ఉదయం ఎనిమిది గంటలు. నోయిడాలోని ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతం. బస్ స్టాప్ వద్ద మైనాదేవి నిలబడి ఉంది. ఆమె ఎడమ చేతి బొటనవేలుకు కట్టు ఉంది. అంతకు ముందు రోజే గురుదాస్ అమర్దాస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నప్పుడు, ఒక వైర్ టెర్మినల్ ఆమె చర్మాన్ని చీల్చి౦ది. ఆ కంపెనీ వాహనాల కోసం వైర్ హార్నెస్‌లను, డేటా సిస్టమ్స్ కోసం షీల్డెడ్ కేబుల్స్‌ను తయారు చేస్తుంది. చేతి నొప్పి తీవ్రంగా ఉ౦ది. అయినా డ్యూటీ కి వెళ్ళటానికి ఆమె కంపెనీ బస్సు కోసం ఎదురు చూస్తోంది.
సెలవు పెట్టక పోయారా? ఒక విలేఖరి అడిగాడు. ‘ఒక్క రోజు పనికి వెళ్లకపోయినా 530 రూపాయలు నష్టపోతాను. ముగ్గురు పిల్లలను పోషించుకోవాలి’. అని అ౦ది. జీవితంలోని కఠినమైన సత్యం. ఎంతో క్రూరమైనది.
మైనాదేవిది మురాదాబాద్. వలస కార్మికురాలు. వాళ్ళ ఊరు నోయిడా కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. నోయిడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఉంది. ఢిల్లీ కి సరిహద్దు పారిశ్రామిక నగరం. ఇంతకు ముందు, ఆమె నోయిడా హోసియరీ కాంప్లెక్స్‌లో రోడ్డుకు అవతలి వైపు ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలలో రెండేళ్ల పాటు పనిచేసింది. ఆ కర్మాగారాల్లో జీతం ఇంకా తక్కువని, నెలకు తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని ఆమె అ౦ది. “రెండేళ్ల పాటు రోజుకు పన్నెండు గంటల షిఫ్టులు. నిలబడే టేబుల్ దగ్గర దారాలు కత్తిరించేదాన్ని. కంపెనీ మా జీతాన్ని ఒక్క రూపాయి కూడా పెంచలేదు”, అని ఆమె గతాన్ని గుర్తు చేసుకుంది.
మైనాదేవి దాదాపు ప్రతిరోజూ మూడు నుండి నాలుగు గంటల పాటు ఓవర్‌టైమ్ పనిచేసినప్పుడు, గంటకు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కంపెనీ ఇచ్చేది. ఓవర్‌టైమ్ కోసం రోజువారి వేతనం కంటే కనీసం రెట్టింపు ఇవ్వాలనే చట్టాన్ని ఇది ఘోరంగా ఉల్లంఘించడమే. ఫిర్యాదు ఎవరు చేయగలరు? చేస్తే, ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోగొట్టునే శక్తి ఎవరికీ లేదు. ఆమె చుట్టూ ఉన్న యువ తోటి ఉద్యోగులు ఆమె మాటకు తలూపారు. తక్కువ వేతనాలు, పన్నెండు గంటల పని – ఇవే నోయిడా ఫాక్టరీలల్లో సాధారణ నియమాలు.
ఫ్యాక్టరీ ప్రపంచం: నోయిడాలోని పెట్టుబడి, శ్రమ
ఏప్రిల్ 2026లో నోయిడా పారిశ్రామిక జోన్లో ఏం జరిగింది? ముందు నోయిడా అంటే ఏమిటో చూద్దాం. ఇది రియల్ ఎస్టేట్ బ్రోచర్ కనిపించే ఐటి పార్కులు, ఎక్స్‌ప్రెస్‌వేల అద్దాల మేడల నగరం మాత్రమే కాదు. ఇది మరో నోయిడా. పెద్ద గాలికి ఎగిరి పోయే రేకు షెడ్లు, చెవులు చిల్లులు పడే సైరన్ల మోతలు, జైళ్ళలాంటి గదుల్లో ఆరుగురు చొప్పున నివసించే వలస కార్మికుల చిన్న చిన్న డబ్బాల లాంటి ఇండ్ల సముదాయం మరో నోయిడా. చిన్న సందులు, ఇండ్ల ము౦దు మురుగు కాలువలు, ఈగల మోతలు, ఇవి కార్మిక నోయిడా దృశ్యం. ఉదయం ఎనిమిదింటికి తెరుచుకుని, రాత్రి తొమ్మిదింటికి మూసుకునే ఫాక్టరీ గేట్లు. ఈ రోజువారీ అణిచివేత, ఆ మురికి కూపాలు, 181 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ కార్మిక వర్గంపై ఫ్రెడరిక్ ఏంగెల్స్ చేసిన పరిశీలనలు అదేదో చరిత్రలా కాకుండా నోయిడా పైన నివేదికలా అనిపిస్తుంది.
నోయిడా (NOIDA- న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ) ఆసియాలోనే అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక పట్టణాలలో ఒకటి. దీని ప్రత్యేక ఆర్థిక మండలి (NSEZ) ఒక్కటే 2025లో 11,000 కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులను చేసింది. విస్తృతమైన పారిశ్రామిక ప్రాంతమంతటా పది వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ వంద లోపు కార్మికులతో నడిచే చిన్న తరహా సంస్థలు. ఇవి టీసీఎస్, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, షియోమీ వంటి భారతీయ, ప్రపంచ స్థాయి గుత్తాధిపత్య సంస్థల నుండి సబ్-కాంట్రాక్టు తీసుకున్నవి. ఐరోపా, అమెరికాలోని ప్రధాన వీధుల్లో విక్రయించే బట్టల మీద కనిపించే అనేక బహుళజాతి బ్రాండ్లు కూడా ఇక్కడివే. ఒక్క నోయిడా రెడీమేడ్ దుస్తుల క్లస్టర్ లోనే సుమారు మూడు వేల విదేశాలకు ఎగుమతి చేసే యూనిట్లు ఉన్నాయి. ఏటా 18-20 వేల కోట్ల రూపాయల ఎగుమతులను ఉత్పత్తి చేస్తు౦టాయి.
2020లో కోవిడ్-19 తో నోయిడా స్తంభించిపోయింది. తిరిగి పనులు ప్రారంభించడానికి తమ యూనిట్లకు కనీసం రెండు లక్షల మంది కార్మికులు అవసరమని నోయిడా అప్పారెల్ ఎక్స్పోర్ట్ సెంటర్ నిస్సహాయ స్థితిలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కోవిడ్-19 సమయంలో కార్మికులు ఇళ్ళకు కాలి నడకన పిల్లా పాపలతో వెళ్తున్న ఆ హృదయ విదారక దృశ్యాలు మీకు గుర్తుకు వస్తున్నాయా? హైవేల వెంట, రైల్వే పట్టాల మీదుగా వేల మైళ్ళు బీహార్, ఉత్తర ప్రదేశ్ మారుమూల ప్రాంతాల్లోని తమ ఇళ్లకు చేరుకోవడానికి ప్రయత్నించిన కార్మికులు, వారి కుటుంబాల దారుణ పరిస్థితి అది. నోయిడా, గ్రేటర్ నోయిడాలలో సుమారు 20,000 పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. దాదాపు 17 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. నోయిడా ఉత్పత్తి రంగంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఆటో విడిభాగాలు, ఐటీ సేవలు, మందులు, ముఖ్యంగా రెడీమేడ్ దుస్తులున్నాయి. భారతదేశ తయారీ ఎగుమతులకు ఇవి వెన్నెముక లా౦టివి. ఏప్రిల్ నుండి జూన్ మధ్య 40 డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో, ఫ్లోరోసెంట్ దీపాల కింద కార్మికుల శ్రమతో ఇవి తయారవుతాయి. గ్లోబల్ బ్రాండ్ నుండి భారతీయ బడా కంపెనీలకు, అక్కడి నుండి సబ్-కాంట్రాక్టర్ కు, ఆపై లేబర్ కాంట్రాక్టర్ కు- ఇలా పని పొరలు పొరలుగా అవుట్ సోర్స్ చేయబడుతుంది. ప్రతి పొరా కొంత లాభాన్ని గడిస్తూ, బ్రాండ్ కు కార్మికుడికి మధ్య ఒక అడ్డుగోడను సృష్టిస్తుంది. ఉత్పత్తి ఆర్డర్ తయారీ విభాగానికి చేరుకునే సమయానికి, ఆ వస్తువును తయారు చేసే కార్మికులకు, ఏ కంపెనీ తయారు చేయిస్తుందో వాటి మధ్య ప్రత్యక్ష ఉపాధి సంబంధం ఉండదు. వారు ఒక ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ఒప్పందంపై నియమించబడతారు. ఆ ఏజెన్సీ వారి స్వల్ప వేతనాల నుండి కొంత శాతాన్ని సేవా రుసుముగా తీసుకుంటుంది.
నియోమి క్లయిన్ తన ‘నో లోగో’ పుస్తకంలో చెప్పినట్లు, ఈ రోజుల్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యూహాత్మకంగా ఉత్పత్తి నుండి పూర్తిగా తప్పుకున్నాయి. ఎలా? నైక్ షూలను తయారు చేయదు. యాపిల్ కంపెనీ ఫోన్లను తయారు చేయదు. లూయిస్ విట్టన్ తన దుస్తులను కుట్టదు. అవి తయారు చేసేది కేవలం బ్రాండ్, లోగో మాత్రమే. వస్తువు మరెక్కడో, మరెవరి ద్వారానో తయారవుతుంది. శ్రమించే కార్మికుడికి కి అసలు పెట్టుబడి దారుడికి మధ్య ఏ మాత్రం సంబ౦దం లేదన్న౦తగా, సరుకు తయ్యారి కార్మికుడి పట్ల అసలు యజమానికి ఏ రకమైన చట్టపరమైన బాధ్యత లేనట్లుగా సుదీర్ఘమైన కాంట్రాక్టుల గొలుసుల వల్ల అన్పిస్తుంది. మార్క్స్ పరాయీకరణ (alienation) ను కార్మికులు తన శ్రమ ఫలితం నుండి వేరుచేయటం గా చెప్పారు. క్లయిన్ పరిశోధించిన అంశాలు – నోయిడా కర్మాగారాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్న వాస్తవాలు మరో కోణాన్ని చూపిస్తుంది. అదేమిటి? ఉత్పత్తి ప్రక్రియ నుండి పెట్టుబడిదారుడు ఉద్దేశపూర్వకంగా విడిపోవటం. సరుకు ఎక్కడి నుండి వస్తోంది? అది ఏ కష్ట జీవుల చేతుల సృష్టి అనే విషయాలు పెట్టుబడిదారుడికి అనవసరం అయిపోవటం.
పెరుగుతున్న కాంట్రాక్టు విధానం
భారతదేశవ్యాప్తంగా వ్యవస్థీకృత ఉత్పాదక రంగంలో, కాంట్రాక్టు కార్మికుల వాటా 2019-20 నుండి 2023-24 మధ్య 38 శాతం నుండి 42 శాతానికి పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు మినహా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఈ వాటా 2019 నుండి 2025 మధ్య 34 శాతం నుండి దాదాపు 50 శాతానికి చేరుకుంది. నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో ఈ కాంట్రాక్టు విధానం పూర్తిగా అమలవుతోంది. బట్టల, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో దాదాపు కార్మికులందరినీ స్వల్పకాలిక ఒప్పందాల ప్రాతిపదికనే నియమిస్తున్నారు. శాశ్వత ఉద్యోగమనేది లేదు. యూనియన్లకు గుర్తింపు లేదు. ఉమ్మడి బేరసారాలకు తావులేదు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం శూన్యం. ఉత్తర ప్రదేశ్‌లోని ‘కనీస వేతనాల సలహా మండలి’ పద్నాలుగు ఏళ్లగా జీతాల సవరణల కోసం నిమ్మకు నీరెత్తినట్లు కూచుంది. ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికుల మధ్య సంస్థాగత త్రైపాక్షిక చర్చలు జరిపే ‘ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్’ 2015 నుండి సమావేశమే కాలేదు.
వ్యవసాయేతర రంగాల్లో క్రమబద్ధమైన వేతనాలు, జీతాలు పొందే కార్మికుల్లో కూడా అసంఘటిత ధోరణి విస్తృతంగా ఉంది. 2025లో, సుమారు 58.2% మంది కార్మికులకు రాతపూర్వక ఉద్యోగ ఒప్పందం లేదు. 51.7% మందికి ఎటువంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందడం లేదు. అంతేకాదు. 47.3% మందికి జీత౦ తో కూడిన సెలవుల సౌకర్యం లేదు. దీని అర్థం, అధికారిక సంస్థలలో పనిచేస్తున్న కార్మికులలో సింహభాగం అసంఘటిత కార్మికులుగానే కొనసాగుతున్నారు.
పారిశ్రామిక ఉద్యోగాల్లో పదేళ్ళలో పెరిగిన కాంట్రాక్టు కార్మికుల శాతం
[ఆధారం: కుల్విందర్ సింగ్ (2024). భారతదేశ ఫ్యాక్టరీలలో కొనసాగుతున్న కార్మికుల కాంట్రాక్టు విధానం – సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ (CEDA), అశోక విశ్వవిద్యాలయం. ceda.ashoka.edu.in లో ప్రచురితం.]
పెట్టుబడికి చట్టాలు పనిచేయవా? దానికంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలున్న మన దేశంలోనే మరో గణతంత్ర దేశంమా?
మహిళా కార్మికులు
2025-26 పరిశ్రమ అంచనాల ప్రకారం, వస్త్ర రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు దాదాపు 60 శాతం. ఫాక్టరీ లోపలి అభద్రతా పరిస్థితులు వారి పని పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. సూపర్వైజర్లు లైంగికంగా లొంగిపోవాలని వేధిస్తారు. లేకపోతె ‘ఉద్యోగం నుండి తొలగిస్తామనే’ బెదిరిస్తారు. ఇది ఒక వ్యవస్థాగత సమస్యగా మారింది. దీనిని వ్యతిరెకిస్తూ, ఏప్రిల్ 2026 నాటి పారిశ్రామిక అశాంతి సమయంలో కార్మికులు సురక్షితమైన వేధింపుల ఫిర్యాదు ప్రోటోకాల్‌లను డిమాండ్ చేశారు. తీవ్ర ఒత్తిడితో కూడిన ప్రొడక్షన్ లైన్లలో భాగంగా, టాయిలెట్ విరామాలను కూడా లెక్కపెట్టి, కార్మికులకు పని భారం పెంచుతున్నారు. ప్రసూతి ప్రయోజనాల స్కీముల నుండి తప్పించుకోవడానికి, గర్భిణీ కార్మికులను తరచుగా ‘నిశ్శబ్దంగా బయటకు పంపేస్తున్నారు’. బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న వలస మహిళా కార్మికులు, ఇరుకైన సింగిల్-జెండర్ హాస్టళ్లలో లేదా అద్దె గదులలో ఉంటున్నారు. నోయిడా పారిశ్రామిక ప్రాంతాల్లో ఒక గది అద్దె నెలకు ఐదు నుండి ఏడు వేల రూపాయల వరకు ఉంటుంది. నైపుణ్యం లేని కార్మికుడికి లభించే నెలసరి వేతనంలో ఈ అద్దె 40 నుండి 60 శాతం వరకు పీల్చేస్తుంది. ఏప్రిల్ 2026 సమ్మెలకు ముందు వారి వేతనం అధికారికంగా రూ.11,313 వద్ద నిలిచిపోయింది. ఈ అద్దెలు చెల్లించాక, అనారోగ్యం పాలైనా, పిల్లల స్కూలు ఫీజులకైనా, కనీసం ఇంటికి వెళ్ళడానికి బస్సు ఛార్జీలకైనా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఉదయం ఎనిమిది నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిలబడే ఉండాలి. కేవలం మూత్ర విసర్జన విరామాలు తప్ప వేరే విరామం ఉండదు. అద్దె చెల్లించాల్సి ఉంది కాబట్టి మైనా దేవికి గాయపడ్డ బొటనవేలుకు కూడా విశ్రాంతి ఇవ్వలేని దుస్థితి. నోయిడాలోని ఒక మహిళా కార్మికురాలి జీవన చిత్రం ఇది. “మా ప్రాణాలు మాత్రమే ఇక్కడ చౌక, మిగతా అన్నీ ఖరీదైనవే” అని ఒక కార్మికుడు వాపోయాడు.
వలస కార్మికుల సంఖ్య ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. వీళ్లు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ తూర్పు జిల్లాల నుండి వస్తారు. ఆ ప్రాంతాల్లో వ్యవసాయం కుంటుపడి పేదరికం తాండవిస్తోంది. అక్కడ పరిశ్రమలు అస్సలు లేవు. నగరంలో వీరు ఒంటరివారు. స్తానికులు కారని, వారికి ఎటువంటి అండదండలు లేవనే విషయం కాంట్రాక్టర్లకు, ఫ్యాక్టరీ యజమానులకు, ప్రభుత్వానికి కూడా తెలుసు.
పెరుగుతున్న ధరలు
ఏప్రిల్ 2026 కి ముందు నైపుణ్యం లేని పనులకు నెలకు రూ. 9000 నుండి 11,013 వరకు జీతాలు ఉండేవి. 2012 నుండి ఈ వేతనాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కనీస వేతనాల చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతనాలను సవరించాలి. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దశాబ్దకాలంగా ఈ నిబంధనను బేఖాతరు చేస్తూనే ఉంది.
అదే సమయంలో, పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) 2021 నుండి 2026 మధ్య కాలంలో దాదాపు 25 శాతం పెరిగింది. నామమాత్రపు వేతనాలకు, అసలు కొనుగోలు శక్తికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం పాలనాపరమైన వైఫల్యం కాదు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన విధానం. ప్రభుత్వ మౌనం ఫ్యాక్టరీ యజమానులకు లాభం సహజంగా చేకూర్చింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా, యజమానులు మాత్రం శ్రమ ఖర్చును కృత్రిమంగా అణచివేయగలిగారు.
కార్మిక చట్టాలు – అక్రమ పద్ధతులకు చట్టబద్ధత
నవంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక చట్టాలను (Labour Codes) నోటిఫై చేసింది. వేతనాల చట్టం, పారిశ్రామిక సంబంధాల చట్టం, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల చట్టం, సామాజిక భద్రతా చట్టం. ప్రస్తుతం అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను ఈ నాలుగింటిలోకి విలీనం చేశారు. భారతదేశ కార్మిక నియంత్రణ చట్రాన్ని పూర్తిగా మార్చివేస్తూ, పెట్టుబడిదారులకు “వ్యాపార నిర్వహణ సులభతరం” (ease of doing business) చేసే౦దుకు దీన్ని రూపొందించారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఏకగ్రీవంగా వీటిని ఖండించాయి. ఈ చట్టాలు “కార్మికుల జీవితాలు, జీవనోపాధిపై జరుగుతున్న సామూహిక దాడి” అని అన్నాయి. ప్రభుత్వం “అప్రకటిత బానిసత్వాన్ని” రుద్దుతోందని ఆరోపించాయి. ఈ అభ్యంతరాలు గంభీరమైనవి. కొత్త చట్టాల ప్రకారం రోజుకు పన్నెండు గంటల వరకు పనివేళలను పొడిగించవచ్చు. దీనివల్ల మైనాదేవి వంటి వారు ఇన్నాళ్లు చట్టవిరుద్ధంగా చేస్తున్న పన్నెండు గంటల షిఫ్టులకు ఇప్పుడు చట్టబద్ధత లభించింది. సంఘాల గుర్తింపుకు అవసరమైన కనీస సభ్యుల సంఖ్యను పెంచడం ద్వారా సామూహిక బేరసారాల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేశారు. “కార్మికుడు” అనే నిర్వచనాన్ని కుదించి, కాంట్రాక్టు కార్మికులలోని మరిన్ని విభాగాలను చట్టబద్ధమైన రక్షణ పరిధి నుండి తొలగించారు. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి, వంట గ్యాస్ నుండి వండిన ఆహారం వరకు అన్ని ధరలు ఆకాశాన్ని తాకడంతో- ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త చట్టాలు వేతనాలను క్రమబద్ధీకరిస్తాయన్న వాగ్దానం మౌనంగా అటకెక్కింది. దీంతో కార్మికుల సహనం నశించింది. నిబంధనల నోటిఫికేషన్‌తో కేంద్ర ప్రభుత్వం మే 9, 2026 నుండి కార్మిక చట్టాలను పూర్తిగా అమలులోకి తెచ్చింది. అయితే, కనీస వేతనాల నిర్ణయం విషయంలో ఆ చట్టాల నిబంధనలు (Rules for Labour Codes) విఫలమయ్యాయి. ‘..ఒక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ప్రమాణాలను విడిగా పేర్కొంటాము..’ అని కేవలం మాటలతో వాయిదా వేసింది.
మానేసర్ (హర్యానా) లో రాజుకున్న అగ్గిరవ్వ
ఇది ఏ కార్మిక సంఘం ఇచ్చిన సమ్మె పిలుపుతోనూ ప్రారంభం కాలేదు. అక్కడ ఏనాయకుడు లేడు. వేదిక లేదు. ఏ మీటింగులు లేవు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిరసన పరిస్థితుల నేపథ్యంలో, సమిష్టిగా పని నిరాకరించిన ఒక్క సంఘటన కార్మికుల్లో దావాగ్నిలా రాజుకుంది.
మారుతీ సుజుకీతో పాటు వందలాది ఆటో విడిభాగాలు, రెడీమేడ్ గార్మెంట్స్ ఎగుమతి పరిశ్రమలకు నిలయమైన హర్యానాలోని మనేసర్ పారిశ్రామిక కేంద్రంలో 2026 మార్చి చివరి నుండి ఏప్రిల్ మొదలు వరకు కార్మికులు నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలు ఒక ఫ్యాక్టరీ నుండి మరో ఫ్యాక్టరీకి దావానలంలా వ్యాపించాయి. ఏప్రిల్ ప్రారంభం నాటికి హోండా నుండి ముంజాల్ షోవా, సత్యం ఆటో, రూప్ పాలిమర్స్ వరకు పాకాయి. రిచా గ్లోబల్, మోడలామా వంటి వస్త్ర కంపెనీల కార్మికులు సైతం విధులను బహిష్కరించి బయటకు వచ్చారు.
ఏప్రిల్ 9 నాటికి హర్యానా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనాన్ని నెలకు సుమారు ₹12,000 నుండి ₹16,000 పైచిలుకు పెంచుతూ, 35 శాతం వృద్ధితో ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు పదకొండేళ్ల తర్వాత జరిగిన మొదటి వేతన సవరణ ఇది. చరిత్రను సృష్టించేది, మార్పును తెచ్చేది ప్రజలేనని ఎవరన్నా కాదనగలరా?
సరే, ఈ వార్త నోయిడాకు చేరింది. నోయిడాలో ఆటో విడిభాగాలను అమర్చే, గార్మెంట్స్ కుట్టే కార్మికులకు ఒక విషయం అర్థమైంది. కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోని హర్యానాలో తమ లాంటి పనే చేసే తోటి కార్మికులు ఇప్పుడు వాళ్ళ కంటే మూడోవంతు ఎక్కువ జీతం వస్తోంది. అన్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. పన్నెండు గంటల షిఫ్టుల్లో కష్టపడే కార్మికులకు ఈ చిన్న పాటి లెక్క సులభ౦గానే అర్థమైంది.
ఏప్రిల్ 9, 2026న నోయిడా ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలోని NSEZ మెట్రో స్టేషన్ దగ్గర వందలాది మంది కార్మికులు గుమిగూడారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. హర్యానా ప్రభుత్వం మాదిరిగానే తమకు కూడా వేతన సవరణ కావాలని డిమాండ్ చేశారు. వారు శాంతియుతంగా ఉన్నారు. పోలీసులు వారిని గమనిస్తున్నారు.
కార్మికుల ముఖ్య డిమాండ్లు ఏమిటి?
పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా నైపుణ్యం లేని కార్మికులకు నెలకు ₹20,000 నుండి 26,000 కనీస వేతనం ఇవ్వడం. కాంట్రాక్టర్లు వేతనాల్లో కోత విధించకుండా నిరోధించేందుకు కంపెనీలే నేరుగా నియామకాలు చేపట్టడం. వాళ్ళ ప్రధాన డిమాండ్ల. సాధారణ పని వేళల కంటే ఎక్కువ చేసిన ప్రతి గంటకు రెట్టింపు వేతనం ఖచ్చితంగా అమలు చేయాలనీ, గత ఆర్థిక సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న బోనస్‌లను తక్షణమే క్లియర్ చేయాలనీ, వేతన బకాయిలను ముందస్తు తేదీ నుండి వర్తించేలా చెల్లించాలని కూడా కార్మికులు డిమాండ్ చేశారు. నోయిడాలోని సెక్టర్లల లో, చుట్టు పక్కల గ్రామాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిన కారణ౦గా, ఇంటి అద్దె భత్యాన్ని (HRA) భారీగా పెంచాలని వారు కోరారు. ఎనిమిది గంటలకు మించి చేసే పని ఐచ్ఛికంగా ఉండాలనీ, చేస్తే దానికి ఓవర్ టైం పరిహారం చెల్లించాలనీ, ఉద్యోగులకు ప్రతి వారానికి పెయిడ్ సెలవులు ఖచ్చితంగా ఉండాలని వారు పట్టుబడుతున్నారు. అదనంగా, పని ప్రదేశంలో వేధింపులు, మేనేజర్ల నోటి దురుసును అరికట్టడానికి చురుకైన అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలనీ, కోరారు. (ఉద్యమ౦ ఉధృతమై, అరెస్టులు జరిగాక, ఏప్రిల్ 13 నిరసనల సమయంలో నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) లను ఉపసంహరించుకోవాలనీ, అరెస్టయిన వారిని షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండు లను అదనంగా చేర్చారు.)
తర్వాతి మూడు రోజుల్లో ఈ నిరసనలు ఒక ఫ్యాక్టరీ నుండి మరో ఫ్యాక్టరీకి వ్యాపించాయి. నోయిడాలో ఐదు వస్త్ర పరిశ్రమలు (మానేసర్‌లో మరో మూడు ఉన్నాయి, అక్కడ ఇప్పటికే వేతన పెంపు సాధించారు) నిర్వహిస్తున్న రిచా గ్లోబల్ కార్మికులు సమానత్వం కోరుతూ విధులను బహిష్కరించారు. ఆటోమొబైల్ విడిభాగాల దిగ్గజం మదర్సన్ సుమీ వైరింగ్ కార్మికులు కూడా చేరారు. గృహ కార్మికులు, గిగ్ వర్కర్లు, చివరికి సెక్టర్ 63లోని చిన్న చిన్న గదుల్లో ఉంటూ ఎలాస్టిక్ బ్యాండ్లు కుట్టే వారు, దారాలు కత్తిరించే వారు కూడా ఫ్యాక్టరీల నుండి బయటకు రావడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 2026 రెండో వారంలో పారిశ్రామిక ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ కార్మికులతో ప్రారంభమైన ఈ సమ్మె, ఏప్రిల్ 14-15 నుండి పనిమనుషులు, వంటవారు, క్లీనింగ్ సిబ్బంది వంటి గృహ కార్మికులు తమ నిరసనలు ప్రారంభించడంతో అనేక వర్గాలకు విస్తరించింది. ఇది నోయిడాలో కనీ వినీ ఎరుగని సార్వత్రిక సమ్మెగా నిలిచింది.
రణరంగం
ఏప్రిల్ 13 ఉదయం. అప్పటికే ఐదురోజులగా సమ్మె నడుస్తోంది. ఫ్యాక్టరీ యజమానుల నుండి ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది. కార్మికులు నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ గేట్లు, కూడళ్ల వద్ద శాంతియుతంగా కూర్చున్నారు. అయినా పోలీసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ 13 రోజున జనం పెద్ద ఎత్తున కదిలారు. కార్మికుల్లో కోపం, నిరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫేజ్ 2, సెక్టర్ 60 పారిశ్రామిక ప్రాంతాల్లో పరిస్థితి విషమించింది. పోలీసు చర్యలో ఒక మహిళా ఉద్యోగిని లాఠీ దెబ్బకు గాయపడటంతో ఫేజ్ 2లో హింస చెలరేగిందని, అది గుంపును ఆగ్రహానికి గురిచేసిందని ‘ది వీక్’ పత్రిక పేర్కొంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసారు. ఇది కార్మికులకు తీవ్రమైన కోపం తెప్పించింది. హోసియరీ కాంప్లెక్స్ ప్రాంతంలో భారీ గుంపులను చెదరగొట్టడానికి బాష్పవాయువు, లాఠీచార్జీలను ప్రయోగించడంతో నిరసన కాస్తా వీధి పోరాటంగా మారింది. కార్మికులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. పోలీసు మోటార్ సైకిళ్లపై దాడులు జరిగాయి. పోలీసులు లాఠీచార్జీలతో, బాష్పవాయువు గోళాలతో ప్రతిస్పందించారు. రాత్రి అయ్యేసరికి ఆ దృశ్యాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. పోలీసు వాహనాల నుండి లేస్తున్న మంటలు. పొగలో పరుగెడుతున్న కార్మికులు. పార్లమెంటుకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ శాటిలైట్ సిటీ తిరుగుబాటు స్థితిలో ఉందా అని పాలా వర్గాలను ఉలిక్కి పడేటట్లు చేసాయి.
ఈ హింస “ముందుగా పథకం ప్రకారం జరిగిన వ్యవస్థీకృత చర్య” అన్న పోలీసుల ఆరోపణను కార్మిక సంఘాలు ఖండించాయి. ద్రవ్యోల్బణం కారణంగా తమ అసలు వేతనాలు తగ్గి పోవడం చూస్తున్న కార్మికుల నుండి పెల్లుబికిన “రగులుతున్న ఆగ్రహం” అని అవి అన్నాయి. అదే సమయంలో, వారి పని గంటలు 12 గంటల షిఫ్టులకు యాజమాన్యాలు పెంచాయి. ఈ మంటలు ఫాక్టరీలల్లో కొనసాగుతున్న నిర్దాక్షిణ్యమైన దోపిడీ, భయంకరమైన పరిస్థితుల, మురికివాడల దుర్భర జీవన పరిస్థితుల కారణమనేది కాదనలేని వాస్తవ౦.
ఈ ఆందోళనలో ఉన్న వారి గొంతుకలను వింటే తప్ప మనం ఆ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేము. వినయ్ మహోతీ వయస్సు ముప్పై ఏళ్లు, బీహార్ నుండి వచ్చి నొయిడాలోని ఒక హోసియరీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను మొదట తన తయారీ యూనిట్ లోపల ఎలా నిరసన తెలిపాడో, ఆపై వీధుల్లోకి వచ్చిన ఇతర కంపెనీల కార్మికుల సమూహంతో ఎలా కలిశాడో వివరిస్తాడు.
అతని డిమాండ్లు చాలా ప్రాథమికమైనవి: “పని గంటలు నిర్ణయించాలి, అదనపు పని గంటలకు (ఓవర్ టైం) వేతనం చెల్లించాలి”. ఒక్కసారి ఊహించండి, అతను ఆకాశంలోని చందమామను కోరలేదు. కేవలం చట్టం అమలు కావాలని మాత్రమే డిమాండ్ చేశాడు.
ఒక గార్మెంట్ పరిశ్రమలోని యువ మహిళా కార్మికురాలు, తన గొంతు రికార్డ్ అయి విస్తృతంగా షేర్ అయిన సందేశంలో ఇలా అంది: “వేతనాల కోసం నిధులు లేవని వారు మాకు చెబుతారు. యజమాని మాత్రం గ్రేటర్ నొయిడాలో ఇప్పుడే రెండో ఇల్లు కొన్నాడు. ఎవరు పేదవాళ్లో, ఎవరు కాదో మాకు కనిపిస్తూనే ఉంది”. గోరఖ్‌పూర్ నుండి వలస వచ్చిన మరో కార్మికుడు ఇలా అన్నాడు: “మేము నేరస్థులం కాదు. మేము అద్దె చెల్లిస్తాము, ఇంటికి డబ్బు పంపుతాము, ఆహారం కొనుక్కుంటాము. కానీ పదేళ్లుగా వారు మా వేతనాలను మార్చలేదే? పదేళ్లు! మే౦ ఏమి చేయాలో చెప్పండి?”
వేరు వేరు అంచనాల ప్రకారం, ఏప్రిల్ 13 నాటికి దాదాపు 50,000 మంది కార్మికులు నొయిడా వీధుల్లోకి వచ్చారు. ఇదేదో అల్లరి మూక చర్య కాదు. కుట్ర అంతకన్నా కాదు. ఇది తమ చెమటనూ, రక్తాన్నీ దోచుకోవడానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పేరుకుపోయిన న్యాయమైన ఆగ్రహం. ఇది 1997 నాటి ఆందోళనను గుర్తుకు తెస్తుంది. అప్పట్లో లక్షకు పైగా కార్మికులు నొయిడాలో నిరసన తెలిపి సమ్మెకు దిగి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు.
అణచివేతతో ప్రతిస్పందన
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మొదటి స్పందన వేతన కమిటీ వేయడం కాదు. లేదా ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు జరపడం కాదు. లేదంటే లేబర్ కమిషనర్ జోక్యం చేసుకోవడం కూడా కాదు. అది కేవలం ఒక FIR (ప్రధమ సమాచార నివేదిక) మాత్రమే. సెంటర్ ఫర్ స్ట్రగ్లింగ్ ట్రేడ్ యూనియన్స్‌కు చెందిన శ్రేయ ఘోష్, ది హిందూ పత్రిక సోషల్ అఫైర్స్ ఎడిటర్ జి. సంపత్‌కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: “కార్మిక వివాదాలను ‘శాంతిభద్రతల’ సమస్యగా ఎందుకు చూస్తారు”?
ఏప్రిల్ 13 నాటి సంఘటనలు జరిగిన కొద్ది గంటల్లోనే, నోయిడా పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ ఏడు ప్రధమ సమాచార నివేదికల (FIRs) నమోదును, మూడు వందల కంటే ఎక్కువ మంది వ్యక్తుల అరెస్టును ప్రకటించారు. ఏప్రిల్ 14 నాటికి ఆ సంఖ్య 300 దాటింది. పోలీసుల కథనం ప్రకారం, మూడు వందల యాభై మందికి పైగా వ్యక్తులను “చుట్టుముట్టి అదుపులోకి తీసుకోగా”, అందులో రెండు వందల మందిని అధికారికంగా అరెస్టు చేశారు. వీరిలో “పద్ధతి ప్రకారం, ముందస్తు ప్రణాళికతో దహనకాండకు” పాల్పడిన నిందితులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనలను రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జరిగిన “కుట్ర”గా అన్నాడు. ఆ తర్వాత BJP మాములుగా ఉపయోగించే రాజకీయ పదజాలం తెరపైకి వచ్చింది: “పాకిస్థాన్ హస్తం”, “అర్బన్ నక్సల్స్”, “దేశ వ్యతిరేక శక్తులు”. ఈ హింస “అప్పటికప్పుడు జరిగిన నిరసన కాదు, అత్యంత జాగ్రత్తగా రూపొందించిన కుట్ర” అని ఉత్తరప్రదేశ్ పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. పోలీసుల ప్రకారం, అరెస్టు చేసిన నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, “బాహ్య” సంస్థలు పంపిన “రెచ్చగొట్టే, ప్రేరేపించే” సందేశాలతో కూడిన వాట్సాప్ సమూహాలను (WhatsApp groups) బయటపెట్టాయి.
కొందరు కార్మిక సంఘాల నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత జరిగిన అరెస్టులు అసలు ఏం జరుగుతుందో తెలియజేస్తాయి.
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI) మాజీ సీనియర్ పాత్రికేయులు, అలహాబాద్‌కు చెందిన ప్రముఖ విశ్రాంత చరిత్రకారుడు ప్రొఫెసర్ లాల్ బహదూర్ వర్మ కుమారుడు సత్యం వర్మను, కౌంటర్ కరెంట్స్ నివేదిక ప్రకారం, “నోయిడా పోలీసులు రెండు రోజుల పాటు అపహరించి, ఆపై జైలులో పెట్టారు”. వర్మ ఫ్యాక్టరీ కార్మికుడు కాదూ, యూనియన్ నిర్వాహకుడు కానే కాదు. ఆయనొక పాత్రికేయుడు, విద్యావేత్త, ప్రజా మేధావి. ఆయన అరెస్టు ద్వారా పంపాలనుకున్న సందేశం అందరికీ స్పష్టంగా అర్థమైంది: ఈ ఉద్యమానికి సాక్షిగా నిలవడమే ఒక కుట్రలో భాగస్వామ్యంగా పరిగణించబడుతుంది.
పద్నాలుగు ఏళ్లుగా కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించిన ఫ్యాక్టరీ యజమానులను పోలీసులు అరెస్టు చేయలేదు. చట్టం ప్రకారం ఓవర్ టైం పనికి సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. అయినా, గంటకు కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించిన కాంట్రాక్టర్లను వారు పట్టుకోలేదు. కానీ, కార్మికులకు వారి హక్కులపై అవగాహన కల్పించిన వారిని, వారి పత్రికను పంపిణీ చేసిన వారిని, హర్యానా కార్మికులు సాధించిన విజయాలను వివరిస్తూ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన విద్యార్దులను నిర్బంధించారు.
మే 12న దేశవ్యాప్త డిమాండ్ల దినోత్సవానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు
పద్నాలుగు కార్మిక సంఘాలు, యూనియన్ల సమన్వయ వేదిక అయిన మజ్దూర్ అధికార్ సంఘర్ష్ అభియాన్ (MASA), అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటనలు విడుదల చేసింది. కార్మిక-కర్షక ఐక్యతను చాటే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, సంయుక్త కిసాన్ మోర్చా నోయిడా కార్మికులకు మద్దతు ప్రకటించింది, ఈ అణిచివేతను ఖండించింది. CITU, AICCTU, AITUC, HMS, INTUC వంటి కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా 2026 మే 12న దేశవ్యాప్త “డిమాండ్ల దినోత్సవం” నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ పరిణామాలను ప్రజాస్వామ్య కార్మిక హక్కులపై “రాజ్య మద్దతుతో సాగుతున్న కార్పొరేట్ దాడి”గా అవి అభివర్ణించాయి. కార్మిక కోడ్లను ఉపసంహరించుకోవాలని, నెలకు ఇరవై ఆరు వేల రూపాయల చట్టబద్ధమైన కనీస వేతనం అమలు చేయాలని, ఎనిమిది గంటల పనిదినం ఉండాలని, శాశ్వత ఉద్యోగాలలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలి కార్మిక అశాంతి సెగలో వెయ్యి మందికి పైగా కార్మికులను అరెస్టు చేసి ఉంటారని వారు అంచనా వేశారు. పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు.
ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం BMS, కార్మికుల ఆందోళనకు మద్దతు తెలపలేదు. పారిశ్రామిక కార్మిక వర్గంపై ఏకరీతి కనీస వేతనాన్ని రుద్దడాన్ని అది వ్యతిరేకించింది. “మానేసర్, నోయిడాలలో ఇటీవల జరిగిన అశాంతి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఏకరీతి వేతన నిర్మాణంపై ఇతర కేంద్ర కార్మిక సంఘాలతో విభేదిస్తున్నాం; దేశవ్యాప్తంగా ఒకే రకమైన వేతన విధానం అనేది అటు ఆచరణాత్మకం కాదు, ఇటు ఆర్థికంగా నిలకడైనది కాదు” అని పేర్కొంది. కార్మికుల “హింస”ను ఆ సంఘం ఖండించింది.
ఈ ఉమ్మడి ఒత్తిడికి తలొగ్గిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అయిష్టంగానే, పాక్షికంగా, కార్మికుల కనీస వేతనాలను పెంచటానికి ఒప్పుకొంది. 2026 ఏప్రిల్ 17, 18 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కనీస వేతనాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం, నైపుణ్యం లేని కార్మికులకు గతంలో ఉన్న 11,313 రూపాయల స్థానంలో, ఇకపై నెలకు 12,356 నుండి 13,690 రూపాయల మధ్య వేతనం లభిస్తుంది. నైపుణ్యం కలిగిన కార్మికులకు 15,224 నుండి 16,868 రూపాయల వరకు వేతనం అందుతుంది. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి కమిషనర్ ఆధ్వర్యంలో ఒక “శాశ్వత వేతన సవరణ యంత్రాంగాన్ని” రూపొందించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది.
కార్మికులు ఈ వార్తను జాగురూకతతో గమనిస్తూనే సంతృప్తితో స్వీకరించారు. “మా వేతనాలు దోచుకోబడ్డాయి, మేము పోరాడి మార్పు తెచ్చుకున్నాము” అని నోయిడా పారిశ్రామిక వాడలోని ఒక మహిళా కార్మికురాలు వ్యాఖ్యానించారు. అయితే, సవరించిన వేతనాలు కూడా హర్యానా స్థాయి కంటే చాలా వెనుకబడి ఉన్నాయని, ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేసిన 26,000 రూపాయల జీవన వేతనానికి దరిదాపుల్లో కూడా లేవని కార్మిక నాయకులు, విశ్లేషకులు ఎత్తిచూపారు. ఉత్తరప్రదేశ్‌లోని కనీస వేతనాల సలహా బోర్డు పద్నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉంది. తదుపరి సవరణకు మరో పద్నాలుగేళ్లు పట్టదని గ్యారెంటీ ఏమిటి?
మరోవైపు, 2026 మే మాసం ప్రారంభం నాటికి, అనేకమంది కార్మికులు, ఉద్యమకారులు కస్టడీలోనే ఉన్నారు. మహిళా కార్మికులు, కొందరు మైనర్లు సహా పలువురు కఠిన శిక్షలు పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నాయకులు, మానవ హక్కుల సంఘాలు, న్యాయవాదులు తమను నిర్బంధితులతో కలవకుండా అడ్డుకుంటున్నారని నివేదించారు. వందలాది కార్మికుల పై నమోదైన కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ప్రభుత్వం కుట్ర కేసుగా ఈ తప్పుడు కేసును యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది.
నోయిడా పోరాటం ప్రాముఖ్యత
2026 ఏప్రిల్ నాటి నోయిడా తిరుగుబాటు ఒక మైలురాయిగా గుర్తుండిపోతుంది. ఇది సంపూర్ణ విజయం సాధించినందుకు కాదు, అణచలేని శక్తిగా నిలిచినందుకు. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ప్రతీకగా ఉన్న నగరంలో, ఏ కేంద్ర సంఘం నిర్దేశం లేకుండానే యాభై వేల మంది కార్మికులు స్వచ్ఛందంగా కర్మాగారాల నుండి బయటకు రావడ౦ అపూర్వం.
పద్నాలుగేళ్లుగా కనీస వేతనాల్లో స్తబ్ధత ఈ నిప్పును రాజేసింది. లేబర్ కోడ్ చట్టబద్ధం చేసిన పన్నెండు గంటల పనివేళలు ఈ సెగను పుట్టించాయి. గంటకు ఇరవై ఐదు రూపాయల చొప్పున సాగుతున్న అక్రమ ఓవర్‌టైమ్ ఈ మంటను రగిలి౦చింది.
తన గాయపడిన బొటనవేలితో ఫ్యాక్టరీ గేటు ముందు నిలబడిన మైనాదేవి కూడా ఈ జ్వాలను రగిల్చింది.
లేబర్ కోడ్ల కాలంలో, ప్రభుత్వ అండతో శ్రామిక వర్గంపై పెట్టుబడిదారీ వర్గం చేస్తున్న దాడిని ఎదుర్కొంటూ కార్మిక లోకం తిరిగి పోరాడుతోంది. ప్రజలు CAA, NRCలకు వ్యతిరేకంగా, రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినట్లే, నేడు శ్రామిక వర్గం లేబర్ కోడ్ పాలన ప్రభావాలపై పోరాటం చేస్తోంది. రెండేళ్ల క్రితం శ్రీపెరంబుదూర్‌లోని శామ్సంగ్ కార్మికులు తక్కువ వేతనాలు, చెల్లించని ఓవర్‌టైమ్, యూనియన్ను గుర్తించని యాజమాన్య మొండితనంపై పోరాడారు. ఫిబ్రవరిలో బరౌనీ, పానిపట్, హజీరా కార్మికులు పరాన్నభుక్కులైన కాంట్రాక్టర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, మెరుగైన పని పరిస్థితుల కోసం శ్రమించారు. ఎన్టీపీసీ (NTPC), జార్ఖండ్ ప్రభుత్వ ఉమ్మడి సంస్థ అయిన పత్రాతు విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (PVUNL) ప్లాంట్‌లోని కార్మికులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో బకాయి వేతనాలు, సుదీర్ఘ పనివేళలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. రాయ్‌పూర్‌లోని అదానీ రాయ్ ఖేడ పవర్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, భద్రతా ఆందోళనలు, భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలిస్తామన్న హామీల అమలు కోసం కార్మికులు పోరాడారు.
కార్మిక పోరాటాల భూతం పెట్టుబడిదారీ వర్గాన్ని వెంటాడుతో౦ది. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రత్యక్ష ఘర్షణలు పెరగడం ఖాయం. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం, తద్వారా సామాన్య ప్రజలపై పడే ధరల భారం ఇందుకు కారణం అవుతాయి. నోయిడా ‘తిరుగుబాటు’ శ్రామిక వర్గం జ్ఞాపకాల్లో ఏళ్ల తరబడి నిలిచిపోతుంది. ఐక్యతలోని పాఠాలను, సంస్థాగత బలాన్ని, ప్రభుత్వం-పెట్టుబడిదారుల కుమ్మక్కును, పెట్టుబడికి-శ్రమకు మధ్య ఉన్న రాజీలేని వైరుధ్యాన్ని కార్మికులు నేర్చుకుంటారు.
కార్మికుల చర్యలన్నీ విముక్తికి దారితీసే తుది పోరాటాలకు రిహార్సల్స్ వంటివని లెనిన్ చెప్పారు.
కట్టు కట్టిన బొటనవేలితో బస్టాప్‌లో నిలబడి, పనికి వెళ్తూ, ఇంకా ఆదాయం-ఖర్చు లెక్కలు వేసుకుంటున్న మైనా దేవి అక్కడ ఉంది. ఆమె ఏదో సాధించింది. అది చిన్నదైనా, చాలనిదైనా, ఆమె నెలవారీ వేతనంలో నిజమైన పెరుగుదల. వీధుల్లోకి వచ్చి, యాభై వేల మంది లో తానూ ఒకతయి సమిష్టిగా ధైర్యంతో నిలబడి సాధించింది. ఆమె రోజుకు పన్నెండు గంటలు నిలబడే ఉంటుంది. గంటకు నలభై నుండి యాభై వస్తువులను తయారు చేస్తుంది. ఉత్పత్తి లక్ష్యాలు పేరుకుపోకుండా ఉండటానికి టాయిలెట్ నుండి కూడా పరుగున వస్తుంది. ఆమె, ఆమె తోటి కార్మికులు వెలిగించిన పోరాటం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలైంది. మైనా దేవి వంటి కార్మికుల శ్రమ దోపిడీ కొనసాగినంత కాలం నోయిడాలో రేగిన మంటలు అంత సులభంగా ఆరిపోవు. భారతదేశమంతటా ఉన్న శ్రామిక వర్గ ప్రజలు నోయిడా, మానేసర్ ప్రాంతాలతో పాటు బరౌనీ, పానిపట్, హజీరాలోని రిఫైనరీ కార్మికుల పోరాటాల నుండి నిస్సందేహంగా స్ఫూర్తి పొందుతారు.
ఈ వ్యాస రచనకు గాను నేను ‘ది మైగ్రేషన్ స్టోరీ’ (అనుమేహ యాదవ్, ఏప్రిల్ 22, 2026), ‘ది వైర్’ (శృతి శర్మ, మే 2026), ‘కౌంటర్ కరెంట్స్’ (ఏప్రిల్ 2026), ‘ది ఫెడరల్’ (ఏప్రిల్ 21, 2026), ‘గ్రౌండ్ జీరో’ (నవంబర్-డిసెంబర్ 2025) పత్రికలకు రుణపడి ఉన్నాను.
1- ఓఖ్లా అనేది ఉత్తరప్రదేశ్, హర్యానాలోని ఫరీదాబాద్ సరిహద్దులో ఉన్న ఢిల్లీ నగరంలోని ఒకప్పటి గ్రామం. ఓఖ్లా పరిసరాల్లో పారిశ్రామిక వాడను 1958లో ప్రణాళిక చేశారు. ఓఖ్లా పారిశ్రామిక మండలి విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్ విభాగం (నోయిడా) 1976లో ప్రారంభమైంది. ఓఖ్లా పారిశ్రామిక వాడ (ఢిల్లీ), నోయిడా (యు.పి), భల్లభ్ ఘడ్ (ఫరీదాబాద్, హర్యానా) కలిసి ఒక సుదీర్ఘమైన, అవిచ్ఛిన్న పారిశ్రామిక క్షేత్రంగా ఏర్పడ్డాయి. ఇక్కడ వివిధ రకాల కర్మాగారాల్లో సుమారు 17 లక్షల మంది కార్మికులు శ్రమిస్తున్నారు.
2 ది హిందూ, “ఇరాన్‌పై యుద్ధం ఢిల్లీ పరిసరాల్లో కార్మిక నిరసనలకు ఎలా దారితీసింది”, ఏప్రిల్ 18, 2026.
3 “వీవింగ్ ఫ్యూచర్స్: భారతీయ వస్త్ర రంగంలో మహిళల ఉపాధిపై ఒక అధ్యయనం”, VNGSU జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్.
4 ఆగస్టు 2025లో విడుదలైన ‘యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్’ (ASI) 2023-24 నివేదిక ప్రకారం, భారతదేశ వ్యవస్థీకృత తయారీ రంగంలో కాంట్రాక్ట్ కార్మికుల వాటా ప్రస్తుతం 42 శాతానికి చేరుకుంది. ఇది గత 27 ఏళ్లలో నమోదైన అత్యధిక స్థాయి. 2019-20 కాలంలో ఉన్న 38 శాతంతో పోలిస్తే ఇది స్థిరమైన వృద్ధిని సూచిస్తోంది.
5 ది హిందూ, “నోయిడా ఫ్యాక్టరీ అశాంతి కేవలం వేతనాలకే పరిమితం ఎందుకు కాదు”, 20 ఏప్రిల్ 2026.
6 ఎకనామిక్ టైమ్స్, ఏప్రిల్ 19, 2026.
(వెబ్ పత్రిక కౌంటర్ కరెంట్స్లో మే 11, 2026న ప్రచురితమైన వ్యాసానికి అనువాదం.)




