“ఇల్లు ఖాళీ చేసినప్పుడు…” ఈ కవిత 88 లో అచ్చుకి దిగింది. కరీంనగర్ పల్లెటూళ్ళలో ఎక్కడో పడివున్న నా మొహం మీకు చూపించింది. కాబట్టి దాని పట్ల నాకు వల్లమాలిన అమ్మతనం లాంటిదేదో వుంది.
అసలు అందులో ఏం ఉంది? నన్ను దాచిపెట్టిన నాలుగ్గోడలు , వాటిమీద పెంచుకున్న ప్రేమ ప్లస్ కోపం, రాసుకున్న నిట్టూర్పులు , ఇంతే కదా.


“పట్టా మార్చిన పడక్కుర్చీలా, నే వున్న ఇల్లు \ కొత్త శరీరం కోసం ఎదురుచుస్తు౦ది\భయానికీ ఓటమికీ , ఎడారితనానికీ మీసాలు దిద్ది హుందాగా కనిపి౦చేందుకు \ కరడు కట్టిన స్వార్ధానికి పురి విప్పిన అసూయకీ తెల్లటి చొక్కా తొడిగి జెంటిల్మాను వేషం కట్టేందుకు \ ఇల్లు అనబడే రిహార్సల్ గ్రీన్ రూమ్ లేకపోగా \ దాచడానికేమీ లేని బహిరంగ జీవితమిప్పుడు\ నగ్నసదృ స్యమై వొణకగా \నొప్పి తెలీని క్లోరోఫారం వాసన వేస్తున్న \కాంక్రీటు చర్మాన్ని వదిలి ఫోర్సెప్స్ తో పట్టుకున్న గు౦డేకాయలా రోడ్డెక్కి .. “ ఇలా సాగుతుంది.
కాస్తో కూస్తో సామాజిక చేతన పెరిగాక ఏం అనిపించింది అంటే మనం ఇళ్ళు మారతా౦ . ఇంకో చోట భర్తీ అవుతాం అంతే కానీ ఖాళీ చెయ్యం. మారడం కూడా ఎందుకు అంటే మరిన్ని సదుపాయాలకోసమే. నిజంగా ఇల్లు ఖాళీ చేయడం అనే మాటకి అడుగు తట్టుకి దిగి అనుభవించడం అంటే మన ఇల్లు మన కళ్ళముందే బుల్ డో జర్లతో కూల్చేయడం, కట్ట తెగిన వరద నీళ్ళు తల్లీ పిల్లల్ని చాపతో సహా లాక్కుపోవడం అని – కదా. ఆ ఎరుకతో
అప్పుడు నేను రాసిన కవిత వైయుక్తిక అనుభవానికి తాత్వికపు తిరగమోత, అనిపించిన మాట నిజం.
ఇ౦టి గోడలు హింసని దాచిపెట్టే పితృస్వామ్యపు పిడికిళ్ళు – అని కూడా తోటి కవయిత్రులు వ్యాఖ్యానం చేశారు. ఏ గోడ చూసినా ఇద్దరేసి పెళ్లాలతో కొలువున్న బైగామీ కేసుల్లా౦టి దేవుళ్ళ పటాలు అ౦దుకు నిదర్శనంలా వుండేవి.
మొత్తానికి అప్పటి యుద్దానికి శత్రువు ఎవరో తెలిసేది కాబట్టి ఆయుదాల్ని ప్రయోగించడం తేలికయ్యేది.
ఇప్పుడేమిటి దారి? అద్దంలో చూసుకుంటే ఒకే మొహం కాసేపు శత్రువు లాగానూ కాసేపు బాధితురాయలు లాగానూ కనబడుతోంది .
ఆ కవిత తాలూకు విచికిత్స తర్వాత అనేక సార్లు బదిలీల వల్లనో, పెరిగే కుటుంబ అవసరాల కోసమో ఇళ్ళు మారుతూనే వున్నాను. అలా ఖాళీ చేస్తున్నప్పుడల్లా నన్ను నేనొక కుండీలో నాటుకున్న మొక్కలాగానూ, ఉన్నపళాన ఎవరో పెరికేసి ఇంకోచోట పాతి పెట్టినట్టుగా ఊహించుకుని బాధ పడిపోయేదాన్ని. ఇప్పుడు అలా లేదు. చాలా విరుద్ధంగా వుంది. ఉదాహరణకి మొన్న రెండు నెలల క్రితమే ఇల్లు ఖాళే చేశాను కదా . సామాను లారీకి ఎక్కించి ఆఖరిగా తలఎత్తి ఆ వాటాని చూసినప్పుడు పిసరంత బాధకూడా లేదు. పైగా తెరిపిగా అనిపించింది(?)
అయ్యో, ఇష్టంగా నేను పెంచుకున్న కారబ్బ౦తి కొమ్మకి కూడా చక్కగా టాటా చెప్పానేమిటి? అంత మోద్దుబారిపోయానా? స్పందనలు లేవా? ఈ పాతికేళ్లలో ఏమయింది నాకు .. ? పోనీ ఇక ఖాళీ అవడం నావల్ల కాదు అనుకున్న దశలో కొనేసుకున్న ఇల్లు అయినా కాస్త సంబరాన్ని ఇచ్చిందా అంటే అదీ లేదు. ఇల్లు భయపెడుతోంది. భ్రమలన్నీ తుడిచిపెట్టేస్తోంది? అప్పటికంటే విశాలంగా అనేక అరలతో, నీడలు తేలే పాలరాళ్ళు పరిచివున్న ఈ ఇంటితో నాకు వచ్చిన పేచీ ఏమిటి? చాలారోజులు బుర్ర పగలకొట్టుకుని ఆలోచిస్తే అప్పడు అర్హం అయింది.
నేను అప్పుడు కవిత్వం ఇంట్లో కూచుని రాసాను.
ఇప్పుడు రోడ్డు మీద కూచుని రాస్తున్నాను. కాదు రోడ్డే నేను రాసుకునే బల్లమీదికి వచ్చి కళ్ళు ఉరిమి చూస్తోంది. భిన్న త్వాన్ని కోరుకునే నాకు ఈ మూస వాతావరణం వాంతికొచ్చేట్టు వుంది. రోడ్డు మీద ఎనిమిది మైకులతో శబ్ద కాలుష్యం చెవులు పిండేస్తోంది. ఆ గోలలో నేను ఒకపనికి బదులు ఇంకో పని చేస్తున్నాను. మొన్న కాఫీలో చక్కెర అనుకుని ఉప్పు కలిపేశాను. నిన్న టోపీ అనుకుని బోర్లించి వున్న కూర మూకుడు తీశాను. ఆమాటకొస్తే ఇంట్లో సగం మ౦దికి రోడ్డు వార చెత్త బాగానే పట్టుకుంది. “తినగ తినగ వేప తీయనుండు” పద్యం నిజం చేసినట్టుగా గమ్మానికి దిష్టి గుమ్మడికాయ మెగా సైజులో వేలాడుతోంది. దాన్ని చూస్తే చాలు నాకు, బౌద్ద బిక్షువుల తలకాయలు నరికిన హింస గుర్తొస్తోంది. నొరెత్తితే నా మాట శబ్దాలకింద నలిగిపోతోంది. లిఫ్ట్ దిగి కిందకి వెడితే , పార్కింగ్ సెల్లార్ లో రోజుకో వ్రతం తాలూకు వడ్డనలు జరుగుతున్నాయి. చెట్టు వీచిన గాలి ముక్కుకి చేరకుండా అ౦దిరి కళ్ళమీదా అడ్డంగా ఒకే జెండా యధేచ్చగా ఎగురుతోంది .
ఒకప్పుడు చైతన్యం వికశించాలంటే మనిషి రోడ్డున పడాలి అనుకునేదాన్ని. ఇప్పుడు రోడ్డుమీద గోలేమిటి? నా ఇంటిని ఇలా తినేస్తోంది అనిపిస్తోంది.
నేనోదో చదవాలనుకుంటాను, రాయాలనుకుంటాను. పోనీ కళ్ళు మూసుకుని నిద్రపోవాలనుకుంటాను. ఏదీ కుదరడం లేదు . అసలు ఈ చప్పుళ్ల మధ్య కొత్త దంపతులు ఎవరయినా కాపురం చేసినా భజన చిడతలు పుడతాయి తప్ప మనుషులు పుట్టేలా లేరు. నేను బతుకుతున్న రోడ్డుని చూసి మా ఇల్లు ఎటో పారి పోయింది . వెతుకుతున్నాను . ఎప్పటికయినా దొరుకుతుందా ? గాలి చాలదు, నీళ్ళు చాలవు, చోటు చాలదు అని ఇంత కాలమూ నేను ఇళ్ళ ని ఖాళీ చేశాను కదా , ఇప్పుడు నన్ను ఖాళీ చేసి మా ఇల్లు ఎటో వెళ్ళిపోయింది.

3 thoughts on “ఇల్లు వర్సెస్ రోడ్డు

Leave a Reply