం యొక్క స్వభావం వ్యక్తమవుతుందని విమర్శకులంటారు. అలా చూసినపుడు.. గట్టిగా హత్తుకునేందుకు యుద్దమేమీ/ప్రియురాలి ఆలింగనం కాదు/ మరణించిన తర్వాత కూడా/ మనిషిని దేశాన్ని విడిచిపెట్టని/వొకానొక గడ్డుకాలం యుద్దం/ వొట్టిపోయిన మట్టి కంటి చెమ్మ/వొడలి రాలిపోయిన/పేదవాడి బతుకుచిత్రం యుద్దం అంటుంది.

వైష్ణవిశ్రీ తన కవిత్వపు మస్తిష్కపుపొరల్లో వైవిధ్యతను, శైలిని నిర్మించుకున్నారు. అనతికాలంలో కవిత్వలోకంలో బలమైన కవిత్వ అభివ్యక్తిని సృష్టించుకున్నారు. కవిత చదవగానే ఇది వైష్ణవిశ్రీ రాసిన కవితలా వుందే.. అన్నంత బలమైన కవిత్వముద్ర వేయగలిగింది. వొక్కోసారి తను చెప్పగలుగుతున్న విషయాన్నంతా వొకే వొక కవితావాక్యంలో ఇమిడ్చి అర్థవంతంగా రాసేస్తుంది. అదెలాగంటే..‘పేదరికమంటే బహుళ అంతస్తుల నుంచి జారిపోతున్న చిక్కటి నెత్తురు’ అనేస్తుంది. అలాగే మరొకచోట చాలా సున్నితంగా జీవిత రహస్యాన్ని చెబుతుంది. అదెలాగంటే..నువ్వూ నేనూ ఇంకా ఎన్నాళ్ళనీ/మన బతుకులకి కావలి కాద్దాం?! స్వంతం చేసుకున్నప్పుడే యజమానులు కాగలం’ అంటారు. ఇలా చాలా బాగా జీవితాన్ని కవిత్వానికి అన్వయించి సారాన్ని చెబుతుంది.సారంకోసం, రూపం కోసం కవితావాక్యాలను వెతకాల్సిన పనిలేదు. రూపం సారం కవిలో బలపడాలంటే వొక సైద్ధాంతిక నిబద్దత మెండుగా ఉండాలి. అది వైష్ణవిశ్రీలో బలంగా వుంది. ఆ నిర్ధిష్ట సైద్దాంతిక భావజాలమే తనకవిత్వానికి ఊపిరి అవుతున్నది. భావజాలమన్నమాట చెప్పాల్సి వచ్చినపుడు.. దేశంలో బుల్డోజర్‌ అవతారమెత్తిన వెలిసిన కొత్తదేవుడు/ ఇంద్రధనుస్సుకి కాషాయాలు పులిమి/పసిగొంతుల్ని నులుముతున్నాడు/ మనుషుల్ని వెదురు బద్దల్లా చీల్చి /ఖండఖండాలుగా విసిరేస్తూ/ భూమధ్యరేఖపై అధిపత్యం గోడకట్టాలనుకుంటాడు/ రాబోయే రోజులన్నీ మంచివని నమ్మాలంటే/ ఇప్పుడందరూ వీధికో నినాదమవ్వాలి/ నెత్తుటిజెండా తలకెత్తుకోవాలి/ విషాదసంకేతాలు ఎక్కడ కనిపించినా/భరోసా నిండిన ఎర్రెర్రని వాక్యాల్ని రాయాలి’ ఇప్పుడర్థమైందనుకుంటాను తన భావజాలం, తన సైద్ధాంతిక నిబద్దత..ఈ పుస్తకాన్ని నాకు చాలా అనుమానంగానే ఇచ్చింది. ఈ కవిత్వాన్ని చదువుతాడా? లేదా? నాల్గక్షరాలు ఈ నా కవిత్వంపై రాస్తాడా లేదా..?ఇవ్వడం వేస్టవుతుందా అన్న అనుమానపు చూపులతో అందరికీ ఇచ్చాక, పోతేపోనీలే ఒక కాపీ అనుకుని ఇచ్చిందనిపించింది. కానీ కవిత్వం చదువుతున్నంత సేపూ ఏకబిగిన చదివేలా రాసింది. కవిత్వ నిర్మాణ రహస్యాలన్నీ ఆమె కవిత్వంలో నన్ను పలకరించాయి. పైన పేర్కొన్న కవితలో తనకు ఈ దుర్నీతిరాజ్యం పట్ల ఉన్న కోపం మండే నిప్పుకణికల్లా కనబడుతుంది. నిజమే కదా ఈ రాజ్యం బుల్డోజర్‌ రాజ్యమన్న సంగతి ప్రతివొక్కరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఎలాంటి కోపమంటే ‘దేవుడు ముసుగేసుకున్న బల్డోజర్‌ /మత మతాబుల వెలుగుల్లో/మనం మసిబారిపోయి!!’ ఇలాంటి సున్నితమైన కోపాన్ని బలమైన అభివ్యక్తితో పోలుస్తుంది.

ఈ కవిత్వంలో రాజ్యం మీద తిరుగుబాటే కాకుండా, సామాజిక సమస్యలే కాకుండా ఫెమినిస్టు దృక్పథంతో రాసిన కవితలు చాలా కనబడతాయి. నిజమే కదా..ఈ సమాజంలో  ‘మాంగల్యం తంతునానేన మతజీవన హేతునా కంఠే బద్నామి సుభగేతం జీవశరదశ్శతమ్‌’’దీనర్థం నా జీవనమునకు హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్ళు వర్ధిల్లు అని అర్థం. పోతన ‘‘మెలత మంగళ సూత్రంబు మినుకు దక్క’’ అని సీతమ్మ తాళిని ప్రశంసించాడు. స్త్రీల స్వేచ్ఛను హరించి బంధీ చెసేందుకు నానా పద్ధతులు సృష్టించారు.మనదేశం భిన్నత్వంలో ఏకత్వం కల్గిన ఏకైక దేశం అని మతాలను, సంప్రదాయాలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవిస్తున్నాము. మత గ్రంథాలు మాత్రం మనల్ని విభజిస్తున్నాయి. అందుకే స్త్రీవాదం అవసరమైంది. అనివార్యమైంది. వారి సమస్యల్ని వాళ్ళు, వాళ్ళ వెతల్ని వాళ్ళు, వాళ్ళ కన్నీటి గాథల్ని వాళ్ళు, వాళ్ళ స్వేచ్చను వాళ్ళు చెబటం తప్పేమీ కాదు. అది ఇప్పుడున్న ఈ కార్పోరేట్‌ సమాజంలో అవసరమైనది కూడా..అందుకే వైష్ణవిశ్రీ కవిత్వం స్త్రీవాదాన్ని కూడా బలంగా స్పృశిస్తుంది. అందుకే తను ఒక కవితలో ‘అవమానాలు, దాడులూ, అత్యాచారాలు, నా స్థిర చరాస్తులు’ అంటుంది. ఈ కవిత రాసిన సందర్భం మరొక్కటి అయినా నిర్వచనం మాత్రం స్థిరమైనదే. అలాగే వాడేం చేసినా ఆమె ఎందుకు పడుండాలో/నెత్తిమీద ఊగే ఉరితాడు సమాధానమయ్యే ప్రశ్న, అని మరొక చోట  గాయాలు మానిపోయాయనుకోకు/ గుండెలూతుల్లోకి దిగబడిన ముళ్ళను బైటకు తీయలేకపోతున్నా..అంటుంది. నిజమే కదా  ఇలా ఇప్పుడెవరు మాట్లాడతారు. ముళ్ళుగుచ్చుకున్న వాళ్ళకే బాధ తెలుస్తుంది. అందుకే తను మాట్లాడటం అవసరం.

ఈ రెండు ప్రపంచాల మధ్య కవిత్వంలోని ప్రతీ కవిత మాట్లాడదగ్గదే..ప్రతీది విశ్లేషించదగ్గదే..నేను దేశాన్ని అన్న శీర్షికతో రాసిన చివరి కవిత దగ్గర ఆగిపోయాను. ఎంత గాఢతగా, ఆర్ధ్రతగా రాసిందంటే అది చూద్దాం..

మూడు దేహాలు కలిసిన రక్తంతోనేగా/జాతీయ జెండాగా మారి దేశం/అంత ఎత్తున తలెత్తుకు నిలబడిరది./అశోక చక్రం తన వొంటి నిండా నీలి రంగుని పులుముకుంది!/నా రక్తంలో దేశం ఉంది/దేశం నదుల్లో నేను పారుతున్నా/నా నుండి దేశాన్ని వేరు చేయాలన్న నీ ప్రణాళికల పట్ల/నన్ను కుదిపేస్తున్న ఆగ్రహమూ ఉంది/అన్ని దిక్కులు ఆవహిస్తున్న ఏకాకితనం పట్ల నిట్టూర్పూ ఉంది./నా అవయవాల్లోకి కాషాయం నెత్తురెక్కించాలని చూస్తున్నావు/నా రెక్కల్ని నీ ఆధీనంలో ఉంచబోను/అందరిలాగే ఈ నేలపై నా కాళ్లమీదే నిలబడ్డాను/ఇప్పుడు నువ్వు హిసాబ్‌ కు తేలనంటూ/తలకిందుల లెక్కలేస్తున్నావు నేను పేగు పంచుకున్న ఊరునాది కాదంటున్నావు/నేను వొట్టి హిజాబ్‌ను కాదు ఈ దేశం మగ్గం మీద నేయబడ్డ జాతి వస్త్రాన్ని !!’ అంటూ ఈ కాషాయ రాజ్యం మీద వరచుకుపడుతుంది

సమకాలీన ప్రపంచంలో జరిగే ప్రతి దారుణాన్ని, ప్రతి దారుణ మారణ కాండల్ని, ప్రతీ దురాగతాల్ని ఈ కవిత్వం లో రికార్డు చేయగలిగింది. ప్రపంచంనివ్వెర పోయిన మణిపూర్‌ లాంటి దారుణాలపై కూడా కవిత రాసింది. అత్యాచారాలపై అవమానాలపై కవితాస్త్రాలతో యుద్దం చేసింది. ఈ కవి వర్తమాన సమాజంలో, తెలుగు సాహిత్యలోకంలో ప్రామిస్డ్‌ పోయెట్‌గా నిలబడింది. ఈ కవి ఆశయం గొప్పది. ప్రగతిశీలభావజాలంతో అక్షరయుద్దం చేస్తున్న వైష్ణవిశ్రీ ఆమె చెప్పినట్టే..దారి చూపే నక్షత్రదీపానివి నువ్వు/ పీడన వేర్లని పెకిలిస్తున్న పదునైన పద్యానివి..నిజమే కదా..

2 thoughts on “‘ఇదే నేను ఇదే నా జీవితమనుకో…’

Leave a Reply