ప్రతీకలకు చాలా అర్థాలు ఉంటాయి. జెండాల్లో, రంగుల్లో, చిహ్నాల్లో అసలైన భావాలు ఉంటాయి. మనుషులు చేసే పనుల్లో బైటికి కనిపించని లక్ష్యాలు సహితం అవి ప్రతిబింబిస్తుంటాయి.
చత్తీస్‌ఘడ్`తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను భారత ప్రభుత్వ బలగాలు ఏప్రిల్ 22వ తేదీన చుట్టుముట్టాయి. సరిగ్గా ఆ రోజే దిగ్బంధం మొదలైందా? అంతక ముందు ఎంత సన్నాహం జరిగి ఉంటుంది? ఎంత ప్రణాళిక అమలయి ఉంటుంది? గుట్టలకు, గూడేలకు, రోడ్లకు యుద్ధం ఎంతగా భీతానుభవంలోకి వచ్చి ఉంటుంది? అడవి యుద్ధరంగం కావడం, ప్రకృతి తర్కం అటుపోట్లకు గురికావడం, మనుషులు గుండెలవిసేలా ఆందోళనపడటం పత్రికలకు అందేదేనా? టీవీలకు కనిపించేదానా? దేశమంతా కలవరపడి, కలతచెంది, యుద్ధం వద్దు.. శాంతి కావాలనే ఆకాంక్షలో తప్ప ఇంకెక్కడ ఈ తుపాకుల మోతను పసిగట్టగలం? ఇంకెక్కడ ఈ సైనిక పదఘట్టనల వికృత ధ్వనులను వినగలం?
ఇది ఇప్పటికి ముగిసిందా? చెప్పలేం. ఏ రకంగా ఇది ముగిసిందని చెప్పగలం? గత చరిత్రనంతా ప్రస్తుతానికి వదిలేద్దాం. కనీసం 2024 జనవరి 1న మొదలైన కగార్ యుద్ధంలోని అత్యంత దుర్మార్గమైన ఘట్టం ‘అపరేషన్ కర్రెగుట్టలు’. బహుశా ఇప్పటికి పతాక స్థాయిలో జరిగిన చుట్టుముట్టు భీతావహ సన్నివేశమిది.
మధ్య భారతదేశంలోకి చొరబడిన లక్షలాది సైనిక బలగాల్లో 26వేల అర్ధ సైనిక, సైనిక బలగాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయనే వార్తలు వచ్చాయి. భూమి దద్దరిల్లేలా, ఆకాశం పిక్కటిల్లేలా బాంబులు కురిశాయని అన్నారు. యుద్ధానికి వచ్చిన హెలికాప్టర్ల సుడిగాలి రొద వీడియోల్లో వినిపించింది. చత్తీస్‌ఘడ్ సరిహద్దు తెలంగాణ భూగోళంలోని గ్రామాలను సైన్యం భయం గుప్పిట్లో బంధించిన కథనాలు వచ్చాయి. గుట్టల నలుదిశలా సైన్యం ఎగబడి కాల్పులు జరిపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మండుటెండల్లో డజన్ల కొద్దీ సైనికులు సొమ్మసిల్లిపోయారని, వాళ్లను హెలికాప్టర్లలో చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించి వైద్యం చేయించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.
కర్రెగుట్టల్లో వేలాదిగా మావోయిస్టులు ఉన్నారని, ముఖ్య నాయకులు ఉన్నారని, వాళ్లను చంపేయడమే లక్ష్యంగా ఈ దాడి మొదలు పెట్టారు. ఇప్పుటికీ అక్కడి పరిస్థితి ఏమిటో తెలియదు. కానీ సైనికులు అక్కడ మువ్వన్నెల జెండా ఎగరేసి, వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలు మన దేశానికి ఏ వైపు సరిహద్దుల్లో ఉన్నాయని, ఏ భూభాగాన్ని కైవసం చేసుకున్నారని, ఏ దేశ శత్రు బలగాలపై జైత్రయాత్ర ముగిసిందని ఈ జాతీయోత్సాహం అనే తీవ్రమైన ప్రశ్నలు సమాజం నుంచి వినిపిస్తున్నాయి.
ఇరవై ఏళ్ల కింద ఆపరేషన్ గ్రీన్‌హంట్ మొదలైనప్పుడే ఇది ఈ దేశ ప్రజలపై భారత ప్రభుత్వ యుద్ధం అన్నవాళ్లు ఉన్నారు. దాన్ని కొట్టిపారేసిన వాళ్లూ ఉన్నారు. భారత ప్రజాస్వామ్యం దొడ్డగుణం తెలియక ఇట్లా అంటున్నారుగాని, ఎన్నటికీ భారత రాజ్యం అంతగా దిగజారిపోదని భరోసా ఇచ్చిన వాళ్లూ ఉన్నారు. మన విశ్వాసాలకేం? ఎన్నిటినైనా ప్రోది చేసుకోవచ్చు. కానీ వాస్తవం కఠినమైనది. ఆ సంగతి ప్రభుత్వమే తేల్చేసింది. ఇది యుద్ధమని బాహాటంగా ప్రకటించింది. భారత రాజ్యం మీదా, రాజ్యాంగం మీద అపారమైన గౌరవం ఉన్నవాళ్ల కళ్లు తెరిపిస్తూ అంతిమ యుద్ధం చేస్తున్నామని పాలకులు స్పష్టం చేశారు.
రాజ్యాంగం భారతదేశాన్ని భౌగోళికార్థంలో నిర్వచిస్తూ.. రాబోయే రోజుల్లో దురాక్రమించుకోబోయే భూభాగాలతో కలిసినదే పవిత్ర భారతదేశం అని చెప్పింది. దురాక్రమణ భావన రాజ్యాంగబద్ధం. దాన్ని సాధించేదీ, కాపాడేదీ భారత సైన్యం. రాజ్యాంగంలోని భారతదేశమనే భౌగోళిక స్ఫూర్తికి సాయుధ వ్యక్తీకరణ సైన్యం. దురాక్రమణ దాని ఆచరణ. ఉద్వేగాలతో, హింసోన్మాదంతో, భక్తిప్రపత్తులతో, ఎంతమందినైనా చంపి, ఎంత నెత్తురైనా పారించి దురాక్రమణను రాజధర్మంగా ప్రకటించగల శాసన అధికారం భారత సైన్యానికి ఉంది. లేదా దాన్ని నడిపిస్తున్న భారత రాజ్యానికి ఉంది. సారాంశంలో సైన్యమంటే దురాక్రమణ. ఆధునిక బూర్జువా రాజ్యాంగాల ప్రకారమే కాదు, సనాతన ధర్మం ప్రకారం కూడా రాజ్యమన్నా, సైన్యమన్నా అర్థం దురాక్రమణే.
అట్లాంటి భారత రాజ్యం చేతిలో ఉన్న బలగాలు కర్రెగుట్టల మీద మూడు రంగుల జెండాను ఎగరేశాయి. అక్కడ దేశ సరిహద్దులే ఉండనక్కర లేదు. అవతలి వైపు శతృ బలగాలే ఉండనవసరం లేదు. సైన్యం వెళ్లిందంటే, దానికి తెలిసిందీ, చేసేదీ దురాక్రమించడం. దానికి ప్రతీకగా అక్కడ ఒక మువ్వన్నెల జెండా ఎగరేయడం. కర్రెగుట్టల్లో వాళ్లు సాధించిన విజయం ఏమిటనే తార్కిక ప్రశ్న మనం వేసుకోనవసం లేదు. కనీసం ఈ విడత దాడి అయినా ముగిసిందా? అని మనం తెప్పరిల్లే అవకాశం కూడా లేదు. కానీ దేశంలోని భూభాగాన్నయినా సరే.. కైవసం చేసుకున్నామని చెప్పడమొక్కటే సైన్యానికి తెలుసు.
దండకారణ్యాన్ని భారత రాజ్యాధికారానికి బీజరూప ప్రత్యామ్నాయ ప్రజాధికార కేంద్రమని చాలా మంది కవులు రాశారు. విశ్లేషకులు వివరించారు. పరిశీలకులు చూసి వచ్చి చెప్పారు. పాతికేళ్లుగా దాని మీద దండయాత్ర జరుగుతోంది. అంతకన్నా భీకర యుద్ధాలు దేశ సరిహద్దుల మధ్యే చాలా జరిగాయి. ‘దేశ’ ప్రజల మీదే జరిగాయి. కానీ ఇంత సుదీర్ఘకాలం, ఇన్ని వైపుల నుంచి, ఇంత భీతావహంగా ఇక్కడే జరుగుతున్నది కావచ్చు. క్రాంతికారీ భారత్‌కు, కార్పొరేట్ భారత్‌కు మధ్య సాగుతున్న యుద్ధమిది. దీన్ని అంతిమ యుద్ధమని ప్రకటించి, వచ్చే ఏడాది మార్చి చివరికి గడువు పెట్టాక, అప్పటి దాకా కూడా ఆగే ఓపిక లేని కార్పొరేట్ ఒత్తిడి కర్రెగుట్టలను చుట్టుముట్టేలా చేసింది. ఇప్పటికిప్పుడు అక్కడ విజయోత్సవం జరుపుకొని, కర్రెగుట్టల నుంచి పహల్గాం మీదుగా పాకిస్తాన్ మీదికి పోవలసి ఉన్నది.
ఎప్పటికైనా దండకారణ్యాన్ని ఆదివాసుల నుంచి విముక్తి చేయాలి. మావోయిస్టు ముక్త భూభాగం చేయాలి. ఆ పని చేయగలరో లేదోగాని, చేశామని ఇప్పటికిప్పుడు భారత రాజ్యం కార్పొరేట్లకు భరోసా ఇవ్వాలి. దానికి ప్రతీక జాతీయ పతాకం. అక్కడ జెండా ఎగరేసి కార్పొరేట్ ప్రపంచంలో రాజ్యాంగబద్ధ దురాక్రమణను భాగం చేయాలి. అందుకే సైన్యం దాన్నక్కడ ఎగరేసింది. సైన్యానికి ఉండే దురాక్రమణ లక్ష్యానికి, కార్పొరేట్లకు ఉండే దురాక్రమణ స్వభావానికి రాజ్యం సమన్వయం సాధించింది.
కర్రెగుట్టల మీద దేశ సరిహద్దులు లేనట్లే అక్కడ సైన్యం ఎగరేసింది జాతీయ పతాకం కాదు. అచ్చమైన కార్పొరేట్ పతాకం. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదిక మీద సైనిక క్యాంపు పెట్టాలి. ఆదివాసులను ఓడిరచామని, విప్లవకారులను నిర్మూలించామని చెప్పుకోగల అచారిత్రక ఘట్టాన్ని కర్రెగుట్టల మీద ఆవిష్కరించాలి. ప్రతీకలకు ఎంత గాఢమైన అర్థాలు ఉంటాయో చూడండి. ఎంత వివరించుకుంటే అంతగా సారం బోధపడుతుంది.
*కర్రెగుట్టలపై మీరు ఎగరేసింది కార్పొరేట్ జెండా కదూ”
పై అర్టికల్ చదివాను. అందులొ ఇక్కడ (ఉదహరించిన) తెలియజేసిన “ప్రతీకలకు, భీతానుభవంలోకి, పదఘట్టానల, భీతావహ” వంటి “పద గంభీరాలు” వాడకుండా సాధారణ పదలు వాడితే బాగుండేదండి. ఇక ఇలాంటి “పద గంభీరాలు” వాడకండి అని సవినయంగా మనవి.
,