ఒక్కరొక్కరే ఒరిగిపోతూ కన్నీటి చుక్కలవుతున్నారు. కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోబోతే అవి రక్తాశ్రువులని గుండెలు బరువెక్కుతున్నాయి. కానీ రెండు నెలలకు పైగా శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో యోధుల పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న స్పందన ఆ యోధులిచ్చిన శాంతి సందేశపు ప్రదర్శనలుగా తెలుగు నేల అన్ని చెరగులలోనే కాదు ఇవాళ దేశమంతా నలు దిశలా విస్తరిస్తున్నది. ఇది మృతదేహాల స్వాధీన ఉద్యమం ఎన్కౌంటర్లు జరిగి ఆ శవాలనుంచే ఆసుపత్రి శవాగారాల నుంచి, రిపోస్టుమార్టం కోసం న్యాయపోరాటం జరిగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి, రిపోస్టుమార్టం జరిగే ఆసుపత్రుల నుంచి, అమరుల గ్రామాల దాకా ప్రదర్శన లైనట్లుగా మారుమూల గ్రామాలలో కూడా అంతిమయాత్రలుగా మారి చంద్రబాబు పాలనలోని శ్మశాన శాంతిని భగ్నపరిచే ఒక పోరాట రూపమైనట్లుగా ఇవాళ మళ్లీ విభక్త ఆంధ్రప్రదేశ్ అటువంటి సవాల్నెదుర్కొంటున్నది.
అటువంటి సవాల్ ఎవరో కాదు. స్వయంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అమరుడు కామ్రేడ్ నంబాళ కేశవరావు అలియాస్ బసవరాజు మృతదేహం స్వాధీనం చేసుకునే ప్రయత్నంతో మొదలైంది. విప్లవోద్యమం, అందులోనూ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం కొనసాగే దీర్ఘకాల సాయుధ పోరాటంలో విజయాలకు పొంగిపోవడం మాత్రమే కాదు అపజయాలకు కృంగిపోవడం కూడా తగదనే విషయాన్ని ఎంత నిర్దిష్టంగా ఆయన తన మరణవాజ్మూలంలో చెప్పి పోయాడంటే, తన రక్షణ కోసం 60 గంటలు 35 మంది రక్షణ వలయం నిద్రాహారాలు మాని, ఒక్కొక్కరే ఒరిగిపోతుంటే, మిగిలిన వారు ఆయనను తప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు, నాకోసం, నన్ను కాపాడడం కోసం మీరు యువకులు ప్రాణాలు పోగొట్టుకోనక్కరలేదు. నేను మరో రెండు మూడేళ్లు పనిచేయగలనేమో, భవిష్యత్ నాయకత్వంగా రూపొందే యువతరాన్ని కాపాడుకోవడం మీద కేంద్రీకరించండి అని చెప్తూ తన రక్షణలోని 28 మందితో పాటు తాను నేలకొరిగాడు. ఏడుగురు తప్పించుకోగలిగారు. కొంచెం ఆలస్యంగానైనా కేంద్ర కమిటీ అభివక్త అభయ్ ఇచ్చిన ప్రకటనలో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ గత రెండు నెలలుగా ఆయన శాంతి చర్చల కోసం పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ప్రాణాలు ఇచ్చాడని కూడా చెప్పాడు. ఒకవైపు శాంతి చర్చలు కోరుతూ ఆక్రమణ యుద్ధాన్ని తాము కాల్పుల విరమణ ప్రకటించిన కాలంలో ఆత్మ రక్షణ కొరకే పోరాడుతూ వందల సంఖ్యలో పార్టీ నాయకులు, శ్రేణులు ఎందుకు అమరులవుతున్నట్లు. ప్రజా యుద్ధంలో అవిభాజ్య భాగమైన, అర్థవంతమైన శాంతికోసం అది ఆంధ్రప్రదేశ్లోని ఎన్డిఏ ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడుకు అర్థవంతమైన శాంతి కోసం పార్టీ, ప్రజాస్వామిక వాదులు చేసిన కృషిని శ్మశాన శాంతిగా చేసిన అనుభవం ఉన్నది. అప్పుడు ఆయన యుపిఏ కన్వీనర్ నుంచి ఎన్నికలు అయిపోగానే ఎన్డిఏలో చేరి ఎన్డిఏ కన్వీనర్ అయిన కాలం. ఎల్ కె అద్వానీ అప్పుడు ఆయనకు ఆదర్శం. ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘాలు, పౌర స్పందన వేదిక, ప్రజల ఆకాంక్షలతో చర్చలకు నిషేధం, తలలపై వెలలు, గ్రేహౌండ్స్ గాలింపులు, ఎన్కౌంటర్లు కొనసాగిస్తూనే చర్చలకు పిలిచాడు. చంద్రబాబు ప్రపంచ సిఇఓ స్వభావం తెలియక కాదు. ప్రజా ఆకాంక్షల కనుగుణంగా పార్టీ తాను చర్చలకు వస్తానని ప్రకటించి విధి విధానాలు చర్చించడానికి ప్రతినిధులను నియమించింది. 2002 జూన్ 5, 9, 20 తేదీల్లో ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులతో విధివిధానాలు చర్చించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా పోలీసు అధికారులు ఉండకూడదు. ఎక్కడ పోలీసు యంత్రాంగం ఉండకూడదు అని పార్టీ, ప్రతినిధులు సూత్రబద్ధమైన ప్రతిపాదన చేస్తే తాను శ్రీకాకుళ పోరాట కాలం నుంచి ఎమర్జెన్సీ కాలం దాకా, ఆ తరువాత కూడా నక్సలైట్ వ్యతిరేక విధానాలకు, ఎన్కౌంటర్ ఆచరణలకు బాధ్యుడై పి. వి. నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటిలిజెన్స్) చీఫ్ (ప్రధాన అధికారి) గా పనిచేసి, పదవి విరమణ చేసి న్యాయవాద వృత్తి చేపట్టి చంద్రబాబు కాలంలో టిడిపిలో చేరి మంత్రి పదవి చేపట్టిన విజయ రామారావును ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాడు. ఆయనతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి తమ్మినేని సీతారాంను మరొక ప్రతినిధిగా నియమించాడు. ఆయన తాను శ్రీకాకుళ ఉద్యమ నాయకుడు అమరుడు పంచాది కృష్ణమూర్తికి బంధువునని చెప్పుకున్నాడు. జూన్ 5, 9 తేదీలు ఎన్కౌంటర్లతోనే గడిచిపోయాయి. జూన్ 20కి ముందు పీపుల్స్ వార్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నేలకొండ రజిత ఎన్కౌంటర్ తో చర్చలకు రావడంలేదని లేఖ పంపింది.
చర్చలకు ప్రాతిపదికగా పీపుల్స్ వార్ ఏపీ కమిటీ కార్యదర్శి ఆర్కె పంపిన కీలక పత్రాన్ని విజయరామరావు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు (డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ) తో పోల్చాడు. ‘అవును మీరు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పాటించకపోయినా అమలు చేయకపోయినా మిమ్ములను రాజ్యాంగ యంత్రం గానీ, అందులో భాగమైన న్యాయవ్యవస్థగానీ విచారించి శిక్షించడానికి వీలు లేదు కదా, అవి మీరు నాలుక గీసుకునే ప్లాస్టిక్ టంగ్ క్లీనర్లుగా కూడా పనికిరావు కదా అని ప్రతినిధులు అన్నారు. కానీ పార్టీకి అట్లా కాదు – వాళ్ల భాష ఆచరణ నుంచి వచ్చింది, వర్గ పోరాట ఆచరణ నుంచి వచ్చింది, ప్రజాయుద్ధ పంథానుంచి వచ్చింది శాంతి చర్చల ప్రతిపాదన.
ఇప్పుడు మళ్లీ ఎన్డిఏ పాలనలో మోషా నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలోనూ ఉండి అమరావతిని పునరావిష్కరించుకున్న చంద్రబాబు, సనాతన ధర్మ పరిపాలకుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నాటికి దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ శాంతి చర్చల ప్రతిపాదన మావోయిస్టు పార్టీ చేసింది. మావోయిస్టు పార్టీ ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన శాంతి చర్చలకు, తెలంగాణ ప్రజల తరఫున పీస్ డైలాగ్ కమిటీ చేసిన శాంతి చర్చల (మార్చి 24, 2025) ప్రతిపాదనకు మార్చి 28న అభయ్ ప్రకటన ద్వారా అనుకూలంగా స్పందించినా అది ఛత్తీస్గఢ్, బీహార్, రaార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలతో సహా మావోయిస్టు పార్టీ ప్రజాయుద్ధ ఆచరణలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలకు ప్రతిపాదించింది.
ఇక్కడే మనం కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి కగార్ ఆక్రమణ యుద్ధంలో భాగంగా, మావోయిస్టులను, మావోయిజాన్ని పూర్తిగా తుడిచేసి మావోయిస్టు రహిత భారత్ను చేస్తానని చేస్తున్న ప్రకటనలు అదే కాలంలో ఛత్తీస్గఢ్లో డబుల్ ఇంజన్ పార్టీగా బిజెపి ప్రభుత్వమే వచ్చి అక్కడి హోం మంత్రి చేసిన శాంతి చర్చల ప్రతిపాదనలోని నయవంచన రాజనీతిని గమనించాలి.
అంటే రాజ్య స్వభావంలో, బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ నీతిని అమలు చేస్తున్న బిజెపి ఆచరణలో కగార్ ఆక్రమణ యుద్ధంలో భాగమే శాంతి చర్చల ప్రతిపాదన. ఎవరైనా రావచ్చు. ఒకరైనా రావచ్చు. ఎక్కడైనా మాట్లాడవచ్చు. కానీ లొంగిపోయి రావాలి. లొంగిపోయినాక చర్చలకేముంది.
ఈ వైరుధ్యాల ఆచరణతో, ఈ ద్వంద్వ నీతితో 2025 జనవరి 1 నుంచి బస్తర్లో అమలవుతున్న మారణకాండ మన అనుభవంలోకి వచ్చింది. అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న ఆదివాసులను రక్షించుకోవడానికి ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రకటించి, ఆయా సందర్భాల్లో పునరుద్ఘాటించి పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయనతో పాటు మరో 27 మంది ఆయన రక్షణ దళంలోని ఉక్కు శిక్షణ గల పార్టీ శ్రేణుల్లో ఉన్నవాళ్లు, సభ్యులు అమరులైనా, ఆ సందర్భంలో విడుదల చేసిన ప్రకటనలో కూడా శాంతి చర్చల ప్రతిపాదనను పునరుద్ఘాటించింది.
అయితే 28 మంది అమరులైన ఎన్కౌంటర్ పేరుతో జరిగిన ఈ మారణకాండ తర్వాత ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరించిన కపటనీతి, శ్మశాన శాంతి ఎట్లా ఉన్నాయి. మృతదేహాలను కూడా అప్పగించడానికి వీలులేదనే ఆత్మలోకపు దివాలా రాజనీతికి దిగజారిపోయాయి. మృతదేహాలు ఇవ్వకపోవడమే కాదు, అక్కడే దహనం చేసి, ఆ అమరుల బూడిదను కాదు కదా, సమష్టిగా దహనమైన వారి బూడిద కలిసిన మట్టిని కూడా ఇవ్వనిరాకరించి వెనక్కి పంపారు.
2002కు పూర్వం చావంటే భయం లేని వాళ్లను చంపి చావుకు భయపడ్డాడు. జ్ఞాపకాలుగా స్థూపాలు కట్టుకుంటే వాటిని కూల్చేసి నేలమట్టం చేశాడు. ఆ స్థలంలో ఊడ్చి, అలికి దీపాలు పెట్టుకుంటే ఆర్పేశాడు. మరి అక్కడ భూమి ఉంది కదా, ఆ భూమి ఏమంటుందోనని ఆ భూమికి భయపడిన పాలకుణ్ని ఓ కవి ప్రశ్నించాడు.
పైగా ఇప్పుడు అక్కడ మిగిలిన భూమి బస్తర్ భూమి. ఆదివాసుల భూమి. రామాయణ రచనా కాలానికే ఉన్న దండకారణ్య భూమి. రామాయణం రచన కాలానికే రాముణ్ని ప్రతిఘటించిన ఆదివాసులు, బ్రాహ్మణీయ సనాతన ధర్మం రాక్షసులుగా చిత్రించిన ఆదివాసులున్న భూమి, ఇప్పుడక్కడ పోలీసు నాకాలు రావచ్చు. లక్షలాదిగా కేంద్ర ప్రభుత్వ అర్థ సైనిక బలగాలు, వందలాదిగా ఎయిర్ఫోర్స్ బాంబింగ్ విమానాలు, హెలికాప్టర్లు రావచ్చు, లొంగిపోయి రామదండు (సాల్వాజుడుమ్, డిఆర్జి, బస్తర్ ఫైటర్స్) లో చేరిన విభీషణులు రావచ్చు, ఈ అందరి వెసులుబాటుతో వచ్చిన కంపెనీలు రావచ్చు – కర్రె గుట్టల మీద కాషాయ జెండా జాతీయ పతాక పేరుతో ఎగరవచ్చు. కాని తెలంగాణలోని ధన్వాడలో ప్రజాగ్రహానికి గురై పేకమేడల వలె కూలిన ఇథనాలు కంపెనీ పరిపాలన విభాగం వలె ఈ సైనికీకరణ కార్పొరేటీకరణ కుప్పకూలే రోజొకటి వస్తుంది. నిజమైన సజీవమైన శాంతి ప్రజా యుద్ధ పోరాట నీతిలో భాగంగా పరిడవిల్లే భవిష్యత్తుకు దాఖలా ఇప్పటి ప్రజల కదలిక.
శాంతికి పిలుపు ఇచ్చిన పార్టీ అధినేత, ప్రజాయుద్ధ సేనాని అతని సహయోధులతో నేలకొరిగి రెండు వారాలు గడిచిపోక ముందే శాంతి దూతను చంపారు. కపటత్వానికి కమిట్మెంట్కు, నయవంచనకు, నిజాయితీకి, ప్రపంచ బ్యాంకు సిఇఓ నీతికి జనతన రాజ్యం ప్రజల నీతికి, విధ్వంస పూర్వక అభివృద్ధికి, త్యాగపూరిత వర్గ పోరాట అభివృద్ధికి మధ్యన ఉన్న వ్యత్యాసం స్పష్టంగా ఈ రెండు ఎన్కౌంటర్లలో మన ముందుకు వచ్చింది. ఒక్క చలం అలియాస్ సుధాకర్ను ఎన్కౌంటర్లో మరణించినట్లు ప్రకటించిన ఛత్తీస్గఢ్ ఐజి సుందర్రాజ్, ఆయన సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ రీజినల్ బ్యూరో (సిఆర్బి – మధ్య భారత ప్రాంతీయ బ్యూరో) బాధ్యతల్లో ఉన్నవాడు అని చెప్తూ ఆయన మార్క్సిస్ట్ స్కూల్ నిర్వహిస్తున్న టీచర్ అని అంటే మావోయిజం అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న పార్టీ నాయకుడు మాత్రమే కాదు సిద్ధాంతాన్ని మెదడులో దూరుస్తున్న (ఇన్ఫ్లిక్టింగ్ ఐడియాలజీ) ఉపాధ్యాయుడు కూడా అని తాను నిందాపూర్వకంగానే వాడినా శత్రువు ఆయుధానికి ఎంత భయపడుతున్నాడో, ఆచరణకు ఎంత భయపడుతున్నాడో, వర్గ పోరాటానికి ఎంత భయపడుతున్నాడో, ప్రజా యుద్ధానికి ఎంత భయపడుతున్నాడో, అంతగానే అర్థవంతమైన శాంతి ఆకాంక్షకు భయపడుతున్నాడు. వర్గ పోరాటంలో, ప్రజా యుద్ధ వ్యూహంలో భాగమైన శాంతి డిమాండ్కు భయపడుతున్నాడు. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి హోం మంత్రి ఒక శ్మశాన శాంతి ప్రతిపాదన చేసి ఏడాదిన్నరగా అమలు చేస్తున్నాడు. వారది కగార్ ఆక్రమణ యుద్ధంలో భాగంగా సడక్, ఠానా, కంపెనీల నిర్మాణంలో భాగంగా, కార్పొరేటీకరణ, సైనికీకరణ సామ్రాజ్యవాద దళారీ విధానాల నిర్ణయంలో భాగంగా అమలు చేస్తున్నాడు. ఈ రెండు వారాల్లోనే ప్రజలు మాత్రం ఒక కన్నీరు తుడుచుకుంటూనే, శాంతి చర్చల కోసం డిమాండ్ చేస్తూనే తమ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, శాంతి చర్చల ప్రతిపాదకుడు బసవ రాజు, అతని సహకామ్రేడ్స్ మృతదేహాలు కాదు కదా, బూడిద కూడా ఇవ్వకున్నా వాళ్ళ ఊళ్లల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచమంతా, అన్ని దేశాల్లోని మావోయిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు మాత్రమే కాదు పోరాట ప్రజలు, అర్థవంతమైన శాంతి కోరుతున్న ప్రజలు వాళ్లను స్మరించుకున్నారు. స్మరించుకుంటూనే శాంతి సంభాషణల కోసమే కాదు, శాంతిదూత సుధాకర్, ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శి మృతదేహాలు వారి వారి కుటుంబాలకు అప్పగించడానికి పోరాడి రెండు వారాల తేడాలోనే తాత్కాలిక విజయాన్ని సాధించుకున్నారు. చలం స్వగ్రామం సత్యవోలులో చలం అంత్యక్రియలు కుటుంబంతో పాటు పార్టీ, ప్రజా సంఘాలు, అమరుల బంధుమిత్రుల సంఘం, విరసం, చలం చిన్ననాటి స్నేహితులతో అంతిమయాత్ర నిర్వహించుకున్నారు. కేశవరావు అమరత్వంతో ఆయన అన్న, వదిన, తల్లి, తమ్ముడు మావోయిస్టు కుటుంబంలో భాగమైనట్లుగా వాళ్ళ ఊరు కూడా భాగమైనట్లుగా మళ్లీ ఒకసారి శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డపాడు కూడా పంచాది కృష్ణమూర్తిని ఏటా స్మరించుకునే సంప్రదాయం నిరాకరింపబడి పోరాటంలోకి వచ్చింది. కమ్యూనిస్టు రాజకీయాలు లేని
సత్యవోలు గ్రామంలోనికి విగతజీవి చలం, సుధాకర్ గా ప్రవేశించి మావోయిస్టు రాజకీయాలు తెచ్చాడు. ఆ మృతదేహాన్ని తెచ్చుకోవడానికి ఆ ఊరు మహిళా నాయకురాలు చేసిన పోరాటం గురించి విరసం అధ్యక్షుడు చెప్పాడు.
‘‘మీ జీవితం ధన్యమైంది.. మీరు నడిచిన దారినిండా ఎన్నో పూలను పూయించారు, మీ జీవితం ఈ ప్రపంచానికి ఆదర్శం – మీరు అమరులు – ఇది సత్యవోలు గ్రామం ముద్దుబిడ్డ గురించి ఆ ఊరి ప్రజలు, యువతరం హృదయ స్పందన మాత్రమే కాదు అమరుడు అడెల్ భాస్కర్ పొచ్చెర గ్రామమే కాదు ప్రపంచ స్పందన.
చలాన్ని గుడివాడ సాహిత్య పాఠశాల (1981) కాలం నుంచి 81`83 మధ్యన రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణ కాలంలో, కృష్ణాజిల్లా పార్టీ నిర్మాణ కాలంలో చూశాను. ఒకసారి సున్నపు బట్టీల అజిత, డానీ ఇంట్లో విరసం కార్మిక సభ్యుడు అమరుడు పెద్దిరాజు, అద్దేపల్లి ప్రభు కూడా ఉన్న సమయంలో ఆనంద్గా కలిసినట్లుగా జ్ఞాపకం. మళ్లీ విరసం, ఎపిసిఎల్సి నేత ఎంటి ఖాన్ నాయకత్వంలో అడవి నుంచి శాంతి చర్చల రెండు పార్టీల ప్రతినిధి బృందాన్ని చిన ఆరుట్ల దగ్గరి నుంచి హైదరాబాద్ మంజీరా గెస్ట్ హౌస్ దాకా అక్టోబర్ 11 నుంచి తిరిగి అక్కడే అక్టోబర్ 21న వీడ్కోలు చెప్పేదాకా అతి సన్నిహితంగా చూశాను. మంజీరా గెస్ట్ హౌస్ కావచ్చు – చర్చలు జరిగిన స్థలం కావచ్చు – అతి సౌమ్యుడు, అతి సజ్జనుడు – ప్రభుత్వ శాంతి ప్రతిపాదనలను ఆనాడు ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాగాను పార్టీ అంగీకారాన్ని ప్రజల ఆకాంక్షగా, వర్గ పోరాట పథములో భాగంగా చూసిన సుధాకర్ కరస్పర్శ, మృదువైన కానీ దృఢమైన, సత్యమైన వాక్కుతో చూశాను. జనతన రాజ్యంలో ప్రజా న్యాయం ఎట్లా ఉంటుందో చెప్పే అద్భుతమైన కథ అని విరసం ప్రచురించిన ‘రేపు’ ను కూడా వర్గ పోరాటంలో భాగంగా ఎట్లా విశ్లేషించాలో, శత్రువు ప్రతిపాదించే మేకింగ్ ఇండియా అభివృద్ధి విధానాన్ని విధ్వంసపూరకమైందని విశ్లేషించాలో వంటి ఎన్నో సిద్ధాంత వ్యాసాలు రాసిన జహంగీర్ ఆయన. ఒక్క మాటలో వర్గ పోరాట సిద్ధాంతాన్ని మన మనసుకు చెదిరిపోకుండా హత్తుకునేలా చెప్పే విప్లవ కారుడాయన.
అమరుడు అడేల్ భాస్కర్ నాకొక భరత పక్షి. స్క్రైలార్క్. రెండున్నర దశాబ్దాలుగా వింటున్న పేరు. ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా అమరులు ఆదిరెడ్డి, కటకం సుదర్శన్, లలిత, పండరి సుధాకర్, సురేష్ వంటి అమరుల వారసుడుగా సామాజికంగా అమరుడు గజ్జల గంగారం వంటి ప్రాతినిధ్య ప్రతీకగా ప్రజాయుద్ధంలో అమరుడైన అడెల్ భాస్కర్ కు కన్నీటి జోహార్లు.