బొగ్గుబావిలో పని కోసం సొంత ఊరిని వదిలేసి వచ్చిన కుటుంబం. తట్ట, చెమ్మసు తీసుకుని సైకిల్ పైన పనికివెళ్ళే తండ్రి. భర్త కష్టానికి తన కష్టాన్ని జతచేస్తూ, భర్త రావడం కాస్త ఆలస్యమైనా తన భయాన్ని ఇంటి దర్వాజ అలికిడిలో వ్యక్తీకరించే తల్లి. తమని ఎంతో ప్రేమించే తండ్రి కోసం, తండ్రి ప్రేమగా తీసుకొచ్చే వస్తువు కోసం కిటికీ చువ్వల నుండి ఎదురుచూపులనే ఎర్రతివాచిలుగా పరిచి పెట్టే కూతుర్లు. ఇది నల్ల బంగారం కథలలో రచయిత బాల్యం. కథలన్నీ చదువుతుంటే చాలా దగ్గరి అనుభవాలు గుర్తుకొచ్చాయి. ఆలోచిస్తే ఇది అచ్చంగా నా బాల్యం. సింగరేణి ప్రాంతంలో గడిచిన నా బాల్యం , ఇప్పటికీ నడుస్తున్న నా జీవితం ఈ కథల్లో ఉంది. అందుకే ఈ కథలను చదువుతుంటే మా ఇంటి చుట్టూ ఉన్న కుటుంబాలు, నా చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ జీవితాలను చూస్తున్నట్టే అనిపించింది.
రచయిత తన హృదయంతరాలలో గతంగా మారిన బాల్యపు గనుల్లోకి అక్షరాల పారలతో వెళ్ళి, గడ్డకట్టుకుపోయిన నల్లని జ్ఞాపకాలను పేజీల తట్టల్లో నింపి పదమూడు కథలుగా కుప్పపోసింది. బంగారం లాంటి బాల్యాన్ని తవ్వుకుంటూ వెళ్ళిన కథలు నల్ల బంగారం కథలు. . ఈ కథల్లో వస్తువు బొగ్గు గని కార్మికుల జీవితాలే. కానీ కేవలం వాళ్ళ జీవితాలు మాత్రమే కావు. ఇవి అందరి కథలు, ఇందులో ఉన్నవి అందరి జీవితాలు. కేవలం రచయిత బాల్యపు జ్ఞాపకాలే కాదు. ఇవి ‘ బాల్యానికి ‘ సంబంధించిన జ్ఞాపకాలు. నేపథ్యంతో సంబంధం లేకుండా అందరి బాల్యం కనిపించే కథలు. అభివృద్ధి అదనపు బహుమతిగా ఇచ్చే విధ్వంసం కింద పాతిపెట్టబడిన తన ఊరిని, తన వాళ్ళను, తన బాల్యాన్ని, తనను ఈ కథల్లో రచయిత వెతుక్కుంది. అలా వెళ్తున్న వెతుకులాటలో రచయిత పాఠకులతో చాలా విషయాలు పంచుకుంది. విషయాలు అనడం కంటే విషాదం అనే పదం సరైనదేమో. ఎందుకంటే రచయిత తన బాల్యం అనుభవించిన ఆనందం కంటే చూసిన దుఃఖం, ఎదురైన కష్టాలనే కథలలో ఎక్కువగా రాసింది. నల్లని ఆకాశంలో తెల్లగా మెరిసే చుక్కల్లా అక్కడక్కడ ఆనందాలు ఉన్నా, చూసి కాసింత సేపు నిమ్మలపడడానికే గాని చీకటిని మరిపింపజేయలేని ఆనందాలు అవి. రచయిత స్వర్ణ కిలారి ఈ కథలలో తన బాల్యంలో తను చూసిన, విన్న, అనుభవించిన అనేక ఉద్వేగాలను చెప్పుకుంది. అలా చెప్పుకున్న ఉద్వేగాలలో తన చుట్టూ ఉన్న అనేక మంది జీవితాలు ఉన్నాయి. అద్భుతంగా స్పృశించబడిన మానవ సంబంధాలు ఉన్నాయి. కష్టాలను గురించి చెప్పే కథలు, కథకులు చాలా మంది ఉన్నారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనిషి పడే వేదనను, మనసు పడే ఆవేదనను చెప్పే కథలు నల్ల బంగారం కథలు.
నల్ల బంగారం కథలలో రచయిత తన బాల్యం తియ్యని మిఠాయి పొట్లం అని రాసుకుంది. ఆ మిఠాయి పొట్లాన్ని పాఠకుల చేతికి ఇచ్చి తినమని భగభగ మండుతున్న భూమి పొరల లోపల, నల్లని చీకటిని ఒళ్ళంతా నింపుకున్న బొగ్గు కుప్పల మధ్య కుర్చీ వేసింది. ఆ మిఠాయి పొట్లం తినాలి అంటే, ఆ బాల్యం గురించి చదవాలి అంటే ఊపిరి ఆడని ఉబ్బరింత, శరీరానికి కాదు మనసుకు. చిత్రంగా చెమటలు కళ్ళకు పట్టాయి. చుట్టూ మనుషులు, కన్నీళ్లను ఒంటికి పూసుకున్న మనుషులు. అసలు సంబంధం లేని మనుషుల్లాగే అనిపిస్తున్న చాలా దగ్గరి మనుషులు. చదువుతున్నంతసేపు ఇంత గాఢంగా ఎలా రాసింది బాల్యాన్ని, ఇంత లోతుగా ఎలా చూసింది జీవితాలని అనిపించింది. తాను చూసిన, విన్న కథలు కూడా ఉన్నాయి అని చెప్పుకుంది. కానీ అన్ని తన కథలే అన్నంత సహజంగా రాసింది. కెరీరిజం పరుగులాటలో తెలియట్లేదు కానీ, ఒకసారి ఆగి పక్కకి చూస్తే, పక్కన ఉన్న వాళ్ళ జీవితాలను పరిశీలిస్తే నా చుట్టే ఇంతా విషాదం ఉందా అని అనిపించేంతలా రాసింది. పుస్తకంలో జీవితాలని చదువుతున్నప్పుడు రచయిత అనుభావాలతో సానుభూతి చెందడం మాములు విషయమే కావచ్చు గాని ఇట్లా సహానుభూతి చెందే అనుభవం నాకే దక్కిందేమో అనిపించింది.
మొత్తం పదమూడు కథలు. ప్రేమలు, కోపాలు, విషాదాలు, విధ్వంసాలు, మర్చిపోకుండా గుర్తు పెట్టుకునే ఆనందాలు, మర్చిపోవాలి అనుకున్న సాధ్యం కాని అనుభవాలు అన్నీ ఉన్నాయి ఈ కథల్లో.
కథల విషయానికి వస్తే ఒకరి అవసరానికి, ఇంకొకరి నిజాయితీకి మధ్య జరిగిన ఘర్షణలో పుట్టిన ఆవేశం రెండు కుటుంబాలలో నింపిన విషాదమే దిల్ సే కథ. ఇందులో ఆవేశం మిగిల్చిన విషాదమే కాకుండా పశ్చాత్తాపం అందించిన శాంతి కూడా ఉంది. రచయిత స్త్రీ అయినందుకో, అమ్మాయి బాల్యానికి సంబంధించిన కథలు అయినందుకో, అమ్మ కొంగు వెనకాల దాక్కొని ప్రపంచాన్ని చూసిన బాల్యం అయినందుకో తెలియదు కానీ ఈ కథలలో స్త్రీల పట్ల రచయిత ప్రత్యేక దృష్టి కనిపిస్తుంది. కుటుంబంలో ఉన్న ఘర్షణ అంతా గుండెల్లో దాచుకుని, అది కనపడకుండా మొఖానికి కోపాన్ని పూసుకుంది హైమవతి పాత్ర. నా కష్టం కానిది పైసా గూడ నాకొద్దు అని చెప్పేంతగా, తాను డబ్బులు పోగొట్టుకున్న నిజాన్ని నమ్మితే చాలు అనుకునేంత హుందాగా నిలబడింది ఎల్లి పాత్ర. తండ్రి అన్ఫిట్ అయితే కొడుకులు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. కుటుంబానికి అండగా నేను ఉంటాను అంటూ ధైర్యం చెప్పగలిగిన కూతురు పాత్ర. ఇంకా ఇట్లాంటి పాత్రలు ఎన్నో. నల్ల సింగిడి కథలో అమ్మమ్మ ప్రేమను అందంగా చెప్తూనే ఒక్కసారిగా తాతయ్య ఎడబాటును చెప్పుకుంది. అప్పటివరకు తనకి ఇష్టం లేని స్వర్ణ పేరులోనే తర్వాత తాతయ్య గుర్తులను వెతుక్కుంది. బొగ్గుబాయి పనికి పోయే కుటుంబాలలో ప్రతీ రోజు ఉండే దుఃఖాన్ని, భయాన్ని వాగొడ్డు కథలో పాఠకుల అనుభవంలోకి వచ్చేంత అద్భుతంగా చెప్పింది రచయిత. గనిలోకి పని కోసం వెళ్ళిన ప్రతి కార్మికుడి కుటుంబం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటుంది. రోజు చూసే జీవితమే కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ కథలో ఉంది. నిన్నటి వరకు ఆడుకున్న వాగే, వాడుకున్న నీళ్లే. కానీ ఆరోజు వేరే అనుభవాన్ని అందించాయి. రోజు వెళ్ళే పనే కానీ ఆరోజు ఇంకో గమ్యంగా భయపెట్టింది. నా బాల్యంలో ఎన్నో సార్లు నాకు ప్రత్యక్ష పరిచయం ఉన్న భయం అది. ఆ భయం నిజమైన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నం పెట్టే బొగ్గుబాయే ఆకలిగా మింగిన మనుషులు వాళ్ళు.. మింగలేక పుక్కిలించిన మనుషులు ఇంకా ఉన్నారు. కాళ్లో, చేతులో విరిగి పనికి అన్ఫిట్ అయిన వాళ్ళు, కుటుంబాలకి భారంగా బతుకుతున్నవాళ్లు. ఆ పరిస్థితి గురించి ఒకవేళ నేను ఒక కథ రాసుకున్నా నా భయం, నా అనుభవాల వ్యక్తీకరణ కొలతల్లో తేడాలు ఉండవేమో. వయసు, స్దాయి మనుషుల మనసులలో సృష్టించే అంతరాలను చెప్పే కథ మాఫ్ కరో దోస్త్. బాల్యంలో కలిసిన తిన్న స్నేహాలే, కలిసి తిరిగిన స్నేహాలే స్థాయిలు, అంతస్తులు మారడం వలన ఎలా మార్పు చెందుతాయి అనేది ఈ కథలో చెప్పింది. సున్నితమైన భావోద్వేగాలను రచయిత పట్టుకున్న విధానం గొప్పగా ఉంది. దానికి సాక్ష్యమే మఫ్ కరో దోస్త్ కథ ముగింపు. కాస్త సున్నితమైన ముగింపు, ఇంకాస్త భావోద్వేగమైన ముగింపు. ఇంకా ఈ కథలలో బాల్యంలో కలిగే కుల, మతాలకు అతీతమైన ప్రేమ భావనలు. వయస్సుతో పాటు ప్రేమ మీద మారే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దో పెహ్లీ ప్రేమ్ పత్ర్ కథలో హేమ ప్రేమ మీద అభిప్రాయం లేదని చెప్తూనే చివరికి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ పత్రాలు చేతుల్లో పట్టుకుని తిరిగిన వాళ్లు వేరే మార్గాలకు ప్రయాణం చేసారు. రచయిత అక్షరాలకు అంకురాలను అందించి, తన సాహిత్యంలో ఒక పాత్రగా మిగిలిపోయిన సైదయ్య, అనుకోకుండా తమ జీవితాల్లోకి వచ్చి ఆత్మహత్య చేసుకుని వెళ్లిపోయిన శ్రీను. అందరివీ అలా కాకుండా ఉంటే బాగుండు అనుకున్న జీవితాలే. చివరికి ఏ సామాజిక విభజన నిజం కాదు. చావే అసలైన సత్యం అని చెప్పిన అమ్మ జీవితం కూడా.
రచయిత ఓపెన్ కాస్ట్ సర్జరీ కథలో తన ఊరిని, బాల్యాన్ని వెతుకుతూ వెళ్తున్నప్పుడు తన కాలికి గుచ్చుకున్న బొగ్గుపెల్ల తనతో ఏదో చెప్పాలని చేసిన ప్రయత్నం ఫలించి ఉంటే, ఆ బొగ్గుపెల్ల గొంతు గట్టిగా పెగిలి ఉంటే, దాని గొంతు వినే శక్తి రచయితకి ఉండి ఉంటే అది వెళ్ళి జీవగర్రపుల్లను వెతకమని చెప్పేదేమో. దొరికితే గతించిన తన బాల్యాన్ని, గతంగా కూడా మిగలని తన ఊరిని, స్కూలుని, మనుషులను, జ్ఞాపకాలను మళ్ళీ బతికించుకోమని అడిగేదేమో.