కొన్ని ప్రశంసాపూర్వక వాక్యాలు, మరికొన్ని ముఖస్తుతి పదబంధాలు, ఇంకొన్ని పొగడ్తతో ముంచెత్తి ఈ కవిని కవిత్వాన్ని అభినందించాలని కాదు. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఎదో తెలియని బాధ. ఇలా కదా చెప్పాల్సింది. ఇలా కదా మాట్లాడాల్సింది. ఇలా కదా రాయాల్సింది. నివురుగప్పిన నిప్పుకణికలతో మరిన్ని నిప్పుకణికల్ని ఇలా కదా మండించాలి అనిపించింది. ఆలోచింపజేసేలా ఈ కవిత్వం కవి నాయుడు గారి జయన్న రాశారు. తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి.
సామాన్యజనం ఈ సమాజాన్ని ఎలా చూస్తారన్నది వారి చైతన్యం మీద, స్పృహ మీద ఆధారపడి వుంటుంది. కాని కవికి ఈ సమాజం పట్ల మాత్రం బాధ్యత ఉందని ఈ కవిత్వం చదివాక ప్రతివొక్కరికీ అనిపిస్తుంది. ఆ బాధ్యతతోనే కవిత్వం రాయాలి. కవి ఎవరి పక్షాన ఉన్నాడన్నది, ఉండాలన్నది స్పష్టంగా తెలియాలి. ఆ స్పృహ కవికి ఉండాలి. పాలకపక్షమా? ప్రజాపక్షమా? పాలకపక్షమైతే ప్రజలతో సంబంధముండదు. ప్రజాపక్షమైతేనే, ప్రజలు ఆ కవి కవిత్వాన్ని మోస్తారు. ఈ కల్లోల కడలి కవిత్వం రాసిన ఈ కవి ప్రజలపక్షపాతి. ప్రజలబాధల్ని మాటల ఈటెలుగా మార్చి యుద్దం చేస్తున్న కవి. అందుకే ఈ కవి కవిత్వం యుద్దమైదానం. ఈ కవి తొలికవిత్వంలో కవిత్వనిర్మాణాలేమైనా ఉన్నాయేమో అని ఈ కవిత్వం మొత్తం చదివాక ఇలా పరిశీలించి చూశాను.
శిల్పం:
శిల్పంలోపిస్తే ఎంత గొప్ప కవిత్వమైనా రాణించదని విమర్శకులు చెబుతుంటారు. కొత్తగా రాస్తున్న కవులకు శిల్పం ఏం తెలుసని కాస్త సీనియర్ కవులు స్టేట్మెంట్లిస్తుంటారు. కాని కొత్తగా రాస్తున్న కవుల్లో కూడా అద్భుత శిల్పంతో రాసేవాళ్ళుంటారని కవి ఈ కవిత్వం ద్వారా నిరూపించారు. శిల్పాన్ని కుందుర్తి నాలుగు భాగాలుగా విభజించారు. అక్షరశిల్పమని, ఛందోశిల్పమని, అలంకారశిల్పమని, వర్ణనాశిల్పమని అన్నారు. ఈ కవి అక్షరశిల్పాన్ని మాత్రం చాలా గొప్పగా రాశారు. అది పరిశీలించినపుడు..
‘‘పొలాల్లో పంటలకు బదులు
రియల్ ఎస్టేట్ రాళ్ళు మొలిచాక
బుక్కెడు బువ్వను
చారెడు నేలను
వెతుకుతూనే ఉండు’’ అని కృషీవలుడు కవితాశీర్షికలో అంటారు. రాళ్ళు మొలవడమేంటి? శిల్పం ఇలా పండితేనే గదా కవిత్వం జనం నాల్కలపై పదికాలాలుంటుంది. పంటపొలాల్ని, రైతు బతుకుల్ని రియలెస్టేట్ రాకాసి మింగేసిన వైనాన్ని ఈ కవితలో కవి చెప్తారు. కవి ఎంత బాధపడితే ఈ కవిత్వం పురుడుబోసుకుంటుంది. అందుకే నేను అక్షరశిల్పం అన్నాను.
వస్తువు:
కవికి ప్రపంచం నిండా వస్తువులే కనబడ్తాయి. అలా ఈ కవికి కనబడ్డాయి. కాని కావ్యవస్తువులు మాత్రం ఏకవికైనా రెండుంటాయి. ప్రత్యక్షంగా చూసి వస్తువును తీసుకోవడమొకటైతే, అంతర్ముఖీయంగా మనసుపొరల్లో ప్రవహించే ఊహను వస్తువుగా తీసుకుని రాయడం రెండోది. ఈ కవి రెండిరటింని తీసుకున్నారు. రెండు వస్తువులు వైవిధ్యంగా భిన్నమైన సందర్భంలో చెప్తారు. అవీ చూద్దాం.
ఒరేయ్ ! ఉగ్రవాది!
ఒరేయ్! ఉన్నాది!
మనుషులను పిట్టలకన్నా దారుణంగా
మట్టుబెట్టమన్న నీ మత పిచ్చికి మంటబెట్టుకో
నీ మతాన్ని మడిచి దోపుకో..! ఎంత ఆక్రోషం కదా. ఉగ్రవాదం వల్ల ఈ ప్రపంచం ఎంత నాశనమౌతుందో వర్తమాన ప్రపంచంలో ఉన్న ఈ కవి చూస్తున్నాడు. మతం వల్ల ఈ ప్రపంచం నిండా నెత్తురెలా ప్రవహిస్తున్నదో చూస్తున్నాడు . మత మౌఢ్యానికి వేల ప్రాణాలు అనంత వాయువుల్లో ఎలా కలసిపోతున్నది చూస్తున్నాడు. మతం మనిషి అంతానికి కారణమైనప్పుడు ఈ మతం ఎవరికవసరం.? మానవత్వాన్ని చంపేసే మతం మనకెందుకవసరం. చాలా గొప్పగా చెప్పారీ కవిత్వంలో..అందుకే కవి ఆ వస్తువును చాలా వైవిధ్యంగా రాశారు. ఇది ప్రత్యక్షంగా చూసిన వస్తువైవిధ్యమని అనుకున్నప్పుడు..మనసులోతుల్లోంచి సంచరించే ఇంకొక వస్తువును కూడా ఈ కవిత్వంలో చూద్దాం.
‘‘నడక మొదలైనప్పుడు
లక్ష్యశిఖరం వైపు
ఒక చెయ్యి కూడా మన వీపు మీద ఉండదు.
శిఖరానికి చేరే క్రమంలో
కష్టాల ముళ్ళు
నష్టాల రాళ్ళు తొక్కికందిన
జీవిత పాదానికి
ఏ హస్తము లేపనం రాయదు.
శిఖరం మీద ఉన్నంతకాలం
తలెత్తే ఒక నేత్రమన్న
అసూయనొదిలి
మన విజయాన్ని హర్షించదు.’’
కవితావస్తువు చాలా తాత్వికంగా సాగుతుంది.మనసులోని భావాల్ని మెలిపెట్టితోడ్తాయి. జీవితాన్ని, జీవనగమనాన్ని, ఎత్తుపల్లాల్ని ఈ కవిత్వం చదువుతున్నంత సేపూ కవిత చూపించింది. ఈ వస్తువు అంతర్లీనంగా ప్రవహించి పెల్లుబికింది.
ఎత్తుగడ:
కవిత్వం ప్రారంభంలో ఆకట్టుకునే వాక్యాలే కవిత్వ ఎత్తుగడ. ఎత్తుగడ బలంగా ఉన్నపుడు కవిత్వపాఠకులు ఏకబిగిన కవిత్వాన్ని చదువుతారు. ఇలాంటి కవిత్వ ఎత్తుగడలు ఈ కవిత్వంలో చాలా చోట్ల ఎలుగెత్తి పలకరిస్తాయి. అలాంటి ఎత్తుగడలు చూద్దాం.
‘‘ఎవరూ తిప్పకపోయినా
భూమి పరిభ్రమిస్తూనే ఉంది
ఎవరూ తరమక పోయినా
కాలం పరిగెడుతూనే ఉంది’’ గోడ అనే కవిత్వశీర్షికతో ఈ కవిత రాశారు. దాదాపు ఈ కవి రెండు దశాబ్దాల క్రితమే ఈ కవిత రాసినట్లు చెప్పుకున్నారు. ఆ రోజుల్లోనే ఈ కవి కవిత్వాన్ని చాలా గాఢతగా, ఆర్ద్రతగా రాశారు. ఇది గొప్ప ఎత్తుగడ అని కూడా తనకి తెలిసివుందో లేదో! కాని వర్తమానా కవిత్వ సమాజం మాత్రం ఇది గొప్ప ఎత్తుగడ అని మాత్రం ఖచ్చితంగా చెబుతుంది. ఇంకో ఎత్తుగడ కవితను చూద్దాం..చాలా సహజంగా మనల్ని లేవుపట్టుకుని నడిపించే
ఎత్తుగడ..
మా ఊరికి పోయిరావాలి!
నే చేజార్చుకున్న
నా బాల్యపు తీపిగుర్తులను
ఏరి, వెంటతెచ్చుకోవాలి!
నేను నడియాడిన
నా నీడలను
వెతికి వెతికి వెంట తెచ్చుకోవాలి.
బాల్యం ఎంత మాధుర్యంగా ఉంటుందో కదా..జ్ఞాపకం హృదయానికి లయాత్మకసంగీతాన్నిస్తుంది కదా. ఊహల్లో తేలిపోయే స్మృతి. ఇవన్నీ ఎలా సాధ్యమంటే మనం పుట్టిపారాడిన నేల..మనం అడుగులో అడుగేసి ఆడేసుకున్న నేల.ఎన్నో అనుభవాల్ని మూటగట్టుకున్న నేల.ఇది కదా బాల్యం.ఇది కదా జ్ఞాపకం.ఇది కదా జీవితం.ఎంత బాగా రాశారీయకవి.తీపిగుర్తుల్ని దోచేసుకుని గుండెలనిండా దాచుకున్న అనుభూతి.ఎంత బాగుందీ ఎత్తుగడ.
ఈ కవిత్వం కవిత్వనిర్మాణంతో రూపుదిద్దుకున్నది. కవిత్వనిర్మాణసూత్రాలన్నీ మనకు కనబడతాయి. కవిత్వాన్ని ప్రేమించే కవులు ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఆపకుండా చదివేస్తారు.ఇంకా ఏముందని ఈ కవిత్వాన్ని చదవాలి అని ప్రశ్నించుకుంటే.
జీవితానికి నిర్వచనం.
‘‘జీవితమంటే అర్థం కావాలా?
ఎగసి, పడి
పడి, ఎగసే
కెరటాలపై ప్రయాణం చేసి చూడు..’’
ఈ నిర్వచనం సరిపోతుందా? జీవితానికి తార్కాణమై నిలుస్తుందా పై కవిత..అలవోకగా, అవలీలగా కవి తన అంతరంగాన్ని ఎంత బాగా స్పృశించాడో కదా.ఇంకోచోట ఇలా అంటారు.
‘‘బతుకుదారి అన్వషిస్తున్నపుడు
తెలిసింది జీవితమంటే ఇట్టా ఉంటుందని.’’
ఈ కవి ప్రతి అక్షరాన్ని కవిత్వం చేసే ప్రయత్నం చేశారు. అందులో తనాశించిన మేర సఫలం కూడా అయ్యారు. వొక్కోసారి జీవితం మాట్లాడతారు. మరొక్కసారి ఉద్యమమై ఎగసిపడతారు. వొక్కోసారి కోపాగ్ని జ్వాలలు రగిలిస్తే మరొక్కసారి శాంతపరిచి చైతన్యపరుస్తారు. కవి పంథా, దృక్పథం ఈ కవిత్వంలో సమాంతరంగా ప్రయాణిస్తుంది.
రాజకీయచైతన్యం:
ముందుగానే నేను చెప్పినట్టు ఈ కవి చాలా సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉన్నారు. తన అక్షరం ఈ సమాజాన్ని మేల్కొల్పాలని భావిస్తారు. ఈ సంపుటిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించే కవితలనేకం ఉన్నాయి. ఒకట్రెండు పరిశీలిద్దాం.
‘‘ఇది
ఏ నిరంకుశ ప్రభువు చేతి నిర్ధాక్షిణ్య బ్రహ్మస్త్రమో!
ఏ మతిలేని కోతి నాటిన ఆలోచనా విషబీజమో!
ఏ చిట్లిన మెదడు తీసుకున్న విపరీత చర్యనో!’’(317 జీవోను వ్యతిరేకిస్తూ.)
‘‘ఉద్యోగులు కుక్కతోకలా
అదే అయితే మరి నువ్వు
…………………….
…………………..
తోకకూడా కడవాలమే కాదు
కరవాలం కూడా..’’
‘‘న్యాయమైన కోరికలు
తీర్చమని సమ్మెకడితే
పలుకరేమి పాలకులు
పాపాలబైరవులు’’
ఇలాంటి పదునైన రాజకీయ వ్యతిరేక కవిత్వం రాసి ప్రజల్ని చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తారు. ఈ కవిత్వంలో చాలా చోట్ల ప్రజలపక్షాన నిల్చుని మాట్లాడతారు. అలా మాట్లాడితేనే కదా కవి ప్రజలకవిగా ఉద్భవించేది. అలా రాసి చైతన్య పరిసేతనే కదా ప్రజలు కవులని గుండెల్లో పెట్టుకునేది.భావాలను తన అనుభవాలతో జోడిరచి నిప్పుకణికల్లాంటి కవితాక్షరాలను ఈ కవి ఈ సంపుటి నిండా పరిచారు. ఈ కవిత్వం పచ్చిని పంటై సాహిత్యలోకంలో పండుతున్నది.
స్మృతి కవిత్వం:
స్మృతి మదిలో నిక్షిప్తమైన భావోద్రేకం. సముద్రమంత కన్నీటిని నింపుకుంటుంది. కెరటాల్లా ఎగసిపడుతుంది. అప్పుడప్పుడు నెమ్మదించినట్లున్నా దానిహోరుమాత్రం తగ్గదు. అలాంటి స్మృతి కవితలు ఇందులో ఉన్నాయి. తన బాబాయ్ ఈ లోకాన్ని వీడిన బాధ వొకటైతే.నిత్యం వెలుగులు పంచే సూర్యుడి లాంటి మేనల్లుడు అస్తమించిన బాధ..ఈ రెండు ఘటనల్ని కవి కన్నీటిని సిరాచుక్కలుగా చేసుకుని రాశారు.
‘‘నీభుజంపై కూర్చొని
నీ పాట వింటుంటే
ఆకాశం అందేది
చంద్రుడు చెంప తడిమి వెళ్ళేవాడు
పాతాళం పక్కనున్నట్లే ఉండేది
దేవుళ్ళని, రాక్షసులని
వింతవింత మనుషులని
మా ఆనందం కోసం
సృష్టించిన మా ఇంటిబ్రహ్మవు కదూ!’’ తన బాబాయ్ నాగశేషి నాయుడు కోసం ఈ కవిత రాస్తే..తన మేనల్లుడు రాజశేఖర్ ఈతకు వెళ్ళిబావికి బలైన దుర్ఘటనకు కన్నీటి పర్యంతమై..
‘‘ఇటు చూడు మీ ఇల్లెంత
నిశ్శబ్ధంగా నిదురోతుందో
నీ సందడి లేక
నీవు లేవన్న నిజం
భయంకరంగా అర్థమయ్యాక..’’
అందుకే ఈ కవిత్వం పదికాలాలు నిలబడుతుందని భావిస్తున్నాను. ఈ కవి సాహిత్యసమాజంలో నిలబడతారు. మొదటి సంపుటిలోనే కవిగా నిలబడతారు. మరింత అధ్యయనం ద్వారా కవిగా పరిపూర్ణవంతమౌతాడు. కవిత్వ నిర్మాణసూత్రాలతో వైవిధ్యమైన కవిత్వం భవిష్యత్తులో మరింత రాయగలరు. ఈ కవినిమన:స్పూర్తిగా అభినందిస్తూ.. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన డా.నాగేశ్వరాచారి ఇలా అంటారు “ఈ కవితల్లో అంతర్లీనంగా అప్రజాస్వామిక విలువలపైనా, అణచివేతపైనా అతిసున్నితమైన వ్యంగ్యం ఉంది. ఆ వ్యంగ్యంలో ఆర్తి ఉంది. జయన్న గారి పద్యనిర్మాణం గెరిల్లా పోరాటం వంటిది. ఎటు నుంచి వస్తాడో. కొట్టి ఎటు వెళ్ళిపోతాడో ఆశ్చర్యకరంగా ఉంటుంది.” అందుకే ఈ కవిత్వం ప్రతి వొక్కరూ చదవాల్సిన కవిత్వం.