రాతన్నాక అప్పుడప్పుడు
లోకాన్ని నగ్నపరచి రాయాల
నగ్నంగా విన్న దాన్ని వాస్తవీకరించాల్న
నలిగిన దేహాల్ని
మాటల్ని గాక
సరికొత్త వాక్యం పుట్టించాల్న
కోపమొస్తే కొవ్వొత్తిలా కరిగి
అగ్నిలా వెలుగొందాల్న
నిప్పులు చిమ్మాల్న
చపాతిముద్దలా పిసకబడ్డ
కోమల జీవితాలను వర్ణించాల్న
నీవొక
కొత్త వాక్యాన్ని నిర్మించావంటే
నువ్వొక నూతన రూపం ధరించాల్సిందే
మట్టి పిసికినప్పుడల్లా నూతన రూపం
ధరించలేదా..?
మనిషి మనిషి కానప్పుడు మట్టే కదా.!
నీచేతిలో ఎదిగినాక్షరాలు
కూసింతమందికైనా గొడుగుపట్టాల
సెగలుగక్కే డ్రైనోసర్ల నుంచి పీడుతుల్ని
రాసిన పదాల ధైర్యంతో
వారిచుట్టూరా
ఒక్కొక్క ముళ్ళకంచయి వలయాన్ని చుట్టాల్న
అధికార మొత్తు మేఘాల్ని
పదాల ఉరుముల్తో కిందాకి దించాల్నా.
ఒక్కొక్క పాదంలో నువ్వొక కొత్తప్రాణిలా
జన్మించాలా.
పదాల్లో జీవించాలా
పదాల్ని జీవింపచేయాల
తొలకరి జల్లుల తాకిడికి విత్తు వికసించినట్లు
పాఠకునిలో
భిన్నత్వాన్ని విసర్జించి ఏకత్వాన్ని బోధించాల్నా.
కవిత్వమంటే
అంతరాల్లో మధించి మధనపర్వతం నుండొప్పోంగే లావానే కదా
కవి అగ్ని పర్వతమైతే దాల్నోంచి యెగసిపడే లావానే కవిత్వం…!
కవిత్వంలో కొత్త వాక్యాన్ని రాసుకున్నప్పుడల్లా
నన్ను నేను పునఃనిర్మించుకుంటాను
సమాజాన్ని మార్చాలని కలాలుపట్టే కవుల్లారా
మీ యీ కలాల్లో సిరా అయిపోతే చెప్పండి
నా రక్తాన్ని నరాల్లో నుండి సిరాల్లోకి ప్రవాహింప చేస్తాను
Related