ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం, యునైటెడ్‌ నేషన్స్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ అభివృద్ధి ఆర్థిక పరిశోధనా సంస్థతో కలిసి రూపొందించబడిన  ‘ప్రపంచ సామాజిక నివేదిక -2025’ ని ఏప్రిల్‌ 24న విడుదల చేసింది. ఇందులో  సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి నూతన విధాన రూపకల్పనను ప్రోత్సహిస్తుంది. పెరుగుతున్న అసమానత, ఉద్యోగ అభద్రత, సామాజిక అపనమ్మకం వంటి అంశాలు ఇందులో చర్చిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక అభద్రత, అస్థిరమైన అసమానత స్థాయిలు, క్షీణిస్తున్న సామాజిక విశ్వాసం, సామాజిక విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచ సామాజిక నివేదిక 2025, సమాజాలను భయపెడుతున్న ధోరణులను వెల్లడిస్తుంది. తక్షణ, నిర్ణయాత్మక విధాన చర్యను డిమాండ్‌ చేస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ముందుకు తీసుకెళ్లడానికి సమానత్వం, భద్రత, సంఫీుభావం పై దృష్టి సారించిన ప్రపంచ విధాన ఎజెండాను నివేదికలో ప్రతిపాదించింది. కీలక ప్రపంచ సామాజిక అభివృద్ధి ధోరణులను నివేదిక ప్రతిపాదించింది. ఆదాయం, ఉపాధి, సంస్థాగత విశ్వాసంలో పెరుగుతున్న అసమానతలు నివేదిక నొక్కిచెప్పింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు ప్రపంచ ప్రయత్నాలు తిరిగి సమలేఖనం చేయడానికి వ్యూహాలు ప్రతిపాదించింది. ఈ నివేదిక సమాజాలను బెదిరిస్తున్న ధోరణులు వెల్లడిరచింది. తక్షణ నిర్ణయాత్మక విధాన చర్యలు తీసుకోవాలని నివేదిక పిలుపునిచ్చింది. సామాజిక ఒప్పందాలు పునర్నిర్మించడానికి, జీవనోపాధి మెరుగుపరచడానికి, ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సంఫీుభావం పునరుద్ధరించడానికి, తక్షణ విధాన సంస్కరణలు అవసరమని తెలిపింది.

ఇవాళ ప్రపంచం బహుళ సంక్షోభాల యుగంలో ఉంది. అనేక సవాళ్లు ఒకేసారి సంభవిస్తున్నాయి. ఇవి సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. ఆర్థిక అభద్రత అధికంగా ఉంది. అసమానతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సమాజంలో పరస్పర నమ్మకం తగ్గింది. సామాజిక విచ్ఛిన్నం పెరుగుతోంది. ప్రపంచంలో 60శాతం మంది ఆర్థిక అభద్రత ఎదుర్కొంటున్నారు. వారి ఆర్థిక భవిష్యత్తుపై వారికి నమ్మకం లేదు. 69 కోట్లకు పైగా ప్రజలు ఇంకా తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. వారి రోజువారీ ఆహార అవసరాలు తీరడం కూడా కష్టంగా ఉంది. అన్ని దేశాలలో మూడిరట రెండు వంతుల ప్రజలలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరింత సంపన్నులు అవుతుంటే పేదలు వెనుకబడిపోతున్నారు. ప్రపంచ జనాభాలో 95శాతం ప్రజల వద్ద నున్న సంపద కంటే ధనవంతులైన 1శాతం మంది ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. సంపద కేంద్రీకరణ తీవ్ర స్థాయిలో ఉంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా తమ ప్రభుత్వాలపై తక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. ఇది పాలన పట్ల అసంతృప్తి సూచిస్తుంది. 2024లో ప్రతి ఐదుగురిలో ఒకరు వాతావరణ వైపరీత్యాలు ఎదుర్కొన్నారు. ఇది పర్యావరణ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తుంది. ప్రతి ఏడుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇది వారి జీవితాల అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

చాలా మంది ప్రజలు ఇంకా పేదరికం అంచున జీవిస్తున్నారు. ఆర్థిక అభద్రత విస్తృతంగా వ్యాపించింది. అనేకమందికి స్థిరమైన ఉద్యోగాలు లేవు. తగినంత ఆదాయం సంపాదించడంలో వారు కష్టపడుతున్నారు. లెక్కలేనన్ని కుటుంబాలు ఒక చిన్న ఆపద వస్తే పేదరికంలో కూరుకుపోయే స్థితిలో ఉన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియా వంటి ప్రాంతాలలో ఉపాధిలో అనధికారిక అభద్రత ఎక్కువగా ఉంది. ఉద్యోగ అస్థిరత ఆదాయంలో అస్థిరతకు దారితీస్తుంది. ఇది బలహీనమైన సామాజిక రక్షణ కల్పిస్తుంది. బలహీనమైన ఉపాధి అవకాశాలు దుర్బలమైన పని పరిస్థితులు ఉద్యోగ అభద్రతను మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వాలు రాజకీయ సంస్థలు ఇతర ప్రజా సంస్థల పట్ల ప్రజలలో నమ్మకం తగ్గింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకు సుపరిపాలనకు ముప్పు కలిగిస్తుంది. తప్పుడు సమాచారం వదంతులు వేగంగా వ్యాప్తి చెందడం, డిజిటల్‌ అంతరాలు ఏర్పడటం, పాలనా వైఫల్యాలు ఈ అపనమ్మకాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. నకిలీ వార్తలు, ఆన్లైన్‌ ధ్రువణత, సామాజిక సంధానాన్ని దెబ్బతీస్తున్నాయి. నమ్మక స్థాయిలు వివిధ వర్గాల మధ్య కూడా తగ్గుతున్నాయి. ఇది సమాజంలో సమైక్యత లోపాన్ని సూచిస్తుంది. ప్రస్తుత స్థితి పట్ల నిరాశ అపనమ్మకం పెంచుతోంది. ప్రపంచ సంఫీుభావ పునాదులను బలహీనపరుస్తోంది.

ప్రపంచ సామాజిక నివేదిక-2025 నూతన పరిశోధన అంతర్దృష్టులను ప్రతిపాదిస్తున్నది. ముఖ్యంగా పెరుగుతున్న అసమానతలు, ప్రభుత్వాలపై క్షీణిస్తున్న నమ్మకం ప్రభావాలను అర్థం చేసుకోవడానికి 2025 నవంబర్‌ 4 నుండి 6 వరకు ఖతార్‌లోని దోహాలో జరగనున్న రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం, ప్రభుత్వాల పురోగతిని అంచనా వేయడానికి, ఈ క్లిష్టమైన సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి, నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి కీలకమైన ఎజెండాను అందిస్తుంది.  ఆర్థిక భద్రత, అస్థిరమైన అసమానత స్థాయిలు, క్షీణిస్తున్న సామాజిక విశ్వాసం, సామాజిక విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. సమాజంలో సుస్థిరత సాధించాలంటే సమానత్వం, ఆర్థిక భద్రత, సంఫీుభావం అవసరమని నివేదిక నొక్కి చెబుతోంది. 

ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పటికి చాలా మంది ఇప్పటికీ దుర్బలంగా ఉన్నారని నివేదిక సూచిస్తుంది. ప్రపంచ జనాభాలో మూడిరట ఒక వంతు కంటే ఎక్కువ మంది అంటే 2.8 బిలియన్లకు పైగా ప్రజలు రోజుకు 2.15 డాలర్ల నుండి 6.85 డాలర్ల వరకు జీవిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా తమ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. ఆందోళనకరంగా, విశ్వసనీయ స్థాయిలు ఒక వర్గం నుండి మరొక వర్గం వరకు తగ్గుతున్నాయి, ఇది సామాజిక సమైక్యత యొక్క క్రమబద్ధమైన విచ్ఛిన్నతను సూచిస్తుంది.

ఈ నివేదిక స్థిరమైన అభివృద్ధికి అవసరమైన మూడు ప్రధాన సూత్రాలను వివరిస్తుంది – సమానత్వం, అందరికీ ఆర్థిక భద్రత, సంఫీుభావం. తీవ్రతరం అవుతున్న సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వీటి పరిష్కారం అవసరం. ప్రపంచ జనాభాలో సగానికి పైగా తమ ప్రభుత్వంపై నమ్మకం లేదని ఇది సూచిస్తుంది. పెరుగుతున్న అసమానత, అభద్రత సామాజిక ఐక్యతను క్షీణింపజేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితుల కారణంగా చాలా మంది వ్యక్తులు నిరాశకు గురవుతున్నారు, విభజించబడ్డారు. అత్యవసర చర్యలు తీసుకోకపోతే, 2030 నాటికి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డిజిఎస్‌) సాధించడం అగమ్యగోచరంగా ఉంటుందని నివేదిక హెచ్చరిస్తోంది. అగ్రస్థానంలో సంపద, అధికారం కేంద్రీకృతమై ఉండటం ఈ విభజనలకు కారణం అవుతోంది. 

ప్రతి ఒక్కరు వారి అవసరాలు బట్టి అవకాశాలు పొందడం నిర్ధారిస్తుంది. సామాజిక చలనశీలత పెంపొందించడం, విద్య ఆరోగ్యం వంటి ప్రాథమిక సేవల అందుబాటులో ఉన్న అంతరాలు తగ్గించడం సమానత్వం లక్ష్యం. వివక్షకు గురిచేయబడిన వర్గాలు అనగా లింగం జాతి మతం వైకల్యం ఆధారంగా వివక్షత తొలగించి వారిని సమాజంలో సంపూర్ణంగా చేర్చడం దీనిలో అంతర్భాగం.  ప్రగతిశీల పన్ను విధానాలు సంపద పంపిణీ మెరుగుపరచడం విద్య ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. సామాజిక న్యాయం ద్వారా అందరికీ గౌరవప్రదమైన జీవితం అందించడం దీని అంతిమ లక్ష్యం.

అందరికీ ఆర్థిక భద్రత : నిరుద్యోగ భృతి, అనారోగ్య సెలవులు, పెన్షన్‌ పథకాలు ఇతర సామాజిక సహాయ కార్యక్రమాలు దీనిలో భాగంగా ఉంటాయి. శ్రామిక మార్కెట్లలో అనిశ్చితి తగ్గించడానికి కార్మికులకు సరైన వేతనాలు మంచి పని పరిస్థితులు నిర్ధారించడానికి విధానాలు రూపొందించడం ముఖ్యం. గౌరవప్రదమైన సురక్షితమైన ఉద్యోగాలు కల్పించడం ద్వారా ప్రజలు భయం లేకుండా జీవించడానికి వారి భవిష్యత్తు ప్లాన్‌ చేసుకోవడానికి వీలు కల్పించాలి.

సంఫీుభావం : సంస్థలపై విశ్వాసం తిరిగి నిర్మించడం దీనికి కీలకం. వివిధ సామాజిక సమూహాలు తరగతుల మధ్య వారధి నిర్మించాలి. ఉమ్మడి లక్ష్యాలు సాధన అందరూ కలిసి పనిచేయాలి. బలహీన వర్గాల వారికి మద్దతు ఇవ్వడం సామాజిక బాధ్యత ప్రోత్సహించడం ముఖ్యమైనవి. నిర్ణయ ప్రక్రియలలో పౌరులు ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు భాగస్వామ్యం పెంచడం వారి గొంతులు వినడం సంఫీుభావం బలోపేతం చేస్తుంది.

ముందుకు సాగడానికి చర్య : విద్య ఆరోగ్య రంగాలకు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఇది మానవ మూలధనం అభివృద్ధి చేస్తుంది. సమాన అవకాశాలు కల్పిస్తుంది. ప్రగతిశీల పున్ణపంపిణీ పన్ను విధానం అమలు చేయాలి. ఆదాయ సంపద అసమానతలు తగ్గించడానికి ధనిక వర్గాలు పెద్ద సంస్థల పై పన్ను రేట్లు పెంచాలి. పన్ను ఎగవేత అరికట్టాలి. పన్ను వ్యవస్థ పారదర్శకంగా సమర్థవంతంగా మార్చాలి. సేకరించిన నిధులు ప్రజా సేవలపై పెట్టుబడులు పెట్టాలి. అందరికీ ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, నిరుద్యోగ భృతి ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించే సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి బలోపేతం చేయాలి. ఇది ఆర్థిక అభద్రత తగ్గిస్తుంది. ప్రజలను దారిద్య్రంలోకి జారిపోకుండా రక్షిస్తుంది. సంక్షోభ సమయాల్లో వీరికి అండగా నిలుస్తుంది. అందుబాటులో ఉండే విద్య ఆరోగ్యం ఇతర ప్రాథమిక సేవలపై ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెంచాలి. ఇది సమాన అవకాశాలు పెంపొందిస్తుంది. మానవ మూలధనం అభివృద్ధి చేస్తుంది. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు డిజిటల్‌ నైపుణ్యాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యం. అందరూ డిజిటల్‌ ప్రపంచంలో భాగస్వాములు కావడానికి ఇది సహాయపడుతుంది. కనీస వేతనాలు పెంచడం, సురక్షితమైన పని పరిస్థితులు నిర్ధారించడం, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు గౌరవించడం, ఇతర కార్మికుల హక్కులు రక్షించడం వంటి చర్యలు తీసుకోవాలి. సాంకేతిక మార్పులు శ్రామిక మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోతున్న కార్మికులకు తిరిగి శిక్షణ ఇవ్వడం నైపుణ్యాలు పెంపొందించడం కోసం కార్యక్రమాలు రూపొందించాలి. బలహీనమైన ఉపాధి దుర్బలమైన పని పరిస్థితులు తగ్గించాలి. సంస్థలను  సమ్మిళితంగా, పారదర్శకంగా, జవాబుదారీగా మార్చాలి.

ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత జవాబుదారీతనం పెంచాలి. అవినీతి అరికట్టడానికి బలమైన చట్టాలు సంస్థలు ఏర్పాటు చేయాలి. ఇది ప్రజలలో నమ్మకం పెంచుతుంది. విధాన రూపకల్పన అమలులో పౌరులు, పౌర సమాజ సంస్థలు ఇతర వాటాదారులను చేర్చడానికి యంత్రాంగాలు ఏర్పాటు చేయాలి. ప్రజాభిప్రాయం గౌరవించడం విభిన్న గొంతులు వినడం ముఖ్యం. ఇది విధానాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. మార్కెట్లలో ఏకస్వామ్యాలను నియంత్రించడం, పోటీ ప్రోత్సహించడం, ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం కోసం బలమైన నియంత్రణ విధానాలు అమలు చేయాలి. ఇది ఆర్థిక అసమానతలు తగ్గించడంలో సహాయపడుతుంది. వాతావరణ మార్పు, మహమ్మారులు, ఆర్థిక సంక్షోభాలు, అసమానతలు వంటి ప్రపంచ సవాళ్లు ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం సమన్వయం బలోపేతం చేయాలి. ఐక్య కార్యాచరణ నడిపించడానికి రాబోయే ప్రపంచ సామాజిక అభివృద్ధ్ధి శిఖరాగ్ర సమావేశం 2025 వంటి వేదికలు ఉపయోగించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం, రుణ ఉపశమనం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయడం ద్వారా మద్దతు ఇవ్వాలి. ఇది ప్రపంచవ్యాప్త సంఫీుభావాన్ని పెంపొందిస్తుంది. పర్యావరణపరంగా స్థిరమైన అభివృద్ధి నమూనాలు ప్రోత్సహించాలి. వాతావరణ మార్పులు పర్యావరణ క్షీణత ప్రతికూల ప్రభావాల నుండి బలహీన వర్గాల వారిని రక్షించాలి. పర్యావరణ న్యాయం ప్రోత్సహించడం సహజ వనరులు పరిరక్షణ దీనిలో భాగంగా ఉండాలి. పర్యావరణ సవాళ్లు పేదరికం అసమానతలను ఎలా పెంచుతాయో గుర్తించి వాటిని పరిష్కరించాలి.

ప్రపంచ సామాజిక నివేదిక 2025లో సమర్పించబడిన ఆధారాలు తక్షణ చర్య యొక్క అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఆర్థిక అభద్రత, అసమానత, క్షీణత విశ్వాసం అనే విష చక్రాన్ని కొనసాగించడానికి అనుమతించడం వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేటి సామాజిక సవాళ్లను వాటి మూలాల వద్దనే ఎదుర్కోవడానికి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల వైపు పురోగతిని వేగవంతం చేయడానికి- సమానత్వం, అందరికీ ఆర్థిక భద్రత, సంఫీుభావం- అనే మూడు మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఒక కొత్త విధాన ఏకాభిప్రాయం అవసరం. అటువంటి ఏకాభిప్రాయం యొక్క హేతుబద్ధత, లక్ష్యాలు కోపెన్‌హాగన్‌ డిక్లరేషన్‌, కార్యాచరణ కార్యక్రమంలో మరియు స్థిరమైన అభివృద్ధి కోసం 2030 అజెండాలో పేర్కొనబడ్డాయి. స్థిరమైన అభివృద్ధి యొక్క ఈ సమిష్టి దృష్టిని ఆచరణలోకి అనువదించడానికి ఇప్పుడు పునరుద్ధరించబడిన వేగం అవసరం.

Leave a Reply