దేశ వ్యాప్తంగా ఆదివాసులకు కెండు లేదా టెండు ఆకు (బీడీ ఆకు) కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే కాదు, వారి జీవనాధారం. పొడి నెలల్లో వచ్చే ఈ ఆకులు వేలాది కుటుంబాలకు కాలానుగుణ ఆదాయాన్ని అందించే హామీనిస్తున్నాయి. కానీ అకారణ ఆలస్యాలు, అమ్ముకోడానికి అనుమతినివ్వడంలో ఆలస్యం, ప్రభుత్వ ఉదాసీన ప్రవృత్తి వల్ల ప్రతీ ఏడాదీ ఇబ్బందులు పడుతున్నారు.
పంట కోత పూర్తి స్థాయిలో ఉండగా, రుతుపవనాలు వేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో, ఒడిశాలోని కొరాపుట్‌లోని ని బోయిపారిగుడా బ్లాక్‌లోని ఎనిమిది గ్రామ సభలు ఈ సీజన్‌లో తాము సేకరించిన బీడీ ఆకును స్వతంత్రంగా అమ్ముకోవడానికి అనుమతి కోసం ఇంకా వేచి ఉన్నాయి.
2006 అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఎ) ప్రకారం ఆదివాసీ సముదాయాలు రాజ్య జోక్యం లేకుండా చిన్న అటవీ ఉత్పత్తులను సొంతం చేసుకోవడానికి, సేకరించడానికి, అమ్ముకోవడానికి అధికారం ఉన్నప్పటికీ, అటవీ శాఖ ఇంకా వారి అమ్మకాలకు పచ్చ జండా ఊపలేదు.
ఇదే తరహా ఆలస్యం కారణంగా గత ఏడాది వర్షం వచ్చి 34 లక్షల రూపాయల విలువైన సరుకు కుళ్ళిపోయిన ప్రమాదం మళ్ళీ జరుగుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ సంవత్సరం ఆకులు వాడిపోవడం కూడా మొదలైంది.
“ఈ ఆకులను సేకరించేందుకు మా సముదాయం తీవ్రంగా కృషి చేస్తోంది, కానీ మార్కెట్ పైన మాకు నియంత్రణ లేదు. ప్రైవేటు వ్యాపారులకు నేరుగా అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. మేం చేసిన కష్టమంతా వృధా అయిపోతోంది. రానున్న నెలల్లో రుతుపవనాల కాలం ప్రారంభం కానుంది. ఈసారి వాటిని అమ్మలేక పోతే అది మా సరుకు నిల్వను ప్రభావితం చేస్తుంది. ఆర్థికంగా, మానసికంగా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది” అని బదలీ బేడా నివాసి నరేష్ అన్నారు.
అతను చాలా నిరాశ పడుతున్నాడు. “మా నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మాకు ఏదైనా అనుకోనిది జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? దీని కోసం మాకు ఏదైనా పరిహారం లభిస్తుందా? లేదు. అది ఒక కల. ఎందుకంటే దానికోసం కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలి. వారికేమీ నష్టం కలగదు; మేమూ, మా కష్టమూ నష్టపోతాం” అని ఆయన అన్నారు.
నరేష్ ఒక్కడే కాదు. “మేం అడవిలో భాగమై అటవీ ఉత్పత్తుల మీదే జీవిస్తున్నాం. గ్రామస్తులు పండించిన పంటను వారే అమ్ముకునే హక్కును ప్రభుత్వం గుర్తించాలి. మాకు కావాల్సింది దానధర్మాలు కాదు, మా పనికి మంచి ధరను సంపాదించే అవకాశం కావాలి” అని ఎనిమిది గ్రామ సభలలో ఒకటైన నీరన్ (అభ్యర్థన మేరకు పేరు చెప్పడంలేదు) అన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ సముదాయాలు ఒడిశా ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఓఎఫ్‌డిసి) కు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. కానీ ఎఫ్‌ఆర్‌ఎ కింద, రాష్ట్ర ఏజెన్సీని పక్కన పెట్టి, వారు నేరుగా ప్రైవేట్ కొనుగోలుదారులకు అమ్ముకోవడం అనేది చట్టబద్ధమైనదే. నబరంగ్‌పూర్, కలహండి వంటి జిల్లాలలో ఈ పథకం విజయవంతమైంది.
అయితే, కోరాపుట్ లో ఆ స్వేచ్ఛ అరుదుగా లభిస్తుంది.
“అనుమతి లేకపోవడం వల్ల మేము సేకరించిన ఆకులు కుళ్ళిపోవడం చూస్తే మా గుండెలు బద్దలైపోతాయి. చట్టాన్ని అనుసరిస్తున్న మాకు ఎందుకీ శిక్ష? మంచి ఆదాయం సంపాదించడానికి, మా కుటుంబాలను పోషించుకోవడానికి, మా రోజువారీ ఖర్చుల కోసం మాత్రమే మేం కోరుకున్నట్టుగా వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛను కోరుకుంటున్నాం” అని మరో గ్రామస్తుడు కవి చెప్పారు.
“ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీద అడుక్కోడానికి పంపించాలనుకుంటుందా? అప్పులు తీసుకొని మా కుటుంబాలు కష్టాలపాలు కావాలనుకుంటోందా? మేము మా హక్కులను మాత్రమే డిమాండ్ చేస్తున్నాము. ఆదాయం లేకపోవడం వల్ల మా కుటుంబాలు బాధపడుతున్నాయి; మా పిల్లల చదువు దెబ్బతింటుంది; ఇక ముందు అలా జరగకూడదు అని అనుకుంటున్నాం. ప్రశాంతంగా, ఆర్థిక నష్టాలు లేకుండా జీవించాలనుకుంటున్నాం” అని ఆయన అన్నారు
ముఖ్య కార్యదర్శి 2022లో గ్రామసభ నేతృత్వంలో వ్యాపారం జరగడాన్ని సమర్థిస్తూ ఇచ్చిన ఆదేశం ఉన్నప్పటికీ, అటవీ శాఖ తన వైఖరినే కొనసాగిస్తోంది.
కొరాపుట్ జిల్లాలో తెందు ఆకుల అమ్మకానికి ఉన్న నిబంధనలు తొలగించలేదు. మేం ఇప్పటికే ఉన్న నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అటవీ శాఖ కొనుగోళ్లు ప్రభుత్వం నిర్ణయించిన రేటుతో కొనసాగుతున్నాయి. అయితే, గ్రామస్తులు తమ సరుకును ఆ ధరకు ప్రభుత్వానికి అమ్మడానికి ఇష్టపడడడం లేదు. ఆకులను వృథా చేయకుండా ప్రస్తుత నిబంధనల ప్రకారం వాటిని ప్రభుత్వానికి అమ్మితే వారి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది” అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శరత్ కుమార్ సాహు అన్నారు.
కానీ గ్రామస్తులు ఈ వాదనను తిరస్కరిస్తున్నారు. “మేం మళ్లీ నష్టానికి అమ్మితే మా కుటుంబాలను పోషించుకోవడానికి డబ్బు ఉండదు. మేము విలాసవంతమైన జీవితం కావాలని అడగడం లేదు; మేము కేవలం నేరుగా అమ్ముకోవడానికి అనుమతినివ్వమని మాత్రమే అడుగుతున్నాం, అంతే. మా ఉత్పత్తులను అమ్ముకునే హక్కు మాకు ఉన్నదని చట్టం చెబుతోంది. అయితే, ప్రతి సంవత్సరమూ ప్రభుత్వం నుండి ఆమోదం పొందడానికి అర్థం పర్థం లేని అనేక ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తే, మేం మా ఆదాయాన్ని కోల్పోతాము” అని కవి గ్రామస్తుడు చెప్పారు.
“మా ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అమ్మాలనుకోవడం లేదు. పూర్తి స్థాయిలో చట్టాలు అమలు అవాలనుకుంటున్నాం. విధానాల అమలులో ఉన్న లోపాల వల్ల అన్యాయమైన పరిణామాలను ఎదుర్కోవటానికి బదులుగా ప్రభుత్వం ఎందుకని వ్యవస్థను మార్చదు?”అని ఆయన అన్నారు.
పనాస్‌పుట్ గ్రామ నివాసి అయిన మాధురి తన బాధను ఇలా పంచుకుంది. “మా సరుకును మేం అమ్ముకోవడానికి ఒకరి అనుమతి కోసం ఎందుకు వేచి ఉండాలో మాకు అర్థం కావడం లేదు. బీడీ ఆకులు నుండి వచ్చే ఆదాయం మీద నా కుటుంబం ఆధారపడి ఉంటుంది. కానీ, ప్రభుత్వం సకాలంలో మా అమ్మకాలు ఆమోదించకపోతే మాకు ఏమీ మిగలదు. ఆకులు ఎండిపోయి వాటి నాణ్యతను కోల్పోతాయి. మేము కష్టపడి పనిచేస్తాం, కానీ ఆ కష్ట ఫలితం మాకు దక్కదు. ఇది చాలా అన్యాయం… నా కుమార్తెకు పెళ్ళి చేయాలనుకుంటున్నాను. డబ్బు లేకుంటే ఎలా చేయను? నేను అప్పు చేయను. నా కూతురు కాబోయే అత్తమామల అవసరాలు, డిమాండ్లను నేను తీర్చలేను. నేను చనిపోతాను కానీ ఎవరి నుండి డబ్బు తీసుకోను. ప్రభుత్వం మన సంక్షేమం గురించి ఆలోచించాలి కానీ నాశనం చేయడం గురించి కాదు.”
ఈ ప్రాంతానికే చెందిన యువ అండర్ గ్రాడ్యుయేట్ పంకజ్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసాడు. “ఇది దయాధర్మం గురించి అడగడం కాదు; ఇది న్యాయమైన వాణిజ్యం, ఆర్థిక న్యాయాలకు సంబంధించినది. మాకు వనరులు ఉన్నాయి; వాటిని నేరుగా మార్కెట్‌లో అమ్మే స్వేచ్ఛ మాకు కావాలి. ఈ వ్యాపారంలో ఉన్న మధ్యవర్తులు మా సరుకు నుండి బాగా సంపాదిస్తారు; కానీ మాకు మాత్రం ఏమీ మిగలదు. మేము ఈ గొలుసు ప్రక్రియ ముగిసిపోవాలని, మాకు రావాల్సింది మాకు రావాలి అని అనుకుంటున్నాం”.
భారతదేశం అంతటా ఆదివాసుల హక్కుల అమలులో ఉన్న నిర్లక్ష్య ధోరణికి గల పెద్ద నమూనాను కోరాపుట్ సమస్య సూచిస్తుంది. అటవీ హక్కుల చట్టం వంటి ప్రగతిశీల చట్టాలు ఉన్నప్పటికీ, విధానానికి, ఆచరణకు మధ్య ఉన్న అంతరం చాలా పెద్దది.
“ప్రభుత్వం సకాలంలో అనుమతులను మంజూరు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేయకపోడం వల్ల తరతరాలుగా అడవుల సంరక్షకులుగా ఉన్న ప్రజలు తాము నిభాయించే వనరుల నుండి లాభాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు” అని పర్యావరణ విధాన నిపుణుడు రాహుల్ మాథుర్ ఖచ్చితంగా చెప్పారు.
వర్షా కాలం వస్తోంది, తెందు ఆకులు చెడిపోవడం మొదలవుతోంది.. సమయం గడిచిపోతోంది.
https://twocircles.net/2025apr30/451915.హాటముల్
2025 ఏప్రిల్ 30
తెలుగు: పద్మ కొండిపర్తి