గత సంవత్సరం మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోడీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మెజారిటీ తగ్గిపోవడానికి ప్రదాన కారణం. జెడియు, టిడిపి మద్దతుతో బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బిజెపి కొనసాగిస్తోంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ‘వినాశకర వ్యవసాయ చట్టాలు’ తిరిగి ప్రవేశపెట్టేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది.
రైతు ఉత్పత్తిదారుల సంసస్థలు (ఎఫ్‌పిఓ)పై జాతీయ విధాన పత్రం (ఎన్‌పిఎఫ్‌ఎఎమ్) పేరిట కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గత నవంబర్ 24న విడుదల చేసిన ముసాయిదా ఆరెస్సెస్, బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ కుత్సిత ఉద్దేశాలను బహిర్గతం చేస్తున్నది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఏకరూప జాతీయ మార్కెట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. నూతన విధానం కింద ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఒకేసారి చెల్లించేలా ఫీజు ఉండనున్నాయి. ఇక, ఈ ముసాయిదా ప్రకారం… ప్రైవేటు హోల్‌సేల్ మార్కెట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీటి ద్వారా ఉత్పత్తి, ఎగుమతిదారులు, రిటైల్ వ్యాపారులు, వ్యవస్థీకృత రిటైల్ వ్యాపారులు నేరుగా విక్రయాలు జరుపుకోవచ్చు. అదేవిధంగా గిడ్డంగులు, శీతల గోదాములను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తిస్తారు. అలాగే, ప్రైవేటు ఈ-ట్రేడిరగ్ వేదికల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ రుసుములను ఒకేసారి నిర్ణయిస్తారు. అయితే, ఈ ముసాయిదాలో ఎంఎస్ స్వామినాథన్ సూచించిన ‘లాభదాయక కనీస మద్దతు ధరలపై ఎలాంటి సూచనలు చేయలేదు.
రైతుల ప్రయోజనాలను బలిపెట్టి కార్పొరేట్ లాభాలను అత్యధిక స్థాయికి చేర్చడం కోసం పన్నిన పన్నాగమిది. రైతాంగ ఉద్యమం ముందుకు తెచ్చిన ఏ ఒక్క కోర్కెనూ కేంద్రం తీవ్రంగా తీసుకోలేదని ఈ ముసాయిదా స్పష్టం చేస్తుంది. గరిష్ట మద్దతు ధర (ఎంఎస్‌పి)ను చట్టబద్ధం చేయడం, వ్యవసాయంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, రైతాంగానికి అనుకూలమైన పరపతి సదుపాయాలు కలిగించడం వంటి కోర్కెలను అసలు పట్టించుకోలేదని తెలుస్తుంది. రాజ్యాంగం 246వ అధికరణం ప్రకారం ఏడవ షెడ్యూల్‌లోని జాబితా రెండు (రాష్ట్ర జాబితా)లోని ఎంట్రీ 18 కింద వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోనిదని కంటితుడుపుగా ఒప్పుకుంటూనే ఆ ముసాయిదా ప్రధాన శైలి మాత్రం సమాఖ్య విధానంపై రాష్ట్రాల అధికారాలపై దాడి చేసేదిగా ఉంది. రాష్ట్రాల ప్రాయోజితమైన మార్కెట్ మౌలిక సదుపాయాలను నిర్మూలించడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటి (ఎపిఎంసి)ల పాత్రను రద్దు చేయడం, చిన్న మధ్యతరహా రైతాంగాన్ని ప్రైవేటు వ్యాపార కూటములకు విపరీతంగా లోబడిపోక తప్పని పరిస్థితి కల్పించడానికి దారితీసేదిగా ఉంది.
ప్రపంచమంతా కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు ఆర్డినెన్సులను తీసుకువచ్చి, ఆ తరువాత వాటిని నవంబర్‌లో చట్టాలుగా మార్చడం తెలిసిన విషయమే. ఈ మూడు చట్టాలను భారత రైతాంగం పూర్తిగా వ్యతిరేకించి, చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా దాదాపు 15 మాసాలు దేశ రాజధానిలో చేసిన దీక్షలు, ధర్నాల ఫలితంగా.. చివరికి దేశ ప్రధాని రైతాంగానికి క్షమాపణ చెప్తూ ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఆయన రైతాంగానికి కొన్ని నిర్దిష్టమైన హామీలను ఇచ్చారు. అందులో ముఖ్యమైనది కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడం. ఈ హామీ నేటికీ అమలు చేయకపోవడంతో గత నవంబర్‌లో భారత రైతాంగం తిరిగి పోరాట బాట పట్టింది. రైతాంగం నుంచి ఇంత వ్యతిరేకతతో కూడిన పోరాటాలు కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం (ఎన్‌పిఎప్‌ఎఎం) ముసాయిదా రూపంలో మళ్లీ రద్దు చేసిన రైతు వ్యతిరేక చట్టాలలోని కొన్ని అంశాలను రైతులపై రుద్దే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం.
కార్పొరేట్ లాబీ, అలాగే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు కనీస మద్ధతు ధర (ఎంఎన్‌పి) కి పచ్చి వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయోత్పత్తులను కారుచౌకగా కొనేయడమే ఎప్పుడూ వారి వ్యూహంగా ఉంటున్నది. దానికి కొంత నాణ్యత జోడిరచి బ్రాండు వేసి మార్కెట్‌లో అమ్ముకోవడమే వారి లక్ష్యం. ఈ క్రమంలో విపరీతమైన లాభాలు గుట్టలు పోగు చేసుకోవాలని చూస్తారు. ఈ విధంగా బడా వ్యాపార వర్గాలు రైతులనూ అలాగే వినియోగదారులను కూడా దోచుకుంటారు. మార్కెట్ సామర్థ్యం పేరుతో కేంద్రం వ్యవసాయోత్పత్తులను కార్పొరేట్ లూటీకి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నది. కార్పొరేట్ పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ప్రాథమిక ఉత్పత్తిదారులైన రైతుల నుంచి తాము కబళించిన అదనపు లాభంలో కొంత శాతాన్నయినా రైతులు అందించిన ముడి సరుకుకు గిట్టుబాటు ధరగా కలపాలని ముసాయిదాలో ఎలాంటి నియంత్రణ నిబంధన పెట్టలేదు. ఈ విధంగా బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకు లొంగిపోతున్నది. రైతాంగ ఆత్మహత్యలు, రుణభారం కొనసాగడానికి కారణమవుతున్నది. రైతాంగం దివాళా తీసే పరిస్థితిని సృష్టిస్తున్నది.
వ్యవసాయం కార్పొరేటీకరణ :
ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులపై సార్వత్రిక (ఒక పన్ను) పన్ను విధించనుంది. ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్ యార్డు స్థానంలో వ్యవసాయ మార్కెటింగ్ మెకానిజం కొత్త ఫ్రేమ్ వర్క్‌ను కమిటీ సూచించింది, పెద్దమొత్తతంలో నిల్వ చేయడం, పెద్ద ప్రైవేట్ పార్టీల ద్వారా నేరుగా కొనుగోలు చేయడంపై చట్టాలు, కేంద్ర ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు చేసేందుకు జిఎస్‌టి కమిటీ తరహాలో రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ప్రతిపాదనలు ప్రస్తుతం ఉన్న పబ్లిక్ మార్కెట్ యార్డులను రద్దు చేసే ప్రయత్నంగా పరిగణించబడుతున్నాయి. ఒక విధంగా ఈ విధానం రైతు వ్యతిరేకమైనది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని ఈ ముసాయిదా సుస్పష్టంగా చెబుతోంది. వ్యవసాయాన్ని సంస్కరించడానికి అదొక్కటే మార్గమని చూపిస్తున్నది. ఉదాహరణకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పిఓ) పథకం కార్పొరేట్ చొరబాటుకు మార్గంగా ఊహిస్తున్నది. దీని ప్రకారం ఎఫ్‌పిఓలు క్లస్టర్ల ప్రాతిపదికగా బడా వ్యాపార సంస్థలతో కాంట్రాక్టు ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగడానికి సానుకూల వాతావరణం సృష్టించాల్సి ఉంటుంది. ఎఫ్‌పిఓ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి వీలుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసిసిఐ) వంటి కార్పొరేట్ గ్రూపులు చూపిస్తున్న మహా ఆరాటం ఇప్పుడు ఆవిష్కృతమవుతున్నది.
ప్రైవేటు హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటు, ముఖద్వారంలోనే కార్పొరేట్ వ్యాపారులు, ఎగుమతిదారులు కొనుక్కునే అవకాశం కల్పించడం వంటి అంశాలు ఈ ముసాయిదా ప్రధానంగా సూచిస్తున్నది. సంప్రదాయక వ్యవసాయ మార్కెట్ యార్డుల స్థానంలో కార్పొరేట్ ఆధీనంలోని గోదాములు, కోల్డ్ స్టోరేజీలను చేరుస్తుంది. రాష్ట్ర వ్యాపిత మార్కెట్ ఫీజును, వాణిజ్య ఫీజును ప్రవేశ పెట్టడం వంటివి ఈ ముసాయిదాలో ప్రధానంగా సూచించిన సంస్కరణల్లో ఉన్నాయి. బడా కార్పొరేట్లు ఎపిఎంసి మార్కెట్ యార్డులను తోసిపుచ్చి తామే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆ ముసాయిదా ప్రతిపాదిస్తున్నది. రిలయన్స్, అదానీలతో సహా బడా కార్పొరేట్ కంపెనీలకు విస్తారమైన గోదాము వ్యవస్థ ఉంది. హర్యానాలోని సిస్రా, పంజాబ్‌లోని లుథియానాలలో ప్రైవేటు రైల్వే నెట్‌వర్క్ కూడా ఉంది. ఫ్యూచర్ బహిరంగ మార్కెట్ ద్వారా పెట్టుబడుల ప్రవేశాన్ని మరింత లోతుకు తీసుకుపోవాలన్న సూచన రైతాంగానికి బడా వ్యాపార సంస్థల ఉచ్చుగా మాత్రమే చూడవలసి ఉంటుంది. దీనివల్ల బహుళజాతి కంపెనీలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు దేశీయ ఆహార పరిశ్రమలోకి ప్రవేశించి ఆధిక్యత సంపాదించి నియంత్రించేందుకు అవకాశం లభిస్తుంది. తద్వారా భారతీయుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది.
ఈ ముసాయిదా సాంప్రదాయ వ్యవసాయాన్ని సాంకేతిక వ్యవసాయంగా మార్చడం లక్ష్యంగా ప్రకటించింది. మన వ్యవసాయ రంగం ప్రపంచంలో పాడి, జ్యూట్, పప్పుధాన్యాలు ఉత్పత్తిలో మొదటి స్థానంలో గోధుమ, వరి, వేరుశనగ, కూరగాయలు, పళ్ళు, పత్తి, చెరకు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ… చిన్న కమతాల వల్ల సరిపడా ఆదాయం రావడంలేదని పేర్కొంది. వాతావరణ సస్యరక్షణ, సాగునీటి వ్యవస్థ, అధిక ఎరువుల వాడకం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నందున డిజిటల్ టెక్నాలజీతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొంది. ప్రతి గ్రామంలో బకెటింగ్ సిస్టం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పేర్కొంది. ఈ గొడుగులన్నీ కార్పొరేట్ కంపెనీల అజమాయిషీలోనే ఉంటాయి. వ్యవసాయ కార్యకలాపాలన్నీ కంపెనీల అజమాయిషీలోనే నిర్వహించాల్సి ఉంటుంది. పేద, మధ్య తరగతి రైతాంగం యావత్తూ కంపెనీలకు బంధీలై పోతారు. రైతులకు అగ్రి స్టాక్ కార్డులు ఇవ్వాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పశుపోషణ, భూమి సారాలు, వాతావరణ ఫోర్ కాస్ట్, భూమిలో తేమ శాతం, క్రిమి కీటకాల ప్రభావం, క్రాప్ కటింగ్ ఎక్స్‌పరిమెంట్స్ అన్నీ దీని ద్వారా నిర్వహించాలని పేర్కొన్నది. ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు తదితర అగ్రికల్చరల్ రోబోట్లను ప్రవేశపెట్టాలని పేర్కొంది. భూములన్నీ ఏకీకృతం చేయడం లక్ష్యంగా ఉంది. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే తప్ప వేరుగాదు. రెండు దశాబ్దాలకు పూర్వం కుప్పంలో ఇజ్రాయెల్ కంపెనీతో చంద్రబాబు చేసిన ప్రయోగం లాంటిదే తప్ప వేరు కాదు.
అన్ని మండీ ప్రక్రియలను డిజిటల్ ఆటోమేషన్, లైసెన్స్‌ల డిజిటల్ జారీ, వ్యాపారులకు ప్రైవేట్ ప్లేయర్‌లకు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించుట. ముసాయిదా వాణిజ్య సంస్కరణలు రైతులకు లభించే మద్దతు ధరలను నిరాకరించటానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఎపియంసి), మార్కెట్ యార్డులను నాశనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఇవి ప్రైవేట్ వ్యాపారుల సిండికేట్ ధరల మాయజాలంకు చిన్న రైతులను గురిచేస్తాయి. భారత వ్యవసాయ అతిపెద్ద వ్యాపార సంస్థ (ఐటిసి) అదానీ ఎగుమతిదారులు వంటి టోకు కొనుగోలు కార్పొరేట్ మార్కెట్ ప్లేయర్‌లను తిరిగి పరిచయం చేసే ప్రయత్నం. కొత్త ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఈ ప్రైవేట్ ప్లేయర్‌లు, కార్పొరేషన్‌లు నేరుగా రైతుల నుండి పొలం కల్లాల వద్ద కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఇప్పటి వరకు ఎపియంసి మార్కెట్ యార్డుల నియంత్రణలో ఉన్న ఉత్పత్తుల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి యూనిట్‌లను ప్రైవేట్ ప్లేయర్‌లకు అప్పగించడం వల్ల ధరలు పతనమైనప్పుడు, ఇతర పరిస్థితులలో నిల్వ సదుపాయం తొలగించ (టొమాటోలు, పండ్లు, ఉల్లిపాయలు) బడుతుంది.
‘రైతులారా! మీరు ఏమన్నా మొత్తుకోండి వ్యవసాయ కార్పొరేటీకరణపై నా బాట నాదే’ అంటున్నాడు నరేంద్ర మోడీ. వ్యవసాయ గేట్ వద్ద కార్పొరేట్ వ్యాపారులు పెద్దమొత్తంలో కొనుగోలు చేసే నిబంధనలను సులభతరం చేయడంతో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలను (యంఎస్‌పి), బేర సారాలు చేసే హక్కు రైతులకు నిరాకరించబడుతుంది. బల్క్ కొనుగోళ్ల వల్ల పెద్ద కార్పొరేట్లు నిత్యావసర వస్తువుల చట్టంతో సంబంధం లేకుండా ఉత్పత్తులను నిలవ చేసుకునేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధనలు సూపర్ మార్కెట్‌లు, బిగ్ బాస్కెట్ లేదా అమెజాన్ వంటి ఈ మార్కెట్ వ్యాపారులు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తాయి. పంట సమయంలో తక్కువ ధరలు ఉంచడం ద్వారా, రైతులకు పంట ఉత్పత్తులపై యంఎస్‌పిలను ఎగవేయడం ద్వారా, తరువాతి నెలల్లో వారు ధరను పెంచుతారు, వినియోగదారులకు చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తారు.
ముగింపు :
రైతుల డిమాండ్‌ల ఊసెత్తని ముసాయిదా 12 సంస్కరణలు గూర్చి మాట్లాడుతోంది. ప్రైవేటు టోకు మార్కెట్లు ఏర్పాటు, మార్కెట్ నుండి నేరుగా టోకుగా కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు, సంఘటిత రిటైలర్‌లు, భారీ కొనుగోలుదారులను అనుమతించటం వాటిలో ఉన్నాయి. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని ఇలాంటి ప్రమాదకర అంశాల వల్ల రైతుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది. చిన్న రైతులు వ్యవసాయం నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వారు తమ పంటలకు సరైన ధర పొందడంలో ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరొకవైపు, మార్కెటింగ్ వ్యవస్థలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం మరింత పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అసమానతలను పెంచే అవకాశముంది. సారాంశంలో భారత రైతాంగానికి ఇది మరణశాసనం.
ఈ ముసాయిదాకు వ్యతిరేకంగా ఇప్పటికే రైతుల నుండి గట్టి ప్రతిఘటన మొదలైంది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుపై ఈ ముసాయిదాను దగ్ధం చేస్తూ దేశ వ్యాపితంగా వేలాది మంది రైతులను గత డిసెంబరు 23న ప్రదర్శనలో సమీకరించింది. అదేవిధంగా జనవరి 26న ట్రాక్టర్లు/వాహనాల ర్యాలీలలోకి తీసుకొచ్చింది. హర్యానాలోని తొహనాలోనూ పంజాబ్‌లోని మోగాలోనూ జరిగిన రెండు మహా కిసాన్ పంచాయత్‌లలోనే 75 వేల మంది రైతులు సమీకృతులైనారు. ఇటీవలనే ఢల్లీలో జరిగిన ఎస్‌కెఎం జాతీయ సమావేశాలు ఈ పోరాటాన్ని మరింత తీవ్రం చేయాలని ప్రతినబూనాయి. దేశంలోని రైతు సంఘాలు అన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చింది. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దేశ విదేశీ కార్పొరేట్లకు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించాలని చూస్తున్న బిజెపి, ఆరెస్సెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అన్ని తరగతుల ప్రజలూ బలంగా ప్రతిఘటించడం అవసరం.