కళింగనేల మీద దళితచైతన్యంలోంచి వచ్చిన కవిత్వం తక్కువ. గరిమెళ్ళ సత్యన్నారాయణ,శిల్లా రాజులరెడ్డి, తిమోతి జ్ఞానానందకవి, వంగపండు ప్రసాదరావు మొదలైన కవులు వాళ్లదైన భూమిక నుంచి దళిత కవిత్వం రాయడం జరిగింది. 1990-2000కు అటుఇటు తెలుగు నేల మీద జరిగిన దళితోద్యమాల వెల్లువ కళింగాంధ్ర సాహితీకారుల మీద పడాల్సినంతగా పడకపోవడానికిఒక కారణం- ప్రపంచీకరణ వలన తలెత్తిన వ్యవసాయ సంక్షోభాన్ని కళింగాంధ్ర రచయితలు కవిత ద్వారా, కథ ద్వారా చెప్పే పనిలో నిమగ్నమై వుండటం, రెండో కారణం- దళిత నేపథ్యం నుంచి బలమైన సృజనకారులు రాకపోవడం. అందుకు సామాజిక అంతరాల నిచ్చెనమెట్ల వ్యవస్థ ప్రధాన కారణంగావుంది.

కళింగాంధ్ర సాహిత్యానికి ఒక చారిత్రక నేపథ్యం వుంది‌. గురజాడ పరిచిన సంస్కరణ బాట నుంచి, శ్రీశ్రీ-నారాయణబాబు మొదలైన అభ్యుదయ కవులు నడిచిన అభ్యుదయ బాట నుంచి, సుబ్బారావు పాణిగ్రాహి-వెంపటాపు సత్యం-భూషణం మాస్టారు నిర్మాణం చేసుకుంటూ వచ్చిన విప్లవోద్యమ సాహిత్యబాట నుంచి 1990 తర్వాత ప్రపంచీకరణ ప్రభావం కళింగనేల మీద చాలా బలంగా పడటం వలన దాని గుట్టు రట్టు చేయడం, ఎదురునిలవడం అనే పనుల నిర్మాణంలోంచి కళింగాంధ్ర సాహిత్యం వెలువడింది.

తెలుగునేల మీద దళిత చైతన్యం వెల్లివిరిసిన కాలంలో వ్యవసాయ పరాయీకరణ ప్రధానమైన వస్తువుగా కళింగ సృజనకారుల ముందు వచ్చి నిలిచింది. కళింగ వ్యవసాయ సంక్షోభాన్ని రికార్డ్ చేసిన ప్రధానమైన కళింగాంధ్ర కవులు, కథకులు ఎవరూ దళిత నేపథ్యం నుంచి వచ్చినవారు కాదు.

పైన నేనన్న ఆయా కారణాల నుంచి మినహాయింపును కోరుతూ 1998లో రాయబడి 2001లో పుస్తక రూపంలోకి వచ్చిన ‘గొడిముక్క’ దీర్ఘ కవిత మనముందు వుంది. ఈ కవితను రాసింది రెడ్డి రామకృష్ణ. కళింగనేల కంబారి బతుకును symbolic గా చెప్పిన శీర్షికే ఈ  ‘గొడిముక్క’. రామకృష్ణ వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన కవైనా సరే ‘దళిత సాహిత్య సృజన నిరంతర ప్రవాహం కావాలనే’ కోరిక కలిగినవాడు. ఈ విషయన్ని కవే ‘గొడిముక్క’ పుస్తకంలో చెప్పుకోవడం జరిగింది.

‘గొడిముక్క’ అంటే పశువుల కాపరిచేతిలోని చిన్న కర్ర ముక్క. పశువులను అదిలించడానికి ఈ గొడిముక్కని ఉపయోగిస్తారు.

1991 ఆగష్టు 6న జరిగిన చుండూరు మారణకాండ దళితుల బతుకుల్లో ఎంత పెద్ద గాయాన్ని మిగిల్చిందో తెలిసిందే. చుండూరు మారణకాండ నెత్తుటిదుఃఖం నుంచి కళింగనేల మీద పురుడుపోసుకున్న కవితగా ‘గొడిముక్క’ని గుర్తించుకోవాలి.

కళింగ గ్రామాల్లోని మోతుబరులు దగ్గర కంబారి పని చేసి బతికే దళిత కులానికి చెందిన ఒకానొక పాలేరు గొంతు నుంచి కవితనడుస్తుంది. ఈ కళింగ పాలేరు కళింగప్రాంత దళిత గాయాల చరిత్రకు, తదనంతర తిరుగుబాటుకు సజీవ సాక్ష్యం. ఈ రెండు అంశాలను రామకృష్ణ నిజాయితీగా, నిజం నుంచి కొంచెం కూడా పక్కకు తప్పకుండా నిర్వహించాడు.

       

కళింగ నేల మీద ‘గొడిముక్క’ప్రాసంగికత ఏమిటి? అనే ప్రశ్న వేసుకుందాం. దేశం మొత్తమ్మీద, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మతం, కులం కత్తులు పట్టుకుని విచ్చలవిడిగా సంచరిస్తున్న వర్తమాన సన్నివేశంలో- కళింగ నేల మీద ‘లక్షింపేట’లాంటి ఒక కుల దురహంకార ఘటన పూర్వపరాల్లోంచి సామాజికచట్రాన్ని విశ్లేషించుకునేటప్పుడు ‘గొడిముక్క’ ప్రాసంగికత ఏమిటో అర్థమౌతుంది.

కళింగ నేల మీద రామకృష్ణ ఒక్కడే దళిత వస్తువుని చెప్పాడా? అని అంటే- రామకృష్ణకు ముందు, అతని సమకాలంలో,అతని తర్వాత దళిత వస్తువును బలంగా చెప్పిన కళింగకవులు వున్నారనే విషయం తెలిసిందే. అయితే దళితోద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో కాస్తా ఆలస్యంగానైనా దళిత వస్తువును ఒక దీర్ఘకవితలో చెప్పినందుకే రామకృష్ణని అభినందించాలి. చుండూరు ఘటన జరిగిన ఏడేళ్లకి ఈ దీర్ఘ కవిత కళింగనేల మీద వెలువడింది.

‘గొడిముక్క’లో మరో ప్రధానమైన సానుకూల అంశం- కవి గ్రామీణగొంతుతో కవితను అభివ్యక్తం చేయడం. వస్తువునెంత బలంగా బాధ్యతతో చెప్పాడో, శిల్పాన్నీ అంతే చాకచక్యంగా నడిపాడు. వస్తువే శిల్పాన్ని ఎంచుకుంటుంది అన్నదానికి ‘గొడిముక్క’ ఒక మంచి ఉదాహరణ.

బుగతలవద్ద జీవితాంతం కంబారిగానే బతికాల్సి వచ్చే ఒక దుర్మార్గం పట్ల ఎరుక ఏర్పడిన ఒకానొక కళింగ దళిత పాలేరు తన తండ్రి దుఃఖపువలపోతల మీదుగా, తన తర్వాత రెండు తరాలు ఘర్షణ,వైఖరుల నుంచి ఈ కవిత వ్యక్తమవడం జరిగింది. ఈ కవితలోని గొంతు ప్రధానంగా రెండోతరంది. ఈ రెండోతరం నుంచి కవితను నిర్మాణం చేయడం ఈ కవిత సాధించిన విజయంగానే నేను భావిస్తున్నాను. సంక్షిప్తంగా చెప్పాలంటే ముందు వెనుక నాలుగుతరాల కళింగ దళిత పాలేరుల కథ ఇది. అంత నిడివి గల గాయాల చరిత్రను చుండూరు చైతన్యం ఇచ్చిన శక్తితో కవి ఈ కవితను నడపడాన్ని నిస్సందేహంగా మెచ్చుకోవాలి.

      

‘కాలం కడు సిత్రమైంది

అది ఎంతటి గాయాన్నైనా మానుపుతుంది

పారే ఏరు

ఎంతటి గొయ్యినైనా కప్పేసినట్టు’

అని మొదలవుతుంది ఈ దీర్ఘ కవిత. కవిత మొదలవడమే ఆశాజనకంగా మొదలవడం కవిత నడకని ముందే నిర్దేశిస్తుంది. ఏ మంచి కవిత ప్రారంభమైనా కవిత తర్వాత తర్వాత నడవాల్సిన దారిని గురించి ఒక ఎరుకను కల్గిస్తుంది. ‘గొడిముక్క’కు వున్న దళిత నేపథ్యం వలన దాని ఎదుగుదల ఈ తొలి వాక్యాల్లోనే కనిపించింది.

ఎన్నో ఏళ్ల అవమానాలను దిగమింగుకున్న ఒక జీర గొంతు నుంచి దుఃఖప్రవాహంగా కవిత సాగిన తీరు కవితని ఎక్కడా సడలినివ్వలేదు.ఒక డెబ్భైఏళ్ల దళిత పాలేరు గొంతు కవిత మొత్తం ధ్వనించింది.

కవి దళిత పాలేరు గుండెల్లోని అణువణువులోకి నడిచి కవితను చెప్పడం దగ్గరే కవిత successని చెప్పకనే చెబుతుంది.

దళిత పాలేరు అంటున్నాడు-

‘జలమల్లోకెల్లా జలమ

మానవ జలమ్మెత్తినాం

ఏటి పలం కొడకా

మనుసులమని మరిసిపోయాక

గుండె పెద్ద పుండు

సలుపు పెడుతుంది కొడకా

మళ్ళీ దాన్ని రేపమంటావా నాయనా

సరే, రేపుతాను

నా సెరిత్ర సెప్పమంతావా కొడకా

సరే సెప్తాను’

అని దళిత చెమట చరిత్రని, కన్నీళ్ల చరిత్రని మొత్తం మనముందు పరవడానికి సిద్ధమౌతాడు.

‘సెరిత్రెక్కడుంది

ఇదిగో ఈ సెర్మం ముడతల మజ్జె ఉంది

యిప్పుతాను కొడకా.. యిప్పుతాను

నా నొసట పడ్డ ముడులన్నీ యిప్పుతాను’

అంటాడు. రోగగ్రస్తవ్యవస్థ అసలుసిసల రూపాన్ని కళ్లముందు పరుస్తాను అని చెబుతున్నాడు.బుగత కింద ఎన్ని పుర్రాకులు పడ్డాడో అవన్నింటినీ చెప్పడానికి ఉద్యుక్తుడౌతాడు.

‘నా సూపులు గొడుముక్కల్తో

సేల సుట్టూ

పెండె కడుతూనే ఉండేవోన్ని

నా కళ్ళు

మంద కాసిన కుక్కల్లా

గస్తీ తిరుగుతూనే ఉండేవి’

కళింగపాలేరు విషాదగానాన్ని పాడుతున్నాడు కవి.

బుగత ఆవులను మేపుకి తీసుకెళ్లిన తర్వాత-అవి కన్నుగప్పి పక్కపొలంలోకి వెళ్లి పంటని నాశనం చేస్తే- అప్పుడు బుగత చేత పడిన దెబ్బలను గురించి చెబుతూ- అంటాడు.

‘నా ముకం పువ్వునాగ ఏనాడు యిప్పారనేదు’

ఇంతా బుగత కింద సేవ జేసి- ఫలితమేటని ప్రశ్నిస్తాడు. ఒళ్లు ఆనకుండా కష్టపడి పనిజేసానని చెప్తాడు.

‘అయితే నువ్వడగొచ్చు

నువ్వెక్కడ నొంగనేదా అని

నొంగిపోనాను కొడకా

నొంగిపోనాను

అలాపింటోన్ని

కుంచం.. సిన్నకుంచం

జీతం గింజల్తో

మా జీవితాల్ని కొలిసే కుంచం దగ్గర మాత్రం

నేనెందుకూ పనికిరానోన్నయిపోనాను’

అని తనెక్కడ మోసపోతున్నాడో, ఎక్కడ అవమానించబడుతున్నాడో ఆ ఆకలి దగ్గరకు కవితను తీసుకొస్తాడు.

భూస్వామి- ఏటా పాలేరుకు ఇచ్చే ధాన్యంగింజ దగ్గరఎలా మోసం చేస్తున్నాడో, శ్రమను దోచుకుంటున్నాడో చెప్పుకొస్తాడు. పాలేరు కష్టాన్ని తక్కువ చేసిన కుంచం గురించే చెబుతున్నాడు.

ఇక్కడ కుంచం గ్రామ మోతుబరికి ప్రతీక.

‘సాలీ సాలని జీతం కొలసి

తిరిగి సలాములు కొట్టించుకునేది కుంచం’

అనే వాస్తవ అంశాన్నే మనముందు కవి చర్చకు పెడతాడు.

ఏ మనిషైనా యవ్వనం తీపికలలు నుంచి తప్పించుకోలేడు. పాలేరుకి కూడా యవ్వనం వుంది. కవి- పాలేరుకి యవ్వనప్రాయంలో ఆలోచనల్లో వచ్చిన మార్పులను గురించి చెబుతాడు. అతనికి మేనమామ కూతురు మీద కలలొస్తాయి.

          కవిత కొనసాగిస్తూ- అంటాడు-

‘ఓ పాలి మా అయ్య పిలిసి

ఒరే నాయనా

ఒంటిగాడి కస్టం యింటికి రాదురా అన్నాడు

సెయ్యి సెయ్యి కలిత్తేనే సప్పిటవుతాది

కర్రకి కర్ర రాపాడితేనే అగ్గయినా పుడతాది

ఆడ మొగ తోడయితేనే

పిల్లవుతాది, జెల్లవుతాది

నీదంటూ ఒక యిల్లవుతాది’

అని అయ్యే ఎలాగు తనకి, మేనమామ కూతురు నచ్చికి లగ్గం కుదర్చాడో, పెళ్లి చేసాడో చెబుతాడు.

 తదుపరి వాక్యాల్లోఅయ్య కవితలోకి ప్రవేశిస్తాడు.

‘మీ యమ్మ ఉండేదంతే ఎందుకూ

పనికి రానిదైపోయింది

బుగతల కల్లాలు తుడిసి తుడిసి

దాని కళ్లల్లో దూలి మేఘాలు కమ్మేసినాయి

కోతలు కోసీ కోసీ

దాని నడుము కొడవలయిపోయింది

సెరిగి సెరిగి దాని సేతులు

అరిగిన సేటలయిపోనాయి’

అని అంటాడు. తల్లిలా- బుగతపొలంలో, కళ్లంలో పనిచేసి నచ్చి కూడా అలాగే అవుతుందని ఎరుక కల్గిస్తాడు.

ఇంకా ఇలా అంటాడు అయ్య-

‘ఒరే నాయనా

మన పుటకే అన్నేయం పుటకరా

బెమ్మరాసిన రాతో

మనిసి గీసిన గీతో

ఏదైనా మనసుట్టూ ఓ గిరిగీసి ఉంది’

అని-

ఇది దళిత జీవన దుఃఖం. తరతరాల నుంచి కొనసాగిన దుఃఖం. ఈ దుఃఖాన్నే ఇప్పుడు కవితలోని రెండోతరం పాలేరు ఒప్పుకోనంటుంది. దుఃఖం పోయే మార్గం వైపు నడక సాగిస్తున్నాడు.

‘పండిన్నాడు

పట్టెడు గింజలెక్కువ అడిగితే

కడజాతి నా కొడుకులకి

కడులు మంటెక్కువరా అని

నా జాతినే తిడతారు’

అని పల్లెల్లో వాస్తవంగా దళితవర్గాలపైఆధిపత్యవర్గాలు చూసే చూపుని పాలేరు ద్వారా సరిగ్గానే పలికించాడు కవి.

పాలేరు పాత్ర ద్వారా భారతదేశ వర్ణవ్యవస్థను బోనులో నిలబెట్టాడు కవి. కవిలోని చైతన్యం పాలేరులోకొచ్చిందో, పాలేరులోని చైతన్యం కవిలోకొచ్చిందో చెప్పడం సాధ్యం కాదు.

ఆ తర్వాత పాలేరు తన ఇద్దరి బిడ్డలకు ఇలా చెప్తున్నాడు-

‘ఉండడానికో పాక

ఒండుకోడానికో దాక

నేకపోయినా మరేం పరవానేదు కొడకా

కాయోకసరో తిని

ఏ సెట్టు కిందున్నా

కాలం గడిసిపోద్ది

కాని

మనిసన్నోడికి మడిసెక్కుండాల’

అని భూమిని గురించి రాజకీయ మెలకువను ప్రసరిస్తాడు కవి‌. వాస్తవంగా ఈ ఆకాంక్షలో దళితగొంతే ఉదయించిందని రూఢీ పడాలి.

          పైదానిని నిరూపిస్తూ-

‘నా కొడుకులకొకటే సెప్పినాను కొడకా

మిమ్మల్ని మీరు పిండుకోండి

అలాగ పిండుకోడానికి

అరసెయ్యంత మరక

బూమి సంపాయించుకోండ్రా అని’

ఆ చైతన్యస్థితిని కొనసాగిస్తూ-

‘నేను నా పిల్లల్నెక్కడా పాలేరెట్టనేదు’

అని అంటాడు పాలేరు.

ఇక్కడవరకు కవిత ఒక ఎదుగుదలలోంచి సాగింది. చేరాల్సిన గట్టుకే చేరింది.

రామకృష్ణ రాసిన ఈ దీర్ఘకవితలో పోలికలు గాని, సామెతలు గాని, రూపకాలు గాని, నానుడులు గాని అద్భుత కళింగ సొబగుతో వుంటాయి. ఏదీ గతితప్పలేదు. కవితను అనుకున్న దారిలో నడిపించాయే తప్ప పక్కకు జరగనివ్వలేదు.‌ కవిత చైతన్యపుదారిని విడవకుండా నడవడమే దాని ‘ప్రాసంగికత’గా ఇక్కడా మరొక్కసారి నిరూపణ అవుతుంది.

దళిత జీవితాలలో రాను రాను చైతన్యం వెల్లివిరుస్తున్న క్రమానికి ఈ కవిత కళింగాంధ్ర నుంచి ఒక చిహ్నంగా బయలుదేరిందనే చెప్పాలి. ఇక్కడ నుంచి కవిత మూడోతరంలోకి ప్రవేశిస్తుంది. ఇదింకా చైతన్యపు తరం.

పాలేరు అంటాడు-

‘మా సిన్నోడనే వాడు నాయనా

ఓరయ్యా నువ్వు

మేతకెల్లమని మెడకట్లిప్పినావు

కాని

కాలుకు కూడా కట్లున్నాయని

కానుకోనేప్పోనావురా అని’

తాత, తండ్రి, పిల్లలు, పిల్లలకు పిల్లలు ఈ వరసక్రమంలో దళితబతుకుల్లో, ఆలోచనల్లో పురోగమనమే జరుగుతుంది గానీ తిరోగమనం కాదని ఈ కవిత బలంగా చెబుతుంది.

‘పోరాటకం.. పోరాటకం

పోరాటకం సెయ్యవలసిందే.. అనేవోడు

పోరాటకానికి బయ్యమెందుకురా

పోరాటం నీకు కొత్త గాదు’

అని బతుకులో చిన్న చిన్న అంశాలలోనే పోరాటం ఎలా నిభిడికృతమైవుందో చెప్తాడు- మూడోతరం గొంతుగా కవి.

‘పోరాటకం సెయ్యవలసిందే

కూలి కోసం పోరాటకం

కూడు కోసం పోరాటకం

గూడు కోసం పోరాటకం

మట్టి కోసం పోరాటకం

నువు మనిసివయితే

నేను మనిసినని సెప్పడానికి కూడా

పోరాటకం సెయ్యవలసిందే’

అని ఉద్భోద చేస్తాడు.

‘నువ్వు పులి దగ్గిరికెల్తే

పులిలాగే ఎల్లాలి అనేవోడు సిన్నోడు’

ఇది కదా దళిత చైతన్యం పూసిన సందర్భం.

తదుపరి ఎన్నికల గుట్టూ విప్పుతాడు- పాలేరు లేదా పాలేరు రూపంలో కవి.

‘ఓ పాలికి పాండవులు నెగ్గొచ్చు

ఓ పాలికి కౌరవులు నెగ్గొచ్చు

కాని

నిత్తెము ఓడిపోయేది మాత్తరం నువ్వే’

అని వాస్తవం తేటపరుస్తాడు.

దళిత బతుకులో ప్రతి చోట బడిలో, గుడిలో, టీ షాపుల్లో ఎదురైన అవమానాలను, వాటి తీరును చెబుతూ- కొత్త తరం ఆ వివక్షను ఒప్పుకోదని ప్రకటన చేస్తాడు.

దళితులు ఎదగడాన్ని ఓర్వలేని బుగతను ప్రశ్నిస్తాడు.

‘బుగతల బలం ఆల బుజాల్లో లేదర్రా

బూముల్లో ఉందన్నాడు’

ఇది మూడోతరపు వాస్తవ గ్రహింపు.

ఒకరోజు దళితపేట మీద బుగతలంతా కూడి దాడి చేస్తే ఎదిరించాడు మూడోతరంవాడు. కానీ కేసులు, పోలీసులు, కోర్టులు ముందు నిలబడలేకపోయాడు.

అప్పుడంటాడు- సిన్నోడిని గురించి చెప్తూ పాలేరు-

‘ఆయుధం అమ్మ కావాలని

అడవి దారి పట్టుకు నడిసేడు’

అని అనగా విప్లవ దారి, విప్లవోద్యమంలోకి ప్రవేశించాడని అర్థం.

ఆ తదుపరి అంటాడు పాలేరు-

‘అనాదిగా అనాద బతుకులు

కూలిపనులే ఆధారమయి

నిలబడ్డానికి మరే యితర ఊతనేక

అది కాదనుకుంటే ఊపిరాడక

బుగతల పంచల్లే సేరినాం’

ఇదీ వాస్తవమే- బుగతలపై పోరాటమెంత వాస్తవమో, ఇదీ అంతే వాస్తవం. వాస్తవాన్ని కవి రెండోతరం, మూడోతరం ద్వారా చెబుతున్నాడు.

తర్వాత అంటాడు-

‘అయితె అది ఎంతదాక?

మా పిల్లల పిల్లలు ఎదిగి

బరుల్లో బస్తీల్లో సదువులు సదివి

జై భీమ్ అని జెండాలెత్తిందాక’

అని- ఇదొక conclusion కవి దృష్ట్యా. పేద దళిత బలహీనులు విముక్తి కావాలంటే కవి రెండు దారులను చెప్పకనే చెప్పాడు. ఒకటి- విప్లవోద్యమం, రెండు- దళితోద్యమం. రెండూ తప్పని స్థితిలో ఎంచుకున్న దారులుగానే కవి ఇక్కడ ప్రతిపాదించినట్టు. ఈ విధంగా చూసినా ‘గొడిముక్క’ కవిత ప్రాసంగికత మరింత లోతుగా అర్థమౌతుంది.

దళిత పేట మీద దాడిలో భాగంగా బుగతలు దళితులను వెంబడించి వేటాడిన సన్నివేశాన్ని చెబుతూ-

‘సివంగి పెళ్ళాం

నిండు సూలాలు

పరిగెత్తనేక.. నడవనేక

బెదిరిపోతూ.. అలసిపోతూ

గాభరాలో.. జారి పడిపోతే

కెవ్వుమన్న కేక

నాగేటిసాలు మద్దిన

దుక్కిబెడ్డల్లో

యితనపు గింజ పగిలి మొలక తూరిన శబ్దం

ఆ అర్దరాత్రి

నల్ల సూరీడు పొద్దు పొడిసేడు’

అని అద్భుతమైన imaginationని కవి సాధిస్తాడు. ఈ విధంగా Symbolic గా కూడా ఎత్తులకు ఎదిగింది ‘గొడిముక్క’కవిత.

ఇక్కడివరకు కవిత పరిణామం, అది చర్చించిన విషయాలు, దాని ప్రాసంగికత కొనసాగింపూ ఒక ఎత్తైతే, కవిత నాల్గవ తరంలోకి ప్రవేశించిన తర్వాత దాని రూపం మారింది. అనగా అది లేవదీసిన చర్చ, దానికనుగుణంగాధిక్కారస్వరమూ మారింది. నాల్గవతరంలో పాలేరు చిన్నకొడుకు మనవడుల ద్వారా మంచి చర్చ పెడతాడు కవి.

‘బతుకు యివాల ఒక్క నాగలి మీదే ఆదారపడినేదు’

అని అంటాడు పాలేరు- ఒక్క వాక్యంతో పెట్టిల్లున చీల్చుకువస్తాడు కవి. ఇక్కడ కవి- బుగతల వద్ద ఎకరాలు ఎకరాలు భూమి వుండటమే కొమ్ములు పెరగటానికి కారణమా? అనే తిరుగులేని ప్రశ్నని సంధిస్తాడు. చాలా పెద్ద చర్చని రేకెత్తించే వాక్యం ఇది. దళితుల పక్షాన చాలా లోతైన వాక్యం- ధిక్కార వాక్యం.

‘నా మనవడు నా ఒళ్లోన కూకోనున్నాడు

నా గుండెల్లో పొంగిన దుక్కమే సూసినాడో

ఆలమ్మ కళ్ళల్లోని కన్నీరే సూసినాడో

తాతా

ఆకాశానికి కళ్ళుంతాయా అని అడిగేడు’

మనవడు అడిగిన ప్రశ్నకు పాలేరు గుండె తడిబారుతుంది-

‘అవి లేనిది ఒక్క మనుసులుకేరా అన్నాను’

అని తాత మనవడు మధ్య అనగా రెండోతరం మూడోతరం మధ్య ఈ సంభాషణ ముగుస్తుంది.

అలా తాతని ప్రశ్నించిన మనవడు- పెద్దైన తర్వాత

‘నీ మీద నీకు గౌరం నేకపోతే

నిన్నెవుడు గౌరంగా సూడ్డు

ఒరే అంటే ఒరే అను

ఒసే అంటే ఒసే అను

మరేం బయ్యం నేదు

ఓ పూట తిండినేప్పోయినా ఉండగలం గాని

మాటల ముల్లు

మనసుకు గుచ్చుతుంటే ఎలా ఉండగలం అనేవోడు’

అని అనే స్థాయికి మనవడు ఎదుగుతాడు.మనవడితో పాటూ కవితా ఎదుగుతుంది.

పాలేరు చిన్నకొడుకుఅంటాడు-

‘ముందు బువ్వ కావాల

బువ్వనిచ్చే బూమి కావాల

సంపద నీ దగ్గరుంటే

సచ్చినట్టు గొస్తాది గౌరం’

అని-

‘మనవడు దానికొప్పుకోనేదు’

‘కులం పోకుండా ధనమెలా గొస్తాదంతాడు

నువ్వు యాపారమే జెయ్యు

యవ్వారమే జెయ్యు

నీ ఎనక నీడనాగ కులం

నిన్ను ఎంటాడుతూనే ఉంటాది అంటాడు’

ఈ రకమైన వాక్యాల ద్వారా వర్గం, కులం మధ్య చర్చ పెడతాడు కవి.భూమికి, కులానికి మధ్య చర్చని.

మళ్లీ అంటాడు-

‘నువ్వెన్ని పోరాటకాలు సేసేవు గదా

ఎక్కడైనా కులం నేకుండా పోయిందా అంతాడు’

ఈ వాక్యాలు ఇప్పటి వర్తమాన గాయాల సందర్భంలో పరిగణించాల్సి వుంది.

అంబేద్కరిస్టు దృక్పథాన్ని బలంగా ప్రకటిస్తాడు కవి ఈ వాక్యాల ద్వారా.

‘నీ పోరాటకం మొదట కులంతో సెయ్యాలనేవోడు’

ఇది వర్తమాన దళిత చైతన్యంలో నాల్గవతరం conclusion.

కవిత చివరికొచ్చేసరికి- చుండూరు దళిత మారణకాండని యధాతథంగా record చేసాడు కవి. కవిత అందుకోవాల్సిన చైతన్య స్థాయిని అది అందుకుంది.

చుండూరు మారణకాండకి తక్షణ కారణం అని బుగతలు చెప్పుకుంటున్న కారణం, ఆ సందర్భం చెబుతూ- ఆ ఘర్షణలో ‘నా మనవడు ముందుకొచ్చాడు’అంటాడు పాలేరు.

అని అంటూ

‘నీ కాల దగ్గర తోకూపడానికి

నేను కుక్కను గాదు

బుర్ర ఏలాడేసి నీ ఎనక నడవడానికి

నేను గొర్రెను గాదు

నీ బరువులు మొయ్యడానికి

నేను గాడిదను అంతకన్నా కాదు

నీవు తిట్టిన కొట్టిన పడుండడానికి

నాలుగు కాళ్ల జంతువును కాదు’

అని ధిక్కారాన్ని ప్రకటిస్తాడు.

అయినా- ఊరిజనం పేట మీదకొచ్చి పేటని నెత్తుటి మండలం చేస్తారు. ఈ విషయాన్ని కవితలో దృశ్యమానం చేస్తాడు కవి. ఇలా కవిత చివరికి వచ్చేసరికి ఉన్నట్టుండి ‘చుండూరు’లోకి వెళ్లడం కవిత సాధించిన success యే గానీ, failure కాదు.

చివరి ఆరు వాక్యాల్లో కవి చెప్పింది- చుండూరు ఘటన తర్వాత దళిత బతుకుల్లో పెరిగిన చైతన్యానికి చిహ్నం.

‘అయితే

పెనుగాలికి వొంగిన మొక్క

అలాగే ఉండిపోద్దా

తెల్లారేసరికి మళ్ళీ నిటారుగా నిలబడిపోదూ

సుండూరు సాచ్చిగ సెప్తున్న

మా గుండె దైర్నం బాగా పెరిగింది’

‘గొడిముక్క’ కవిత ముగింపు ఇలా ముగియడమే సరైన justice అని అనుకుంటున్నాను. కవితలో కవి ఇచ్చిన justiceతో నేను ఏకీభవిస్తున్నాను.

కళింగనేల మీద ‘గొడిముక్క’ రావడం ఒక చారిత్రక అవసరంగానే నేను భావిస్తున్నాను. ‘గొడిముక్క’relevance ఇప్పుడు ఈ వర్తమానంలోనూ వుందనే నేను ఉద్ఘాటిస్తున్నాను.

 కళింగాంధ్ర వచన కవిత్వప్రయాణంలో ఇదొక పాయ. ఈ పాయను రామకృష్ణ సమర్థవంతంగానే నిర్వహించాడు.

ప్రస్తుత హిందుత్వ రాజకీయ సందర్భంలో ‘కులం’ గాయం లోతు ఇంకా ఇంకా లోకానికి అర్థమౌతున్న స్థితిలో ఈ ‘గొడిముక్క’ ప్రాసంగికత తెలియవస్తుంది.

మార్క్సిజం, అంబేద్కరిజం మధ్య ఒక వంతెన అల్లబడాల్సిన దృష్ట్యా కూడా ‘గొడిముక్క’ కవితకు వున్న ప్రాసంగికత మరింతగా అర్థమౌతుంది.

Leave a Reply