అందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెదొక దారి అన్నట్టుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు. దూకుడుతనానికి దుందుడుకు స్వభావానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టింది పేరు. ప్రమాణ స్వీకారం చేసి చేయగానే దుందుడుకుగా మొదటి వారం రోజుల్లోనే పచ్చిగా తన మితవాద అజెండాను ముందుకు తెచ్చారు. అందులో ఒకటి వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు… ఆర్థికపరమైన యుద్ధం… సుంకాలు, పన్నులతో ఆయన మిత్రులనూ, శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోరాకడతో ప్రపంచం ఇప్పటికే ఉత్పాతాలకు సిద్ధపడిరది. కొలంబియాపై సుంకాల మోత మోగించిన ట్రంప్‌, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చిరకాలంగా తమతో వాణిజ్య భాగస్వాములుగా కొనసాగుతున్న మెక్సికో అండ్‌ కో పై ముందూవెనకా ఆలోచించకుండా సుంకాలు విధించడంతో అమెరికా వాణిజ్య విధానం విమర్శలకు గురవుతోంది. సుంకాల విధింపునకు ట్రంప్‌ చెబుతున్న కారణాలు వాణిజ్యానికి సంబంధం లేనివే కావడం గమనార్హం. గద్దెనెక్కగానే ఏం చేయబోతున్నావో ఆయన ముందుగానే చెప్పాడు. అమెరికాకి మళ్ళీ ఔన్నత్యాన్ని అద్దడానికి, గతకాలపు కీర్తిని తెచ్చి తలకు చుట్టడానికి ఇంటాబయటా కూడా సమూల ప్రక్షాళనకు ఒడిగడతానని ప్రమాణ చేశారాయన. అందులో భాగంగా అగ్రరాజ్యానికి తలవంపులు తెచ్చే వెకిలిపనులకు కూడా ఆయన వెనుకాడడం లేదు.

అధ్యక్షుడు ట్రంప్‌ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ… కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. దీంతో అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడిరటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది.  అది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చని మార్కెట్‌ వర్గాలు భయాందోళనలకు గురువుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులను వారు పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు టారిఫ్‌ షాక్‌తో మన కరెన్సీ మరింత బక్క చిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవిత కాల కనిష్ఠానికి పతనమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలూ మళ్లీ పుంజుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రూపాయి మరింత క్షీణించవచ్చని, పసిడి పరుగు పెట్టవచ్చన్న భయాందోళనలు నెలకొన్నాయి.  

చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్‌ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే.పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్‌ సరఫరాను అడ్డుకోవడానికి ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. మొత్తానికి ట్రంప్‌ ఆరంభించిన వాణిజ్య యుద్ధం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలాదేశాల మార్కెట్‌ సూచీలు ఆదుర్దాగా కదులుతున్నాయి. త్వరలోనే యూరోపియన్‌ యూనియన్‌ వంతు వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అధ్యక్షుడి అంతిమ లక్ష్యం మిగితా దేశాలను రాయబారానికి దించడం, లొంగివచ్చే వరకూ ఒత్తిడి పెంచడం కనుక ఈ వాణిజ్య యుద్ధానికి అందరు బలికాక తప్పదు. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. విశ్వవేదికపై ట్రంప్‌ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడిరది. ట్రంప్‌ సుంకాల యుద్ధానికి మిగతా దేశాలు మొదట్లో  కాస్తంత తడబడినా, త్వరితంగానే తట్టుకొని నిలబడ్డాయి. పెంచిన సుంకాల దెబ్బకు సరుకుల రాకడ తగ్గి, ధరలు పెరిగి సామాన్య అమెరికన్‌కు సెగ పుట్టడానికి కొంత సమయం పట్టవచ్చు.

అమెరికా సామ్రాజ్యవాదం ఏకపక్షంగా ఇతర దేశాలపై విధించే ఆంక్షలకు ఐరాస నుండి ఎటువంటి ఆమోద ముద్రా లేదు. తమ చెప్పుచేతల్లో మెలగడానికి నిరాకరించే సాహసానికి ఒడిగట్టినందుకు ప్రపంచంలో మూడో వంతు దేశాల మీద ఇప్పటివరకూ అమెరికా ఏదో ఒక విధమైన ఆంక్షలను విధించింది. పశ్చిమ దేశాలలోని ఆర్థిక సంస్థలలో ఆయా దేశాలు పెట్టిన పెట్టుబడులను స్తంభింపజేయడం ఆ ఆంక్షలలోని ఒక భాగం. ఇరాన్‌, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాల విషయంలో ఇదే జరుగుతోంది. ఇటీవల రష్యా కూడా వాటితో పాటు ఈ తరహా ఆంక్షలకు గురైంది. ఈ విధంగా సంపదను స్తంభింపజేయడం పెట్టుబడిదారీ సూత్రాలకే విరుద్ధం. అది కేవలం అంతర్జాతీయ దారి దోపిడీ మాత్రమే. కాని సామ్రాజ్యవాద దేశాలకు ఇటువంటి చర్యలు చేపట్టడంలో ఎటువంటి ఊగిసలాటలూ ఉండవు. పుండు మీద కారం జల్లినట్టు, ఇటీవల యుక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా స్తంభింపజేసిన రష్యన్‌ పెట్టుబడుల మీద వచ్చిన వడ్డీని రష్యా మీద యుక్రెయిన్‌ సాగిస్తున్న యుద్ధానికే ఆర్థిక తోడ్పాటుగా అమెరికా అందిస్తోంది.

ఇప్పటికే పలు దేశాలకు అగ్రరాజ్యం అమెరికా, 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పు ఉంది. వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పుడున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 1.5 శాతం మేర పడిపోతుందని ఆర్థికవేత్తల విశ్లేషణ. సగటు అమెరికన్‌ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్‌ (నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తారు.) తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్‌ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ తీరా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు.

ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడ్డాక రక్షణాత్మక విధానాలకు అన్ని దేశాలు స్వస్తి పలికాయి. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, రానున్న రోజుల్లో యూరోపియన్‌ యూనియన్‌, భారత్‌ సహా ఇతర దేశాలపైనా ట్రంప్‌ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై  లోతుగా దృష్టి పెట్టాలి. వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్భణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కానీ ట్రంప్‌ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?

ట్రంప్‌ దూకుడు చూస్తుంటే… ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’ తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్‌ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ-డాలరైజేషన్‌ చర్యల నుండి వెనక్కి తగ్గకపోతే బ్రిక్స్‌ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్‌లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థికవేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి… ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని, సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆ మేరకు ధరలు పెంచుతారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందే. జో బైడెన్‌ హయాంలో అధిక ధరలతో అసహనానికి గురైన అమెరికా ఓటర్లు ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు జై కొట్టారు. తీరా ట్రంప్‌ తాజా చర్యలతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి చందంగా మారేలా కనిపిస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుతో వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో దలాల్‌ స్ట్రీట్‌ బెంబేలెత్తుతోంది. మదుపరులు ఇప్పటికీ లక్షల కోట్లు నష్టపోయారు. స్టాక్‌ మార్కెట్లన్నీ నేల చూపు చూస్తున్నాయి. ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, రూపాయు పతనం, దేశీయంగా ఎలాంటి సానుకూలాంశాలు కానరాకపోవడంతో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవి చూస్తున్నారు.

ఫిబ్రవరి 10న ట్రంప్‌ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్‌ వేస్తానని ప్రకటించాడు. దీని ప్రభావం భారత్‌తో సహా కెనడా, మెక్సికో, చైనా, సౌత్‌ కొరియా, బ్రెజిల్‌పై పడనుంది. ట్రంప్‌ సుంకాల విధింపు విధానంతో ఆటో మొబైల్‌ రంగంలో గందరగోళాన్న సృష్టిస్తున్నారని ఫోర్డ్‌ సిఇవొ జిమ్‌ ఫర్లీ పేర్కొన్నాడు. ట్రంప్‌ విదేశీ దిగుమతులపై టారిఫ్‌లు 25 శాతం పెంచితే రిటైల్‌లో వస్తువుల ధరలు చాలా పెరుగుతాయి. ధరలకు కళ్లెం వేయలేదంటూ తమపై దుమ్మెత్తిపోసినా ప్రజలను డెమోక్రటిక్‌ పార్టీ నేతలు ఇప్పుడు చురకలంటిస్తున్నారు. తమను కాదని ట్రంప్‌ను నమ్ముకున్నందుకు భలే జరిగిందంటూ సోషల్‌ మీడియాలో వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. ‘‘పచారీ సరుకుల ధరలు ఎక్కువున్నాయా? టమాటాల ధరలపై ఆందోళన చెందుతున్నారా? కాస్తాగండి. మీ ట్రంప్‌ దాటికి అవన్నీ ఇంకా పెరగనున్నాయి’’ అని డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ చక్‌ షుమర్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో భవన నిర్మాణ రంగం దాదాపు కెనడా పైనే ఆధారపడిరది. రైతులు, ఆటో మేకర్స్‌, పరిశ్రమల సిబ్బంది అక్కడి నుంచి రావాల్సిందే.

అమెరికా విధించే పన్నులు ఎలా ప్రభావం చూపబోతున్నాయి? సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్న దానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8 శాతం దిగజారుతుంది. 1.3 ఎగుమతులు, 2.8 శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి. లక్షా 84 వేల ఉద్యోగాలు పోతాయి. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు పెరిగితే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25 శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బిలియన్‌ డాలర్లు, చైనా వస్తువులపై 43.2  బిలియన్‌ డాలర్లు, మొత్తం 275.7 బిలియన్‌ డాలర్లని, దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క. చైనా వస్తువులపై 60 శాతం, మిగతా వాటిపై 20 శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ చెబుతున్నది. మొత్తం మీద పది శాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, 7,600 డాలర్లు ఉంటుందని నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు.

ట్రంప్‌ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్‌ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్‌ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్‌ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారినపడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకుంటారా వేచి చూడాలి. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ మని తీర్పునిస్తే తప్ప… ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్‌ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్‌ మార్కు వ్యవహార శైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడకపోవచ్చు.. అదే సమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే!

దేశమేదైనా సామ్రాజ్యవాద  ప్రపంచీకరణ చట్రాన్నుంచి  బైటపడి ప్రజలకు అనుకూలంగా ఆర్థిక వ్యవస్థను స్వావలంబన దిశగా నిర్వహించాలని నిర్ణయించిందనుకుందాం. అప్పుడు ఆ దేశంలోని పెట్టుబడులు వెంటనే బైటకు తరలిపోతాయి. అప్పుడు బైట నుండి ఆ దేశానికి వచ్చే పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోతుంది. అనతి కాలంలోనే ఆ దేశపు విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆ దేశం దిగుమతుల మీద కూడా నియంత్రణ విధించాలి. దానివలన దేశంలో ప్రజలకు కావలసిన వస్తువులకు కొరత ఏర్పడుతుంది. వాటి ధరలు పెరుగుతాయి. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దిగుమతులకు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు పెంచుకోవాలి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు గనుక జరిగితే ఈ కష్టాలు చాలా మేరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆయా దేశాల నడుమ జరిగే ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలు ఇందుకు దోహదం చేస్తాయి. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్న కాలంలో చాలా దేశాలతో అది ఇటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేది. ఆ ఒప్పందాలు ఉభయ దేశాలకూ ప్రయోజనకరంగా ఉండేవి.

తమ దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధమనే ధీమాతో ఆయన ట్రంప్‌ ఉన్నట్లుగా కనబడుతోంది. కానీ, పేరుకు అగ్రరాజ్యమే అయినా చమురు సహా పలు ఉత్పత్తుల కోసం అగ్రరాజ్యం అనేక దేశాలపై ఆధారపడుతోందన్నది తోసిపుచ్చలేని నిజం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడం ప్రజాస్వామిక దేశాలు అనుసరించే ప్రాథమిక సూత్రం. అయితే డొనాల్డ్‌ ట్రంప్‌కు చర్చలపై అంతగా నమ్మకం ఉన్నట్లు కనబడదు. దూకుడుగా ప్రవర్తించడం. బెదిరింపుల ద్వారా, ఆంక్షలు విధించి కట్టడి చేయడం ద్వారా ఎదుటి వారిని దారికి తెచ్చుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. ఈ సందర్భంగా మిన్నెసోటా గవర్నర్‌ అమీ క్లోబుచర్‌ అన్న మాటలు ప్రస్తావనార్హం. ‘ట్రంప్‌ వచ్చాక గందరగోళం పెరిగింది. అవినీతి పెరిగింది. కోడిగుడ్ల ధరలు సైతం పెరిగాయి. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కావలసింది ఇది కాదు. ఉలిని వాడటానికి బదులు ఆయన పెద్ద సుత్తిని వాడుతున్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. గోటితో పోయేదానికి ట్రంప్‌ గొడ్డలి వరకూ తీసుకువెళ్తున్నారు. ఫలితంగా అమెరికా ఒంటరి కావచ్చని ఆందోళన వెలిబుచ్చాడు.

ఇప్పుడిప్పుడే అమెరికాకు వ్యతిరేకంగా అనేక కూటములు ఏర్పడుతున్నాయి. అమెరికా ఆధిపత్య చట్రాన్ని బద్దలుగొట్టుకుని బైట పడడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. చైనా తన ముడిచమురు దిగుమతుల కోసం చేసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అటువంటి అవకాశాల పెరుగుదలకు సంకేతం. ఇవాళ అమెరికా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రుణభారంతో సతమతమవుతోంది. వాణిజ్యపరంగా, సాంకేతిక రంగాలలో చైనా అమెరికాకు సవాలు విసురుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు చైనా అప్పులు ఇస్తోంది. డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెట్టడానికి బ్రిక్స్‌ కూటమి ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అన్ని రంగాల్లో డీలా పడుతున్న అమెరికా, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనా మధ్య రాజకీయ భౌగోళిక వైరుధ్యం ఉంది. ఈ సవాలును ఆంక్షలు, సుంకాల ద్వారా ట్రంప్‌ ఎదుర్కోవాలనుకుంటున్నాడు. అది అంత సులభం మాత్రం కాదు. ఆయన తన మార్గాన్ని మార్చుకోకపోతే, ప్రపంచ దేశాలు త్వరలోనే వాషింగ్టన్‌కు వ్యతిరేకంగా మరింత ఐక్యంగా మారవచ్చు.

Leave a Reply