(దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమం గురించి ఆదివాసీ మహిళ కుమ్మే నాతో ఇలా సంభాషించడం మొదలు పెట్టింది. ఆమె మాటలు లోకమంతా వినాల్సినవి.  దండకారణ్యం గురించి, విప్లవోద్యమం గురించి, అందులో అమరులైన వీరుల గురించి నాకు చెప్పింది.  అందులో గొప్ప జీవితానుభవం ఉంది.  జ్ఞానం ఉంది. విప్లవాచరణ ఉంది. చాలా మామూలు జీవితం నుంచి వచ్చి విప్లవకారులై అమరులైన తీరు వివరించింది.  ఆమె ఏమంటున్నదో వినండి… ఓ కార్యకర్త)

మేం ఆదివాసులం. అడవులే మా ప్రాణం. మా అడవులలో చాలా కాలంగా శాంతి కరువైంది. ఇపుడు ఎటు చూసినా మా అడవులలో ఖాకీలే దర్శనమిస్తున్నారు. ఎందుకో తెలియదు. అడవిలో ఏ పని చేయాలన్నా ఇపుడు ఖాకీలే ముందుంటున్నారు. వాళ్లకు అడవులలో ఏం పని? వాళ్లు మమ్మల్ని హింసిస్తున్న తీరు మాకు చెపుతున్న వాళ్లను పోలీసులు  సహించడం లేదు. మా దగ్గరికి వచ్చి ఈ రాజ్యం గురించి, పోలీసుల  గురించి, మా జీవితాల గురించి, మా అడవుల గురించి, హక్కుల గురించి చెపుతున్న వాళ్లంతా మా పిల్లలే. వారిలో కొందరు మరెక్కడో పుట్టారు. వారి వివరాలు మాకు అంతగా తెలియవు. కానీ, వాళ్లు మా మధ్య మా వాళ్ల కన్నా ఎక్కువగా మాతో కలిసిపోయారు. మా మధ్య ఎలాంటి తారతమ్యాలు, అరమరికలు లేవు. వాళ్లు అడవులకు ఆదివాసులే యజమానులు అని నిత్యం చెప్పేవారు.   పోలీసులు ఆ అడవులను మా నుండి దూరం చేయడానికి, మా అడవులలోని అడుగు అడుగూ మాకు కాకుండా చేయడానికి వచ్చారనీ, అడవి గర్భంలో దాగిన అణువు అణువు గనులను, ఖనిజాలను, ఉపరితలంలోని సంపదలను, జల వనరులను తరలించడానికి వచ్చారనీ చెప్పేవారు.

అందుకే వారిని చంపుతున్నారనీ ఆపటోల హత్యల ద్వారా మాకు అర్ధమవుతోంది. మాకోసం, మా మధ్యే, మాతో కలిసి పని చేసి అమరులైన వారిని స్మరించుకోకుండా మేం ఎలా వుండ గలం? అది నేరమెలా అవుతుంది? మేం వాళ్లతోనే ఉంటున్నాం. ఎంత మంది ఖాకీలు వుంటే ఏంటి? ఎన్ని కగార్‌ లను సూర్యశక్తులను, జలశక్తులను కొనసాగించి ఎంత భీభత్సం సృష్టిస్తేనేమి! వారి స్మరణలో వారి గురించి మాకు తెలిసిన అన్ని విషయాలూ ఇప్పుడు నీకు చెబుతాను.

ఇప్పుడిప్పుడే ఏదీ జరగవద్దనుకొంటున్న సమయంలోనే కార్పొరేట్‌ కాషాయ కగార్‌ దాడి. రెప్పపాటు కాలంలోనే అమూల్యమైన కామేడ్స్‌ అమరత్వం. ఏప్రిల్‌ 16 వ తేదీన కాంకేర్‌ జిల్లాలో (ఉత్తర బస్తర్‌ డివిజన్‌) జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌. కాదు ప్లాన్‌గా చేసిన నరసంహారం. ఈ నరసంహారంలో 29 మంది కామ్రేడ్స్‌ అమరత్వం. పోల్చుకోలేనట్టుగా ఉన్న వారి ఫోటోలు. ఫోటోలను చూసినప్పుడే తీవ్ర చిత్రహింసలు పెట్టి చంపారని సులువుగా అర్థమై పోతోంది. అది కూడా ‘దొంగచాటు దెబ్బే’ననేది మాత్రం స్పష్టం. అమరులైన కామేడ్స్‌ అందరూ శత్రువు పెట్టిన తీవ్ర చిత్రహింసలను గేలి చేస్తూ అమరత్వాన్నే ఆహ్వానించారు. ఉక్కు క్రమశిక్షణ కలిగిన విప్లవోద్యమ రహస్యాలను కాపాడారు, త్యాగపూరిత ఆదర్శాలను నిలబెట్టారు.

కార్పొరేట్‌ కాషాయ కగార్‌ దాడి మొదలైన దగ్గరి నుంచి కళ్ళముందే ఎంతో మంది ప్రజలు, ఎందరో విప్లవకారులు తమ విలువైన జీవితాల్నీ, ప్రాణాల్నీ ధార పోస్తున్నారు. స్వార్థం, వంచన, దోపిడీ లేని సమాజం కోసం  త్యాగం అవసరమని, దాని కోసం కుటుంబాన్ని వదిలారు. కపటం లేని జీవితాన్ని జీవించారు. పీడిత ప్రజలను ప్రేమించారు. వారి కోసం ప్రాణాలను ఇచ్చారే తప్ప బదులుగా ఏమీ కోరలేదు. సమాజాన్ని మార్చటానికి తమ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించారు, ఏమీ తమవి కావనీ, అన్నీ సమాజానికే అన్న నిజాయితీతో.

అందుకే జరిగిన ప్రతి దాడిలో వీసమెత్తు కూడా శత్రువుకు లొంగలేదు. చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని విధంగా బాటలు వేశారు. ప్రజలతో నిత్యం సజీవ సంబంధాలతో  ంటూ అమరులైన ఆ 29 మంది కామ్రేడ్స్‌ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విశిష్ట లక్షణం. ఎవరికీ ఎవరూ తీసిపోరు. ఆర్గనైజర్స్‌ గా, మిలటరీ కమాండర్స్‌ గా, వివిధ విభాగాల్లో అనుభవం ఉండి ఆరితేరిన కామ్రేడ్స్‌. వీళ్ళు మంచి తిండి కోరుకోలేదు, మంచి బట్ట కట్టుకోలేదు, ఏవేవో కావాలని ఆశ పడలేదు. కోరుకుందల్లా ఒక్కటే. కాషాయ ఫాసిజపు కార్పొరేటీకరణ – సైనికీకరణను తుదముట్టించే వర్గపోరాటం. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ, అది వైషమ్య స్థాయికి (యుద్ధం) చేరుతుండటంతో దాన్ని బద్దలు కొట్టే ఉత్పత్తి శక్తులకు నాయకత్వం వహించారు. దాన్నే ఊపిరిగా బతికారు. అందుకే వారిని విప్లవోద్యమపు ఒడిదుడుకుల్లో, తీసుకొన్న నిర్ణయాల అమలులో తెరిచి చదువుకోవచ్చు.

ఉత్తర బస్తర్‌ డివిజన్‌ ఉద్యమంలోనూ, ముఖ్యంగా వెచ్చఘాట్‌ ప్రజా పోరాటంలో కా. శంకర్‌ ను, నిప్పులు చెరిగే ఆర్‌.కె.బి. (రాజనందగావ్‌ – కాంకేర్‌ బోర్డర్‌ కమిటీ) డివిజన్‌ విప్లవోద్యమంలో కా. రీతా, వినోద్‌ లను, ఉన్న పనులను అలుపు సొలుపు అనుకోకుండా నడిపే సమన్వయంలో కా. బచ్చు, అనితలను, ప్రతాపూర్‌ ఏరియా ప్రత్యామ్నాయ ప్రభుత్వ పని విధానంలో కా. సుఖలాల్‌, రజిత, గీత, బద్రులను, ఎస్‌.ఎమ్‌.సి. నుంచి వెలువడుతున్న ‘పడియోర పొల్లో’ పత్రికలో కా. రమేష్‌ ను, లేలేత వయసులో ఉద్యమంలో భాగమై ఓనమాలు దిద్దుతూ, దిద్దిస్తూ ఉన్న ఏకాగ్రతలో ఆ పందొమ్మిది మంది కామ్రేడ్స్‌ ను చూడవచ్చు.

అమరులయ్యింది ఇరవై తొమ్మిది మంది. అందులో మహిళా కామ్రేడ్స్‌ పద్నాలుగు మంది. కామేడ్స్‌ రీత, రజిత, అనిత, గీత, సురేఖ, షర్మిల, కవిత, సంజీలా, భూమే, సజొంతి, జెన్నీ, సునీలా, జనీలా, శీలో. ‘ఆకాశంలో సగం – అధికారంలో సగం’. అమరత్వంలో కూడా అంటూ ముందు పీఠిన నిలబడ్డారు మహిళా కామ్రేడ్స్‌. విప్లవోద్యమంలో వాళ్ళు భాగమైన నేపథ్యం ఒక్కొక్కరిది ఒక్కొ రకంగా ఉన్నప్పటికీ సారాంశం మాత్రం ఒకటే. దోపిడీ- పేదరికం, అణచివేత. వీటికి కారణం ఎవరు? ఎలా వచ్చాయి? లాంటి ప్రశ్నలే వారిని అనునిత్యం వెంటాడడం, పీడిత వర్గంలో, అణచివేతకు గురవుతున్న ఆదివాసీ తెగల్లో పుట్టి పితృస్వామిక సమాజంలో మహిళలుగా వివక్షతకు గురవటంతో విప్లవం ఒక అవసరంగా భావించారు. సమాజ మార్చు కోసం సాయుధ పోరు మార్గాన్ని ఎంచుకొన్నారు. నమ్మిన ఆశయం కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు అంకితమై పనిచేశారు.

సీనియర్‌  సభ్యురాలైన కా. గీత ప్రతాపూర్‌ ఏరియాలోని వరకోడ్‌ భూమి పుత్రిక. నిర్మలమైన మనసు, కష్టపడే మనస్తత్వం కలిగిన కా. గీత వ్యక్తిగత జీవితంలో ఊహించని విషాదాన్నే చూసింది. ఇష్టపడి పెళ్ళి చేసుకొన్న సహచర కామేడే ద్రోహిగా మారి ప్రజల  చేతిలో శిక్షకు గురైనప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఉద్యమం తీసుకున్న  నిర్ణయాన్నే తన నిర్ణయంగా స్వీకరించింది. చివరి వరకు నీటిలో చేపలా ప్రజలను  ప్రేమించింది. వారికోసం ప్రాణమిచ్చింది. అమరవీరుల సరసన నిల్చింది.

మొదటిసారి కా. గీత గురించి విన్నప్పుడు నల్గొండ జిల్లాలో కలిసి పనిచేసిన ‘మానస’నే గుర్తుకొచ్చింది. మానస సహచరుడు సిరాజ్‌ శత్రువు బెదిరింపులకు భయపడి కోవర్దుగా మారినప్పుడు ‘‘ప్రజల కోసం పని చేస్తున్న పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని శిక్షించడమే సరైందన్న’ రాజకీయ చైతన్యాన్ని మానన ప్రదర్శించింది. ఆ నిర్ణయాన్ని సిరాజ్‌ ముఖం మీదే చెప్పింది. 2015 ఆగష్టు నెలలో ఎఓబిలో పొడియా ఏరియాలోని కోవాసిరాసి గ్రామ పరిసరాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో కా. మానస (జానకి, కవిత) అమరురాలయ్యింది.

ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల ముద్దుబిడ్డ ప్రతాపూర్‌ ఏరియా ప్రజల చిరపరిచితురాలు కా. రజిత డికె కు వచ్చిన దగ్గర నుండి అమరత్వం చెందే వరకు ప్రజలనే అంటిపెట్టుకొంది. ఉద్యమంలో ఆమె స్థాయి ఏంటో మాకు తెలియదు. తెలుసుకునే అవసరమూ రాలేదు. విశ్వసించిన ఆశయానికే కట్టుబడి ఆమె పని చేసింది. తప్పు చేసిన వారిని ఎవరినైనా సూటిగా విమర్శించేది. జీవిత భాగస్వామి అయిన కా. శంకర్‌ని అయితే మరీ ఎక్కువగా. విమర్శించేది, పనుల ఒత్తిడిలో ఉన్న కా. శంకర్‌ కు ఒక కామ్రేడ్‌ గా సహాయ సహాకారాలు అందించేది. కాసేపు కిచెన్‌ దగ్గర కనపడేది. మరింతలోనే సెంట్రీలోనో, పెట్రోలింగ్‌ లోనో, సీనియర్‌ కామేడ్స్‌ కు సహాయం చేస్తూనో, లేదంటే జనంతో మాట్లాడుతూనో, మరింకే పని మీదనో. అలా ప్రతి క్షణం కా. రజిత కష్టపడుతూనే ఉండేది. విప్లవోద్యమంలో భాగమైన ప్రతివారు కష్టపడాల్సిందే. విప్లవోద్యమమే కష్టాలతో కూడుకొన్నది. ఆ కష్టాల్లో ఉన్న తీపి ప్రత్యక్షంగా భాగస్వాములైన వారికే తెలుస్తోంది.

5వ నంబరు కంపెనీలోని ప్లాటూన్‌ కమిటీ సభ్యురాలు కా. అనిత నారాయణపుర్‌ జిల్లాలోని ఓర్చా బ్లాకులోని బొండోస్‌ గ్రామ ప్రజల తనయ. 2011 లో విప్లవోద్యమంలోకి అడుగు పెట్టింది. ఆపై వెనుదిరిగి చూడలేదు. దాదాపు పన్నెండు సంవత్సరాలు సమన్వయ దళంలో ఉంటూ క్షణం తీరిక లేకుండా పనిచేసింది. రూట్స్‌ మీద, టెర్రయిన్‌ మీద, ప్రజల మీద పిండి కొట్టినంత పట్టు సాధించింది. శత్రువు ఉద్యమానికి కల్పిస్తున్న ఆటంకాల వలన ఒక్కోసారి ఉరుకు – పరుగులతో సమన్వయ పనులుండేవి. అయినా ఏమాత్రం రిస్క్‌ అనేది తన ముఖంలో కనిపించేది కాదు. నడిచి, నడిచి అలసిపోయి ఉన్నప్పటికీ ఆగాల్సిన చోటుకి వచ్చిన వెంటనే చకచకా వంటకు సంబంధించిన పనులన్నీ చేసేది. తన రుచికరమైన వంటకాల ద్వారా కామేడ్స్‌ అలసటను క్షణాల్లో ఎగరకొట్టేసేది.

కోత్రి ఏరియా కమిటీ సభ్యురాలైన కా. రీత మహాల – మాన్‌పూర్‌ జిల్లా, మాన్‌పూర్‌ బ్లాక్‌, హలోరా పంచాయతీ, గ్రామంలో పుట్టి పెరిగింది. ఇంటి దగ్గరే పెళ్లయ్యింది. పెళ్ళయిన కొద్ది రోజులకే సహచరుడు విప్లవోద్యమంలో భాగమైనాడు. అప్పటికి తను ఇంటి దగ్గరే. ఒక పనిమీద వెళుతున్న సహచరుడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు. లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. తనని కూడా. కానీ రీత గుండె ధైర్యం గొప్పది. సహచరుడి లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించింది. శషభిషలు లేకుండా విప్లవోద్యమంలో భాగమైంది. ప్రజల బాధలను తన బాధలుగా భావించింది. అంచెలంచెలుగా ఎదిగింది. నిప్పులు చెరిగే నిర్భంధంలో పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కొంటూ ప్రజలు విశ్వసించే కమాండర్‌ గా పరిణతి చెందింది.

చూద్దానికి చిన్న పిల్లాడిలా కనిపించే కా. వినోద్‌ ప్రజలు ఆదరించే, అక్కున చేర్చుకొనే ఆత్మీయ సంబంధం నిండుకున్నవాడు. జెంధి – మొహలా సంయుక్త ఏరియా కమిటీలో ఆధారపడ దగిన కామ్రేడ్‌. ఆర్గనైజేషన్‌ అయినా మిలటరీ వర్క్‌ అయినా అవలీలగా చేసే నేర్పరి. గత (2023) మే నెలలో జరిగిన పోలీసుల దాడి నుంచి వెంట్రుక వాసిలో తప్పుకొన్న కామ్రేడ్‌. ఆ దాడిలో కా. వినోద్‌ సహచరి కా. పగిని పోలీసుల వలయం నుండి రిట్రీట్‌ అవుతుండగా పోలీసులు చేసిన కాల్పుల్లో గాయపడిరది. పగినిని తమతో పాటు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వినోద్‌ కి కూడా గాయమయ్యింది. లేవలేని స్థితిలో ఉన్న పగిని పోలీసులకు దొరికింది. ఆ ఘటన నుండి తోటి కామ్రేడ్స్‌ సహాయంతో వినోద్‌ బయట పడ్డాడు. ఇప్పుడు పగిని జైల్లో ఉంది. జైల్లో ఉన్న పగినికి వినోద్‌ ధైర్యంతో కూడిన ఉత్తరం రాశాడు. పగినికే కాదు పగిని కుటుంబానికి కూడా. తనే ఈ విషయం చెప్పుతున్నప్పుడు అతని ముఖంలో ఒక రకమైన తృప్తి కనిపించింది. చిన్న వయసులో ఈ ఘటన ఎంత ప్రభావం పడుంటుందో కదా! అని ఎవరికైనా అనిపిస్తోంది. కానీ ప్రజలు, విప్లవోద్యమం ఇచ్చిన రాజకీయ చైతన్యం వినోద్‌ ను రాటుదేల్చింది, గట్టి పిండంలా.

నిజం కదా! ప్రజలే పుట్టించిన విప్లవోద్యమం ఎంత గొప్పది. అన్నింటినీ తనలో లీనం చేసుకొంటుంది. అది సంతోషమైనా, దుఃఖమైనా. ఆ తదుపరి పరిపూర్ణ కామ్రేడ్స్‌ గా తీర్చి దిద్దుతోంది. ఒక రకంగా మట్టిలో నుంచి మాణిక్యాలను వెలికితీస్తోంది. తనకు గాయం అయిన భాగాన్ని చూపించి ‘తగ్గిపోయింది ఇప్పుడేం లేదు’ అన్న తన మాటలు నాకు ఒకింత ధైర్యం చెప్పినట్టనిపించాయి.

కా. రీత, వినోద్‌ లు ఒకే జిల్లా, ఒకే బ్లాకు వారు. స్థానికులవటంతో భౌగోళికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రజల మీద, ప్రజల భాషల మీద గట్టి పట్టు ఉన్న కామ్రేద్స్‌. అది గోండీ అయినా హిందీ అయినా ఛత్తీస్‌ఘడీ అయినా. అందుకే జనం మెచ్చే తమదైన యాసలో బతుకు పోరును అందించారు. వారి నాలుకల మీద చిరస్థాయిగా నిలిచి పోయేటట్టు జీవించారు.

వీరి అమరత్వానికి రెండు నెలల ముందు వీరి విప్లవ భవిష్యత్తును అక్కడి బాధ్యులు పంచుకోవటమైంది. ఉద్యమ భవిష్యత్తు గురించి రకరకాల ఆలోచనలతో ఉండి, ఈ ఇద్దరి కామ్రేద్స్‌ ద్వారా ఎన్నో ఆశించిన ఆర్‌.కె.బి. డివిజన్‌ ప్రజలకు, విప్లవోద్యమానికి వీరి అమరత్వం ఒక బాధాకరమే. దాని  నుంచి విప్లవోద్యమం కోలుకొంటుంది. ప్రజలు కోలుకొంటారు, తమ పిల్లలను ఉద్యమ వారసులుగా తయారు చేస్తారు, విప్లవోద్యమాన్ని మరింత ముందుకు నడిపిస్తారు.

కా. శంకర్‌ ఎనిమిది సంవత్సరాలు ఉత్తర బస్తర్‌ నాయకత్వంలో ఉండి ప్రజల కోసం పని చేసిండు. ఆయన నిరంతరం ప్రజల మధ్యే జీవించాడు. ప్రజలతో, కేడర్లతో సన్నిహితంగా మెదులుతూ వారిపై చెరిగిపోని ముద్ర వేశాడు. తనకంటూ ఏదీ ప్రత్యేకంగా కోరుకున్నట్టు వినటం గానీ, చూడటం గానీ ఎప్పుడు లేదు. చాలా సింపుల్‌ గా మెలిగే మనస్తత్వం. అనారోగ్యాన్ని సైతం పక్కన పెట్టేసి ముందున్న పని మీదే కేంద్రీకరించేవాడు. ఉత్తర బస్తర్‌ డివిజన్‌ ఉద్యమం గురించి ఎంత తపన పడేవాడో.  ద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే ఆరాటం. అది కూడా సృజనాత్మకంగా. ప్రతి దాంట్లో ఆ సృజనాత్మకతనే చూసేవాడు. దానికోసం వెంపర్లాడేవాడు. ముఖ్యంగా ఉత్తర బస్తర్‌ లోనే తమ ప్రాంతంలోనే ప్రజలు ప్రారంభించిన వెచ్చఘాట్‌ ప్రజా పోరాటాన్ని సన్నిహితంగా పరిశీలించేవాడు. ఆ పోరాటం చాలా న్యాయమైందని పూర్తిగా నమ్మాడు. వారు చట్టబద్ధంగా పోరాడుతున్నారు, అది కూడా అవసరమే, అంతా తమ లాగే సాయుధంగానే పోరాడాలనుకోవడం ఎలా కుదురుతుందని వారి పోరాటాన్ని తన చర్చల ద్వారా సర్వత్రా సమర్థించేవాడు. వెచ్చఘాట్‌ ప్రజా పోరాటం జయప్రదం కావాలని సదా మనసార కోరుకునే వాడు.

ప్రతాపూర్‌ ఏరియా చీంద్‌పూర్‌ గ్రామ పుత్రుడు కా. సుఖలాల్‌. స్థానిక నిర్మాణాల నుంచి ఎదిగొచ్చిన కామ్రేడ్‌. అందుకే ఏరియా ప్రజలందరికీ పరిచితుడే. 2021 సెప్టెంబరు నెలలో జరిగిన ఉత్తర బస్తర్‌ డివిజన్‌ ప్లీనంలో ప్రతినిధిగా పాల్గొన్నాడు. డివిజన్‌ ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ళను, జనతన సర్కారు పనివిధానాన్ని చర్చించాడు. అమరుడయ్యే నాటికి ప్రతాపూర్‌ ఏరియా జనతన సర్కార్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

సుక్కా జిల్లా కరైగూడెం గ్రామంలో పుట్టి పెరిగిన కా. బద్రు ఉద్యమావసరాల రీత్యా 2016 జనవరిలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ లోని ప్రతాపూర్‌ ఏరియా ఉద్యమంలో భాగమయ్యాడు. ప్రతాపూర్‌ ఏరియా లో జరిగిన, జరుగుతున్న ప్రతి పోరాటంలో కా. బద్రు కృషి వుంది. నిజాయితీ పరుడు. ధైర్య, సాహసాలతో, ఎంచుకొన్న పని మీద దృఢ సంకల్పం ఉన్న కామ్రేడ్‌. కేడర్‌ అయినా నాయకత్వమైనా అందరితో కలివిడిగా ఉండేవాడు. ఇక్కడకొచ్చిన తక్కువ కాలంలోనే ప్రజల భాషను నేర్చుకొన్నాడు. వారితో విడదీయరాని అనుబంధాన్ని అలవర్చుకున్నాడు.

సమాజానికి అవసరమైన శాస్త్రీయ విద్యను జనతన సర్కార్‌ స్కూల్లో అభ్యసిస్తున్న కా. రమేష్‌ బాల్యంలోనే ఫాసిస్ట్‌ సల్వాజుడుం దారుణాలను చూశాడు. దోపిడీ పాలకవర్గాల మీద వర్గకసితో విప్లవోద్యమ బాట పట్టాడు. ప్రజల సంపదలను అప్పనంగా దోచుకోవటాన్ని వ్యతిరేకించిన ప్రజలు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, సల్వాజుడుం మంటల్లో ఆహుతై పోతున్న సమయంలో. అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. ఉద్యమ అవసరాల రీత్యా వివిధ చోట్ల పనిచేశాడు. కా. రమేష్‌ మంచి రైటర్‌. అంతకుమించి టైపిస్ట్‌ కూడా. తన చేతులతో తయారైన సందేశాలు, లెటర్లు ఎన్నో. ముఖ్యంగా ‘పడియోర పొల్లో’ పత్రిక కూడా. దానికోసం పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమించాడు. తను చెప్పే విషయాలను వినాలనిపించే వినసొంపు ఉన్న కామ్రేడ్‌.

దానికొక ఉదాహరణ చెబతాను.  2016 లో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కామ్రేడ్స్‌ అందరం ఒక పని మీద జమయ్యాం. ఆ సమయంలో రోజూ సాయంత్రం ఐదు గంటల సమయంలో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ నడిచేవి. పాటలు, నాటికలు, కథలు, రిపోర్టులు. రోజుకొక కామ్రేడ్‌ మాట్లాడటం జరిగేది. ఒకరోజు కా. రమేష్‌ తనకిష్టమైన, చదివిన ఒక కథ గురించి చెప్పాడు. చెప్పటం కూడా మామూలుగా కాదు. చెప్పే కథలోకే వినేవాళ్ళందర్నీ లీనం చేశాడు. వెచ్చపాల్‌ పుత్రుడిపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న ప్రజల్లో సదా గుర్తుండి పోతాడు.

కా. బచ్చు స్ఫురణకు వచ్చినప్పుడల్లా పదిహేడు సంవత్సరాల క్రితం పరిచయమైన చిచ్చర పిడుగు రూపమే కనిపిస్తుంది. ఇక్కడ కొచ్చిన కొత్తలో ‘బచ్చు’ అనే పేరు విని ఇదేం పేరు? అని అనిపించింది. తర్వాత బచ్చునే చెప్పాడు. బచ్చు అంటే ‘ఎంత?’ అని. అలా బచ్చుతో పరిచయం ఏర్పడిరది. అది కూడా నన్ను అపాయింట్‌మెంట్‌ కు తీసుకువెళ్ళే టీములో ఉన్నందుకు. టీమ్‌ సభ్యుడైనప్పటికీ టీమ్‌ కమాండర్‌ కు మించి ఎక్కువ బాధ్యత వహించాడు. మా ప్రయాణంలో కలిసిన జనాన్ని ప్రేమగా పలకరించేవాడు. తనున్న ఆ రెండు రోజులు జనం, జనం అలవాట్లను తనకొచ్చిన తెలుగులో చెప్పాడు. ‘నీకెలా వచ్చు తెలుగు?’ అని అడిగినప్పుడు ఒక పెద్ద కథే చెప్పాడు. అదీ కూడా చాలా ఉత్సాహంగా. అపాయింట్‌మెంట్‌ కు క్ష్షేమంగా చేరాం. అదే రోజు చీకటి పడుతుండగా నవ్వుతూ చేతులు కలిపి విడిపోయాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కలవలేదు. రెండు సంవత్సరాల ముందు రెండు సార్లు కలిసినా లాల్‌సలామ్‌ తోనే విడిపోవటమైంది. చివరిగా 2023 నవంబరు నెలలో తను ఇప్పుడు అమరత్వం చెందిన ప్రాంతంలోనే కొన్ని రోజులు కలిసి ఉండే అవకాశం వచ్చింది. ఒకరోజు రవిగా మారిన బచ్చుతో కూర్చున్నప్పుడు. పదిహేడు సంవత్సరాల కాలంలో జరిగిన ఎన్నో విషయాలు మా ముందు పరుచుకొన్నాయి. ముఖ్యంగా దోపిడీ పాలకవర్గాలు విప్లవోద్యమంపై అమలు చేస్తున్న పాశవిక నిర్భంధం, కామేడ్స్‌ అమరత్వం, అనారోగ్యం. ఇంకా చాలా విషయాలే. నాలుగు గంటలు నాలుగు క్షణాల్లాగా గడిచిపోయాయి. సెంట్రీ నుంచి కాషన్‌ రావటంతో మా, మా మకాంలకు దారి తీశాం.

ఈ పాశవిక దాడిలో బచ్చుతో పాటు సహచరి సురేఖ, కా. శంకర్‌ తో పాటు సహచరి రజిత అమరురాలయ్యారు. అమరత్వం కూడా జంటగానే. ఒకరి దుఃఖం మరొకరికి తెలీకుండా.

బచ్చు గార్డుగా ఉన్న మడకాం గోపన్న సుదీర్ఘ విప్లవ జీవితం మీద విశ్వాసం సడలి పాలకవర్గాల పంచన చేరితే, బతుకు పోరును నేర్పించిన బచ్చు విప్లవానికీ అంకితమయ్యాడు.

అమరులైన వారిలో ముఖ్యంగా కా. సజొంతి, జెన్నీ, బజనాధ్‌, పింటూ, సునీలా, సీతల్‌, రాజు, శీలో లు విప్లవోద్యమంలో భాగమయ్యి ఎంతో కాలం కాలేదు. మరీ ముఖ్యంగా పింటు, సునీలా, సీతల్‌, రాజు, శీలోలు పట్టుమని పదిహేను రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఈ దారుణం. ఇళ్ళను విడిచి పదిహేను రోజులు కూడా కాని వీరి కుటుంబాలకు, ప్రజలకు తీరని వేదనే. విడిపోయేటప్పుడు ఎంత సంతోషంగా చేతులు కలిపారు. పుట్టి పెరిగిన ఇంద్రావతి ఏరియాలోనే ఉండాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ ఉద్యమ అవసరాన్నే తమ అవసరంగా, ఇష్టంగా భావించారు. విడిపోయే రోజు ఈ ఐదుగురే కాకుండా మరికొంత మంది కామ్రేడ్స్‌ ‘విడిపోతున్నాం కదా! మళ్ళీ ఎప్పుడు కలుస్తామో? అందుకే సినిమా చూపించండం’టూ చిన్న కోరిక కోరారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. వాళ్ళడిగిన చిన్న కోరిక కూడా తీర్చలేక పోయానే అన్న వెలితి వారి అమరత్వ కబురు విన్న ప్రతిక్షణం నుంచి నన్ను వెంటాడుతూ ఉంది. విప్లవకారులకున్న చిన్న, చిన్న కోరికలను కూడా తీర్చుకోలేని విషమ పరిస్థితులు.

అమరులైన కామ్రేడ్స్‌ ఎటువంటి ఒడిదుడుకులకు, లొంగుబాట్లకు వెరవక వర్గపోరాటాన్నే జీవితాచరణగా జీవించారు. సమస్త మానవాళి కోసం జరిగే ఒక మహోన్నత లక్ష్యం కోసం, ఉజ్వల చరిత్ర కోసం తమ జీవితాన్ని అర్పించిన అమరులందరూ హిమాలయ పర్వతమంతా ఎత్తు ఎదిగారు. అందుకే వారు ప్రజల కోసం వెలిగిన, వెలుగుతోన్న ఆశాజ్యోతులు. ఆ జ్యోతులు ఆరిపోయినా విషాదాంతం కాదు. అవి రేపటి ఉషోదయానికి చిహ్నాలు.

అమరుల శవాలను ప్రజలు, కుటుంబీకులు తమ తమ గ్రామాలకు తీసుకెళ్ళి విప్లవ సాంప్రదాయాలతో అంతిమ సంస్కారం చేశారు. విప్లవ సంస్కృతిని నిలబెట్టారు.

కార్పొరేట్‌ కాషాయ ఫాసిజపు ఈ దాడి వనరుల దోపిడీ కోసమే. దాని కోసం కార్పొరేట్‌ పాలకవర్గాలు గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలు, విప్లవోద్యమంపై నరసంహారం (యుద్ధం) సాగిస్తున్నారు. ‘‘బంతిని ఎంత వేగంగా పైకి విసిరి కొడితే అంతే వేగంగా నేల మీద ఎలా రాలి పడుతోందో’’ అలా వాడి ఊహాలకు భిన్నంగా ప్రజా పోరాటాలు అంతే ఎత్తున ఎగిశాయి. కానీ న్యాయమైన ఈ ప్రజా పోరాటాలను అంగీకరించని కార్పొరేట్‌ రాజ్యం ఇప్పుడిక ‘యుద్ధ’ వాతావరణాన్నే సృష్టించింది. ప్రజలను, విప్లవకారులను వెంటాడి, వేటాడి హత్య చేయడమే కాకుండా వారి ‘జీవితం’ సమాజానికి, రేపటి యువతరానికి తెలియకుండా నిషేధిస్తుంది.

ప్రజలే విప్లవోద్యమ వారసులు. దాన్ని సరైన డైరెక్షలో వారే ముందుకు నడిపిస్తారు. నాశనం చేయాలని చూస్తున్న పాలకవర్గాలను ప్రతిఘటిస్తారు. వారి ఆకాంక్షలను నెరవేర్చుకొంటారు. చీకటిని చీలుస్తూ వెలుగు వస్తోంది. రాలిన పండులో నుండి విత్తనం మొలకెత్తుతుంది. అది మొక్కగా, చెట్టుగా, వృక్షంగా, మహావృక్షంగా పెరిగి తన శాఖలను విస్తృత పరుచుకొంటోంది. కాబట్టి దోపిడీ పాలకవర్గాలు ఎంతమంది విప్లవకారులను చంపినా ఉద్యమాన్ని రూపుమాపలేడు. అది వాడి తాత్కాలిక విజయమే. అసలు ‘మనుషులను చంపితే జీవితం అంతం అవుతుందేమో గానీ ‘జీవిత లక్ష్యం’ అంతం కాదు. మనుషులు  అమరుడవ్వవచ్చు గానీ ఆశయం మాయమవదు. అందుకే విప్లవోద్యమానికి ఎన్ని నష్టాలు జరిగినా భవిష్యత్తు ప్రజలదే. త్యాగానికి సిద్ధపడేవాళ్ళే తొలిపొద్దును చూడగలుగుతారు. అంతిమ విజయం ప్రజలదే.

(కాంకేర్‌ జిల్లాలోని ఆపాటోలా దగ్గర ఏప్రిల్‌ 16 న కార్పొరేట్‌ కాషాయ కగార్‌ దాడిలో అమరులైన కామేడ్స్‌ కు వినమంగా జోహార్లర్పిస్తూ.. )

Leave a Reply