1
యుద్ధంలో
మరణాలెప్పుడూ
దొంగలెక్క

ఆయుధాలు
గింజల్ని పండించలేవు
మరణాల్ని భిక్ష వేస్తాయి

పిల్లలు లేక
బొమ్మలు దిగాలు పడ్డాయి
వాటికి తెలియదు
యుధ్ధం చంపిందని

రాజ్యహింసలో
ప్రజల దుఃఖం
మైళ్ళు మైళ్ళు మేఘావృతం

యుధ్ధం ఉన్మాదం
అది సృజనాత్మకతను
చంపుతుంది

యుధ్ధం కామా
అది మరణాల్ని కప్పుకునే
రాక్షసి

యుధ్ధం
శరీరాల్ని మాయం చేశాక
తిరిగి మనుషుల్ని ప్రవేశపెట్టలేనిది


2
ప్రతి నేల
రక్తంతో తడిసినదే
యుధ్ధం కాలుమోపని స్థలమేది

చరిత్ర అంటేనే
నెత్తురుతో రాయబడ్డ
పుస్తకం

ఆధిపత్యాల అహంకారాలకు
ఎంత కన్నీరు పారిందో
బంధాల్ని పోగొట్టుకున్న
ప్రజలు సాక్ష్యం

యుధ్ధాలకు లాక్కోవడమే తెలుసు
నాశనం చేయడమే తెలుసు
ప్రాణాలు తిరిగి తేవడం తెలియదు

బాణాలు దిగిన కపోతాల బాధ
వేటగాళ్ళను కదిలించవు

విషనాగులకు కాటు
కిరాతకులకు గాటు తప్ప
ఏమీ తెలియవు

శాంతి జండాలు ప్రజల చేతుల్లో
బందూకులు నాయకుల గుప్పిట్లో

తూటాలకు
తుమ్మెదలు సీతాకోకలు వర్తించవు

పూలను రాల్చే గాలికైనా
కనికరముంటుంది
పిశాచాలకు శూన్యం

ప్రవక్త జీజస్ బుద్దుడు దిగివచ్చి చెప్పినా
యుధ్ధం విరమించని సైతాను కాలమిది

దేశమేదైనా
రక్తం పారిన చోట పూలు పూయవు.

One thought on “తెలుగు వెంకటేష్ కవితలు రెండు

  1. యుద్దమంటే అహంకారానికి కంకాళాల హారం వెయ్యడమే

    (వీరేశ్వర రావు మూల)

Leave a Reply