ఈ జూన్ 6 కు భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో జైలుకు పోయిన మొదటి ఐదుగురిలో నలుగురి జైలు జీవితం ఆరో సంవత్సరం పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది.

ఈ  ఐదుగురిలో మొదటివాడుగా రోనా విల్సన్‌ను పేర్కొనవచ్చు. ఎందుకంటే అంతకన్నా ముందు 2018 ఏప్రిల్  27న ఢిల్లీలో మునీర్కాలో వున్న ఆయన అద్దె గదిపై పూనే విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ ఎసిపి శివాజీ పవార్ నాయకత్వంలో పోలీసులు రెయిడ్ చేసి ఆయన కంప్యూటర్‌ను , పెన్ డ్రైవ్‌లను, యితర ఎలక్ట్రానిక్ పరికరాలను, పుస్తకాలను ఎత్తుకపోయారు. మిగతా ఐదుగురిలో సుధీర్ ధావ్లే (రిపబ్లికన్ ప్యాంథర్స్ వ్యవస్థాపకుడు) ఉంటున్న ముంబైలోని అద్దెగదిపై రెయిడ్ చేసి ఆయనను జూన్ 6 న అరెస్టు కూడా చేసారు. పూనేలో 2017 డిసెంబర్ 31న జరిగిన ఎల్గార్ పరిషత్‌లో రిపబ్లికన్ ప్యాంథర్స్  తరఫున పాల్గొని మరొక సాంస్క్రతిక కళాకారుల సంస్థ కబీర్ కళా మంచ్‌తో పాటు ‘నయీ పీష్వాయీ నహీ చలేగి’ అనే నినాదంతో, పోరాట పిలుపుతో పాల్గొన్నాడు గనుక అరెస్టు చేసి సుధీర్ ధావ్లే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని కుట్ర కేసు నమోదు చేశారు.

మహారాష్ట్రలో ముంబైలో సుధీర్ ఇంటిపై దాడి చేసిన 2018 జూన్ 6  రోజే నాగపూర్‌లో యిరవై ఐదేళ్లుగా ఆదివాసీల, దళితులపై పెట్టిన కేసులు వాదిస్తున్న సుప్రసిద్ధ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌ను, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిపై (సీనియర్ జర్నలిస్టు ప్రశాంత రాహి , జెఎన్‌యు విద్యార్థి, సాంస్కృతిక కళాకారుడు హేమ్ మిశ్రా, ఆదివాసీలైన పాండు నరోటే, మహేష్  టిర్కే, విజయ్  టిర్కే ) గడ్చిరోలిలో 2013లో నమోదైన కేసు వాదించిన కక్షతో అరెస్టు చేశారు. అట్లాగే నాగపూర్ విశ్వవిద్యాలయంలో మరో నెలకు రిటైర్ కానున్న ప్రొఫెసర్ షోమాసేన్ (ఇంగ్లిషు డిపార్ట్‌మెంట్, జెండర్ స్టడీస్ బాధ్యురాలు) ఆదివాసి హక్కుల కార్యకర్త, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్‌లో ఎంఎస్ చేసి ప్రధాని ఆదివాసి విభాగంలో పనిచేస్తున్న ముప్ఫై ఏళ్ళ యువకుడు మహేష్ రావత్‌ను అరెస్టు చేశారు.

ఈ ఐదుగురిలో షోమాసేన్‌కు మాత్రమే ఎన్నో న్యాయ పోరాటాల తర్వాత ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి, నాగపూర్, మహారాష్ట్రలో ఎక్కడైనా ఉండడానికి అనుమతించింది.

వాస్తవానికి చట్టబద్ధంగా కూడ వీళ్ళు ఐదుగురు 90 రోజుల లోపల ఛార్జ్‌షీట్ ఫైల్ చేయకపోయినా, అది యాంత్రికమైన పద్ధతిలో చేసినా  2018 సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండె. బొంబాయి హైకోర్టు సెప్టెంబర్  6 తర్వాత ఛార్జ్‌షీట్‌పై ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో ఐఓ (ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శివాజీ పవార్)తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అభిప్రాయం వ్యాఖ్య ఏమీ రాయకుండా యాంత్రికంగా ఫైల్ చేసిందని ఈ ఐదుగురు ముద్దాయిల తరఫున చేసిన వాదనలను ఆమోదించి వీరికి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. అంటే రెండవ విడత ఆగస్టు 18న అరెస్టయి, హౌస్ అరెస్టులో అక్టోబర్, నవంబర్‌లలో కొనసాగినవారు ఎరవాడ జైలుకు రాకముందే (గౌతమ్ నవలఖా  మినహా సుధా భరద్వాజ్, వర్నన్ గోన్సాల్విస్, అరుణ్ ఫెరెరా, వివి) మొదటి ఐదుగురు విడుదల అయి ఉండవచ్చు.

కానీ బొంబాయి హైకోర్టు ఈ ఐదుగురికి ఇచ్చిన డిఫాల్ట్ బెయిలును వ్యతిరేకిస్తూ ప్రాసిక్యూషన్ అంటే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్టే తెచ్చింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ముందుకు ఇది వచ్చేనాటికి జస్టిస్ రంజన్ గొగోయ్ పదోన్నతి  పొందాడు. ఆయన కుఖ్యాతి గురించి చెప్పనక్కర్లేదు కదా.  అయోధ్య తీర్పు రామ మందిర నిర్మాణం కొరకు భూమినంతా ట్రస్ట్‌కు కట్టబెట్టిన ఐదుగురి ధర్మాసనానికి ఆయన అధ్యక్షత వహించాడు. అది ఏకగ్రీవ తీర్పు మాత్రమే కాదు, ఎవరు రాశారో కూడా ప్రకటించలేదు. అది ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చంద్ర చూడ్ రాసాడన్నది బహిరంగ రహస్యమే. రంజిత్ గొగోయ్ తన ఆత్మ కథలో మాత్రం ఆ తీర్పు ఇచ్చిన సాయంత్రం తన నలుగురు బ్రదర్స్ (సహ న్యాయమూర్తులు)కు ఐదు నక్షత్రాల హొటల్‌లో విందు ఇచ్చానని రాసుకొని రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయ్యాడు.

సామాజిక రిజర్వేషన్లు వర్తించని ఉన్నత న్యాయవ్యవస్థ బ్రాహ్మణీయ స్వభావం అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం నేపథ్యం మనకు తెలిసి ఉండాలి. యూఎపిఎ వంటి అప్రజాస్వామిక చట్టంలో కూడా  ప్రొసీజర్‌కు మినహాయింపు లేదనేది ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఇతరుల కేసులో రెండు మార్లు, డిఫాల్ట్ బెయిల్ కేసు విషయంలో సుధా భరద్వాజ్‌కు  బొంబాయి హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడే మళ్ళీ రుజువయింది.

కాని డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ చేయడానికి రంజన్ గొగోయ్ ఛార్జిషీట్ ఇంగ్లీష్ అనువాదం వారం రోజుల్లో కావాలన్నాడు. ఇంక స్వయంగా స్వయంసేవకుడైన డాక్టర్ శివాజీ పవార్ ఇన్వెస్టిగేటింగ్  ఆఫీసర్ పూనే ఫెర్గూసన్ లా కాలేజీ మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలం గల సభ్యులు, ప్రిన్సిపల్ సహాయంతో ఒక సమావేశం ఏర్పాటు చేయించి ఈ చార్జిషీటు అనువాదం ఎంత దేశభక్తుల కర్తవ్యమో వివరించి ప్రిన్సిపల్, అధ్యాపకులతో, రిసెర్చ్ స్కాలర్స్‌లలో కొందరితో మూడు రోజుల్లో ఇంగ్లిషు అనువాదం పూర్తి చేయించాడు.

డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం అనేది టెక్నికల్ లోపాల వల్లనే జరిగింది తప్ప చార్జిషీట్‌ను బట్టి చూస్తే ప్రైమాఫేసీ నేరారోపణకు అవకాశం ఉన్నదని చెప్తూ రంజన్ గొగోయ్ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేశాడు. దానిపై ఈ ఐదుగురు ముద్దాయిలు వేసిన రివ్యూ పిటిషన్  ఈ ఐదు సంవత్సరాలుగా సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ ముందుకు రానేలేదు.

2019లోనే వర్నన్, అరుణ్‌లు ట్రయల్ కోర్టు (పూనే) బెయిల్ నిరాకరించాక హైకోర్టులో బెయిల్ కోసం వేశారు. అప్పుడే సుధా భరద్వాజ్ వేసింది. కానీ జస్టిస్ కొత్వాల్ ద్వి సభ్య బెంచి (వార్ అండ్ పీస్ అనే విదేశీ నవల ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని వర్నెన్‌ను ఆక్షేపించిన జడ్జి) బెయిల్ నిరాకరిస్తూ ముగ్గురికి ఒక్కొక్కరికి 60 పేజీల తీర్పులు ఇచ్చింది. దానిపై వర్నెన్‌, అరుణ్‌, సుధా భరద్వాజ్ సుప్రీంకోర్టుకు పోయారు. విడివిడిగానే పోవాల్సి ఉంటుంది. డిఫాల్ట్ వంటివి తప్ప. అంతేకాకుండా సుధా, గౌతమ్, హనీ బాబులకు డాక్టర్ యుగ్ చౌదరి హైకోర్టులో లాయర్.

రెండవసారి అరెస్ట్ అయిన  నలుగురు (సుధా భరద్వాజ్, వర్నెన్‌, అరుణ్‌, వివి) హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ వేస్తే, ఎన్ఐఏ చేపట్టిన తర్వాత 2021 డిసెంబర్‌లో సుధా భరద్వాజకు మాత్రం డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి మిగతా ముగ్గురికి నిరాకరించింది హైకోర్టు.

మొదట తొమ్మిది మందిలో వివికి మెడికల్ బెయిల్ ఆగస్టు 2022లో పర్మినెంట్‌గా మారాక, అప్పటికే షోమా, మహేశ్‌లు బెయిల్ పిటిషన్లు  (షోమా విషయంలోనైతే మెడికల్ బెయిల్, ఇంటీరియమ్ బెయిల్, రెగ్యులర్ బెయిల్లలో ఏదైనా ఇవ్వాలని ఆమె అనారోగ్య కారణాలతో కోరుతూ ఆమె గ్లుకోమా, ఆర్థరైటిస్తో బాధపడుతున్న 65 సంవత్సరాల ముద్దాయి కనుక బొంబాయి హైకోర్టులో ఉన్నందున) మిగిలిన సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్‌లు, సుధా భరద్వాజ్‍కిచ్చిన డిఫాల్ట్ బెయిల్ తమకు కూడా వర్తిస్తుందని, గతంలో వేసిన గ్రౌండ్స్ పైన కాకుండా విడిగా పిటిషన్ వేసారు. దానిపై వాదనలు హైకోర్టు బెంచ్ విన్నది. తీర్పు పెండింగ్‍లో ఉన్నది. తీర్పు ఎప్పుడు చెప్తారని ఏ కోర్టునూ అడగడానికి చట్టం ప్రకారమే వీలు లేదు. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులను కానిస్టిట్యూషనల్ కోర్టులు అంటే రాజ్యాంగం మౌలిక స్వభావానికి భంగం రాకుండా వ్యాఖ్యానించే అధికారం వున్న కోర్టులను కేసు వినడం ఆలస్యమైతే మౌఖికంగా ప్రస్తావించి (మెన్షన్ చేసి) బెంచి మీదికి వచ్చేలా అభ్యర్థించవచ్చు కానీ తీర్పు రిజర్వుడులో ఉంటే ఎప్పుడు చెప్తారని అడగడానికి లేదు. తీర్పులు చెప్పకుండా బదిలీ అయిపోయిన, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులున్నారు. అప్పుడు జైల్లో ఏళ్ళుగా ఉండే ముద్దాయిల విషయంలో ‘రెడ్డొచ్చే మొదలాడు’ చందమే. న్యాయం పూర్తిగా న్యాయమూర్తి స్వీయ నిర్ణయం. మనం రాజకీయ, న్యాయేతర కారణాలు అని నిర్దిష్టంగా అంటే అప్పుడది కంటెప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. కోర్టులను, జడ్జిలను నిర్దిష్టంగా తప్పు పట్టడం కూడా శిక్షార్హమే.

ఇవి కాకుండా  రోనా విల్సన్ కంప్యూటర్లోకి  ప్రవేశించి మాల్‍వేర్ ప్రవేశపెట్టి ఈ ఛార్జిషీట్‌లోని ఉత్తరాలను సృష్టించారని కారవాన్ పత్రికలో వచ్చిన తర్వాత ముద్దాయిల( రోనా తరఫున) అమెరికన్ బార్ అసోసియేషన్ ఇందులో జోక్యం చేసుకోమని కోరగా వాళ్ళు ఆర్సెనల్ అనే పరిశోధనా సంస్థకు ఛార్జిషీట్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఇస్తే (ప్రాసిక్యూషన్ వాళ్లు ఇచ్చినవే) కారవాన్ కథనాన్ని ధ్రువపరచడమే కాదు అంతకన్నా విస్తారంగా పరిశోధన, అధ్యయనం చేసి ఆ వివరాలు వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చింది. ఆ పత్రిక స్వయంగా స్వతంత్రమైన న్యాయ నిపుణులను సంప్రదించి వాళ్లు ఆమోదించాకనే  ప్రచురించింది.

కనుక అమెరికన్ బార్ అసోసియేషన్ అభ్యర్థనపై పరిశోధన చేసి ఈ ఉత్తరాలు దురుద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టబడినవని తేల్చిన ఆర్సెనల్ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేయాలని, ఈ లోగా అప్పటిదాకా బెయిల్ ఇవ్వాలని రోనా విల్సన్, షోమాసేన్‌లు కూడా ముంబై హైకోర్టులో పిటీషన్లు వేసారు. అమెరికన్ బార్ అసోసియేషన్  అయినా అమెరికన్ ఆర్సెనల్ అయినా విదేశీ సంస్థలు గనుక వాటికి మన కోర్టులో చెల్లుబాటు ఉండదు అని  ప్రాసిక్యూషన్ అడ్డు చెబుతున్నప్పటికీ సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ బొంబాయి హైకోర్టులో వాదించింది గాని ఇంకా స్వీకరించే దశలోనే వాయిదా పడి మళ్లీ విచారణకు ఇప్పటిదాకా రాలేదు. ఇట్లా చెప్తూ పోతుంటే చట్టాలు సంక్లిష్టమా, న్యాయం సంక్లిష్టమా తేలదు గానీ జైళ్లలో స్వేచ్ఛాహరణ ఒక్కటే మనకు అర్థమవుతుంది. ఇక అటువంటప్పుడు అమరుడు స్టాన్‌ స్వామిది జ్యుడీషియల్ కస్టడీలో మరణం కనుక దానికి తలోజా జైలు నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని సవాల్ చేసిన పిటిషన్ కానీ, స్టాన్ స్వామిపై ‘టెర్రరిస్టు’ అనే అభియోగాన్ని తొలగించాలని ఫాదర్ ఫ్రేజర్ వేసిన పిటిషన్ గాని ఇప్పటివరకు బొంబాయి హైకోర్టు చేపట్టనే లేదు.

మొదటి ఐదుగురిలో ఒకరైన మహేశ్ రావత్ (ఈయన,  సుధీర్ ధావ్లే, విడుదలయ్యేదాకా షోమాసేన్ – ఏ కారణంతో కూడా కోర్టు తప్ప బయట ప్రపంచం చూడలేదు)కు 2023 సెప్టెంబర్లోనే బొంబాయి హైకోర్టు జస్టిస్ గడ్కరి బెంచ్ మెరిట్ రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. గౌతమ్ నవలఖ 2020 ఏప్రిల్ 14న ఎన్ఐఏ చేపట్టిన తర్వాత కోర్టులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆనంద్ తేలుతుంబ్డేతో పాటు సరెండర్ అయ్యాక కూడా గడ్కరి బెంచి బెయిల్ రెగ్యులర్, మెరిట్ ఆధారాలతోనే ఇచ్చింది. ఈ రెంటిపై స్టేట్ హైకోర్టులోనే స్టే తెచ్చుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఒక దశలో సాలిసిటర్ జనరల్ (అదనపు) రాజు ఈ రెండు బెయిల్ పిటీషన్లు కలిపి వినమని చీఫ్ జస్టిస్‌ను కోరాడు. ఈ ఇద్దరి లాయర్లు కూడా అంగీకరించారు. కానీ ఎందువల్లనో అది జరగలేదు. ఈ జూన్ 6నాటికే కాదు జూలై ఒకటి దాకా సుప్రీంకోర్టుకు సెలవులు కనుక మహేశ్ రావత్‌కు అప్పటికి కనీసం 10 నెలల కింద నయినా బొంబాయి హైకోర్టులో లభించిన స్వేచ్ఛ సుప్రీంకోర్టు స్టే తొలగి అనుకూలమైన తీర్పు వస్తే తప్ప ఎండమావి గానే మిగిలిపోతుంది.

ఈ లోపుగా ఆయన ఎరవాడ జైలు నుంచే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ హ్యూమన్ రైట్స్ డిప్లమా చేశాడు. తలోజా జైలు నుంచి లా ప్రవేశ పరీక్షలో 99.9 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

మహేశ్ కన్నా న్యాయం లభించ బోయి చేజారిపోయినామె కబీర్ కళా మంచ్  జ్యోతి జగతప్. వాస్తవానికి కబీర్ కళా మంచ్ కళాకారులను ముద్దాయిలుగా మొదటి నుంచీ చూపుతున్నప్పటికీ  2020 జనవరిలో ఎన్ఐఎ (కేంద్ర ప్రభుత్వం) ఈ కేసును చేపట్టిన తర్వాత 2020 సెప్టెంబర్లో ఈమెతోపాటు రమేష్ గైచార్, సాగర్ గోర్కెలను ఎన్ఐఏ ఆఫీసుకు పిలిపించి రోజంతా ప్రశ్నించడం కన్నా, ఎల్గార్ పరిషత్‌లో క్రియాశీలంగా పాల్గొన్న కబీర్ కళా మంచ్ సభ్యులుగా రమేష్, సాగర్లను, సుధీర్ ధావ్లేకు వ్యతిరేకంగా అప్రూవర్లుగా మారవలసిందిగా ఒత్తిడి పెట్టారు. అట్లా అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి వదిలేస్తామన్నారు. వాళ్లు గతంలో మూడేళ్లు నాగపూర్ జైల్లో ఉన్న అనుభవం ఉన్న రాటుతేలిన కళాకారులు కనుక మొదటి రోజు ఈ ఇంటరాగేషన్ అంతా జాగ్రత్తగా తమతో జేబుల్లో ఉన్న మొబైల్లో రికార్డు చేసి మొదటి రోజు ఇంటరాగేషన్ అయిపోగానే లాకప్ నుంచే బయటికి పంపారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయి వీళ్ళను జ్యోతితో పాటు కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపక తప్పలేదు. జ్యోతితో పాటు సుధా భరద్వాజ్, షోమా సేన్‌లు ఉన్న బైకులా మహిళా జైలుకు పంపారు. మిగతా ఇద్దరిని తలోజా జైలుకు పంపారు. జ్యోతి ఎమ్.ఎ సైకాలజీ పాస్ అయింది. ఆమె ట్రయల్ కోర్టు, హైకోర్టులలో బెయిల్ నిరాకరింపబడిన తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ సోమాసేన్ పిటిషన్ విచారణకు వచ్చే ముందు వేసింది. ఒక దశలో ఇద్దరిని కలిపి వినాలని ప్రతిపాదనలు కూడా ప్రాసిక్యూషన్ ఆమోదించింది. కానీ ఎందువల్లనో అది జరగలేదు. కానీ విడిగా ఆమె పిటిషన్ పై వాదనలు ముగిసాయి.  గౌతమ్ నవలఖాకు సుప్రీంకోర్టు మెరిట్, రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన మర్నాడు అదే బెంచి ముందు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే వాదనలు ముగిసాయన్న విషయం మరిచిపోయిన న్యాయమూర్తి మర్నాడు ఆ విషయం తాజాగా అఫిడవిట్ ఫైల్ చేయమని వాయిదా వేసాడు. సుప్రీంకోర్టు సెలవులు మొదలు కావడానికి ఒక రోజు ముందు మే 19న ఇంక ఇప్పుడు వినలేము సెలవులు తర్వాత జులై కి వాయిదా వేస్తున్నామన్నారు. మనమేమీ అనడానికి లేదు జులైలోనైనా వింటారని, అప్పటికి దాదాపు నాలుగు సంవత్సరాలు జైలు జీవితం అయిపోతుంది కనుక వస్తుందని ఆశించడమే ఆశావాదులుగా మన పని.

ఈ కేసులో ఉన్న ఒకే ఒక్క ముస్లిం ముద్దాయి ఢిల్లీ యూనివర్సిటీ హనీ బాబు. జైలుకు వచ్చినాక కరోనాకాలంలో ఆయన చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కున్నాడు. ఎన్ఐఎ ఈ కేసు చేపట్టిన తర్వాతనే ఆయన ఇంటిపై రెయిడ్స్ కానీ ఎన్ఐఎ ఆఫీస్‌కు రెండుసార్లు పిలిపించడం కానీ జరిగింది. ఆయన లింగ్విస్టిక్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గలవాడు. ఆయన విడుదల గురించి జరిగిన అంతర్జాతీయ సెమినార్‌కు రావాల్సి ఉండిన చామ్స్కీ  సందేశం పంపించాడు. జర్మనీలోని ఒక విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరెట్ ఇచ్చింది. ఆయన ఢిల్లీ   యూనివర్సిటీ ఇంగ్లిషు ప్రొఫెసర్ కనుక అప్పుడు సాయిబాబా వలెనే యూనివర్సిటీ క్వార్టర్స్‌లో ఉండడం వల్ల సాయిబాబా డిఫెన్స్ కమిటీలో ఉన్నాడు. అదే పెద్ద నేరమయింది. అయితే ఎన్ఐఎ ఆశించిందల్లా ఆయనను అరెస్టు చేయాలని కాదు సాయిబాబా డిఫెన్స్ కమిటీలో సిఆర్‌పిపి ఆర్గనైజింగ్ సెక్రటరీగా రోనా విల్సన్ క్రియాశీలంగా పనిచేశాడు కనుక రోనావిల్సన్‌కు మావోయిస్టు పార్టీతో క్రియాశీల సంబంధాలు ఉన్నాయని అప్రూవర్‌గా మారవలసిందిగా రెండు మూడు సార్లు పిలిచి ఒత్తిడి చేసారు. ఆయన ససేమిరా అన్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన సహచరి జెన్నీ రౌనా గానీ కూతురు గానీ తాము కూడా నైతికంగా ఆయన అండగా ఉంటామన్నారు. అప్పుడింక ఎన్ఐఎ సాయి బాబా అరెస్టు తర్వాత ఢిల్లీ కేంద్రంగా హనీ బాబు మావోయిస్టు పార్టీతో అర్బన్ మావోయిస్టుగా సంబంధాలు నెరపుతున్నాడని, ఆయన జాతీయంగా, అంతర్జాతీయంగా ఆ వ్యవహారాలు నిర్వహిస్తున్నాడని ఆరోపణలతో తలోజా జైలుకు పంపింది.

ఇటీవల సాయిబాబా ఆయన సహచరులు నిర్దోషులుగా విడుదలయ్యాక, హనీ బాబు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేసాడు. కానీ సుప్రీంకోర్టులో వాతావరణం అననుకూలంగా ఉన్నదని ఉమర్ ఖలీద్ తన బెయిల్ పిటీషన్ వెనక్కు తీసుకున్న కొంతకాలానికి హనీ బాబు కూడా అదే కారణాలతో వెనక్కి తీసుకున్నాడు. ఆయన మళ్లీ ట్రయల్ కోర్టు, హైకోర్టుల ద్వారా బెయిల్ ప్రయత్నాలు చేయాల్సిందే.

సురేంద్ర గాడ్లింగ్‌పై భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసుతోపాటు, 2016 లోనే ఆయన మొదటి ముద్దాయిగా చూపిన అహిరి పోలీస్ స్టేషన్ కేసు గడ్చిరోలి కోర్టులో ఉంది. సూర్జాగడ్  లాయిడ్స్ కంపెనీ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ టిప్పర్లు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ఆదివాసీలు కొంతకాలానికి బెయిల్ వచ్చి విడుదలయ్యారు కానీ అందులో మొదటి ముద్దాయిగా సురేంద్ర గాడ్లింగ్‌ను, రెండవ ముద్దాయిగా వివిని పెట్టారనేది 2019 జనవరిలో ఎరవాడ జైలుకు అహిరి పోలీసులు వచ్చి తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి 13 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడే తెలిసింది. వివికి భీమా కోరేగావ్ కేసులో హైకోర్టులో మెడికల్ బెయిలు వచ్చింది కనుక ఈ కేసులో కూడ గడ్చిరోలి కోర్టుకు కూడా మెడికల్ బెయిల్ ఇవ్వక తప్పలేదు. కానీ సురేంద్ర  గాడ్లింగ్‌కు గడ్చిరోలి కోర్టు కాదు కదా నాగపూర్ హైకోర్టు కూడా ఇప్పటికీ రెండు సార్లు బెయిల్ నిరాకరించింది. దానిపై ఆయన సుప్రీంకోర్టుకు కూడా పోయాడు. కానీ ఆయన కూడ సుప్రీంకోర్టులో వాతావరణం బాగా లేదని బెయిల్  పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు

ఇవి చేదు నిజాలు.

ఇప్పుడింక జూలైలో జ్యోతి జగతప్ సుప్రీంకోర్టు ఫలితాన్ని బట్టి కబీర్ కళా మంచ్ రమేష్, సాగర్‌లు తమ బెయిలు ప్రయత్నాలు మొదలు పెడతారు.

ఇప్పుడు తలోజా జైల్లో జూన్ 6 కు ఆరేళ్ల నుంచి ఉన్న సుధీర్, సురేంద్ర, రోనా, మహేష్ రౌత్‌లు – నలుగురు ఉన్నారు.  ఇంచుమించు నాలుగేళ్ల నుంచి ఉన్న హనీ బాబు కబీర్ కళా మంచ్ రమేష్, సాగర్‌లు ఉన్నారు. బైకులా జైల్లో జ్యోతి జగతప్ వుంది.

బి కె 16 లో 2021 జులై 5న స్టాన్ స్వామి జ్యుడీషియల్ కస్టడీలో అమరుడయ్యాక మిగిలిన 15 మందిలో ఏడుగురు బెయిల్‌పై విడుదలై ఉన్నారు. షోమా సేన్ నాగపూర్‌లో ఉండి ప్రతి వాయిదాకు ఇప్పటిదాకా ముంబై స్పెషల్ కోర్టుకు తిరుగుతున్నది. మిగతా వారంతా ముంబైలోనే ఉన్నారు. ఆనంద్ తేల్తుంబ్డేకు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో అంటే బొంబాయి హైకోర్టు పరిధిలో ఎక్కడికైనా వెళ్లే, తిరిగే అవకాశం ఉంది కానీ ఆయన తల్లిని చూడటానికి చంద్రపూర్ (ఆయన తమ్ముడు అక్కడ బొగ్గు గనుల్లో కార్మికుడు) పోవాలన్నా పోలీసు బందోబస్తు సంచలనం వల్ల తిరగడం లేదు.

సుధా భరద్వాజ్ ఇంక బొంబాయి హైకోర్టులోనే న్యాయవాదిగా నమోదయి ఒక సీనియర్ న్యాయవాది ఆఫీసుకు వెళ్తూ ఇప్పటికైతే మహిళా ఖైదీలకు, కార్మికులకు న్యాయ సలహాలు ఉచితంగా ఇచ్చే కర్తవ్యం నిర్వహిస్తున్నది. సరే ప్రస్తుతం ఇంకా విడుదల కావాల్సిన బికే ఎనిమిది మంది ముద్దాయిల గురించి రోనా తదితరులు అరెస్ట్ అయినప్పుడు చేపట్టిన కమిటీ అగెయినిస్ట్ స్టేట్ రిప్రెషన్ (సిఎయస్ఆర్) కిస్ కిస్ కో ఖైద్ కరోగే కమిటీ తరఫున జూన్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శన చేపట్టింది. రోనా విల్సన్, హనీ బాబు,  సురేంద్ర  గాడ్లింగ్, సుధీర్ ధావ్లే పేర్లతో పోస్టర్లు వెలువడినవి.  ఎట్లాగూ షోమాతప్ప మిగతా నలుగురు ఆరేళ్ళ నుంచి ఉన్న వాళ్లే గనుక వారితో పాటు  మంది పోస్టర్లు కూడా రావచ్చు.

కానీ ముఖ్యంగా ప్రతి జూన్ 6 ఒక సందర్భం భీమా కోరేగావ్ కేసులో మొదటి ఐదుగురు అరెస్ట్ అయిన రోజు. 2018 ఆగస్టు 18న అరెస్ట్ అయిన వాళ్లు, ఎన్ఐఎ తీసుకున్నాక 2020 ఏప్రిల్ 14న సుప్రీంకోర్టు ఆదేశాలపై హైకోర్టుకు  సరెండర్ అయిన ఇద్దరూ, అంటే మొత్తం ఏడుగురు బయట ఉన్నారు.

మిగతా ఎనిమిది మంది కోసం జంతర్ మంతర్ దగ్గరే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తూ మొత్తం రాజకీయ ఖైదీల విడుదల కోసం కేసుల ఉపసంహరణ కోసం ఈ జూన్ 6న (కొత్త కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది కనుక) ఒక కర్తవ్యంగా పోరాడుదాం.

కొసమెరుపు: భీమా కోరేగాఁవ్‌ ఎల్గార్‌ పరిషత్‌ కేసులో మొదటి ఐదుగురిలో ఒకరు, ఇంకా జైల్లో బందీగా ఉన్న మహేష్‌ రావత్‌ జూన్‌ 6 కు మరో ముగ్గురితోపాటు ఆరేళ్లు శిక్ష పూర్తి చేసుకొని ఏడో ఏట ప్రవేశించాడని పైన రాసాను. అయితే ఆయనకు బొంబాయి హైకోర్టు ద్వి సభ్య బెంచి 2023 సెప్టెంబర్‌లోనే రెగ్యులర్‌ మెరిట్‌ బెయిలు ఇచ్చింది. ఎన్‌ఐఏ కు దానిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు పోవడానికి రెండు వారాల స్టే అడిగితే  ఒకవారం స్టే కూడ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎన్‌ఐఏ అభ్యంతరాన్ని వినడానికి అనుమతించి అప్పటి నుంచి తొమ్మిది నెలలుగా నిరవధికంగా స్టే పొడగిస్తున్నది. సుప్రీం కోర్టుకు జూలై 1 దాకా సెలవులు గనుక ఆ తొమ్మిది నెలల స్టే పది నెలలు కూడ కావచ్చు. ఇంకా ఎక్కువే కావచ్చు. అయితే సుప్రీంకోర్టు కేసు వినడానికి స్టే ఇవ్వవచ్చు గానీ కాలాన్ని స్థంబింపచేయలేదు కదా.

ఈ లోగా మే నెలలో మహేశ్‌ రావత్‌ నానీ (అమ్మమ్మ) తీవ్ర అస్వస్థతకు గురయింది. ఆమె మహేష్‌ను మూడో ఏట నుంచి పెంచి పెద్దచేసినామె. ఆమె గడ్చిరోలీ జిల్లాలో ఉంటుంది. కనుక తీవ్ర అస్వస్థతకు గురయిన, తనను పెంచి పెద్ద చేసిన నానీని చూసి రావడానికి తనకు రెండు వారాల తాత్కాలిక మధ్యంతర బెయిలు ఇవ్వవలసిందిగా ముంబైలో ఉన్న రెగ్యులర్‌ ట్రయల్‌ (స్పెషల్‌) కోర్టులో పిటిషన్‌ వేసాడు. రెగ్యులర్‌గా కేసు నిర్వహిస్తున్న స్పెషల్‌ జడ్జి కటారియా మే లో సెలవుపై పోయినందున మరో స్పెషల్‌ (ఎన్‌ఐఏ) సెషన్స్‌ కోర్టు ముందుకు జూన్‌ 5న బెయిల్‌ దరఖాస్తు విచారణకు వచ్చింది. మహేష్‌ తనకు (బొంబాయి హైకోర్టు రెగ్యులర్‌ మెరిట్‌ బెయిల్‌ ఇచ్చిందనే) కోర్టుకు చెప్పాడు గానీ) ఆ బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందనే వాస్తవాన్ని దాచాడని అందుకని తాత్కాలికంగా రెండు వారాల కోసం బెయిల్‌ ఇవ్వవద్దని ఎన్‌ఐఎ అభ్యంతరం చెప్పింది. తమకు మహేష్‌కు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చే విషయంలో అభ్యంతరం లేదు, లా ఎంట్రెన్స్‌ పరీక్ష రాయడానికి మార్చ్‌ 4న ముంబైలో పరీక్షా కేంద్రానికి పంపడానికి అభ్యంతరం చెప్పలేదుకదా. ఇది రెండు వారాల దీర్ఘకాలం గనుక అభ్యంతరం అన్నది.

ఇంచార్జ్‌ జడ్జి లాహోటి చార్జిషీట్‌లో ప్రైమాఫెసీ (పైపైన చూసినప్పటికీ) తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి గనుక తాత్కాలిక బెయిలు ఇవ్వలేనని పిటిషన్‌ తిరస్కరించాడు.

వాదనల్లో గానీ, తీర్పులో గానీ ఆయనను మూడో ఏట నుంచి పెంచి పెద్ద చేసిన నానీ తీవ్ర అస్వస్థత పట్ల ఎన్‌ఐఏ, కోర్టు స్పందన లేదు. బొంబాయి హై కోర్టు 2023 సెప్టెంబర్‌ లోనే రెగ్యులర్‌ మెరిట్‌ బెయిల్‌ ఇచ్చిన గుర్తింపు లేదు.

కోర్టులకు కాలాన్ని స్థంభింప చేసే శక్తి లేదు గనుక జ్యూడిషియల్  కస్టడీలో ఉన్న స్టాన్‌స్వామిని మరణించకుండా ఆపలేకపోయింది. ఇంకా బయట తీవ్ర అస్వస్థత ఉన్న మహేష్‌ నానీ కోసం ఏం హామీ పడుతుంది. పైగా కోర్టులకుండే అధికారం కూడ జైల్లో పెట్టడమో బెయిల్‌ ఇవ్వడమో కానీ, మానవ సంబంధాలను పరిగణనలోకి తీసుకోవడం కాదు గదా. న్యాయం కన్నా కాలం బలీయమైంది.

11-06-2024

Leave a Reply