ఎస్సీ కులాలు వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, సామాజిక వివక్షను అనుభవించాయి. సంపద మీద హక్కు లేకుండా ఆర్థిక వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, చారిత్రక, సామాజిక కారణాల వల్ల వాటి పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలను అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024, గురువారం ఇచ్చిన తీర్పును విప్లవ రచయితల సంఘం స్వాగతిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యా, ఉద్యోగాలకు దూరంగా ఉన్న డక్కలి, మాష్టి, చిందు, బైండ్ల, బేగరి, బుడగ జంగం మొదలైన కులాలకు రాజ్యాంగ ఫలాలు అందించాలని కోరుతున్నాం.
నిజానికి, అనేక పోరాటాల ఫలితంగా ప్రజల ఒత్తిడి వలన కొన్ని హక్కులనైనా భారత రాజ్యాంగం ఎస్సీ కులాలకు కల్పించింది. ముఖ్యంగా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేసారు. కానీ సారాంశంలో పాలకులు ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయకుండా ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. దీని వల్ల రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్లుగా అట్టడుగున ఉన్న కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కడంలో అనేక పరిమితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పంపిణీలో అనేక సమస్యలు తలెత్తాయి. విద్యాపరంగా ఎదిగి ఎస్సీ కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలను అధికంగా వినియోగించుకున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి.
రిజర్వేషన్ అసమాన పంపిణీని ప్రశ్నిస్తూ మాదిగ సామాజిక వర్గం గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నది. ఎమ్మార్పీఎస్ నాయకత్వంలో జరుగుతున్న పోరాటం తెలుగు నేల మీద చరిత్ర సృష్టించింది. మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు ఎన్నో మిలిటెంట్ పోరాటాలు చేశారు. ఉద్యమ సందర్భంలో త్యాగాలు కూడా చేయవలసి వచ్చింది. మట్టి మనుషులుగా, అంటరాని ప్రజలుగా ఉన్న మాదిగలు చేస్తున్న పోరాటంలోని న్యాయబద్ధతను గుర్తించిన సమాజం వారి డిమాండ్‌కు మద్దతుగా నిలబడిరది. విప్లవోద్యమం, విప్లవ రచయితల సంఘం ఈ ఉద్యమంలో భాగమై వివిధ కార్యక్రమాలను చేసింది. ఎమ్మార్పీఎస్ మీద తెలంగాణ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి, దాని నాయకుడు మందకృష్ణ మాదిగను జైల్లో నిర్బంధించినప్పుడు, ఆ అరెస్టును వ్యతిరేకిస్తూ విరసం హైదరాబాదులో సభ నిర్వహించింది. సుదీర్ఘకాలం జరిగిన వర్గీకరణ ఉద్యమంలో విరసం సభ్యులు, విప్లవాభిమానులు అనేక స్థాయిల్లో పాల్గొన్నారు. తమ రాతల ద్వారా, ప్రసంగాల ద్వారా వర్గీకరణ ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు. వర్గీకరణలో ఉన్న సామాజిక న్యాయాన్ని వివరిస్తూ పుస్తకాలు కూడా రాశారు.
ఇన్నేండ్ల రాజ్యాంగ అమలులో మాల మాదిగ కులాలు రిజర్వేషన్ ఫలాలను కొంతమేరకు ఉపయోగించుకున్నారు. ఇందులో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువగా పొంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కానీ మాల, మాదిగ ఉపకులాలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోయాయి. కనుక ఈ అసమానతలను సరి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ నేపథ్యంలో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పార్లమెంట్‌లో 341 ఆర్టికల్‌ను సవరించి, భవిష్యత్తులో వర్గీకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలను ఓటు బ్యాంకుగా చూడకుండా వర్గీకరణను ఒక సామాజిక కర్తవ్యంగా భావించాలని కోరుతున్నాం. ఈ సమస్యకు శాశ్వతంగా చట్ట పరమైన పరిష్కారం చూపినప్పుడే మాదిగలకు, ఉపకులాలకు ప్రయోజనం చేకూర్చుతుందని మేము భావిస్తున్నాం. ఈ తీర్పు ఒక వర్గానికి అనుకూలం మరో వర్గానికి వ్యతిరేకంగా భావించకుండా మాల, మాదిగలు సామాజిక న్యాయ సాధనకు అతి ముఖ్యమైన విషయంగా భావించాలని సూచిస్తున్నాం. మాల, మాదిగ కులాలు ఐక్యమత్యంతో ఈ అసమ సమాజంలో ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్యమించడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు, పాలకవర్గాల దోపిబీ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పు వస్తుందని మేం భావిస్తున్నాం.
అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
రివేరా, కార్యదర్శి
- విప్లవ రచయితల సంఘం
తేదీ – 02-08-2024