మావోయిస్టులు తక్కువ వయస్సు గల సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు; అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాజ్యం వారిని చంపేస్తోంది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి పార్టీలోకి చేర్చుకొన్న మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో బంధితులయ్యారు. ఈ సంవత్సరం, ఘర్షణలో పెద్ద పురోగతి సాధించాని, దాదాపు 40 ఎన్‌కౌంటర్లలో 153 మంది మావోయిస్టులను హతమార్చామని, ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు.

ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో మాట్లాడి ఆ సంఖ్యల వెనుక ఉన్న కథనాలను అందిస్తున్నాం.

అడవిలో రెండు గంటల పాటు మోటారు సైకిలు పై వెళ్ళిన తర్వాత, రెండు కొండలు దాటి, మూడు వాగుల్లో నడిచి, చివరకు మా గమ్యస్థానాన్ని చేరాము: బట్టేకల్ గ్రామం, ఒక లోయలో చెల్లాచెదురుగా గడ్డి కప్పుతో ఉన్న మట్టి ఇళ్ళ సమాహారం.

16 ఏళ్ల బైజ్‌నాథ్ పెద్దా కుటుంబాన్ని కలవడానికి నారాయణపూర్ జిల్లా ఓర్చా తహసీల్‌లోని గ్రామానికి వెళ్లాము. ఏప్రిల్ 16న చత్తీస్‌గఢ్ పోలీసులు తిరుగుబాటుదారులపై “అతిపెద్ద దెబ్బ”గా అభివర్ణించిన ఘటనలో మరణించిన 29 మంది మావోయిస్టులలో అతను ఒకరు.

అరుదైన దృశ్యం అయిన శిథిలావస్థలో, నిర్మానుష్యంగా అతని ఇల్లు కనిపించింది. ఒక వృద్ధురాలు నిర్లిప్తంగా చూస్తూ ఒక మూలన కూచునుంది; ఒక యువతి లోపలికి, బయటికి తిరుగుతోంది; ఇద్దరు పిల్లలు ఆమె వెంటనే తిరుగుతున్నారు. రెండేళ్లు మించని చిన్నవాడి చేతిలో అన్నం, చింతపండు చారు  వున్న గిన్నె పెట్టింది. మౌనంగా కూర్చున్న మూడో మహిళ నేల వూడవడానికి లేచింది. తునికాకులను తేవడానికి మగవాళ్ళు అడవుల్లోకి వెళ్లారని చెప్పడం తప్ప వాళ్ళెవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

అరగంట తరువాత, ఇరవైల ప్రారంభంలో వున్న ఒక వ్యక్తి వచ్చి తనను బైసురాం పద్దాగా పరిచయం చేసుకున్నాడు. బైజ్‌నాథ్ పెద్దా తన తమ్ముడు అని చెప్పాడు.

ఏడుగురు తోబుట్టువులున్న కుటుంబంలో 2008లో జన్మించిన బైజ్‌నాథ్ మూడవవాడు. 2014లో ఆరేళ్ల వయసులో గ్రామ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. 2019లో పాఠశాల జారీ చేసిన మార్క్‌ షీట్ ప్రకారం 56% స్కోర్‌తో 5వ తరగతి పాస్ అయ్యాడు. ఆ పత్రంలో బైజ్‌నాథ్ పుట్టిన తేదీ 2008 జనవరి 4 అని వుంది.

గ్రామంలో మిడిల్ స్కూల్ లేకపోవడంతో, బైజ్‌నాథ్ అడవి మార్గంలో మూడు- నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. తన కుటుంబానికి వ్యవసాయ పనిలో సహాయం చేయడానికి ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడని అతని అన్న జ్ఞాపకం చేసుకున్నాడు.

గతేడాది సెప్టెంబరులో పద్దా కొన్ని వారాల పాటు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను మావోయిస్ట్ పార్టీలో చేరినట్లు ఎవరో చెప్పేదాకా అతని కుటుంబానికి అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, నారాయణ్‌పూర్‌లోని బస్తర్ అడవులలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆ నిషేధిత సంస్థ భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉంది.

మావోయిస్టు సైన్యంలో చేరినప్పుడు బైజ్‌నాథ్‌కు 15 ఏళ్లు. ఏప్రిల్‌లో కంకేర్‌లోని ఛోటే బేథియా అడవుల సమీపంలో పోలీసుల బుల్లెట్‌లతో మరణించినప్పుడు, అతని వయస్సు 16 సంవత్సరాల నాలుగు నెలలు.

కానీ, తాము చేపట్టిన భద్రతా చర్య గురించి పోలీసులు చేసిన ప్రకటనలో  అతని వయస్సు “సుమారు 18 సంవత్సరాలు” అని రాసారు. అతని వయస్సుపైన  – లేదా, చనిపోయిన మొత్తం 29 మంది వయస్సుల గురించి కూడా మావోయిస్ట్ ప్రకటన మౌనం వహించింది; వారందరినీ తమ కార్యకర్తలుగా గుర్తించింది.

బైజ్‌నాథ్ పెద్దా వయస్సును ఏ పక్షమూ ఖచ్చితంగా చెప్పకపోవడానికి ఒక కారణం ఉండచ్చు: సాయుధ పోరాటాలలో బాల సైనికులను ఉపయోగించడం అనేది ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు ఐచ్ఛిక ప్రోటోకాల్ ద్వారా నిషేధం. కన్వెన్షన్, దాని సంబంధిత ప్రోటోకాల్‌లకు భారతదేశం సంతకం చేసింది కాబట్టి, వాటి నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

ఐచ్ఛిక ప్రోటోకాల్ ఆర్టికల్ 4 సాయుధ సంఘర్షణలో పిల్లల ప్రమేయం గురించి ఇలా పేర్కొంది: “ఒక రాజ్య సాయుధ బలగాల నుండి భిన్నమైన సాయుధ సమూహాలు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియమించకూడదు లేదా ఉపయోగించకూడదు.” “అలాంటి నియామకాలు, వినియోగాన్ని నిరోధించడానికి రాజ్య ప్రభుత్వాలు సాధ్యమయ్యే చర్యలన్నింటినీ తీసుకుంటాయి”అని జోడించింది.

అయితే కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో మరణించింది బాల సైనికుడు బైజ్‌నాథ్ ఒక్కడే కాదు. చనిపోయిన 29 మంది మావోయిస్టులలో నలుగురు 18 ఏళ్లలోపు వారు వున్నారని కుటుంబాలు, వారి ఆధార్ కార్డులు, పాఠశాల పత్రాలలో నమోదు చేయబడిన వయస్సు ప్రకారం తెలిసింది. మరో ముగ్గురు 18 ఏళ్ల వయసువారు ఉన్నారు; మైనర్‌లుగా ఉన్నప్పుడు మావోయిస్టు సైన్యంలో చేరారని వారి కుటుంబాలు తెలిపాయి.

ఈ సంవత్సరం జరిగిన ఇతర ఎన్‌కౌంటర్‌లలో కూడా, మరణించిన వారి కుటుంబాలు వారిని 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిగా కనీసం మూడు సందర్భాలలో గుర్తించాయి.

మావోయిస్టు సైన్యంలో బాల సైనికులు ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు – మావోయిస్టు రిక్రూట్‌మెంట్ విధానం 16 ఏళ్లు పైబడిన వారు తమ సైనిక విభాగంలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఛోటే బేథియా ఎన్‌కౌంటర్‌లో మరణాలు వెల్లడించినట్లుగా, మావోయిస్టులు వారి స్వంత ప్రశ్నించదగ్గ విధానాల ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యారు. గెరిల్లా సైన్యంలో చేరినప్పుడు బైజ్‌నాథ్‌ వయస్సు కేవలం 15 ఏళ్లు. అదే ఎన్‌కౌంటర్‌లో మరణించిన జెన్నీ నురుటి వయస్సు 15 సంవత్సరాలు.

జెన్నీ నూరుతి తన తల్లి, ఏడుగురు తోబుట్టువులతో కల్పర్ గ్రామంలో వుండేది; కుటుంబంలో ఐదవ సంతానం; ఆమె 2009 మార్చి 20 న జన్మించింది; ఆధార్ కార్డులో పేరు జనీలా అని నమోదు అయింది.

ఛోటే బెథియా ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చేసిన ప్రకటనలో ఆమెను మెండ్‌కీ ప్రాంతంలోని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ స్థానిక ఆర్గనైజింగ్ స్క్వాడ్‌లో సభ్యురాలిగా గుర్తించి, ఆమె తలపై రూ. 8 లక్షల రివార్డు ఉంది అన్నారు.

కానీ ఆమె అన్న మిథున్ ఇటీవల జనవరిలో జెన్నీ “పార్టీ”లో(బస్తర్‌లో సిపిఐ (మావోయిస్ట్)ను పార్టీ అని పిలుస్తారు) చేరింది అని చెప్పాడు; ఆమె వయస్సు  14 ఏళ్లు. ఆమె గెరిల్లా సైన్యంతో కేవలం నాలుగు నెలలు మాత్రమే వున్నది; బహుమతి ప్రకటించడానికి అర్హమైన కాలం ఎంతమాత్రమూ కాదు.

ఇంత చిన్న వయస్సులో పార్టీలో చేరడానికి జెన్నీని ప్రేరేపించినది ఏమిటి? ఇంట్లో గొడవ జరిగిందా? అని అడిగాను. కాదు అని తల ఊపాడు మిథున్.

ఆమె స్నేహితులు పార్టీలో చేరినందున ఆమె పార్టీకి ఆకర్షితమైందా? మళ్లీ కాదు అని తల ఊపాడు.

చేరాలని పార్టీ నుంచి ఒత్తిడి వచ్చిందా? లేదు, మళ్ళీ తల ఊపాడు. కానీ ఈసారి, అతను మాట్లాడాడు కూడా: “అప్నీ మర్జీ సే గయీ.” (తన ఇష్టంతో వెళ్లింది.)

జెన్నీ తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని, నిశ్శబ్దంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందని మిథున్ చెప్పాడు. నెల రోజులైనా తిరిగి రాకపోవడంతో మావోయిస్టుల్లో చేరిందని అనుకున్నారు.

ఆమె ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు, ఉండిపొమ్మని కుటుంబం కోరినప్పటికీ, తమ అభ్యర్థనను తిరస్కరించి వెళ్లిపోయిందని చెప్పాడు.

జెన్నీ నురుటి కుటుంబ సభ్యుల్లో ఎలాంటి భావోద్వేగాలు వ్యక్తం కాకపోవడంతో పోలిస్తే, మే నెల ప్రారంభంలో బీజాపూర్ జిల్లాలోని మారివాడ గ్రామంలో ఇంటి దగ్గర కలిసినప్పుడు సోనూ మాడ్వి తల్లిదండ్రుల్లో దుఃఖం స్పష్టంగా కనిపించింది.

నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు బుద్రు మాడ్వి, అతని భార్య ఐతి అడవిలో  సేకరించిన తునికాకులను కట్టలు కట్టడంలో నిమగ్నమై ఉన్నారు.

సోను తమ చిన్న బిడ్డ అంటూ బుద్రు ఏడ్చేసాడు. ఇంట్లో బాగా గొడవపడి మూడేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అది కరోనా వైరస్ విపత్తు సమయంకాలం అని తండ్రి జ్ఞాపకం  చేసుకున్నాడు. సోను బీజాపూర్‌లోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల నుండి బి గ్రేడ్‌తో 8వ తరగతి పాస్ అయ్యాడు, కానీ కరోనా సమయంలో పాఠశాలలు మూసివేయడంతో ఇంట్లోనే వుండిపోవాల్సి వచ్చింది. ఇంట్లో సహాయం చేయడానికి బదులుగా, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా తిరుగుతూ ఉండేవాడని బుద్రు చెప్పాడు.

దీంతో తండ్రీకొడుకుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఒకరోజు బుద్రు అతనిపై అరిచిన తర్వాత, ఉద్రేకంతో వున్న సోను అతన్ని కొట్టాడు. తాను చేసిన పనికి  దిగ్భ్రాంతి చెందిన సోనూ ఇంటి నుండి వెళ్లిపోతుంటే తండ్రి అడ్డుకోలేదు.

సోనూ తిరిగి రాలేదు. “అతను తిరిగి వచ్చి ఉంటే, క్షమించమని అడిగేవాడిని” తండ్రి ఏడుస్తూ అన్నాడు

కొన్ని నెలల తర్వాత, 2021 జూన్‌లో, సోను మావోయిస్టుల్లో చేరినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. బైజ్‌నాథ్, జెన్నీలలాగా, అతని వయసు అప్పుడు కేవలం 15 సంవత్సరాలు.

సోనూను తిరిగి రావాలని కోరుతూ తాము మావోయిస్టు నేతలకు లేఖ పంపామని బుద్రు పెద్ద కుమారుడు సోడి చెప్పాడు. అయితే తాము చేతితో రాసి పంపిన నోట్‌ వారికి అందిందో, లేదో తెలియలేదు.

ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోనూ మరణవార్త గ్రామానికి చేరినప్పుడు, వారు   విషాదంలో మునిగిపోయారు; కానీ కోపం కూడా వచ్చింది. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం సోనూ శరీరందగ్గర ఎలాంటి ఆయుధం దొరకలేదు. అతను నిరాయుధుడిగా ఉంటే పోలీసులు అరెస్టు ఎందుకు చేయలేదని వారు ప్రశ్నించారు.

“వారు అతనిని అరెస్టు చేసి తాము కావల్సినంత కాలం జైలులో ఉంచవచ్చు; కనీసం మేము అతనిని కలుసుకోగలిగేవాళ్లం” కన్నీళ్లను తుడుచుకొంటూ బుద్రు అన్నాడు.

తన కుమారుడి మరణానికి తానే కారణమని నిందించుకున్నప్పటికీ బుడ్రు మావోయిస్టులపైన కూడా కోపంగా ఉన్నాడు – మైనర్‌ను తమ సైన్యంలోకి చేర్చుకునే ముందు తల్లిదండ్రుల సమ్మతి ఎందుకు తీసుకోకూడదు అని అడిగాడు.

“ఒకసారి అడిగి వుంటే బాగుండేది” అని సోను అన్నయ్య అన్నాడు.

ఈ ప్రశ్నకు సమాధానాలు వెతకడానికి, నేను జూలైలో రెండు రోజులపాటు నడిచి, బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతంలోకి గుర్తు తెలియని ప్రదేశానికి చేరుకున్నాను.

నేను ఒక చిన్న ఖాళీ ప్రదేశం దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు, భుజంపై AK-47 తగిలించుకుని, యాభైల ప్రారంభంలో వున్న ఒక సన్నటి వ్యక్తి దట్టమైన అడవిలో నుంచి బయటకు వచ్చాడు. తన రైఫిల్‌ను చెట్టు బోదెకి ఆనించి, ఒక ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి, నన్ను కూర్చోమన్నాడు; తనకేమీ తొందర లేదని  సూచించాడు.

సంభాషణ సమయంలో, అతను సిపిఐ (మావోయిస్ట్)పార్టీ సోపానక్రమంలో చాలా ఉన్నత స్థాయిలో వున్నవాడని తెలిసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన మూడు సబ్-జోన్‌లలో ఒకదానికి బాధ్యుడు; ఇది బస్తర్, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలిలోకి విస్తరించి ఉంది.

బాల సైనికులపై పార్టీ విధానం గురించి, ప్రత్యేకించి ఛోటే బేథియా ఎన్‌కౌంటర్‌లో మరణించిన మైనర్‌ల కేసును ప్రస్తావిస్తూ అతనిని అడిగినప్పుడు మావోయిస్టు నాయకుడు కాస్త ఆత్మరక్షణలో పడ్డాడు.

“జెన్నీ నూరుటికి ఖచ్చితంగా తక్కువ వయస్సు ఉంది,” అతను ఒప్పుకున్నాడు. గత ఏడాది జూలై లేదా ఆగస్టులో పార్టీలో చేరేందుకు వచ్చిన ఆమెను ఇంటికి తిరిగి పంపించాం. “ఆమె వయస్సు కారణంగా మేము ఆమెను ఇంటికి తిరిగి పంపినప్పటికీ, పార్టీలోనే ఉంటానని పట్టుబట్టి తిరిగి వచ్చింది” అని అన్నారు.

“కేవలం జెన్నీ మాత్రమే కాదు, గత సంవత్సరం, మావోయిస్టు రిక్రూట్‌మెంట్ శిబిరాలకు పెద్ద సంఖ్యలో తక్కువ వయస్సు గల బాల,బాలికలు హాజరుకావడంతో ఈ ఏడాది జనవరిలో పార్టీ సమీక్ష చేయవలసి వచ్చింది. దాదాపు 30 మంది తక్కువ వయసు వున్న ఆడ, మగపిల్లలను వెనక్కి పంపాం.”

రిక్రూట్‌మెంట్‌కు కారణమైన ఏరియా కమిటీ సభ్యులను హెచ్చరించాం. చిన్న పిల్లలను పార్టీలో చేర్చుకోకుండా జాగ్రత్త వహించాలని చెప్పాం.

మైనర్‌లను రిక్రూట్ చేయడానికి ముందు పార్టీ తల్లిదండ్రుల సమ్మతిని కోరుతుందా అని అడిగిన ప్రశ్నకు, ఆ సీనియర్ మావోయిస్టు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వివరించాడు. రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌ల సమయంలో, గ్రామస్తులకు రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేస్తారు; పార్టీలో చేరమని ప్రోత్సహిస్తారు. చేరడానికి ముందుకు వచ్చిన తర్వాత, ఏరియా కమిటీ సభ్యులు వయస్సుతో సహా నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత, స్థానిక గ్రామ సభ్యుల ద్వారా, పార్టీలో చేరడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం గురించి సంబంధిత కుటుంబానికి తెలియచేస్తారు.

“16 ఏళ్లలోపు పిల్లలను చేర్చుకోకూడదని మా పార్టీ స్పష్టమైన విధానాలను కలిగి ఉంది. ఇది కేవలం “నియమాల కారణాల” కోసం కాదు. పార్టీలో తక్కువ వయస్సు గల పిల్లలను చేర్చుకోవడం, నిర్వహించడం సులభం కాదు. వారిలో చాలా మంది పాఠశాలకు హాజరు కాకపోవడం లేదా బాహ్య ప్రపంచంతో పరిచయం లేకపోవడం వల్ల వారికి అవగాహన కల్పించడానికి, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడానికి “సరియైన సిలబస్‌ను అభివృద్ధి చేయడం సవాలుగా ఉందని” ఆయన అన్నారు.

కానీ అనేకమంది మానవహక్కుల కార్యకర్తలు ఈ వివరణలు సరిపోవని భావిస్తున్నారు.

బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ “పిల్లవాడు అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి మనిషి” అని నిర్ధారిస్తుంది అని చట్ట పాలన, ప్రజాస్వామ్యానికి గల ముప్పులపై నిర్దిష్ట దృష్టితో మానవ హక్కుల ఉల్లంఘనలను గమనించే ఢిల్లీకి చెందిన స్వతంత్ర ఆలోచనా సంస్థ- రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ డైరెక్టర్ సుహాస్ చక్మా అన్నారు.

2013లో ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ విడుదల చేసిన నివేదిక రచయితలలో చక్మా ఒకరు; ఒడిశా, బీహార్ ఛత్తీస్‌గఢ్‌లోని సీపీఐ (మావోయిస్ట్) పార్టీ 12, 13 ఏళ్లలోపు పిల్లలను రిక్రూట్ చేసుకొని సైనిక శిక్షణలో ఉంచిన సందర్భాలను ఇందులో నమోదు చేసింది.

“సిపిఐ (మావోయిస్ట్)తో సహా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను రిక్రూట్ చేసే ఏ సంస్థ అయినా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లే” అని ఆయన అన్నారు.

అయితే సమస్య తీవ్రతను తగ్గించింది కేవలం మావోయిస్టులే కాదు.

ఇటీవలి ఎన్‌కౌంటర్‌లలో మరణించిన తక్కువ వయస్సు గల పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం పట్ల పోలీసులు కూడా కళ్ళు మూసుకున్నట్లు అనిపించింది – వీరిలో చాలా మందిని రివార్డు మోసే మావోయిస్టులుగా చూపించారు. గతంలో నివేదించిన ప్రకారం, ఈ సంవత్సరం ఎన్‌కౌంటర్ హత్యలకు పోలీసులు రూ.5 కోట్లకు పైగా రివార్డులు సంపాదించారు.

బాల సైనికుల మరణాల గురించి అడిగినప్పుడు, బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి సుందర్‌రాజ్ ఇలా అన్నారు: “చాలా మంది చిన్న అబ్బాయిలు, అమ్మాయిలు చనిపోయారని మేము గమనించాము. బహుశా అసాధారణమైన సందర్భాల్లో, ఒకరు లేదా ఇద్దరు తక్కువ వయస్సు గల పిల్లలు వున్నారు, కానీ ఇది అంతగా గుర్తించదగిన లక్షణం కాదు.”

అయితే, ఎన్‌కౌంటర్‌లలో మరణించిన మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించేటప్పుడు, పోలీసు సిబ్బంది వారి వయస్సును గమనించినట్లు తెలిసింది. మే 23న రేకవాయ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సుమారు 17 సంవత్సరాల అస్మతీ కుంజమ్ సోదరుడు మున్నా కుంజమ్, “ఇంత చిన్న వయసులో వాళ్లను ఎందుకు పంపిస్తారు ?” అని మృతదేహం దగ్గర వున్న ఒక పోలీసు తనను అడిగాడు అని చెప్పాడు.

పోస్ట్‌ మార్టం నిర్వహించే సమయంలో రాజ్య అధికారులు తక్కువ వయస్సు గల వారిని గమనించి ఉండవచ్చు. జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, శవపరీక్షలు నిర్వహించే వైద్యులు చనిపోయిన వ్యక్తి సుమారు వయస్సును నిర్ధారించాలి.

కాంకేర్‌లో, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అవినాష్ ఖరే “పోస్ట్‌మార్టం చేసేటప్పుడు మేము ఎన్‌హెచ్‌ఆర్‌సి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పూర్తిగా అనుసరిస్తాము” అని అన్నారు. ఛోటే బేతియా ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మందిలో 11 మందికి శవపరీక్షలు నిర్వహించిన వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్స్ విభాగానికి చెందిన ఇద్దరు వైద్యులను కలిసాను.

ఆ ఇద్దరూ కూడా తమ పరిశోధనల గురించి చెప్పడానికి అంతగా యిష్టపడలేదు.  “ఖచ్చితమైన వయస్సును నిర్ధారించడం కష్టం, అందుకే రెండు శరీరాలను, మేము సుమారు 18 సంవత్సరాల వయస్సు అని రాసాము” అని తన పేరును బయటపెట్టడానికి యిష్టపడని, వారిలో ఒక వైద్యుడు చెప్పారు. “మేము వయస్సుని నిర్ణయించే కీలకమైన ఎముక ఎక్స్-రే తీసాము; జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం శవపరీక్ష ప్రక్రియను వీడియో రికార్డ్ చేసాము,” అన్నారాయన.

ఏషియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ 2013 నివేదిక భారత ప్రభుత్వం బాల సైనికుల సమస్యపై ఆలోచించకపోవడానికి గల కారణాలను వివరించింది.

తన స్వంత విధానాన్ని హక్కుల కన్వెన్షన్‌కు ఐచ్ఛిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటంపై ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి 2011లో దాఖలు చేసిన చివరి   నివేదికలో, “18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే వారిని కార్యాచరణ ప్రాంతాలకు పంపుతాము”అని 16.5 సంవత్సరాల వయస్సు పిల్లలను సాయుధ దళాల్లోకి చేర్చుకునే తన విధానాన్ని ప్రభుత్వం సమర్థించింది.

“భారతదేశం అంతర్జాతీయ లేదా అంతర్జాతీయం కాని సాయుధ సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కోదు” అని పేర్కొని మావోయిస్టుల వంటి తిరుగుబాటు గ్రూపులు తమ సైనిక విభాగాలలో పిల్లలను ఉపయోగించడాన్ని గురించి చెప్పడాన్ని మినహాయించింది.

మావోయిస్ట్ సంఘర్షణలో పిల్లల ప్రమేయాన్ని అధికారికంగా భారతదేశం అంగీకరించకపోవచ్చు; కానీ ఛత్తీస్‌గఢ్‌లో, పోలీసులు దానిని వ్యూహాత్మకంగా తీసుకురావడానికి మొగ్గు చూపుతున్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్, ఛోటే బేథియా ఎన్‌కౌంటర్‌లో తక్కువ వయస్సు గలవారి ప్రాణనష్టంపైన నిర్దిష్ట వ్యాఖ్యను తప్పించుకుంటూ, “మావోయిస్టులు చిన్న పిల్లలను పార్టీలోకి పంపమని కుటుంబాలపై ఒత్తిడి తెస్తారనేది తెలిసిన విషయమే”అన్నారు.

అయితే, పోలీసుల వాదనకు విరుద్ధంగా, మావోయిస్టులలో చేరాలనే తమ పిల్లల నిర్ణయంలో తమకు పెద్దగా సంబంధం లేదని ఈ సంవత్సరం ఎన్‌కౌంటర్‌లలో మరణించిన చాలా మంది యువ కార్యకర్తల కుటుంబాలు చెప్పాయి.

జూన్ 15న మాడ్‌లోని కొడ్తమార్క ఎన్‌కౌంటర్‌లో పర్‌దీప్ పర్సా మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం, అతని వయస్సు 30 సంవత్సరాలు. కానీ చనిపోయే సమయానికి అతని వయస్సు 20-21 సంవత్సరాల కంటే ఎక్కువ కాదని అతని తల్లి లక్కీ పర్సా నాతో అన్నారు.

పొడవుగా, తీక్షణంగా కనిపించే మహిళ లక్కీకి, పర్‌దీప్ మావోయిస్టులలో చేరిన సంవత్సరం ఏదో గుర్తుకు రాలేదు; కానీ  ఖచ్చితంగా 2019 ఫిబ్రవరిలో జరిగిన తాడ్‌బల్లా ఎన్‌కౌంటర్ తర్వాతనే అని చెప్పింది.

ఆ లెక్క ప్రకారం, మావోయిస్టులలో చేరే సమయానికి పర్‌దీప్ దాదాపు 15-16 సంవత్సరాల వయస్సు వాడై ఉండాలి.

తిరుగుబాటుదారుడిగా మారాలనే నిర్ణయాన్ని అతను స్వయంగానూ, మావోయిస్టులు కూడా తనకు తెలియజేశారని లక్కీ చెప్పింది.

కొద్దిరోజులవరకు ఇంటికి తిరిగి రమ్మని తల్లి కబురు పంపేది. తమ్ముడు మామ దగ్గర వుండడం, చెల్లి ఇప్పటికీ పసిబిడ్డగావడం వల్ల తల్లిదండ్రులకి పొలం పనులలో సహాయం చేయాల్సిన అవసరం ఉందని అతనికి గుర్తు చేసేది.

ఒకరోజు, పర్‌దీప్ ఇంటికి వచ్చినప్పుడు లక్కీ ఇంట్లో లేదు. తిరిగి వచ్చేసరికి వెళ్లిపోయాడు. ” వర్షాకాలంలో వ్యవసాయ పనులు చేయడానికి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు.” కానీ అలా జరగనేలేదు.

తాడోపోట్ గ్రామంలో జరిగిన మరో పోలీసు ఎన్‌కౌంటర్‌లో అనేక మంది పౌరులు చనిపోయారని ఆరోపిస్తూ గ్రామస్థులు నిరసన తెలియచేస్తున్న ప్రాంతంలో  లక్కీతో మాట్లాడాను. గనుల తవ్వకాన్ని సులభతరం చేయడానికి రాజ్యం ఈ ప్రాంతంలో రోడ్లను నిర్మిస్తోందని చూపిస్తూ, “పోరాడడం, మా గ్రామాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం” అన్నది.

తన తొమ్మిదేళ్ల కూతురిని దగ్గరికి తీసుకొని, “నా పిల్లలు ఈ నిరసనల్లో పాల్గొంటే సంతోషిస్తాను; కానీ వారు పార్టీలో చేరడానికి యిష్టపడితే మాత్రం అనుమతించను” అన్నది లక్కీ.

దుఃఖంలో ఉన్న మరో తల్లి కమల కర్తమ్‌ని బీజాపూర్‌లోని దుర్ధా గ్రామంలోని తన ఇంట్లో కలిసినప్పుడు పోలీసులకు, మావోయిస్టులకు ఏమైనా సందేశం ఇస్తావా అని అడిగితే మౌనంగా ఉండిపోయింది. ఛోటే బేతియా ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో ఆమె కుమారుడు గుడ్డు కర్తం కూడా ఉన్నాడు. అతను 2021 జూన్ లో పార్టీలో చేరాడు. అతని ఆధార్ కార్డ్ ప్రకారం అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు.

సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత, కమల గద్గద స్వరంతో గోండిలో ఇలా అంది: “నానా పీనా ఆలసి తాన్ – నాన్ బాట కెట్టా పర్వోన్.” “నేను చాలా అలసిపోయాను – నేను ఏమీ చెప్పలేకపోతున్నాను.”

తెలుగు: పద్మ కొండిపర్తి

https://scroll.in/article/1072960/this-child-soldier-was-killed-in-bastars-anti-maoist-operations-she-is-not-the-only-one

Leave a Reply