పుస్తకాల్లో ప్రేమ కన్నా జీవితాల్లో ప్రేమ అద్భుతంగా ఉంటుందా? అనే ప్రశ్న నన్ను అడిగితే, ఈ కవిత్వం చదివిన వారు ఎవరైనా ఇందులోని ప్రేమ అద్భుతంగా ఉంది.. అని సమాధానం ఇస్తారు . ఈ పుస్తకంలోని ప్రేమని, విరహాన్ని, వేదనను పుస్తకం చదివిన వారు ఎవరైనా ఫీల్ అవుతారు.
ప్రేమ అనగానే లేదా ప్రేమ పేరు వినగానే మనకు తెలియకుండానే మన పెదవుల పై చిరునవ్వు, మన ముఖంలో ఒక భావం చిగురిస్తుంది. అసలు ప్రేమ లేకుంటే అమ్మే బ్రతకడం కష్టం అని చెప్పే వాళ్ళు లేకపోలేదు. అసలు ప్రేమ లేకపోతే ఏ బంధము నిలువదు అనేది నా నమ్మకం. జీవితంలో మనసుకి అంతులేని ఆనందాన్ని ఇచ్చిన, జీవిత కాలం ఒక విషాదాన్ని మిగిల్చినా!. ఏదైనా దానికి ప్రేమ ఒక కారణం.
పుస్తకంలో కవిత్వం లేదు అనుకుంటూ రచయిత చెప్పిన ప్రేమ కవితలు, తనకు లోకమెంత, ప్రేమతో కనిపిస్తుందో, ఈ లోకంలో ఎంత ప్రేమతో నిండిపోయిదో చూపిస్తాడు.
” నీ గురించి విన్నాకో
నిన్ను చదివాకో
తెలియదు గాని
నీతో ప్రేమలో పడి చాన్నాళ్ళయింది
విశ్వ వ్యాప్తమైన నీ పేరు
మండే గుండెకు దిక్సూచి అన్నాడు
నాన్న నిన్ను పరిచయం చేస్తూ”
తన తండ్రి పరిచయం చేసిన మాటల్లోనే తన తొలి ప్రేయసిని చూసానని చెప్పిన కవితా వాక్యాలు, తనలో రగిలిన విప్లవం గురించి, తన తొలి ప్రేమ సమాజ చైతన్యమే అని తన బాధ్యతని గుర్తు చేసుకుంటూ దాని కోసం పోరుబాటులో నడిచేందుకు తాను సిద్ధమని, ఏ యుద్ధం చేయడానికైన వెనుకాకు రాను అని తెలియచెప్పేందుకు ప్రయత్నించాడు .
నలుపు వ్యతిరేకం అని అందరికి తెలిసిన విషయం. నలుపుతో ఆ వెలివాడను కవి చాలా అద్భుతంగా ఓ నా నల్ల కాలువ అని పోలుస్తాడు. బహుజన అస్తిత్వం, ఆ నల్ల కలువ పైన తనకు ఉన్న ప్రేమని, అప్యాయతనీ, మరి కొన్ని కవితల్లో వెలివాడలోని ప్రజల జీవితాన్ని ఎంత ప్రేమగా చూస్తారో, వాళ్ళు వాయించే డప్పు అవర్ణ శబ్దాలు ఉన్న, ఈ మనుషుల బహుజనులు పట్ల ఎంత అసహనం చూపిస్తున్నారో దాని వల్ల వాళ్ళు అనుభవిస్తున్న వేదన గురించి తెలియజేస్తారు .
ఈ సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా ఆ వెలివాడ విముక్తి కోసం , ఏ సరిహద్దులు లేని సమాజం నిర్మించడం తన ఆశయం అని కవి తెలియచెప్పేందుకు ప్రయత్నించాడు.
ఎప్పటికైనా పాలకులదే యుద్ధం. ప్రేమెన్నడూ ప్రజలదే అని ఈ సమాజంలో రాజకీయ నాయకులు, కులం, పేరుతో చేస్తున్న దుర్మార్గాల గురించి రాయడం, ఈ సమాజంలో తను కోరుకున్న మార్పు గురించి తెలుపుతుంది.
కులం, మతం పేరుతో ప్రేమను చంపబడుతున్న చోట, తన ప్రేయసితో కలిపి సరిహద్దులు లేని సమాజాన్ని కలగంటున్న అని రాస్తాడు. మా బహుజన వాడలో డప్పు సప్పుడుతో ఒకరితో ఒకరం కలిసిపోయి అందరం సామూహికంగా తాండవిద్దాం అని రాయడం ఈ సమాజంలో ఏ మార్పు రావాలి అని కోరుకుంటున్నారో అర్థమవుతుంది .
“ఆమె గాయపడ్డ ప్రతిసారి గుండెలో గేయం ఒకటి అర్ధాంతరంగా ఆగిపోతుంది అంటాడు”
ఎన్ని వందల వేల పుప్పోడుల ముద్దులిచ్చానో నా సీతకోక చిలుక నవ్వుల కనులకి చూపుల మెరుపులు పుట్టించిన ఆ విప్పారిన నేత్రాలకి అని అందరిని ప్రేమ మత్తులో ముంచేస్తాడు.
“ఆమె ప్రతీరాకడ అల తీరానికి మోసుకువచ్చే కాన్క” అంటూ తను ఎదురు చూపుల్లో శరత్కాలపు వెన్నెలను కురిపిస్తునే తెగిన చూపుల్లో టూటే హుయే దిల్ కే కుచ్ భీగి అల్ఫాజ్ అంటూ తన హృదయ సవ్వడిని మనకు వినిపిస్తాడు.
ఊహ తెలిసిన నాటి నుండి విప్లవాన్ని, చైతన్యవంతమైన సమాజాన్ని కలగంటూన్నాను, విప్లవం లేక పోతే తనకు బ్రతుకే లేదు అని తన జీవితాన్ని తెలియజేప్పేందుకు ప్రయత్నించాడు.
ప్రేమను వివిధ కోణాల్లో వివరించి రాసిన కవిత్వమే ఈ “కాసింత ప్రేమ కావాలి” ఇది ప్రేమని, బాధ్యతలన్నీ, సమాజంలో తను కోరుకుంటున్న మార్పు తను ఎంచుకున్న దారి గురించి, తన యాదలో దాచుకున్న భావాలే ఈ కవిత్వం. దీన్ని చదవడం మొదలు పెడితే ప్రేమ, విప్లవం రెండు ఒకటే అని, విప్లవంతో కూడా ప్రేమ, ఓ విముక్తి కాంక్షను సమాజ చైతన్య కాంతినే కోరుకుంటుంది అని అర్ధమవుతుంది. ఈ పుస్తకం చదవడం మొదలు పెడితే పూర్తిగా చదివే వారు వదిలి పెట్టరు. ఈ సమాజమే ఈ కవి ప్రియమైన ప్రేయసి అని తెలుస్తుంది.