మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం 1920ల నుండి అమెరికా డాలర్‌, బ్రిటన్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ను అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా   స్థానభ్రంశం చేయడం ప్రారంభించింది. యుద్ధం తర్వాత బంగారం ప్రవాహాలలో అమెరికా గణనీయమైన గ్రహీతగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరింత బలమైన సూపర్‌ పవర్‌గా అవతరించింది.1944 నాటి బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థాపించింది. దీంతో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోని ప్రాథమిక రిజర్వ్‌ కరెన్సీగా మారింది. యుద్ధానంతర కరెన్సీ బంగారంతో ముడిపడి ఉన్న ఏకైక అంతర్జాతీయ కరెన్సీ, ట్రాయ్‌ ఔన్సుకు 35 డాలర్లుగా స్థిరీకరించింది. 1944లో బ్రెట్టన్‌ వుడ్స్‌ వ్యవస్థను స్థాపించినప్పటి నుండి, అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్యానికి మాధ్యమంగా ఉపయోగిస్తోన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రెజరీ స్విఫ్ట్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్స్‌ నెట్‌వర్క్‌పై ఆధిపత్యం కలిగి ఉంది. పర్యవసానంగా విదేశీ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించే సామర్థ్యంతో ప్రపంచ దేశాల ఆర్థిక లావాదేవీల వ్యవస్థలపై అమెరికా భారీ ఆధిపత్యాన్ని కలిగి ఉంది.

రిజర్వ్‌ కరెన్సీ అనేది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విదేశీ కరెన్సీ. రిజర్వ్‌ కరెన్సీ అంతర్జాతీయ లావాదేవీలను సులభతరం చేయడానికి, వివిధ దేశాల కరెన్సీ మారకపు రేట్లను స్థిరీకరించడానికి, ఆర్థిక విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహద పడిరది. కేంద్ర బ్యాంకులు, ఇతర ద్రవ్య అధికారుల వద్ద ఉన్న విదేశీ కరెన్సీలు సాధారణంగా వాటి స్థిరత్వం, లిక్విడిటీ, గ్లోబల్‌ మార్కెట్‌లలో విస్తృత ఆమోదం ద్వారా వర్గీకరిస్తారు. ఇది వాణిజ్యం, పెట్టుబడులతో కూడిన ప్రపంచ అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించడానికి, వాటిని ఆకర్షణీయంగా చేస్తాయి. అంతర్జాతీయ రుణ బాధ్యతల కోసం సిద్ధం చేయడానికి, వారి దేశీయ మారకపు రేటును ప్రభావితం చేయడానికి కేంద్ర బ్యాంకులు రిజర్వ్‌ కరెన్సీని కూడా ఉపయోగిస్తాయి. ప్రస్తుతం అమెరికా డాలర్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా చలామణీలో ఉంది. చమురు నుండి బంగారం వరకు, అలాగే అమెరికా నుండి ఆయుధాలు కొనాలంటే డాలర్లు ఆయా దేశాల్లో ఉండి తీరాలి.

అయితే, ఇవాళ డాలర్‌ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? అమెరికా దూకుడు విధానాలు, డాలర్‌ ప్రపంచ ఆధిపత్యాన్ని నెమ్మదిగా పలు దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్‌ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత యూరప్‌ పూర్తిగా చితికిపోవడంతో డాలర్‌ ప్రాభవం మొదలైంది. యూరోపియన్‌ల యుద్ధకాంక్ష యుఎస్‌కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్‌ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్‌ దశ తిరిగింది. ఇవాళ దాదాపు అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్‌ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్స్చేంజ్‌ మార్కెట్‌లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడిరగ్‌ అమెరికన్‌ డాలర్ల ద్వారానే జరుగుతోంది.

1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ డాలర్‌తో గోల్డ్‌ స్టాండర్డ్‌ను రద్దు చేశాడు. అప్పటి నుంచి డాలర్‌ ఫియట్‌ కరెన్సీగా(పేపర్‌ కరెన్సీ) మారింది. ఫియట్‌ కరెన్సీ అనేది కాగితపు డబ్బు మాత్రమే. దీంతో కామెడిటి మనీ (బంగారం, వెండి) ప్రత్యామ్నాయం కాకుండా పోయింది. రిచర్డ్‌ నిక్సన్‌ ఇకపై బంగారంతో డాలర్లను రీడీమ్‌ చేయలేమన్నాడు. ఒకదేశం ఫియట్‌ కరెన్సీ రిజర్వ్‌ కరెన్సీ హోదాను కలిగి ఉంటే, అది అధిక కరెన్సీని ముద్రించడం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాల వస్తువులను, ఆస్తులను కొనుగోలు చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇది కనిపించని దోపిడీ. మరోవైపు ఒకే కరెన్సీపై అధికంగా ఆధారపడడం వలన డాలర్‌ విలువలో హెచ్చుతగ్గులు, అమెరికా ద్రవ్య విధానంలో చేపట్టే మార్పులు, అమెరికా విధించే ఆంక్షలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను బలహీనపరుస్తోన్నాయి.

ప్రపంచంలో చమురు అత్యంత ముఖ్యమైనది. చమురు ఉత్పత్తి చేసే దేశాలలో సౌదీ ముఖ్యమైనది. 1974 జూన్‌ 8న సౌదీ అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా చమురును డాలర్లలో మాత్రమే విక్రయించాలి. చమురు వ్యాపారం చాల లాభసాటి వ్యాపారం. చమురు ఉత్పత్తిపై నియంత్రణ కలిగియున్న బహుళజాతి సంస్థలు తమ లాభాలను (పెట్రో డాలర్లు) అమెరికా బ్యాంకుల్లో దాచుకున్నారు. దీంతో అమెరికాలో డాలర్ల నిల్వ పెరిగింది. 1974లో కుదిరిన ఈ ఒప్పందం వల్ల అమెరికా ప్రభుత్వం వివిధ అవసరాలను తీర్చుకుంది. అమెరికా చమురును సౌదీ అరేబియా నుండి కొనుగోలు చేస్తోంది. సౌదీ అరేబియా ఆ డబ్బును అమెరికా ఆయుధాల తయారీదారుల నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించింది. అమెరికా ట్రెజరీ బిల్లులలో, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలో అమ్మకాలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, పాశ్చాత్య బ్యాంకింగ్‌ వ్యవస్థలో చమురు లాభాలను రీసైకిల్‌ చేయడానికి ఈ ఏర్పాటును పెట్రో డాలర్‌ వ్యవస్థగా పిలుస్తారు.

అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలు తెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడిరది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు అది సూపర్‌ పవర్‌గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్‌ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్‌ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్‌ను కంట్రోల్‌ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్లు ప్రింటింగ్‌ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది. 2022 నాటికి మొత్తం యుఎస్‌ అప్పు 31.5 ట్రిలియన్‌ డాలర్లు (జిడిపితో పోలిస్తే 120 శాతం పైనే) ఉంది.

2014లో యుక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో అఫ్ఘానిస్తాన్‌, ఇరాన్‌, వెనిజులా వంటి దేశాలపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక 2022లో ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా, పశ్చిమ దేశాలు సీజ్‌ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపులు వ్యవస్థ (స్విఫ్ట్‌) నుండి తొలగించాయి. చైనా తయారీ రంగంలో అమెరికాను అధిగమించింది. అమెరికా చైనాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో అమెరికా, యూరప్‌ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది.

అంతర్జాతీయ విపణిలో అనేక వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే కొనసాగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది. డాలర్‌కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ అమాంతం పెరిగింది. అందరికీ డాలర్లు అవసరం కావడంతో, దానినే తన ఆయుధంగా మలచుకునే సౌలభ్యం అమెరికాకు ఏర్పడిరది. యుక్రెయిన్‌ యుద్ధం వల్ల రష్యా మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం డాలర్‌ ఆయుధీకరణకు నిదర్శనం. అమెరికాకు ఎదురుతిరిగే దేశాలకు డాలర్లు చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం కలుగుతుంది. పెట్టుబడులూ ఆగిపోతాయి. డాలర్‌తో పోలిస్తే ఆ దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపు మోయలేని భారమవుతుంది. రూపాయి విలువ తగ్గి డాలర్‌ విలువ పెరగడం వల్ల దిగుమతులు ప్రియమవుతాయి. ఫలితంగా వాణిజ్యలోటు పెరిగి, విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. అనివార్యంగా రుణాల కోసం చూడవలసి ఉంటుంది.

బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనాలు వ్యవస్థాపక దేశాలు. 2009 జూన్‌ 16న మెకా టెరిస్‌ బెర్గ్‌ బ్రెజిల్లాన్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. మొదట ఈ కూటమి బ్రిక్‌గా వ్యవహరించింది. 2010 సెప్టెంబర్‌లో సౌత్‌ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్‌గా మారింది. ప్రాంతీయ వ్యవహారాలపై వాటికున్న గణనీయమైన ప్రభావానికి గాను బ్రిక్స్‌ సభ్య దేశాలు ప్రసిద్ధి చెందాయి. ఇవన్నీ జి-20లో సభ్యులే. ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేతలు పాల్గంటూ ఉంటారు. 2009 నుండి బ్రిక్స్‌ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి. సభ్య దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహాకారాలను ప్రోత్సహించడం బ్రిక్స్‌ లక్ష్యం.

2020లో ఐదు బ్రిక్స్‌ దేశాలు 310 కోట్లకు పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో ఇది 41 శాతం. ఐదుగురు సభ్యులలో నలుగురు (దక్షిణాఫ్రికా మినహా- అది 24 స్థానంలో ఉంది) జనాభా ప్రకారం ప్రపంచంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. 2018 నాటికి, ఈ ఐదు దేశాల నామమాత్రపు జిడిపి 18.6 ట్రిలియన్‌ డాలర్లు. స్థూల ప్రపంచ ఉత్పత్తిలో ఇది 23.2 శాతం. ఇవాళ బ్రిక్స్‌ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉంది. బ్రిక్స్‌ సంయుక్త జిడిపి (పిపిపి) సుమారు 31.75 ట్రిలియన్‌ డాలర్లు (ప్రపంచ జిడిపిలో ఇది 32 శాతం). జి-7 దేశాల జిడిపి 30.7 శాతం కంటే బ్రిక్స్‌ దేశాల జిడిపి ఎక్కువగా ఉంది. వీటి సంయుక్త విదేశీ మారక నిల్వలు అమెరికా డాలర్లలో 464.46 ట్రిలియను ఉంది. బ్రిక్స్‌ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించుకుంటాయి. ఐదు దేశాలలోని బ్యాంకుల ఆర్థికాభివృద్ధికి ఆయా దేశ ప్రధాన మంత్రుల బృందం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంక్‌ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంక్‌ ఏర్పాటుకు బ్రిక్స్‌ దేశాలు సన్నద్ధమవుతున్నాయి.

చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం కూడా డాలర్‌ ఆధిపత్యానికి మరో కోణమే. దీన్ని సహించని రష్యా, చైనాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీలలోనే లావాదేవీలు జరపాలని నిశ్చయించాయి. దీంతో డాలర్‌ ఆధిపత్యానికి గండి పడే అవకాశం పెరిగింది. బ్రిక్స్‌ వేదికగా డాలర్‌పై సమర శంఖం పూరించాయి. సౌదీ అరేబియా అమెరికాతో 1974లో కుదుర్చుకున్న 50 సంవత్సరాల పెట్రో డాలర్‌ ఒప్పందం 8 జూన్‌ 2024తో ముగిసింది. ఆ ఒప్పందాన్ని పొడగించడం ఇక కుదరదని సౌది నిర్మోహమాటంగా అమెరికాకు స్పష్టం చేయడం  బ్రిక్స్‌కు కలిసి వస్తుంది. చమురు అమ్మకాలకు ఇక నుంచి డాలర్లతో పాటు చైనా యువాన్‌, ఐరోపా సమాఖ్య (ఈయూ) యూరో, జపనీస్‌ యెన్‌ల లోనూ చెల్లింపులు స్వీకరిస్తానని సౌదీ ప్రకటించింది. బిట్‌ కాయిన్లు, డిజిటల్‌ కరెన్సీలలో కూడా చెల్లింపులు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తామంది. బ్రిక్స్‌ దేశాల కేంద్ర బ్యాంకులు ఉమ్మడి డిజిటల్‌ కరెన్సీ(సిబిడిసి)ని వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. బ్రిక్స్‌ ఆర్థిక కూటమి గత రెండేళ్లుగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులను సవాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కూటమి పాశ్చాత్య-ఆధిపత్య ఆర్థిక వ్యవస్థను ప్రతిఘటిస్తోంది. ఆ ప్రయత్నాలు పెరిగిన డీ-డాలరైజేషన్‌  పద్ధతులు, బ్లాక్‌ యొక్క స్వంత స్థానిక కరెన్సీల ప్రమోషన్‌ రూపంలో వచ్చాయి.

సౌదీ ఇప్పటికే చైనాతో స్థానిక కరెన్సీలలో చమురు అమ్మకాలు జరపడానికి ఒప్పందం కుదుర్చుకొంది. భారత్‌, సౌదీలు కూడా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి. దీంతో డాలర్‌-వాల్‌  స్ట్రీట్‌ పాలన గణనీయంగా శక్తివంతంగా ఉన్నప్పటికీ, అమెరికా ఆర్థిక బలహీనత,  దాని గ్లోబల్‌ నార్త్‌ మిత్రదేశాల చట్టవిరుద్ధమైన ఆంక్షల దూకుడు, పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థల కారణంగా డాలర్‌-వాల్‌స్ట్రీట్‌ పాలన గణనీయంగా మారడం, ప్రపంచ క్రమంలో మారే అవకాశాలు ఉన్నాయి. బ్రిక్స్‌ వంటి వేదికల ద్వారా గ్లోబల్‌ సౌత్‌ యొక్క బలం. అమెరికా ప్రపంచ ఆర్థిక ఆధిపత్యానికి అతిపెద్ద ప్రత్యర్థి అయిన చైనా, అటు లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌తో వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో అమెరికా డాలర్‌ను విడిచిపెట్టడానికి అంగీకరించాయని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. రెండు ఆర్థిక దిగ్గజాలు ఇప్పుడు తమ కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిర్వహించనున్నాయి. యువాన్‌, రియల్‌లను కరెన్సీని మార్పిడి చేసుకోవాలని తీర్మాణించాయి. అమెరికా డాలర్‌ ప్రపంచ ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా, మార్చిలో చైనా మొదటిసారి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో 65 వేల టన్నుల ఎల్‌ఎన్‌జి ఒప్పందం యువాన్‌ కరెన్సీ రూపంలో జరిగింది. దీనిపై ఇరు పక్షాలు సంతకం చేశాయి.

అంతర్జాతీయంగా ప్రబలమైన రిజర్వ్‌ కరెన్సీ అమెరికా డాలర్‌పై  ఆధారపడడాన్ని తగ్గించుకునే ప్రక్రియను డీ-డాలరైజేషన్‌ అంటారు. డీ-డాలరైజేషన్‌ అనేది నిర్దిష్ట ఒప్పందాలకు లోబడి ద్వైపాక్షిక లేదా బహుళ పక్ష వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి అమెరికా డాలర్‌ కాకుండా ఇతర కరెన్సీ లేదా కరెన్సీలను ఉపయోగించే సందర్భాన్ని సూచిస్తుంది. అటువంటి స్థానిక కరెన్సీ ఒప్పందం ఈ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను ద్రవ్యోల్బణం వంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రష్యా, చైనా వాణిజ్యంలో యుఎస్‌ డాలర్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, యువాన్‌-రూబుల్‌ మారకంలో వాణిజ్యం ప్రారంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా డాలర్‌ ప్రభావం దెబ్బతింటోంది. ఫలితంగా అమెరికన్‌ డాలర్‌ విలువ సైతం పతనం చెందుతోంది. 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్‌ సదస్సులో రెండు ఆసక్తికరమైన విషయాలు జరిగాయి.  అక్టోబర్‌ 22,24 తేదీల్లో రష్యాలో జరుగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశానికి అనేక మంది కొత్త సభ్యులు ఆహ్వానించబడ్డారు. అర్జెంటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యుఎఇలు ఉన్నాయి. బ్రెజిల్‌ నేతృత్వంలో వాణిజ్యంలో డాలర్‌ స్థానంలో స్థానిక కరెన్సీలతో ఏర్పడే సాదక బాధకాలను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ ఏర్పాటు చేసారు.

పెట్రో డాలర్‌కు తెరపడటంతో అమెరికా కరెన్సీ విలువ కుప్పకూలి పోతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చైనా, రష్యా గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు రష్యా, చైనా పంతం నెగ్గడం కష్టమే. 2024 జనవరి నాటికి జపాన్‌ తరవాత అత్యధిక అమెరికా ప్రభుత్వ బాండ్లను కొన్న దేశం చైనాయే. జపాన్‌ వద్ద  ఏప్రిల్‌ చివరి నాటికి విదేశీ మారక నిల్వలు 1.15 ట్రిలియన్‌ డాలర్లు నిల్వ ఉండగా, బీజింగ్‌ వద్ద 3.2 ట్రిలియన్‌ డాలర్‌ నిల్వలు ఉన్నాయి. భారత్‌ వద్ద కూడా 23,600 కోట్ల డాలర్ల బాండ్లు ఉన్నాయి. చైనా కనుక అమెరికా బాండ్లను ఉన్న పళాన అమ్మేస్తే డాలర్‌ విలువ తగ్గిపోతుంది కానీ, దాంతోపాటే చైనాకూ నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడానికి చైనా డాలర్లతో బంగారం కొంటోంది. 2015లో చైనా విదేశ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా రెండు శాతం. 2023లో అది 4.3 శాతానికి పెరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తెలిపింది.

గత రెండేళ్లలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను పెంచాయని ఐఎంఎఫ్‌ ఫస్ట్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ వెల్లడిరచారు. చైనా స్థానిక కరెన్సీలు, బంగారం, డిజిటల్‌ కరెన్సీల రూపంలో డాలర్‌పై బహుముఖ దాడి చేయబోతోంది. ఇతర దేశాలు కూడా తమకు అనువైన రీతిలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొంటున్నాయి. చైనా, రష్యా, ఇరాన్‌ వంటి దేశాలు డాలర్‌కు పాతర వేయాలని చూస్తుంటే, ఇతర దేశాలు డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినాసరే, ఇప్పుడప్పుడే డాలర్‌ ఆధిపత్యానికి తెరపడబోదని ఐఎంఎఫ్‌ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ప్రపంచ దేశాల వద్ద 11.45 లక్షల కోట్ల డాలర్ల విదేశ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి.  వాటిలో 58.41 శాతం డాలర్లేనని ఐఎంఎఫ్‌ వెల్లడిరచింది. ఒకటి మాత్రం స్పష్టం అమెరికా రాజకీయ విధానాలు ఆ దేశంతో పాటు మిగతా ప్రపంచం పైనా విస్తృత ఆర్థిక ప్రభావాన్ని కనబరుస్తున్నాయి.

ఇవాళ డాలర్ల ప్రమేయం లేని అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ అది అమెరికా, పశ్చిమ సంపన్న దేశాల ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ పోతోంది. సామ్రాజ్యవాద అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్‌పై మూకుమ్మడి దాడి మొదలెట్టాయి. డాలర్‌, మిలిటరీ, విభజించు-పాలించు… అనే  మూడు స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయార్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే… డాలర్‌తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరపడేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం బోధపడుతుంది. గత ఎనిమిది దశాబ్ధాలుగా సామ్రాజ్యవాద పెట్టుబడి బదిలీలు అసమానతల పెంపుకు, శ్రమ విభజనకు, సహజ వనరులు కొల్లగొట్టడానికి దారి తీశాయి. విదేశీ పెట్టుబడులు ఆయా దేశాలలో పెట్టుబడిదారీ అభివృద్ధిని నియంత్రించాయి.

అమెరికా ద్రవ్య విధానం, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ప్రత్యామ్నాయ కరెన్సీల వినియోగం వల్ల డీ-డాలరైజేషన్‌ పెరుగుతోంది. ఇరాక్‌, ఆప్ఘాన్‌, సిరియా, లిబియా దేశాలపై అమెరికా యుద్ధాలు, పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ యుద్ధం, యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల భౌగోళిక రాజకీయాల్లో నెలకొన్న వ్యూహాత్మక మార్పుల కారణంగా అమెరికా డాలర్‌ ఆధిపత్యం ప్రశ్నార్థకమైంది. ప్రస్తుతానికి అమెరికా డాలర్‌ వాణిజ్య లావాదేవీలు కొనసాగుతున్నప్పటికీ, విదేశీ మారక నిల్వలలో కొంత మేరకు డీ-డాలరైజేషన్‌ జరుగుతోంది. గ్రీన్‌ బ్యాక్‌ (19వ శతాబ్దంలో అమెరికన్‌ సివిల్‌ వార్‌ ఖర్చుల కోసం యుఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన మొదటి పేపర్‌ మనీని సూచిస్తుంది. ఈ కాగితం డబ్బు వెనుక వైపు ఆకుపచ్చ రంగు ఉంటుంది) ఇటీవలీ కాలంలో చమురు మార్కెట్‌లలో కూడ డాలర్‌ ప్రభావాన్ని కోల్పోతోంది. ఇక్కడ ఎక్కువ చమురు అమ్మకాలు ఇప్పుడు డాలర్‌యేతర కరెన్సీలలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యం, ఫైనాన్స్‌లో అమెరికా డాలర్‌ ఆధిపత్యం డీ-డాలరైజేషన్‌తో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొంటుంది.

ఇవాళ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా అమెరికా డాలర్‌ ఆధిపత్యం ప్రమాదంలో పడిరది. అయితే పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలకే పరిమితం కాకపోవచ్చు, ఇతర రూపాలలో అవి తక్కిన దేశాల మీద ఒత్తిడులను తీసుకు వస్తాయి. డాలర్ల ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నడపాలన్న ప్రయత్నాలు ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి సంకేతం. అమెరికా అంటేనే యుద్ధోన్మాది, ఆయుధ బేహరి. అందుకే డీ-డాలరైజేషన్‌ను అడ్డుకోవడానికి సామ్రాజ్యవాదులు ఏ దుర్మార్గానికైనా ఒడిగట్టడానికి తయారౌతారు. డాలరైజేషన్‌ యొక్క సంకెళ్ళ నుండి తప్పించుకోవడానికి, గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్నాయి. అపారమైన అప్పులతో ఉన్నాయి. పాశ్చాత్య సంస్థలు వాటి వనరులపై యాజమాన్యాన్ని క్లెయిమ్‌ చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టపరమైన నిర్మాణం పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉంది. అమెరికన్‌ కార్పొరేషన్లు అనుకూలంగా ఉన్నాయి. పాశ్చాత్య నియమాలను ధిక్కరించే వారిపై ఆర్థిక నిబంధనలతో సహా యుద్ధాలు, తిరుగుబాట్లను ప్రేరేపించే సామర్థ్యాన్ని అమెరికా నడపబడుతున్న రహస్య నెట్‌వర్క్‌ కొనసాగిస్తోంది. కాబట్టి సౌత్‌ దేశాలు సంఘటితంగా అమెరికాను ఎదుర్కోవలసి ఉంటుంది.

Leave a Reply