1 
సమభావం!
“రేణుకని చంపేశారట...”
“ఏ రేణుక?”
“జి. రేణుక, మిడ్కో పేరుతో కథలు రాస్తుంది!”
“ఆ... చూశాను, మనవాళ్ళంతా పోస్టులు పెడుతున్నారుగా?”
“మెట్లమీద- అని యాంతాలజీ కూడా వచ్చింది!”
“ఔనౌను, అందరూ అక్కడ ‘జోహార్లు’ చెపుతున్నారు, యిక్కడ ‘జేజేలు’ చెపుతున్నారు!”
“జేజేలు యెవరికీ యెందుకూ?”
“ఉగాది పురస్కారాలు పొందిన వాళ్ళకి, అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకుంటుంటే చెప్పరా జేజేలు...”
“అదేంటి జోహార్లకి కారణమై భాగస్వాములైన వాళ్ళే శాలువాలు కప్పుతుంటే సిగ్గులేకండా జేజేలా?”
“నీకు తెలీదబ్బా... మన రచయితలకు అన్నిటి మీద సమభావం వుంటుంది!”
“....................................................?!?”

2
మిడ్కో!
“మన రాజ్యం చీకటితో యెంత బావుందో కదా?!”
“ఔను, కాని అదేమిటి యింత చీకటిలోనూ మచ్చలా ఆ వెలుగు?”
“నిజమే, అది ఆ స్పార్క్... గ్లీమ్... నిప్పుకణమయితే కాదు కదా?”
“కాదు, కాదు, మిడుగయ్యుంటుంది!”
“మిడుగేమిటి పిడుగులాగ?!”
“మిణుగురు!”
“ఓహ్ మిణుగురు పురుగేగా?, దానికేం నిప్పుంటుందీ అంటుకోవడానికి?”
“భలేవాడివే, వొక్క మిణుగురు వేవేల లక్షల మిణుగురుల్ని పోగేస్తుంది!”
“అప్పుడది అగ్నికంటే ప్రమాదకరం!”
“అలా అయితే మన రాజ్యం తగలబడిపోయినట్టే...?!”
“అడవికి మిణుగురులే వెలుగని ప్రజలు అనుకుంటారు!”
“దిక్కుమాలిన ప్రజలసంగతి అటుంచు, అడవి కడుపులో దాగిన అన్నవస్త్రాల ధారాదత్తం బయటపడితే?”
“వీల్లేదు, మన బలగాలు యేమి చేస్తున్నాయ్?”
“ఆ పని మీదే వున్నాయ్!”
ధన్... ధన్... ధన్...
మిణుగురొకటి నేలరాలింది!!

2 thoughts on “‘బజరా’ గల్పికలు రెండు

  1. జగదీశ్వర్ గారు
    1 దుమ్ము దులిపి దూడ కేసారు
    2 నిజమైన నివాళి

Leave a Reply