బస్తర్‌లో పౌర హత్యలపై మేము నివేదికను ప్రచురించిన నెలలో, మరో రెండు దఫాలు ఈ ప్రాంతంలో నక్సల్ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి, 16 మంది మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మరణించినట్లు తెలిసింది. జూన్ ప్రారంభంలో, సునీతా పొట్టం అనే 25 ఏళ్ల కార్యకర్తను ఆమె ఇంటి నుండి బయటకు లాగి, కొట్టి, అరెస్టు చేసి అనేక కేసులు పెట్టినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కార్పొరేటీకరణ, సైనికీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ప్రచారంలో నిమగ్నమైన మానవ హక్కుల కార్యకర్తలు సుర్జు టేకం, శంకర్ కశ్యప్, ఓరం సామ్లు కోరం, లఖ్మా కోరం, రాను పోడ్యమ్ వంటి వారిని అరెస్టు చేసి హింసకు గురిచేశారు. ఈ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం, హత్యల సంఖ్య పెరుగుదలకు వెనక వున్న ముఖ్యాంశం – బస్తర్‌లో మాయమైపోతున్న భూమి.

రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కోసం తమ అటవీ భూములను ధ్వంసం చేయడాన్ని ఆదివాసీలు నిరసిస్తున్న సమయంలో  మాసే సోడి నిరసనకు హాజరైన భద్రతా బలగాలు కాల్పులు జరిపిన సమయంలో ఆమె రొమ్ము చీకుతున్న ఆరు నెలల పసికందు చనిపోయింది. బస్తర్‌లో ఇటీవలి హింసాకాండలో పెరిగిన విచ్చలవిడితనానికి, భూమిని సులువుగా దోచుకోవడానికి వీలు కల్పించే చట్టాలు, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించే వైమానిక బాంబు దాడుల వంటి చర్యలు మద్దతునిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత రాజ్యం, బస్తర్ భూములు మాయమవడాన్ని సమర్థించటానికి భద్రత అభివృద్ధి అనే అదే పాత వివరణపై ఆధారపడుతూనే కొత్త సాధనాలను కనిపెట్టింది.

రాజ్య సమ్మతితో బస్తర్ భూభాగం, ప్రజలు అదృశ్యమవడం గురించి తెలుసుకోవాలంటే, ఈ ప్రాంత చరిత్రలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను పరిశీలించడం అవసరం.

ఆధారిత, సార్వభౌమిక ప్రాంతాలలో,  బస్తర్ స్థానిక ప్రజలపై బ్రిటిష్ భూ సంస్కరణల ప్రభావాన్ని నందిని సుందర్ పరిశీలించారు. 19వ శతాబ్దపు చివరలో, వలస పాలన సాంప్రదాయిక భూ యాజమాన్యం, నిర్వహణ వ్యవస్థలకు అంతరాయం కలిగించే మార్పులను ప్రవేశపెట్టిన ఫలితంగా స్థానిక సముదాయాలు తమ భూమి నుండి బేదఖలు అయ్యాయి.

బ్రిటీష్ వారు అధికారిక యాజమాన్యం, పన్ను విధింపు అవసరమయ్యే భూ-ఆదాయ వ్యవస్థను అమలు చేశారు, ఇది ఆదివాసీలు ఆచరించే సామూహిక యాజమాన్యం, సాంప్రదాయక హక్కులకు అసంబద్ధమైన భావన.

తరచుగా సాంప్రదాయ హక్కులు, పద్ధతులను విస్మరిస్తూ, భూ యాజమాన్యాన్ని డాక్యుమెంట్ చేయడానికి విస్తృతమైన సర్వే, పరిష్కార చర్యలు జరిగాయి. ఇది సామూహిక భూ-ఆధీన విధానాల విచ్ఛిన్నానికి దారితీసింది. కొత్త చట్టపరమైన ప్రమాణాల ప్రకారం అధికారిక యాజమాన్యాన్ని నిరూపించుకోలేకపోయిన అనేక మంది ఆదివాసీలు తమ భూములనుండి బేదఖలయ్యారు.

అంతే కాకుండా, బ్రిటిష్ వారు వాణిజ్య ప్రయోజనాల కోసం కలపలాంటి అటవీ వనరులను, ఉపయోగించడాన్ని నియంత్రించడానికి కఠినమైన అటవీ చట్టాలను అమలు చేశారు. ఈ చట్టాలు స్థానిక ఆదివాసీ సముదాయాల అడవుల ప్రవేశాన్ని పరిమితం చేసాయి. ఉత్పత్తులను సేకరించడం, వేటాడటం, బదిలీ సాగు చేయడంలాంటి వారి పనులను పరిమితం చేశాయి. తమ ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచుకోడానికి, బ్రిటిష్ వారు ఆదివాసీ సముదాయాల జీవనోపాధి వ్యవసాయంతో విభేదించే నగదు పంటలు, వాణిజ్య వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఈ మార్పు స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చడం మాత్రమే కాకుండా పర్యావరణ వినాశనానికి కూడా కారణమైంది. ఆదివాసీ జీవన విధానాన్ని మరింతగా విచ్ఛిన్నం చేసింది. పెద్ద పెద్ద రిజర్వ్ అడవులను సృష్టించడం వల్ల ఆదివాసీ సముదాయాలు ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా నిరోధించాయి. వారి కార్యకలాపాలను తీవ్రంగా పరిమితం చేశాయి. నిరాదరణను, జీవనోపాధి కోల్పోవడాన్ని మరింతగా పెంచాయి.

ఇరవైవ శతాబ్దంలో భారతదేశం ఆధునిక దేశంగా మారడంతో, తన కార్యకలాపాలలో సార్వభౌమత్వాన్ని చేర్చడంతో, ఆదివాసీ సముదాయాలు దోపిడీ చేయడానికి అనుకూలంగా అంచుకు నెట్టబడ్డాయి. అనేక ప్రాంతాలలో, ఈ దోపిడీకి ప్రతిఘటన ఎదురైంది. సుందర్ తన “సివిల్ వార్స్ ఇన్ సౌత్ ఆసియా: స్టేట్, సార్వభౌమత్వం, డెవలప్‌మెంట్” అనే పుస్తకంలో సంవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి, ఈ ప్రాంతంలో ఉన్న విభేదాలు చారిత్రాత్మకంగా రాజ్యసార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యాలతో ఎలా ముడిపడి ఉన్నాయో రికార్డు చేసింది. బస్తర్‌లోని అంతర్యుద్ధాలు, ప్రతిఘటనలను కేవలం స్థానిక లేదా ప్రత్యేక విభేదాలుగా మాత్రమే అర్థం చేసుకోలేము; అవి రాజ్య నిర్మాణము, ఆర్థిక అభివృద్ధి, ఆధునిక రాజ్య సార్వభౌమత్వ స్థాపన వంటి విస్తృత చారిత్రాత్మక, రాజకీయ ప్రక్రియలతో లోతుగా ముడిపడి ఉన్నాయి.

రాజ్య-నేతృత్వంలోని అభివృద్ధి ప్రాజెక్టులు, ఆధునికత విధింపు తరచుగా సాంప్రదాయ జీవన విధానాలు, స్థానిక సమాజాల సార్వభౌమాధికారంతో విభేదిస్తాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వనరుల వెలికితీత, పరిపాలనా నియంత్రణను పొడిగించడం ద్వారా అట్టడుగు ప్రాంతాలను ఏకీకృతం చేయాలని రాజ్యం లక్ష్యంగా పెట్టుకున్న బస్తర్ వంటి ప్రాంతాలలో ఈ వైరుధ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను, తరచుగా పురోగతిగా చిత్రించినప్పటికీ, నిర్వాసిత్వం, జీవనోపాధిని కోల్పోవడం, స్థానిక సంస్కృతుల క్షీణతలకు దారితీస్తాయి, ప్రతిఘటన, సంఘర్షణలను అధికం చేస్తాయి.

నేడు బస్తర్‌లో కనిపించిన భూమి అంతర్ధానం, వనరుల దోపిడీకి పురాతనమైన అదే ప్రేరణ నుండి వచ్చింది-ఇప్పుడు, భారత రాజ్యం, దాని ధనికులు ఈ అడవులను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇటీవలి సంవత్సరాలలో సాంకేతిక పురోగతి- అందువల్ల కలిగే  విధ్వంసం; ఈ ప్రాంతంలో నిర్బంధాన్ని న్యాయబద్ధం చేసుకోవడానికి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు; ఎంపిక చేసిన కొందరికి మూలధనాన్ని కూడబెట్టుకోవడానికి మార్గాలనేర్పరచడం కొత్తగా వచ్చాయి.

2016 డిసెంబర్‌లో, భారత ప్రభుత్వం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్తీమిసమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్-ఆర్‌సి‌పి‌ఎల్‌డబల్యూ‌ఈ‌ఎఎ) కోసం రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది, ఇది 44 జిల్లాల్లో అన్ని కాలాల వాతావరణాన్ని తట్టుకొని నిలబడే రోడ్డును (ఆల్-వెదర్ రోడ్ కనెక్టివిటీని) నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది, అందులో 35 అత్యంత ప్రభావితమైన జిల్లాలు, తొమ్మిది వాటి పక్కనే ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 2,500 కిలోమీటర్ల పొడవునా మొత్తం 291 రోడ్ల నిర్మాణాన్ని ప్రాజెక్ట్ మంజూరు చేసింది, వీటిలో సగం కంటే తక్కువ 2021 నాటికి పూర్తయింది.

2017 మే లో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆపరేషన్ సమాధాన్ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. సమాధాన్ అంటే పరిష్కారం; సింగ్ ఇలా వివరించాడు S -“స్మార్ట్ లీడర్‌షిప్”; A- “అగ్రెసివ్ స్ట్రాటేజీ”(దూకుడు వ్యూహం); M- “ప్రేరణ-శిక్షణ”;  A- “యాక్షనబుల్ ఇంటెలిజెన్స్” ( క్రియాశీల మేధస్సు); D- “డ్యాష్‌బోర్డ్ ఆధారిత కీ పర్ఫార్మ్ ఇండికేటర్స్ (కీ పనితీరు సూచికలు); కీ రిజల్ట్ ఏరియాస్ (KRAలు) (కీలక ఫలితాల ప్రాంతాలు)”; H-  “హార్నెసింగ్ టెక్నాలజీ”(సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం); A- “ప్రతి రంగం  కోసం కార్యాచరణ ప్రణాళిక” (యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్); N -“నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్” (నిధుల లభ్యత లేదు యాక్సెస్ లేదు.”

గత డిసెంబరు నుండి ఛత్తీస్‌గఢ్‌లో నూతన బిజెపి ప్రభుత్వంలో దారితీసిన ఈ దూకుడు వ్యూహం, పౌరుల నిర్లక్ష్య హత్యలను బస్తర్‌పై మునుపటి ‘అదృశ్యం ప్రాజెక్ట్ కథనం’ డాక్యుమెంట్ చేసింది. అయితే సింగ్ దూకుడు వ్యూహంలో “అభివృద్ధిలో దూకుడు, రహదారి నిర్మాణంలో దూకుడు” కూడా ఉన్నాయి. సాంకేతికతను ఉపయోగించుకునే లక్ష్యంలో భాగంగా, మానవరహిత వైమానిక వాహనాల (యుఎవిలు) లేదా డ్రోన్‌ల ఉపయోగం “అవసరమైనవాటికంటే తక్కువ” అని, “సంఖ్యల ద్వారా, సరైన స్థలంలో ఉపయోగించడం ద్వారా రెండింటినీ పెంచడం” అవసరమని సింగ్ అన్నాడు.

గత మూడు సంవత్సరాలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విచక్షణారహితంగా అమలు చేయడం జరిగింది, వైమానిక దాడుల వినియోగం పెరిగింది. 2021 ఏప్రిల్ 19న, బొతలంక, పాలగూడెం గ్రామాల్లో మొదటి వైమానిక దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలోని ఇళ్లపై కనీసం 12 బాంబులు పడినట్లు గ్రామస్థులు చెప్పారు. దాదాపు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, 2022 ఏప్రిల్ 14- 15 మధ్య రాత్రి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బొట్టెథాంగ్, మెట్టగూడ, దులేద్, సక్లేర్, పొట్టేమంగి గ్రామాలపై భద్రతా దళాలు మరో డ్రోన్ బాంబు దాడులకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. 2023 జనవరిలో, మెట్టగూడ, బొట్టెథాంగ్‌తో పాటు బీజాపూర్‌లోని ఎర్రపల్లి గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని మూడవ సారి వైమానిక దాడులు జరిగాయి. కేవలం రెండు నెలల తర్వాత, బస్తర్ ప్రాంతం బీజాపూర్‌లోని భట్టిగూడ గ్రామంలో నాల్గవ డ్రోన్ బాంబు దాడిని జరిగింది. ప్రతిసారీ, ప్రత్యక్ష సాక్షుల కథనాలు, గ్రామస్థులు తమపై కాల్చిన బాంబుల షెల్‌లను చూపించినప్పటికీ, భద్రతా దళాలు దాడులు జరిగాయి అనడాన్ని తిరస్కరించాయి.

బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని పాలగూడ, ఇట్టగూడ, జిలోర్గడ, గొమ్మగూడ, కంచల్ గ్రామాలు, అడవులపైన పోలీసు, పారామిలటరీ, సైనిక బలగాలు ఈ సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11.45 గంటలకు దాడి ప్రారంభించి దాదాపు అరగంట పాటు విధ్వంసాన్ని సృష్టించాయి. మూల్‌వాసి బచావో మంచ్-(ఆదివాసీల పరిరక్షణా వేదిక) స్థానిక పౌర-సమాజ సంస్థలు యిచ్చిన సమాచారం ప్రకారం-దాడుల సమయంలో భద్రతా దళాలు రాకెట్ లాంచర్‌లు, డ్రోన్ బాంబులను మోహరించాయి. 30 కంటే ఎక్కువ పేల్చిన బాంబులు అటవీ భూమిని నాశనం చేసాయి. 100-200 చదరపు మీటర్ల వ్యాసార్థంలో చెట్లు, మొక్కలు, వన్యప్రాణులను నిర్మూలించింది. చాలా మంది గ్రామస్తులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. దట్టమైన పొగ ఆవరించడంతో  భయాందోళనలతో ప్రాణాలు చేతబట్టుకొని  పారిపోయారు.

ప్రతి ఏప్రిల్‌లో వరుసగా మూడు సంవత్సరాలు జరిగిన ఈ దాడుల కాలం ప్రత్యేకంగా  వినాశకరమైనది, ఎందుకంటే ఈ కాలంలో మహువా పంట గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఆదివాసీలకు కీలకమైన ఆదాయ వనరు అయిన మహువా పువ్వులకు అడవి జంతువులు, పెంపుడు జంతువుల నుండి రక్షణ అవసరం. తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి, ప్రజలు మహువా చెట్ల క్రింద పడుకుంటారు; ఎక్కువ సమయం అడవుల్లో గడుపుతారు. బాంబు దాడులు ఈ ముఖ్యమైన కార్యకలాపానికి అంతరాయం కలిగించాయి; అటవీ ఉత్పత్తులను సేకరించే వారి సామర్థ్యాన్ని తొలగించాయి;  అడవులను, వారి జీవనోపాధిని నాశనం చేసాయి; ఇప్పటికే అనిశ్చిత స్థితిలో ఉన్న వారి ఉనికిని మరింత మూలకు నెట్టాయి.

మోడీ హయాంలో, అటవీ భూముల క్లియరెన్స్‌కు(తొలగింపు) చట్టపరమైన అడ్డంకులను అధిగమించే చట్టాలు, స్థానిక ఆదివాసీ సముదాయాల అంగీకారం వంటి చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురాగలిగింది. మోడీ ప్రభుత్వానికి ముందున్న ఆదివాసీ మంత్రిత్వ శాఖ నుండి దశాబ్ద కాలం పాటు ఆగిపోయిన తర్వాత, అటవీ మంత్రిత్వ శాఖ  అటవీ సంరక్షణ నిబంధనల-2022ను జారీ చేసింది; ఇది సాంప్రదాయ అటవీ భూములకు ఆదివాసీ హక్కులను గుర్తించే బాధ్యతను కేంద్ర నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేస్తుంది. ఆదివాసీ తదితర అటవీ-నివాస వర్గాల నుండి రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతి పొందడాన్ని తప్పనిసరి  చేస్తూ, నివాసులతో ముందస్తు సంప్రదింపులు లేకుండా అటవీ నిర్మూలనకు అధికారం ఇచ్చేలా ఈ నియమాలు కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తాయి. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం అటవీ నివాసుల సమ్మతిని పొందక ముందే ఏదైనా అటవీ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వడానికి ఈ నిబంధనలు అనుమతిస్తాయి, ఇది 2006 అటవీ హక్కుల చట్టం కింద వారికి మంజూరు చేసిన రక్షణలను సమర్థవంతంగా దెబ్బతీస్తుంది.

గనులు, ఖనిజాల చట్టం 2023; 2023-2024; 2024-2025 కోసం యూనియన్ బడ్జెట్‌లతో కలిపి, జీవరాజకీయ నియంత్రణను బహిర్గతం చేసే ఒక ఉపకరణంగా పనిచేస్తుంది. భారతదేశంలో రాష్ట్రాలు బొగ్గు, గనుల తవ్వకాలకు చేసిన పన్నుల కేటాయింపు జాతీయ అభివృద్ధికి ఉద్దేశించినది కాదని, ఆర్థిక పెట్టుబడిదారుల ఎంపిక చేసిన ధనికుల ద్వారా కేటాయించబడుతుందని ఈ శాసన, ఆర్థిక చర్యలు చూపిస్తున్నాయి. ఈ కేటాయింపు ప్రజలపై అణచివేత అప్పుల భారం మోపడమే కాకుండా వారి ఆర్థిక, పర్యావరణ దుర్బలత్వాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇక్కడ, రాష్ట్ర ఆర్థిక విధానాలు వ్యవస్థాగత అసమానతలను కొనసాగించడానికి సాధనాలుగా మారాయి.

పార్లమెంటులో ఆమోదించిన చట్టాలు, బిల్లుల ద్వారా మాత్రమే కాకుండా, దోపిడీకి గురికాగల దుర్బలత్వాలను మరింత తీవ్రతరం చేసే ప్రధాన స్రవంతి కల్పనలో సంభాషణల ఉత్పత్తి ద్వారా కూడా బస్తర్‌కు కంచె కట్టారు. ఎన్నికల చక్రం, పెరిగిన భద్రతా చర్యల మధ్యలో బస్తర్: ది నక్సల్ స్టోరీ అనే ప్రచార చిత్రం విడుదల కావడం ఆశ్చర్యమేమీ కాదు. ఈ సినిమా సల్వాజుడుం మిలీషియాను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు చేసిన ప్రకటనను ఘోరంగా వక్రీకరిస్తుంది. అయితే, దీని ప్రభావం మరింత ఘోరంగా ఉంటుంది. గుర్తింపులను మార్చడం ద్వారా, మైనింగ్ కార్పొరేషన్లు, అభివృద్ధి ప్రాజెక్టుల ఆక్రమణలకు వ్యతిరేకంగా జరుగుతున్న పౌర యుద్ధాలు, చారిత్రక ఆదివాసీల ప్రతిఘటన కథనాలను ఈ సినిమా మసకబారుస్తుంది.

ఈ సినిమా  శక్తివంతమైన చిత్రణతో ప్రారంభమవుతుంది: దట్టమైన లోతట్టు అడవులలో ఒంటరిగా ఉన్న ఒక బ్రాహ్మణ వ్యక్తి, మావోయిస్టు తిరుగుబాటుదారుడి హింసకు లొంగిపోతాడు. ఈ సన్నివేశం బస్తర్‌లో స్థిరపడిన బ్రాహ్మణు వలసదారులపై జరుగుతున్న హింసను చిత్రీకరించడమే కాకుండా, భూమి వాస్తవ సంరక్షకులైన ఆదివాసీ సముదాయాల పోలికను తీసివేయడం ద్వారా అలా చేస్తుంది. ఈ సినిమా ఆదివాసీలను అమానవీయంగా చిత్రిస్తూ, వారిని కేవలం “విప్లవ” సాధనంగా మారుస్తుంది. ప్రత్యేకంగా చిత్రించిన ఒక సన్నివేశంలో ఒక మహిళ గెరిల్లా పోరాట యోధుడిని తిండిపోతుగా వర్ణిస్తుంది. ఆ పాత్ర తమ పిల్లలను పోషించే ఒక బ్రాహ్మణ తల్లి లేదా దుఃఖ:తో, నిరాడంబరంగా వుండే తల్లుల పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమా తాదాత్మ్యం, నైతిక సమలేఖనాన్ని ఎలా మార్చగలదో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ.

ఈ సినిమా తప్పించుకోవడాన్ని మాత్రమే కాకుండా, సామాజిక-ఆర్థిక సోపానక్రమంలో తమ స్థానం గురించి; వలసవాదం, వ్యవస్థాగత సమస్యలకు జాతీయవాద అహంకారం, పురోగతిల ఆకర్షణతో ముసుగు వేసి ప్రజలు, భూముల అదృశ్యానికి తయారీ అంగీకారంతో వీక్షకుల సమ్మతిని చురుకుగా పునర్నిర్మించింది.

భారతదేశంలోని స్థానిక, దళిత సముదాయాలపై, ప్రత్యేకించి తమ భూమి హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం వాదించే వారిపై ప్రయోగించే హింస, ఆపాదించే నేరాల విస్తృత నమూనాను ఛత్తీస్‌గఢ్‌లోని అణచివేత ప్రతిబింబిస్తుంది. తమ పంటలను నాశనం చేస్తున్నాయని గ్రామస్తులు రోడ్లు, అభివృద్ధి ప్రాజెక్టులను నిరసించారు. ఆమదై ఘాటిలో, మైనింగ్ కంపెనీలు ఇనుము, బొగ్గును కడిగిన నీళ్ళవల్ల గణనీయమైన వ్యవసాయ విధ్వంసం జరిగింది. పంటలు నాశనమయ్యాయి, ముఖ్యంగా డోంగర్ ప్రజలు ప్రభావితమయ్యారు. కలుషితమైన నీటి వనరులు పశువుల మరణాలకు దారితీసాయి. కార్పొరేట్లు చేసే డ్రిల్లింగ్ కార్యకలాపాలు గ్రామస్తులలో విస్తృతమైన శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. రోడ్లు వేయడం వల్ల , పాలకులకు, రాజకీయ నాయకులకే తప్ప తమ పురోగతి జరగదని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అర్థం అవుతోంది.

కల్పిత ఆరోపణలు, తీవ్రమైన రాజ్య హింస ద్వారా వారి మానవ హక్కుల కృషి అణచివేతనే   మైనింగ్ ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ, రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న మోరోహ్‌నర్ జన్ ఆందోళన్, ఓర్చా జన్ ఆందోళన్ వంటి శాంతియుత స్థానిక ఉద్యమాలను లక్ష్యంగా చేసుకోవడంలోని ఉద్దేశ్యం. అణచివేతకు, హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా భారతదేశంలోని ఆదివాసీ సముదాయాలు కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ సంక్షోభం నొక్కి చెబుతుంది.

 కార్పొరేట్ గనుల తవ్వకం, సైనికీకరణ ద్వారా ఆదివాసీల భూములను తుడిచిపెట్టడం వల్ల వారి నిర్వాసిత్వం, అట్టడుగుకు నెట్టేయడం, భౌతిక, సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది. బస్తర్‌లో జలాశయాలు కనుమరుగయ్యేలా, అడవులు అంతరించి పోయేలా చేశారు, కొద్దిమంది కులీనుల కోసం, రాజకీయ నాయకుల కోసం ఖనిజాలను దోచుకుంటున్నారు, రాజ్య వలసవాద తర్కం మనుగడను నిలబెట్టారు.

(Photo caption: A protest by Adivasi women with their tools in the Orcha block of Chhattisgarh’s Naraynpur district. In recent months, the Bastar region has witnessed numerous protests against road construction, mining and civilian killings. PHOTO BY BHUMIKA SARASWATI.)

(ఫోటో శీర్షిక: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా బ్లాక్‌లో ఆదివాసీ మహిళలు తమ పనిముట్లతో చేసిన నిరసన. ఇటీవలి నెలల్లో, బస్తర్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, మైనింగ్ పౌర హత్యలకు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. ఫోటో – భూమిక సరస్వతి.)

Leave a Reply