సముద్రాన్ని కళ్ళల్లో నింపుకుందామనుకున్న
సాధ్యమైతే కాలేదు
రెప్పలు మధ్య కన్నీరు ఉబికేదాకా
దుఃఖం కంటే గొప్ప సాగరమేముందో తెలియలేదు
***
కన్నీళ్ళ తో కాస్త జాగ్రత్త
ఉండండి
గాయపరచడానికి ముందు
మీ కళ్ళ గురించి కూడా ఆలోచించండి
***
ఒక్కోసారి కన్నీళ్ళతో పాటు
చూపు ప్రవహిస్తుంది
దృశ్యాలను అనేకం
తనలో కరిగించుకొని
****
కన్నీళ్ళ కళ్ళను
అవమాన పరచకండి
దుఃఖం ఆగాక ఉప్పొంగే
ఉద్వేగం పేరు ఆగ్రహం
***
కళ్ళున్న చోటంతా
కన్నీళ్ళుండక పోవచ్చు
కొందరి హృదయాలు
ఎండమావులు
***
తడి ఉన్నదంతా
కన్నీళ్ళు కాదు
మోసకారులు
కోకొల్లలు
****
కన్నీళ్ళ శక్తి కి అంచనా లేదు
కేరటాల్లా, వానలా, వరదలా
అవి బండలలైనా
కరిగించగలవు కదిలించగలవు
***
లోపలచెలరేగే
తుపానులను
అదుపు చేసే
లంగరులు కన్నీళ్ళు
***
కన్నీళ్ళు
చాలా వాస్తవమైనవి
అవే మనో మంటలను
చల్లార్చగలిగేవి
***
కన్నీళ్ళు రానివాళ్ళ
లోపల
హృదయం ఎండిపోయి
ఉంటుంది
***
నువ్వో సముద్రాన్ని
లోపల మోస్తున్నావని
చెప్పే ఆధారాలు
కన్నీళ్ళు
****
కళ్ళను నమ్మని వారైనా సరే
కన్నీళ్ళను నమ్ముతారు
నీలో మనిషి ఉన్నాడని
అప్పుడు గుర్తిస్తారు

***
గట్టి రొమ్మున్న వారు కూడా
రొప్ప కుండా ఉండలేరు
ఏడ్పు రాని వారెవరూ
ఈ లోకంలో ఇప్పటికీ పుట్టలేదు
***
ఒక సారి కన్నీళ్ళు విడిచింతర్వాత
ఏర్పడే ఖాళీ
ఇంకొకరి దుఃఖాన్ని
ఆలింగనం చేసుకున్నాక పూరింపబడుతుంది
****
కళ్ళు దేహంలో ఉన్నట్లే
ఉండి,
చూపుగా ఎగిరే
సీతాకోకచిలుకలు
***

Leave a Reply