(ప్రసిద్ధ న్యాయవాది, రచయిత, పాత్రికేయుడు, కాలమిస్ట్, ప్రత్యేక/పత్రికా శీర్షికా రచయిత ఎ. జి. నూరానీ 2024 ఆగస్టు 29 నాడు (93 సంవత్సరాలు) మరణించారు. ఆయన మరణంతో మన దేశంలో చట్టాన్ని మాత్రమే కాకుండా, సమాజాన్ని కూడా పర్యవేక్షించే ఒక బలమైన ఆధార స్తంభం కూలిపోయింది. తన జీవితంలో ఎప్పుడూ రాజీపడని స్తంభం. జీవితాంతం తాను సృష్టించిన ప్రజాస్వామిక, లౌకికవాద విలువలకు కట్టుబడి జీవించాడు. ఎమర్జెన్సీకి, బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగానూ, కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలన్నింటిపైనా నిర్భయంగా రచనలు చేసాడు.
బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తన న్యాయవాద వృత్తి కాలంలో ఎప్పుడూ అన్యాయం చేయలేదు. అతను చట్టంలో మాత్రమే కాకుండా దాని పరిమితులకు మించి సమాజానికి ఒక నైతిక కాపలాదారుగా తన పాత్రను పోషించాడు. అతను వ్రాసిన పుస్తకాలు ఉన్నత న్యాయస్థానాలు, పరిశోధనా విషయాలలో రిఫరెన్స్ (సూచనా పుస్తకాలుగా)గా ఉపయోగపడుతున్నాయి.
బాబ్రీ మసీదు అంశంపై ఆయన ఫ్రంట్‌లైన్‌లో ఓ కథనం రాశారు. ఆ పూర్తి వ్యాసం ఇక్కడ ఉంది –ఎడిటర్, జన్‌చౌక్)
రామజన్మభూమి ఉద్యమం విజయవంతం కావడానికి సుప్రీంకోర్టు ఎలా సహకరించింది?
ఏదైనా సముదాయానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని ఆదేశించడానికి లౌకిక రాజ్యానికి చెందిన అత్యున్నత న్యాయస్థానానికి వున్న హక్కు, అధికారం, పరిధులు ఏమిటి?
ఏ సముదాయానికైనా సంబంధించిన గుడిని కట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం ఒక లౌకిక రాజ్యానికి చెందిన అత్యున్నత న్యాయస్థానానికి ఏ చట్టప్రకారం ఉంది? అటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా, సుప్రీంకోర్టు సివిల్ కేసులో ఆస్తి వివాదాన్ని పరిష్కరించే హద్దులు, పరిమితులను దాటింది. 1976 నాటి హెబియస్ కార్పస్, మరి కొన్ని ఇతర కేసులలోలాగా మతపర ఘర్షణలో తలదూర్చి తన ప్రతిష్టను దిగజార్చుకొంది.
“రాజ్యాంగం ఏ జెండాను అనుసరించకపోవచ్చు, కానీ ఎన్నికల ఫలితాల ప్రకారం సుప్రీంకోర్టు వైఖరి ఖచ్చితంగా మారుతుంది.” విజ్ఞుడైన ఇల్లినాయిస్ హాస్యరచయిత ఫిన్లీ పీటర్ డన్ (1867-1936) తన క్లాసిక్ రచన ‘మిస్టర్ డూలీస్ ఒపీనియన్స్: ది సుప్రీం కోర్ట్ డెసిషన్స్’లో ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అధికారంలో మార్పులు, రాజకీయ ప్రభావం కూడా సుప్రీం కోర్టు నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని, వాటిని అనుమానంతో చూస్తారని ఈ వ్యంగ్యం వ్యక్తం చేస్తుంది.
1980 జనవరిలో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కిస్సా కుర్సీ కా’ కేసులో సుప్రీంకోర్టు తన మునుపటి నిర్ణయాలను మార్చిన తీరుపై ఒక కథనంలో (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 04 జూలై 1980) ఈ రచయిత పై వ్యంగ్యాన్ని ఉటంకించారు. ఇది ప్రచురితమైనప్పుడు, సంజయ్ గాంధీ బతికే ఉన్నాడు. నిజాయతీపరుడైన పోలీసు అధికారి ఎన్ కె సింగ్ జోక్యం చేసుకోవడం కోసం చేసిన అభ్యర్థనను “నిందితుడు ఇప్పుడు రాజ్యం” అయినప్పటికీ కోర్టు తిరస్కరించింది.
బాబ్రీ మసీదు విషయంలో కూడా సరిగ్గా అదే పరిస్థితి నెలకొంది.
2019నవంబర్ 9 న బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు యిచ్చిన “ఏకగ్రీవ” తీర్పు – ఆర్‌ఎస్‌ఎస్ దాని సంతానం, బిజెపి, విశ్వహిందూ పరిషత్‌లు పోషించిన మెజారిటీ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది అనేది ఒక సాధారణ ప్రతిస్పందన.
తనపై మోపిన దేశద్రోహ అభియోగానికి ప్రతిస్పందనగా 1922 జనవరి 24నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన ప్రకటన చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఈ ప్రకటనను తనను సమర్ధించుకోవడానికి కాకుండా ధిక్కరణతో ఇచ్చారు. “ప్రపంచ చరిత్రలో యుద్ధభూమిల తర్వాత కోర్టుల్లోనే అతిపెద్ద అన్యాయాలు జరిగాయి” అని అన్నారు.
తన వాంగ్మూలం చివరలో, ఆజాద్ మేజిస్ట్రేట్‌తో ఇలా అన్నారు, “ఈ బోను మాకు వచ్చింది, న్యాయమూర్తి కుర్చీ మీకు వచ్చింది. ఈ పనికి బారికేడ్‌లాగా ఈ కుర్చీ అవసరమని నేను అంగీకరిస్తున్నాను. ఈ చిరస్మరణీయ పనిని పూర్తి చేద్దాం. .చరిత్రకారులు, భవిష్యత్తు ఇద్దరూ చాలా కాలంగా మా కోసం ఎదురు చూస్తున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చే అవకాశాన్ని మీరు ఇస్తూనే ఉన్నారు, మీరు మీ తీర్పులను కూడా రాస్తూనే ఉన్నారు. మరొక కోర్టు తలుపులు ధడాల్‌మని తెరుచుకునే వరకు యిది కొనసాగుతూనే వుంటుంది. . అది అల్లా న్యాయస్థానం అవుతుంది; ఆ న్యాయస్థాన న్యాయమూర్తి ‘సమయం’ అవుతుంది; అదే తీర్పును వ్రాస్తుంది. ఆ తీర్పే అంతిమ తీర్పు అవుతుంది.
నవంబర్ 9న మన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపైన చరిత్ర ఎలాంటి తీర్పు ఇస్తుందో అని తలచుకుంటేనే వణుకు పుడుతోంది. సమకాలీన అభిప్రాయం విభజితమై వుంది. ముస్లింలలో ‘అంకుల్ టామ్’ గా (అతని డబుల్ హోదాను అంగీకరించిన) “సాధారణంగా అనుమానాస్పదంగా” భావించే వారితో సహా చాలా మంది దీనిని ప్రశంసిస్తున్నారు. కానీ అన్ని మతాలు, రాజకీయ దృక్పథాలు కలిగిన వ్యక్తులతో సహా, పెద్ద సంఖ్యలో ముఖ్యమైన రచయితలు అందులో వున్నా స్పష్టమైన మెజారిటీ పోకడలను తీవ్రంగా విమర్శించారు.
భారతదేశపు మొదటి అటార్నీ జనరల్ ఎమ్. సి. సేతల్వాద్ గోలక్‌నాథ్ కేసులో (1967) కోర్టు మెజారిటీ తీర్పుని “రాజకీయ నిర్ణయం”గా ఖండించారు (మై లైఫ్, పేజీలు. 587-588). కానీ అది ఒక తీర్పు. ఇది, మరేదైనా కావచ్చు కానీ తీర్పు మాత్రం కాదు. ఇది నాసిరకం పద్ధతిలో చేసిన నాసిరకం పని. బ్రిటిష్ పాలనతో పాటే భారతదేశానికి న్యాయపాలన కోసం ఈ న్యాయస్థానాల వ్యవస్థ వచ్చింది. ఈ ప్రణాళికను బ్రిటిష్ కోర్టులు శతాబ్దాలుగా అనుసరించాయి. ఇందులో ప్రధాన తీర్పు రాసిన న్యాయమూర్తి (రచయిత)తో పాటు ఆ తీర్పును అంగీకరించిన, అంగీకరించని న్యాయమూర్తుల పేర్లను కూడా ప్రస్తావించారు.
ఈ తీర్పు శతాబ్దాల తరబడి స్థాపితమైన నియమాన్ని ఏ మాత్రం ఊహించని రీతిలో ఉల్లంఘించి, కేసును విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తులు సంతకాలు చేయబోయే ముందు, అంతే అసహజమైన పద్ధతిలో చివరి పేజీ 929లోని కొన్ని పదాలు గుసగుసలాడతాయి: “మనలో ఒకరు, పై వాదనలు, ఆదేశాల వెలుగులో ఏకీభవిస్తూన్నప్పటికీ; హిందూ భక్తుల నమ్మకమూ, విశ్వాసాల ప్రకారం వివాదాస్పద నిర్మాణం రామ జన్మస్థలం అనే సమస్యపై మేం మా ప్రత్యేక అభిప్రాయాన్ని నమోదు చేసాము.”
ఈ కేసులో కీలకాంశం స్థిరాస్తి, మసీదు యాజమాన్యానికి సంబంధించినది. అన్ని ఇతర వివాదాల మాదిరిగానే ఇది భూ చట్టానికి అనుగుణంగా పరిష్కారం కావాలి. కానీ అలహాబాద్ హైకోర్టు బహిరంగంగా చట్టం కంటే విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చింది. సుప్రీం కోర్టు కూడా తనదైన ప్రత్యేక శైలిలో సరిగ్గా అదే పని చేసింది.
మా ఈ అదనపు న్యాయమూర్తి ఈ విషయంలో వున్న మతలబు (లోపాయికారీతనం) ఏమిటో స్పష్టంగా చూపించారు – ఈ నిర్ణయం మెజారిటీ సముదాయం, అంటే హిందువుల “విశ్వాసం-నమ్మకాల” మీద ఆధారపడి ఉంది. దేవుడా! ఈ అసంబద్ధతను ఎత్తి చూపాల్సిన అవసరం ఏముంది?
116 పేజీల ఈ డాక్యుమెంట్‌ని, దాన్ని విడిగా జతచేయడానికి గల కారణాలపై న్యాయమూర్తి స్వయంగా చేసిన వ్యాఖ్యలను చదివినప్పుడు ఈ అనుమానం మరింతగా గట్టిపడుతుంది.
ప్రారంభంలోనే అతను ఒక ప్రశ్న లేవనెత్తాడు, “హిందువుల విశ్వాసము, నమ్మిక, భక్తి ప్రకారం వివాదాస్పద నిర్మాణం రాముడి పవిత్ర జన్మస్థలమా?” ఇది చాలావరకు తీర్పులాగానే ఉంటుంది, భాష మాత్రమే మారింది. న్యాయపరమైన తీర్పులో ఇది క్షమించరాని పొరపాటు.
ఈ జోడించిన భాగాన్ని మరింత విస్తృతపరచి “హిందూత్వ భావన, దాని పవిత్ర నగరాల ప్రస్తావన”దాకా తీసుకువెళ్లారు. ఇది మతపరమైన ఉత్సాహంతో నిండిన అద్భుతమైన పేరాతో ముగుస్తుంది, “మసీదు నిర్మాణానికి ముందూ, తరువాత కూడా, ఎప్పుడూ రాముడి జన్మస్థలం మసీదును నిర్మించిన స్థలమే అని హిందువుల విశ్వాసమూ, నమ్మకమూనూ. ఈ విశ్వాసాన్ని పైన పేర్కొన్న డాక్యుమెంటులు, మౌఖిక ఆధారాలు కూడా నిర్థారిస్తాయి.”
ఈ డాక్యుమెంటరీ సాక్ష్యంలో ఎక్కువశాతం మతపర గ్రంథాలు. విశ్వాసాలు, మౌఖిక సాక్ష్యానికి ఏమీ అర్థం వుండదు. కానీ ఈ మొత్తం కసరత్తు అంతా ఇలానే ఉంటుంది.
“శ్రీరాముడు ఇక్కడ జన్మించాడని ఎవరూ నిరూపించలేరు” అని 1990 సెప్టెంబరు 30నాడు లాల్ కృష్ణ అద్వానీ అంగీకరించాడు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం (ది ఇండిపెండెంట్, 1 అక్టోబర్ 1990). ఇతరుల నైతిక, చట్టపరమైన హక్కులను రద్దు చేసేంతలా ఈ నమ్మకానికి న్యాయపరమైన అనుమతి ఇవ్వవచ్చా?
1949 డిసెంబర్ 22-23 నాడు బలవంతంగా, మోసపూరితంగా మసీదులో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని; 1992 డిసెంబర్ 6న ఆ మసీదును కూల్చివేయడాన్ని సుప్రీం కోర్టు ఖండించింది.
“రాముడు ఎక్కడ జన్మించాడో ఖచ్చితమైన ప్రదేశం నిర్ణయించలేం” అని 1989 జూన్ 5న ప్రొ. హిరేన్ ముఖర్జీకి రాసిన లేఖలో వాజ్‌పేయి అంగీకరించాడు: (ఆర్గనైజర్, 24 సెప్టెంబర్ 1989).
“ఇది న్యాయవ్యవస్థ తీర్పు చెప్పగలిగే కేసు కాదు. రాముడు పుట్టాడు, అతని జన్మస్థలం అయోధ్య అని హిందువులు సాక్ష్యమిస్తారని ఎలా అనుకోగలం?” అని ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యుడు ఎం.డి.దేవరస్ అన్నాడు: (ఆర్గనైజర్, 12 మార్చి 1989). అతను ఈ విషయంలో నిజాయితీగా ఉన్నాడు; ఎటువంటి సాక్ష్యమూ లేనే లేదు. అందుకే బిజెపి తన పాలంపూర్ తీర్మానంలో ఇలా చెప్పింది: “వ్యాజ్యం ఖచ్చితంగా పరిష్కార మార్గం కాదు” (1989 జూన్ 11).
ఇంతకీ ఆ మార్పు ఎలా వచ్చింది? బూటకపు పురావస్తు కేంపెయిన్‌లా? ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి యిప్పటికీ అదే అభిప్రాయాన్ని కలిగివున్నాయి. ఈ సంవత్సరం నాటకీయంగా దాన్ని మార్చేసారు. ఎందుకు? ఎందుకని? 2019 అక్టోబర్ 30 నాడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు మోహన్ భగవత్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు తీర్పును “సంపూర్ణ హృదయంతో” ఆమోదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసాడు(ఆసియన్ ఏజ్, 2019 అక్టోబర్31). న్యాయస్థానాలపైన ఏ మాత్రం నమ్మకం లేని, నమ్మని ఇలాంటి ఉగ్రవాదులకు ఇంతగా మారిపోవడానికి ప్రేరణ ఎక్కడ నుండి వచ్చింది?
పారదర్శకత అనేది న్యాయ ప్రక్రియ సమగ్రతకు ప్రమాణంగా వుంటుంది. ఈ కేసులో ఎందుకు వదిలేసారు? తీర్పును లేదా అందులో విడిగా జోడించిన భాగాన్ని రాసినవారి పేరు ఎందుకు నమోదు చేయలేదు? ఈ రెండు లోపాల కోసం, న్యాయమూర్తులు స్వయంగానూ, అలాగే దళ నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేరుగా బాధ్యులవుతారు. తీర్పుని, దానికి జోడించిన ప్రత్యేక భాగాన్ని రాసిన న్యాయమూర్తుల పేర్లు రాసి వుండాల్సింది. దాని రచయిత నైతిక అపరాధానికి పాల్పడ్డ నేరస్థుడు; అతనితో పాటు ప్రధాన న్యాయమూర్తి, అది తెలియకుండా ఉంచిన, ఉద్దేశపూర్వకంగా కళ్ళు మూసుకున్న ఇతర నలుగురు న్యాయమూర్తులు కూడా. ఆ న్యాయమూర్తి పిరికివాడేం కాదు. తన పేరును ప్రస్తావించకపోవడమే అతని బండారాన్ని బయటపెడుతుంది. ఈ లోపాలు మొత్తం ప్రక్రియను కలుషితం చేశాయి.
ప్రాణాంతకమైన తప్పిదాన్ని పట్టించుకోలేదు
తీర్పు పైన జరిగిన చర్చ అంతటా ప్రాణాంతకమైన పొరపాటును పట్టించుకోలేదు. 1994లో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 2019లో సుప్రీంకోర్టు ఆ అవమానాన్ని పట్టించుకోకుండా అంతకంటే దారుణమైన పని చేసింది. ఈ విషయంపై మౌన అంగీకారాన్ని తెలిపింది.
తిరుగులేని వాస్తవాలను చూద్దాం.
మసీదు కూల్చివేత తర్వాత, పార్లమెంటు ‘అయోధ్యలోని నిర్దిష్ట ప్రాంతాల సేకరణ చట్టం, 1993’ను ఆమోదించి వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఒక ప్రశ్నపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాడు. ఇది 1993 జనవరి 7 నాటి విషయం. అదే రోజున చట్టంగా మారిన ఆర్డినెన్స్ కూడా అమల్లోకి వచ్చింది.
మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఏదైనా హిందూ దేవాలయం ఉండిందా? అని కోర్టు అడిగిన ప్రశ్న. స్వాధీనం చేసుకున్న భూమి యాజమాన్యానికి సంబంధించిన అన్ని చట్టపరమైన చర్యలను చట్టంలోని సెక్షన్ 4(3) రద్దు చేసింది. అడిగిన ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తే హిందువులకే భూమి ఇస్తామని 1994 సెప్టెంబరు 14నాడు ప్రభుత్వం కోర్టు ముందు ప్రకటన ఇచ్చింది; లేదు అని సమాధానం వస్తే “అప్పుడు ప్రభుత్వం చేపట్టే చర్య ముస్లిం సముదాయ కోరికకు తగినట్లుగా ఉంటుంది.”
ఇస్మాయిల్ ఫారూఖీ-ఇతరులు vs. భారత ప్రభుత్వం-ఇతరులు (1994; 6 సుప్రీంకోర్టు కేసులు 360) తీర్పులో, న్యాయస్థానం చట్టపరమైన చర్యలను నిరోధించే సెక్షన్ 4(3)ని రద్దుచేసింది. దీనిపై న్యాయస్థానం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.
సెక్షన్ 4(3)ని మిగిలిన చట్టం నుండి వేరు చేయవచ్చా లేదా అనే అంశంపై కోర్టు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ఎ. ఎమ్. అహ్మదీ, ఎస్.పి భరూచా ఇది విడదీయరానిది అని అభిప్రాయపడ్డారు; మొత్తం సెక్షన్‌నే రద్దు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్.వెంకటచెలయ్య, న్యాయమూర్తులు జె.ఎస్.వర్మ, జి.ఎన్.రేలు ఇది విడదీయదగినదని అభిప్రాయపడ్డారు; మిగిలిన సెక్షన్‌లను అలాగే వుంచారు. ఆ ఐదుగురూ రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
“పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడం ద్వారా వివాదాస్పద భూభాగంపై ప్రత్యర్థి దావాను పరిష్కరించలేం” అనే జస్టిస్ జె.ఎస్.వర్మ అభిప్రాయానికి ప్రాసంగికత వున్నది.
ఈ తగ్గింపు ఫలితంగా, ముస్లిం పక్షం రక్షణకు సంబంధించి ఇచ్చిన అనేక సాక్ష్యాలు అంతమైపోతాయి; క్రీ.శ. 1528లో మీర్ బాకీ మసీదు నిర్మాణం తర్వాత, 400 సంవత్సరాలకు పైగా ఆ మసీదు ముస్లిం సముదాయ పక్షం ఆధీనంలో ఉందనే ‘ప్రతికూల స్వాధీనత’ సాక్ష్యం అందుకు ఒక ఉదాహరణ.(భారతదేశంలో, ప్రతికూల స్వాధీనం అనేది (‘ప్రతికూల స్వాధీనత’ – ఒక నిర్దిష్ట కాలానికి నిరంతర, బహిరంగ స్వాధీనంలో ఉన్న వ్యక్తికి ఆస్తి యాజమాన్యాన్ని మంజూరు చేసే చట్టపరమైన సూత్రం. భూమిని వినియోగించుకోవాలనీ, ఖాళీగా ఉంచరాదనీ ఈ చట్టం చెబుతోంది.)
వివాద పరిష్కారానికి అవలంబించిన ఈ ప్రత్యామ్నాయ విధానం వాస్తవానికి 143(1) సెక్షన్ కింద అదే రోజున తీర్పు కోసం సుప్రీంకోర్టుకు ప్రశ్నలను పంపే ఏకకాల సూచనా (సైమల్‌టేనియస్ రిఫరెన్స్) వ్యవస్థనే అనేది స్పష్టమే.
ఈ కేసులను నిర్ణయించే ప్రాథమిక అంశం న్యాయస్థానానికి తీర్పు కోసం రాష్ట్రపతి పంపిన రిఫరెన్స్‌ల (సూచనలు) లోనూ; ముస్లిం సముదాయం తన రక్షణ (డిఫెన్స్) కోసం సమర్పించిన సాక్ష్యాలలోనూ లేదు అనే విషయం ఈ కేసుల్లో లేవనెత్తిన ప్రశ్నల నుండి స్పష్టం అవుతున్నది.
ప్రస్తావించిన ప్రశ్నకు జవాబు ఏది అయినప్పటికీ, పెండింగ్ కేసుల నిర్ణయానికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు అని; వివాదాస్పద ప్రాంతం కోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించలేదు అని కూడా స్పష్టమైంది.
కాబట్టి, క్రమబద్ధమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా చట్టంలోని సెక్షన్ 4(3) ప్రకారం తగ్గించబడుతున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి బదులుగా ఆర్టికల్ 143(1) కింద సూచన చేయడం అనేది వివాద పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగంగా పరిగణించడానికి వీలులేదు.
అయినప్పటికీ, వివాదాస్పద స్థలాన్ని భూమి తవ్వకాల పద్ధతులు లేదా రేడియాలజీ (జిపిఆర్) పద్ధతులను ఉపయోగించి సర్వే చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ)కి 2002 అక్టోబర్ 23నాడు, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ, సర్వేకు సంబంధించి 2003 ఫిబ్రవరి 17నాడు సమర్పించిన నివేదికలో వైరుధ్యాలు వుండినాయి. 2003 మార్చి 5 నాడు ఆ స్థలంలో తవ్వకాలు జరపాలని ఎఎస్‌ఐని కోర్టు ఆదేశించింది.
నిజానికి రాష్ట్రపతి ద్వారా జరిగిన విచారణ దొడ్డి దారినే జరిగింది. సుప్రీంకోర్టు తిరస్కరించిన రాష్ట్రపతి ప్రశ్న: “…రామ జన్మభూమి-బాబ్రీ మసీదు నిర్మాణాల కంటే ముందు నిర్మాణం కింద ఏదైనా హిందూ మతసంబంధిత నిర్మాణం ఉండిందా?” అని. అయినప్పటికీ, అదే ప్రశ్నపై హైకోర్టు 2003 మార్చి 5నాడు ఈ పదాలలో ఎఎస్‌ఐని ఆదేశించింది: “వివాదాస్పద స్థలంలో ఏదైనా దేవాలయం లేదా నిర్మాణం ఉందా, ఆ నిర్మాణాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారా?” ఈ ఒక్క అవిధేయత ఆధారంగానే, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయాలి, కానీ అలా చేయలేదు.
యాజమాన్య హక్కులకు సంబంధించి సివిల్ దావాలో ఇవాళ్టివరకు ఎప్పుడైనా ఇలాంటి తవ్వకాలు చేయించారా? ఈసారి అది జరిగింది; పూర్తి పారదర్శకతతో జరిగింది. సుప్రీం కోర్టు తీర్పులో, తన స్వీయ ఏకగ్రీవ నిర్ణయాన్నే ఇలా ఉల్లంఘించడాన్ని ఖండిస్తూ ఒక్క పదం కూడా లేదు.
ఫ్రెడరిక్ ది గ్రేట్ పైన రాసిన వ్యాసంలో మెకాలే: “వర్తమాన ఒప్పందాలు, యాజమాన్యాల కంటే పురాతన వాదనలకు ప్రాధాన్యతనివ్వడం మొదలుపెడితే, ప్రపంచంలో ఒక్క రోజు కూడా ప్రశాంతత ఉండదు అనే స్పష్టత లేదా?”అని ప్రశ్నించాడు.
అన్ని దేశాల చట్టాలు ఖచ్చితమైన పరిమితి తేదీని నిర్ణయించడంలో విజ్ఞతను చూపాయి; ఆ తేదీ తర్వాత యాజమాన్య సంబంధిత అన్ని హక్కులను, వాటి మూలం ఎంత చట్టవిరుద్ధమైనప్పటికీ, సవాలు చేయకూడదు.
తమ పూర్వీకుల కాలంలో అన్యాయం జరిగిందనే కారణంతో ఎవరి ఆస్తినైనా లాక్కోవడం అనే ఏకపక్ష జప్తు జరిగితే కనక (యిష్టానుసారం జప్తు చేసుకోవడం వల్ల) ఉత్పన్నమయ్యే స్థితి అన్ని చెడులకు మూలకారణమవుతుందని; అన్ని రకాల ఆస్తికి రక్షణ లేకుండా పోతుందని అందరూ గ్రహించారు.
గణతంత్ర దేశానికి కూడా ఈ ఆందోళన వున్నది; “వ్యాజ్యం ఎక్కడో ఒకచోట ముగిసిపోవాలి” అనే దాని చట్టపరమైన ఆదర్శ వాక్యం కూడా ఇదే. ఖచ్చితంగా ఈ నినాదం కనీసం కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్‌కు కూడా అదే విధంగా వర్తిస్తుంది; ఎందుకంటే దానికి వ్యాజ్యం అంటే “దేశాల వినాశనం; వాణిజ్యం-పరిశ్రమల స్తబ్దత” (క్రిటికల్ అండ్ హిస్టారికల్ ఎస్సేస్ ఆఫ్ లార్డ్ మెకాలే, లాంగ్‌మాన్స్ గ్రీన్ & కో., 1877, పేజి 666 నుండి).
షహీద్‌గంజ్ కేసు
లాహోర్‌లోని షహీద్‌గంజ్ కేసులో, అయోధ్య కేసుకి సరిగ్గా విరుద్ధంగా ఉంది. కాల పరిమితి చట్టం వల్ల ముస్లింల వాదనలు పూర్తిగా తిరస్కరణకు గురయ్యాయి. 1722లో ఫలక్ బేగ్ ఖాన్ వక్ఫ్ (ట్రస్ట్)ని ఏర్పాటు చేసి, ఆ భూమిని మసీదు నిర్మించేందుకు అప్పగించారనే ముస్లింల వాదన సరియైనదని మూడు కోర్టులు అన్నాయి. అయితే ఆ మూడు కోర్టులే, సిక్కులకున్న ‘ప్రతికూల స్వాధీనం’ హక్కు కారణంగా, 1762 తర్వాత ముస్లింలు ఆ భూమిపైన, మసీదుపైన తమ యాజమాన్య హక్కును కోల్పోయారని, అలా కోల్పోవడం సరియైనది అని కూడా అన్నాయి.
ఇందులో అయోధ్య కేసులో వున్న అంశాలు అన్నీ వున్నాయి; మసీదు మరొక సముదాయమైన సిక్కుల ఆధీనంలో ఉండడం; వారి దానిని కూల్చడం; ముస్లింల ఆక్రోశపూరిత ఆందోళన; ఇందులో మతపరమైన ప్రతినిధుల భాగస్వామ్యం; కోర్టుల పట్ల ముస్లింల నిరాశ; ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు పంజాబ్ అసెంబ్లీలో చట్టాన్ని చేయాలనే కేంపెయిన్; అన్నీ విఫలమయ్యాయి. ఎవరైనా వెళ్తారో లేదో కానీ… 1947 ఆగస్టు 15కి పూర్వంలాగానే, ఈనాడు లాహోర్‌లో గురుద్వారా షహీద్ గంజ్ ఉంది. (శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ; 67 ఇండియన్ అప్పీల్స్ 251 లో మసీదు షహీద్ గంజ్)
1938 మార్చి 16న పంజాబ్ ప్రధానమంత్రి (అప్పట్లో ముఖ్యమంత్రి అని పిలిచేవారు) సర్ సికందర్ హయత్ ఖాన్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేసాడు. “ముస్లిం-ఆక్రమిత పంజాబ్‌లో ముస్లిమేతరులు తమ ప్రార్థనా స్థలాలకు ఇదే విధమైన రక్షణను కోరుకుంటే, అటువంటి డిమాండ్‌ను వ్యతిరేకించడం అసంబద్ధం (నిర్హేతుకం) అవుతుంది” అని ఎత్తి చూపాడు.
“ఒకవేళ గవర్నర్, తన మంత్రివర్గం సమ్మతితో, ముస్లింలు అధికంగా ఉన్న పంజాబ్‌లో ముస్లిమేతర చారిత్రాత్మక, ప్రముఖ ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ కోసం ఒక బిల్లును అనుమతిస్తే కనుక ముస్లిమేతరులు మెజారిటీగా ఉన్న ప్రావిన్సులలో కూడా అటువంటి బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల పంజాబ్ ఉదాహరణ వెలుగులో, భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అటువంటి బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించమని ముస్లింలకు పిలుపునివ్వడం అసాధ్యం అవుతుంది….” అని దృఢంగా వాదించాడు.
ఐదు రోజుల తరువాత, మార్చి 21న, ముస్లిం లీగ్ కౌన్సిల్ ఈ ప్రకటనకు మద్దతునిచ్చింది. 1938 ఏప్రిల్ 17-18 తేదీల్లో కలకత్తాలో ఈ విషయానికి సంబంధించి జరిగిన ప్రత్యేక సమావేశంలో జిన్నా ఇలా అన్నాడు, “ఇరువైపులా ఉన్న కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దూకుడుగా ప్రవర్తించారు; రెండు గొప్ప సముదాయాలూ కలిసి ఉండడానికి ఇబ్బంది కలిగే పరిస్థితిని సృష్టించారు. ఇరు పక్షాలు చేసిన అతిక్రమాలను ఖండిస్తున్నాను.” అతను అద్వానీ కాదు.
పాల్కీవాలా హెచ్చరిక
ఎన్.ఎ. పాల్కీవాలా 1993లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇలా వ్రాశాడు:
“అద్వానీ, అతని బృందం రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా వ్యతిరేక వైఖరిని తీసుకుంది. “కోర్టులు కేవలం వాస్తవాలు లేదా చట్టంకి సంబంధించిన సమస్యలను మాత్రమే నిర్ణయించగలవు. అవి అభిప్రాయం లేదా విశ్వాసం లేదా రాజకీయ వివేచనకు సంబంధించిన ప్రశ్నలను నిర్ణయించలేవు; లేదా అలాంటి ప్రశ్నలను నిర్ణయించమని చెప్పకూడదు…. కార్యనిర్వాహకవర్గంకి (ఎక్జిక్యూటివ్) కోర్టు పొడిగింపు కాదు.
కార్యనిర్వాహక వర్గంతో పాటు ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో ప్రజాభిప్రాయం లేదా ప్రజల విశ్వాసం ప్రాముఖ్యతను కలిగి ఉండవచ్చు. అయితే ఈ అభిప్రాయాలు, నమ్మకాలకు ప్రజలు తృప్తి చెందేందుకు ఎంచుకునే బలమైన ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ణయించడం కోర్టుల పని కాదు.
… ఈ ప్రశ్నలపై నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టును అడగాలని కొంతమంది క్యాబినెట్ మంత్రులు అభిప్రాయపడుతున్నారని ఇటీవలి వార్తాపత్రిక నివేదికలు సూచిస్తున్నాయి: 1. వివాదిత స్థలంలో వున్న తాత్కాలిక ఆలయంలో రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించాలా లేదా? 2. కూల్చివేసిన మసీదును ప్రభుత్వం పునర్నిర్మించాలా? లేదా? 3. అయోధ్యలో ఆలయం, మసీదు రెండూ ఉండవచ్చా? లేదా? ఇలాంటి ప్రశ్నలకు తీర్పు చెప్పడం న్యాయస్థానాల పనా?
“బాబర్ నిర్మించిన మసీదు కంటే ముందు ఆ స్థలంలో ఆలయం ఉందా అనే ప్రశ్నకు, చరిత్రకారుల అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. రాముడు అక్కడే పుట్టాడా అనే అభిప్రాయాల్లో మరింత తక్కువ సమ్మతి ఉంది. రాముడు వాస్తవానికి మానవుడా లేదా పరిపూర్ణ మానవునికి చిహ్నంగా మతం సృష్టించిన అతీంద్రియ ఆదర్శమా అనే ప్రశ్నపై అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మతం లేదా చరిత్రకు సంబంధించిన ఇలాంటి ప్రశ్నలు, లేదా మతం-చరిత్రలకు సంబంధించిన మిశ్రమ ప్రశ్నలపై తీర్పు చెప్పమని సుప్రీంకోర్టు లేదా అలహాబాద్ హైకోర్టును అడగడం, మన రాజకీయ వ్యవస్థల దివాళాకోరుతనానికి రుజువును సమర్పించడమే అవుతుంది…. అయోధ్య కేసులో ప్రశ్నలు పంపమని సలహా ఇచ్చినట్లుగా ఏ దేశ చరిత్రలోనూ, ఎప్పుడూ కూడా తీర్పు చెప్పడానికి కోర్టులకు ఇటువంటి ప్రశ్నలు పంపడం జరుగలేదు.
“నిర్ణయం కోసం సుప్రీంకోర్టు లేదా అలహాబాద్ హైకోర్టుకు ఇటువంటి ప్రశ్నలను పంపడం వల్ల వచ్చే పరిణామాలు భవిష్యత్తులో వినాశకరమైనవిగా రుజువవుతాయి. మొదటగా, శిక్షణ లేదా అనుభవం లేని పనిభారాన్ని కోర్టుపై మోపడమవుతుంది. కోర్టులు చట్టం లేదా చట్టానికి సంబంధించిన సమస్యలపైన పని చేయవచ్చు. వాస్తవానికి, పురావస్తు శాస్త్రం లేదా చరిత్ర వంటి ఇతర రంగాలలోని ప్రశ్నలను ఎదుర్కోవడంలో కోర్టులకు నైపుణ్యం లేదు. న్యాయమూర్తి కేవలం డాక్యుమెంటరీ సాక్ష్యం లేదా సాక్షి స్వయంగా చూసిన లేదా విన్న వాటిపై ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా మాత్రమే తీర్పు ఇవ్వగలడు. భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం వినికిడి సాక్ష్యం కోర్టులో ఆమోదయోగ్యం కాదు అనేది నిర్థారితమైన అంశమే …
“ఏదైనా మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని అక్కడ అంతకుముందు వేరే మతానికి చెందిన నిర్మాణం ఉందనే ఆధారంతో కూల్చివేయాలా? పురావస్తు శాస్త్రం పురాతన కాలం నాటి కళలు, ఆచారాలు, నమ్మకాలను అధ్యయనం చేస్తుంది. ఇది ఏదైనా నమ్మకం లేదా అభిప్రాయానికి ఆధారం కావచ్చు …. కానీ ‘సార్వత్రిక సత్యం’కి కాదు.
ఒకే పురావస్తు సాక్ష్యం నుండి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు రెండు వేర్వేరు నిర్ధారణలకు రాలేరా? ఒక న్యాయమూర్తి రాసిన తీర్మానానికి ఆ న్యాయమూర్తికి విరుద్ధమైన అభిప్రాయాన్ని, విశ్వాసాన్నీ కలిగి ఉన్నవారు ఎలా కట్టుబడి ఉంటారు ?
ప్రత్యేక, విభిన్న ప్రశ్నలను గందరగోళానికి గురిచేయడానికి ఇది సహాయపడుతుందా? రాముడు ఈ నిర్దిష్ట ప్రదేశంలో పుట్టాడా? అనే ప్రశ్న, ఆ ప్రదేశంలో ఆలయం ఉందా లేదా? అనే ప్రశ్నకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాబట్టి, ఒక నిర్దిష్ట ప్రదేశం భగవాన్ రాముని జన్మస్థలం అని విశ్వసించే వారి నమ్మకాలను అక్కడ ఏ దేవాలయం లేదని చెప్పి మనం ఏదో ఒకవిధంగా కొట్టిపారేస్తున్నామా?”
ఏకపక్ష దృక్పథం
సుప్రీంకోర్టు దృక్పథం ప్రాథమికంగా తప్పు; ఏకపక్షం. మసీదు వెలుపల, కానీ ఆ ప్రాంగణంలోనే, ఒక అరుగు వుండిది; ఆ అరుగును ‘రామ్ చబుతరా’ (రాముని అరుగు) లేదా జన్మభూమి ఆలయం అని పిలిచేవారు. రాముడి జన్మస్థలంగా గుర్తించింది మసీదును కాదు, ఈ అరుగుని అని బలమైన ఆధారాలు ఉన్నాయి.
విగ్రహాలను అక్కడ ఉంచడానికి కొన్ని రోజుల ముందు, అరుగు వున్న స్థలంలో “విశాలమైన ఆలయం” నిర్మించడానికి ప్రణాళికలు తయారు అవుతున్నాయి. ముంబైలో ఒక ట్రాఫిక్ ద్వీపం (రహదారి విభజన నిస్సార ప్రాంతం) ఉంది; దానిపై ఒక ఆలయం, ఒక చర్చి, మసీదు, మూడూ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. 1855లో, మసీదు ఆవరణకు సరిగ్గా వెలుపల ఉన్న హనుమాన్‌గడిపై వివాదం ఉండింది కానీ మసీదుగురించి కాదు.
“రాముని ఆరాధన పన్నెండవ శతాబ్దం నుండే ప్రజాదరణ పొందినప్పటికీ పదిహేను, పదహారవ శతాబ్దాల వరకు కూడా, రామానందులు అయోధ్యలో గణనీయమైన సంఖ్యలో స్థిరపడలేదు. రామానంది వ్యవస్థ నియంత్రించే రామపంథాకు అయోధ్య కేంద్రంగా పద్దెనిమిదవ శతాబ్దం నుండి మారింది. చాలా వరకు రామాలయాలు ఆ తర్వాతవే…
“హనుమాన్‌గడి ప్రకరణంలోని ముఖ్యమైన కోణం ఏమిటంటే, ఆనాటి హిందూ స్పృహలో బాబ్రీ మసీదు, జన్మస్థలం మధ్య ఎటువంటి సంబంధం లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. అయితే, ముస్లింలు మసీదులో ఆశ్రయం పొందిన సమయంలో బైరాగిల అధికారంలో వుంది. కానీ వారు దానిని స్వాధీనం చేసుకోలేదు లేదా తమది అని చెప్పలేదు. బదులుగా వారు దాదాపు వెంటనే హనుమాన్‌గడి దాకా వెనక్కు వెళ్ళిపోయారు. విచారణ జరుగుతున్నప్పుడు ఏ హిందువు కూడా మసీదు ఉన్న స్థలంలో అంతకుముందు ఆలయం ఉన్నట్లు చెప్పలేదు. అంతేకాదు, హనుమాన్‌గడిపైన ముస్లింల దావాను ఎదుర్కోవడానికి కూడా చెప్పలేదు. బ్రిటీష్ అధికారులు పేర్కొన్న జన్మస్థల ఆలయం గురించి స్థానిక సంప్రదాయం 1855లో ఉన్నట్లు కనిపించడం లేదు.” [(ప్రొ. కె. ఎన్. పనిక్కర్ “ఎన్ హిస్టారికల్ రివ్యూ”లో రాశారు, [ఇది సర్వేపల్లి గోపాల్ సంపాదకత్వంలో అనాటమీ ఆఫ్ ఎ కాన్ఫ్‌రెన్‌టేషన్ లో ప్రచురితమైంది. (పెంగ్విన్, 1991, పేజీలు. 22-80)]
అరుగు (వేదిక)
అరుగు1855లో నిర్మితమైంది. ఈ అరుగును మసీదు నుండి వేరు చేయడానికి ఒక కంచెను, ఒక గోడను నిర్మించారు. 1855 జనవరి 29వ తేదీన, మహంత్ రఘుబర్ దాస్ భారత రాష్ట్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు; “అయోధ్యలో ఉన్న జన్మస్థానమైన అరుగు మీద ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కోసం వాది దావా వేస్తున్నాడు…”
“…ఫైజాబాద్ నగరంలోని అయోధ్యలో ఉన్న జన్మస్థానం పురాతన, పవిత్రమైన ప్రార్థనా స్థలం. వాది ఆ ప్రార్థనా స్థలం పూజారి … పేర్కొన్న అరుగు వాది ఆధీనంలో ఉంది; అరుగుపైన భవనం లేకపోవడం వల్ల, వాది తదితరులు వేసవిలో విపరీతమైన వేడి; చలికాలంలో విపరీతమైన చలి; వర్షా కాలంలో వానలకు తడవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .. ఈ వేదికపై ఆలయం నిర్మిస్తే ఎవరికీ ఎలాంటి హానీ జరగదు.. వాదికి, ఫకీర్లు, తీర్థయాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలు కలుగుతాయి.”
1855లో హిందువులు, ముస్లింల మధ్య గొడవలు జరిగిన తరువాత, భవిష్యత్తులో వివాదాలు రాకూడదని, ముస్లింలు గోడ లోపల, హిందువులు గోడ బయట పూజలు చేయడానికి వీలుగా నాలుగు సరిహద్దు గోడల నిర్మాణం జరిగింది. అందుకని అరుగు, సరిహద్దు గోడ వెలుపల ఉన్న భూమి హిందువులకు, వాదికి చెందుతాయి” అని సబ్ జడ్జి చెప్పారు.
ఒక మ్యాప్‌ను తయారు చేశారు. ఇందులో రామ్ చబుతరా (రాముడి అరుగు) నుండి విడిగా ఒక “మసీదు” ఉంది. వారు చేసిన విస్తృత వివరణ, స్థల పరిశీలన విషయ తీవ్రతను చూపుతుంది. అరుగుపై ఆలయాన్ని నిర్మించడం వల్ల కొట్లాటలు పెరుగుతాయి అనే కారణంతో 1885 డిసెంబర్ 24 నాడు ఫైజాబాద్ సబ్-జడ్జి పండిట్ హరి కిషన్ దావాను కొట్టివేసాడు. 1886 మార్చి18నాడు జిల్లా జడ్జి ఎఫ్.ఇ.ఎ చామియర్ పిటిషన్‌ను తిరస్కరించాడు; “ఈ అరుగు రాముడి జన్మస్థలాన్ని సూచిస్తుందని అంటారు. లోపలికి వెళ్ళే దారి ముందరే మసీదు, కాంక్రీట్ అరుగుల ప్రవేశ ద్వారం ఉంది. అక్కడక్కడా కంచె(రెయిలింగ్)లు వున్న ఒక గోడ, మసీదు అరుగును రామ్ చబుతారా వున్న అరుగునుంచి వేరు చేస్తుంది.”
అవధ్ జ్యుడీషియల్ కమీషనర్ డబ్ల్యూ. యంగ్ కూడా అప్పీల్‌ను కొట్టివేసాడు. “విషయం ఏమిటంటే, అయోధ్యలోని హిందువులు శ్రీరామ చంద్రుడి జన్మస్థలంగా చెప్పబడే పవిత్ర స్థలంలో కొత్త ఆలయాన్ని లేదా పాలరాతి పందిరిని నిర్మించాలనుకుంటున్నారు. ఈ స్థలం సుమారు 350 సంవత్సరాల క్రితం నిర్మించిన మసీదుకి పరిసరాల్లో వున్న భూమికి సరిహద్దులోనే ఉంది.
“మసీదు ప్రక్కనే ఉన్న భూమిలోని కొన్ని ప్రాంతాలపైన హిందువులు చాలా పరిమిత హక్కులను కలిగి ఉన్నారు; వారు తమ ఈ హక్కులను విస్తరించుకోడానికి, ఆ ఆవరణలోని రెండు ప్రదేశాలలో భవనాలను నిర్మించడానికి సంవత్సరాలుగా నిరంతరం ప్రయత్నిస్తున్నారు: (1) సీత వంటగది, (2) రాముడి జన్మస్థలం.” (ఈ పత్రాల అసలు వచనం కోసం ది బాబ్రీ మసీదు క్వొశ్చెన్; సంపాదకుడు – ఎ. జి. నూరానీ 1528-2003, తూలికా బుక్స్, వాల్యూం. 1, పేజీలు 175-185 సవరణ: చూడండి)
1885 డిసెంబర్ -1886 నవంబర్ మధ్య కాలంలో ముగ్గురు న్యాయమూర్తులు ఈ కేసును ప్రశంసనీయమైన లోతుతో విచారించారు; తీర్పు ఇచ్చారు. ప్రతి సందర్భంలోనూ అరుగునే రాముని జన్మస్థలంగా సూచించారు; ఎక్కడా, ఒక్కసారి కూడా మసీదు అని చెప్పలేదు. (1) రామ మందిరం డిమాండ్ తరువాత వచ్చింది; అది ‘రాజకీయ ప్రేరేపిత డిమాండ్’ అని, (2) ‘మసీదు ముస్లింల నియంత్రణలో ఉండింది’; ‘వారు అక్కడ పూజలు చేసేవారు’ అని ఇది పూర్తిగా రుజువు చేస్తుంది
రెస్ జ్యుడికాటా (అంతకు పూర్వం యిచ్చిన తీర్పు వల్ల తిరిగి వాదన చేయడానికి వీలులేకపోవడం) చట్టం ఇక్కడ వర్తించదు అనే సుప్రీం కోర్టు అభిప్రాయం సరైనదే; అంటే దాదాపు 65 ఏళ్ల తర్వాత దాఖలైన వ్యాజ్యాలను అస్సలు ఆపలేదు. ఈ పూర్తి వివరాల జోలికి వెళ్లకపోయినప్పటికీ, 1885 నాటి న్యాయ ప్రక్రియ అర్థం ఏమిటి? మసీదు కేసులో హిందువుల వాదనను దాని యోగ్యతను బట్టి తిరస్కరిస్తుంది. 1885 సంవత్సరం నుంచే రామ మందిరం డిమాండ్ ఎప్పుడైనా తలెత్తిందా? లేదు. బాలగంగాధర్ తిలక్, మదన్ మోహన్ మాలవ్య లేదా లాలా లజపతిరాయ్ వంటి నాయకులను పక్కన పెట్టండి, ఆ డిమాండ్‌ను సావర్కర్ కూడా చేయలేదు.
1984లో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) పిలుపు
విశ్వ హిందూ పరిషత్‌ని 1964 ఆగస్టు 29-30 లో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు ఎమ్. ఎస్. గోల్వాల్కర్, ఎస్.ఎస్. ఆప్టే, కె. ఎమ్. మున్షీలు వ్యవస్థాపకులు. విహెచ్‌పి 1984లో బజరంగ్ దళ్‌ని స్థాపించింది. విహెచ్‌పి అగ్ర వేదికగా వ్యవహరించాల్సి ఉండింది. అపవిత్రం చేయబడిన మసీదు తాళాలు తెరవడానికి ఇందిరా గాంధీతో జరిగిన ఒప్పందం గురించి అధికారిక మూలాల ఆధారంగా రిపోర్టు తయారుచేసిన నీరజా చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
విహెచ్‌పి సరిగ్గా 1984 ఏప్రిల్ 8 నాడే మసీదునే తొలగించాలి అని పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 25న ఒక రథయాత్ర ప్రారంభమైంది. అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్య జరగడం వల్ల రథయాత్రను నిలిపివేయవలసి వచ్చింది. 1986 మార్చి శివరాత్రికి ముందు తాళాలు తెరవడానికి రాజీవ్ గాంధీతో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. 1986 ఫిబ్రవరి 1 నాడు, ఒక అబద్ధపు (నకిలీ) కోర్టు ఆదేశం ప్రకారం, తాళాలను తెరిచారు. ముస్లింలకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు (A.G. నూరానీ; ఆర్‌ఎస్‌ఎస్; లెఫ్ట్ వర్డ్; పేజీలు. 207-208 చూడండి). సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ అంగీకరించినట్లుగా, మొత్తం ఉద్యమమే ఒక రాజకీయం.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో, 1984 ఏప్రిల్ 7-8 తేదీల్లో జరిగిన ధర్మ సంసద్‌లో స్థాపితమైన ఇరవై సంవత్సరాల తర్వాత చొరవ తీసుకున్న విహెచ్‌పి, అయోధ్య, మధుర, వారణాసిలోని మూడు మసీదులను తొలగించాలని డిమాండ్ చేసింది. ఎన్నికలలో చుక్కెదురైన బీజేపీ వెంటనే ఈ అంశాన్ని పట్టుకుంది.
కోర్టులు రాజకీయాల్లోకి ప్రవేశించవు; అయితే మసీదు విషయంలో 1964 వరకు ఆర్‌ఎస్‌ఎస్ మౌనంగా ఉండడాన్ని ఏ కోర్టూ ఉపేక్షించలేదు. “సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా (ఈ ప్రకటనలు మౌఖికంగా ఉన్నప్పటికీ, తరువాత అనుగుణంగా తయారు చేసారు) పూజ, ప్రార్థనల ఒక పద్ధతి వెలికి వచ్చింది. హిందువులు మొదట అరుగుపైనవున్న రాముడి విగ్రహానికి పూజ చేసేవారు. ఆ తరువాత మూడు గోపురాల నిర్మాణం లోపలి-బయటి ప్రాంగణాన్ని విభజించే ఇనుప కంచె బయట నుంచి అర్పణలు చేసి లోపల ఉన్న ‘గర్భ గుడికి’కు మొక్కేవారు (పే. 629). 1885-86 నాటి కోర్టు స్పష్టమైన, ప్రామాణికమైన రికార్డు ఉన్నప్పటికీ ఈ మౌఖిక సాక్ష్యాన్ని ఆమోదించారు. మసీదు గురించి ఎప్పుడూ ఎలాంటి దావా లేదు. అరుగే రాముని జన్మస్థలంగా వుండిది.
“చారిత్రాత్మకంగా చూస్తే కనక, విష్ణువు అవతారంగా భావిస్తున్న శ్రీరాముడి జన్మస్థలంపై వున్న వారి నమ్మకమూ, విశ్వాసమే హిందువుల వాదనకు ఆధారం. అయోధ్య ప్రాముఖ్యతకి సంబంధించి వారి విశ్వాసానికి ఆధారం ప్రధానంగా ఈ రెండు మూలాలలో ఉంది: (1) వాల్మీకి రామాయణం, స్కంద పురాణం, రామచరితమానస్ వంటి గ్రంథాలు శ్రీరాముడిని దేవుడిగా వర్ణిస్తాయి; ప్రధానంగా అయోధ్య (నగరం, మసీదు కాదు) ప్రస్తావన… (2) యాత్రా విశేషాలు, గెజిట్‌లు, పుస్తకాలు” అని న్యాయస్థానం చెప్పింది.
కానీ రామభక్తుడైన తులసీదాస్ తన రామచరితమానస్ (1574)లో మసీదు ప్రశ్నపై పూర్తిగా మౌనంగా ఉన్నాడు. ఈ మసీదు నిర్మాణం 1528లో జరిగింది. తులసీదాస్ రచనలు మాత్రమే ఉదాహరణ కాదు. పదకొండవ శతాబ్దపు గహద్వాల పాలకుడి ఒక శిలాశాసనం అతని అయోధ్య తీర్థయాత్రను ప్రస్తావిస్తుంది; అందులో అతను చేసిన ఆచారకర్మలు, పూజలు చేసిన ప్రదేశాల జాబితా వుంది. ఈ జాబితాలో రామజన్మభూమి లేదు.
లక్ష్మీధర్, మిత్ర్ మిశ్రా, జిన్‌ప్రభా సూరి గ్రంథాలు లేదా అయోధ్యతో సహా ప్రధాన పుణ్యక్షేత్రాలను వివరించే భూశుండి రామాయణం, పురాణాలు వంటి ఈ కాలంలోని పెద్ద సంఖ్యలో సంస్కృత రచనలలో అయోధ్యతో సహా అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రస్తావన వున్నది కానీ వాటిలో ఎక్కడా రామజన్మభూమి గురించి ప్రస్తావన లేదు.. అయోధ్యలో అత్యంత మహత్వమైన తీర్థస్థలం గోప్రతార్ తీర్థం.
‘అయోధ్య మహాత్మ్య’ (పద్నాలుగవ నుండి పదహారవ శతాబ్దాలు) జన్మ స్థలాన్ని నిర్ణయించిన; ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా గుర్తించిన మొదటి గ్రంథంగా కనిపిస్తుంది. కానీ ఈ గ్రంథంలో కూడా పూజలు, నైవేద్యాల గురించి, యాత్రికులకు సంబంధించిన వివరణాత్మక సూచనలలో ఎక్కడా ఆలయానికి సంబంధించిన ప్రస్తావన లేదు.
“బాబ్రీ మసీదు ఆలయ స్థలంలో నిర్మించబడిందనేది సాపేక్షికంగా కొత్త విశ్వాసం. పంతొమ్మిదవ శతాబ్దంలో వలస పాలకులు ఉపఖండం చరిత్ర పునర్‌రచనలో దాని మూలాలు ఉన్నాయి. ఈ పునర్‌రచనలో, మతపరమైన సముదాయాల చరిత్ర, వారి పరస్పర వివాదాలకు ముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఫైజాబాద్ చరిత్ర కూడా దీనికి మినహాయింపు కాదు.” (పణిక్కర్, పేజి 29)
బ్రిటీష్ వారు సంకలనం చేసిన యాత్రా వర్ణనలు(ట్రావెలాగ్స్), వివరణ పత్రాలు(బ్రోచర్) పైన ఆధారపడటం సురక్షితం కాదు; రెండూ వినికిడి సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసి దానిపై మసీదును నిర్మించాడనే టిఫెంతలర్ (1770) అభిప్రాయాన్ని హైకోర్టు, అలాగే సుప్రీంకోర్టు కూడా నమ్మాయి. [జోసెఫ్ టిఫెంతలర్ (27 ఆగస్ట్ 1710 – 5 జూలై 1785) ఒక జెస్యూట్ మిషనరీ; భారతదేశం గురించి వ్రాసిన తొలి యూరోపియన్ భౌగోళిక శాస్త్రవేత్తలలో ఒకరు.]
అయితే 1885లో కేసు వేసిన హిందూ భక్తులు అలా ఏమీ చెప్పలేదు. ప్రాథమికంగా, పాల్కివాలా ఎత్తి చూపినట్లుగా, ఏ న్యాయస్థానమూ, ముఖ్యంగా 1885 కేసు వెలుగులో, అటువంటి రచనలకు ప్రాముఖ్యత ఇవ్వదు; ఇవ్వకూడదు.
సాక్ష్యం; అసంబద్ధ అంచనా
సాక్ష్యాధారాలను మూల్యాంకనం చేసే కీలక తరుణంలో సుప్రీంకోర్టు నిష్పక్షపాతంగా, న్యాయమైన రీతిలో కొలమానాన్ని ఉపయోగించలేదని చెప్పాల్సి రావడం బాధాకరం. 1949 డిసెంబరు 22న మసీదులో విగ్రహాల ప్రతిష్ఠాపన; 1992 డిసెంబర్ 6న మసీదు కూల్చివేత ఘటనలపై ముస్లింలకు అనుకూలంగా దాని తీర్మానాల ద్వారా ఒప్పించాల్సిన పని లేదు. ఖచ్చితంగా, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.
విషయం మసీదుపై ముస్లింల హక్కులకు సంబంధించినది. ” 1877లో హిందువులు లోపలి ప్రాంగణం నుండి బహిష్కరణకు వ్యతిరేకంగా తాత్కాలిక, నిరంతర ప్రతిఘటనను కొనసాగించారు” అని కోర్టు పేర్కొంది. ధన్యులం! ఎప్పుడు? ఎందుకంటే తరువాతి వాక్యం ఏమిటంటే, “బయటి ప్రాంగణానికి ఉత్తరం వైపున బ్రిటిష్ ప్రభుత్వం మరొక తలుపు తెరిచింది, దాని నియంత్రణ, నిర్వహణను హిందువులకు అప్పగించారు. అదే దారి అరుగుకు కూడా వెళ్తుంది. హిందువులు 1885లో దావా వేయగలిగినప్పుడు, యాజమాన్యం కోసం ఆ తర్వాత కూడా దావా వేయవచ్చు అని ఎవరైనా ఊహించవచ్చు.
‘న్యాయం, సమానత్వం, మంచి మనస్సాక్షి’ గురించి మాట్లాడేటప్పుడు, సమానత్వం కోరే వారి చేతులు కూడా శుభ్రంగా ఉండాలి అనే స్థాపిత ముందస్తు షరతును కోర్టు విస్మరిస్తుంది.
ఇక ఇప్పుడు గుండెల మీద చేతులు పెట్టుకోండి. 1856-57 వరకు మసీదును నమాజు కోసం ఉపయోగించారని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని సాక్ష్యంలోని ముఖ్యమైన అంశంగా సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తులు పేర్కొన్నారు (పే. 791). ఈ మసీదు ఫైజాబాద్‌లో ఉండింది, ఢిల్లీలో లేదు, లక్నోలో లేదు. ఖచ్చితంగా, 1528లో నమాజ్ కోసం నిర్మించిన మసీదులో నమాజ్ చేయలేదని సాక్ష్యాలను సేకరించడం అవతలి పక్షం పని. నమాజ్ చేశారనడానికి ఏ రుజువు ఇవ్వగలరు?
ఈ అంశానికి సంబంధించి 1964 వరకు హిందువులు ఎటువంటి దావా చేయని పక్షంలో ముస్లింల ‘ప్రతికూల స్వాధీనం’ హక్కును ప్రభావితం చేస్తుంది. కొన్ని పేజీల తర్వాత (పే. 798) “మసీదు నిర్వహణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సహాయం.. ఆర్థికంగా.. ఆ నిర్మాణాన్ని ప్రార్థనల కోసం ఉపయోగించినట్లు నిర్ధారించడానికి సరిపోదు.” ఎవరూ నమాజ్ చేయని మసీదు నిర్వహణకు బ్రిటిష్ ప్రభుత్వం డబ్బు ఖర్చు చేస్తూండిందా? నిజానికి 1860లో అరుగు నిర్మాణానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన తెలిపారని; అందుకోసం అద్దె డిమాండ్ చేసారు అని ఆధారాలు ఉన్నాయి. “ఈ అరుగును 1857లో కట్టారు; దానిని ముస్లింలు వ్యతిరేకించారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
“1528 లో మసీదు నిర్మాణం నుండి 1857 లో వలసరాజ్యాల ప్రభుత్వం నిర్మించిన కంచె కాలం మధ్య 325 సంవత్సరాలలో, ఈ మసీదులో ఆరాధన లేదా వివాదాస్పద ఆస్తిపై అధికారిక నియంత్రణను రుజువు చేసే ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు.
అందువల్ల, ఎటువంటి సాక్ష్యం లేనందున 1857 కి ముందు వివాదాస్పద భూమిని ఇక్కడ నివసిస్తున్న ముస్లిం సముదాయం ప్రార్ధనల కోసం ఉపయోగించిందని నిర్ధారించలేము.
“భగవంతుడు రాముడి హిందూ భక్తులు వివాదిత ఆస్తిపై తమ హక్కును నిరంతరం పేర్కొన్నారు” అని కూడా న్యాయమూర్తులు అంగీకరించారు. ముస్లింలు ఉపయోగించినట్లు రుజువు లేదనే అంశం అసహ్యకరమైనదిగా భావించేంత స్థాయికి పునరావృతమైంది (పేజీ 858). ప్రతికూల స్వాధీనంపై వారి దావాను అడ్డుకునేందుకే ఇలా చేశారు.
882వ పేజీలో, ఆలోచన మరింత పదునుగా మారుతుంది. రెండు భాగాలను వేరు చేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం రెయిలింగ్‌ను ఏర్పాటు చేయలేదు, కానీ “మసీదు ఆవరణలో హిందువులు పూజించవచ్చు” అనే వాదన కారణంగా. హిందువులు “లోపలి ప్రాంగణంపై తమ అధికారంపై నిరంతర వాదనలు” చేసారు. వారు 1885లో లేదా ఆ తర్వాత మసీదుపై ఎందుకు దావా వేయలేదు; 1964 వరకు లేదా 1984 వరకు కూడా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఎంత విచిత్రం. “ముస్లింలు రెయిలింగ్‌లోపలి ప్రాంతాన్ని ఉపయోగించడం వివాదాస్పదమైంది.” 1949 వరకు దానిపై ఎలాంటి వివాదం లేదని నిస్సందేహంగా రుజువైతే కనక, ముస్లింల ప్రతికూల స్వాధీనత ఖచ్చితంగా రుజువు అయి ఉండేది.
“1856-57కి ముందు లోపలి ప్రాంగణంలో పూజించకుండా హిందువులను బహిష్కరించ లేదు” అని కోర్టు చెప్పింది (891వ పేజీ) -అంటే మసీదులోనే. ఒక ముస్లిమేతరుడిని తన మసీదులో ప్రార్థన చేయడానికి అనుమతించడాన్ని మీరు ఎప్పుడైనా ఊహించగలరా? మొత్తం ఇస్లాం చరిత్రలో ఇలాంటి ఉదాహరణ ఏదైనా ఉందా? 1528- 1857 మధ్య అక్కడ ప్రార్థనలు చేసినట్లు నిరూపించాలని కోర్టు ముస్లింలకు చెప్పింది. అదే మసీదులో పూజలు చేశామన్న హిందువుల వాదనను ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేకుండానే అంగీకరించింది.
899వ పేజీలో తీర్పు రచయిత 1528 మరియు 1856 మధ్య “325 సంవత్సరాలలో” మసీదులో ప్రార్థనలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: “ముస్లింల వివరణలు 1856కి ముందు నమాజ్ విషయంలో ప్రస్ఫుటంగా మౌనంగా ఉన్నాయి, అయితే హిందువులకు దీనికి విరుద్ధంగా, తమ నిరంతర ప్రార్థనల వివరణలు ఉన్నాయి.” అయితే ఈ వివరణలు వేటిలోనూ హిందువులు మసీదు లోపల కాకుండా అరుగుపై మాత్రమే పూజలు చేస్తారని పేర్కొనలేదు. “1856కి ముందు ప్రార్థనల విషయంలో ముస్లింలు స్పష్టంగా మౌనంగా ఉన్నారు, అయితే దీనికి విరుద్ధంగా, హిందువులు ప్రార్థనలు కొనసాగించినట్లు రికార్డులు ఉన్నాయి”. అయితే ఈ వివరాల్లో ఏ ఒక్కటి కూడా హిందువులు మసీదు లోపల కాకుండా, కేవలం చబుతరా (అరుగు)పైన మాత్రమే పూజలు చేస్తారని ప్రస్తావించలేదు.
ఇవి “సాధ్యతల (సంభావ్యత) ప్రాధాన్యత” ఆధారంగా నిర్ణయించబడే సివిల్ కేసులు అని న్యాయస్థానం పదేపదే నొక్కిచెప్పింది; సరియైనది కూడా. కానీ మసీదుకు అనుకూలంగా బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఈ ప్రమాణాన్ని వదిలేసింది.
1994లో అదే న్యాయస్థానం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రస్తుత బెంచ్ ఈ సాక్ష్యం ఆధారంగా యాజమాన్యాన్ని నిర్ణయించనప్పటికీ, “భూమి కింద అంతర్గత నిర్మాణానికి సంబంధించిన పురావస్తు పరిశోధనలు పన్నెండవ శతాబ్దపు హిందూ మతానికి చెందినవిగా సూచిస్తున్నాయి” అని తీర్పు చెప్పింది.
తీర్పు మొత్తం అటువంటి ‘రత్నాల’తో నిండి ఉంది: “హిందువులు లేకుండా నమాజ్ చదివేవారు… అని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు”- అభినందనలు! ముస్లింలు నమాజు చేసేటప్పుడు హిందువులు ఉండేవారా?! నమాజ్ పూర్తిగా నిశ్శబ్ద వాతావరణంలో జరుగుతుందని శతాబ్దాలుగా అందరికి తెలుసు; ఈ కారణంగానే, మసీదు ముందు సంగీతాన్ని వాయించడంపై అల్లర్లు జరుగుతూంటాయి.
కోర్టు పదే పదే ఇలా చెబుతుంది: “వివాదాస్పద స్థలం మొత్తం సమ్మిళితం.” ముస్లింలకు ఐదు ఎకరాలు కేటాయించారు (పేజీ 923, పేరా 801). గుజరాతీ సామెత వుంది – “గలా కాపి నే పగ్డి పెహనవ్” (గొంతు కోసి తలపాగా కట్టడం).
భూమి యాజమాన్యాన్ని నిర్ణయించడంతో కోర్టు ఆగలేదు. మరింత ముందుకు వెళ్ళి (పే. 924, పేరా. 803) ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి, దానికి భూమిని అప్పగించమని ప్రభుత్వాన్ని “ఆదేశించింది.” ట్రస్ట్ రూపురేఖలను తయారుచేయాలని, అందులో “ఆలయ నిర్మాణంతో సహా ధర్మకర్తల అధికారాలను కూడా” నిర్వచించాలని ఆ ఆదేశంలో వుంది.
నిస్సందేహంగా ఒక గొప్ప దేవాలయం నిర్మితమవుతుంది. అయితే ఇది ప్రపంచానికి, భారతీయులకు ఎలాంటి సందేశాన్నిస్తుంది? 1949 డిసెంబర్ 22, 1992 డిసెంబర్ 6 నాటి నేరాల పట్ల కోర్టు చాలా ఉదారంగా ఉంది. “ఆరోపిత” అనే పదాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించారు. విగ్రహాల ప్రతిష్టాపన “ముస్లింల ప్రకారం మసీదును అపవిత్రం చేసింది” (పే. 903).
మర్యాదస్థులకు ఇలాంటి ద్వందార్థ భాష అవసరం లేదు. 1949 డిసెంబర్ 23 నాడు అయోధ్య పోలీస్ స్టేషన్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ రాణి దూబే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఇలా ఉంది: “మాతా ప్రసాద్ (పేపర్ నెం. 7) ప్రకారం, నేను ఉదయం సుమారు 8 గంటలకు జన్మ భూమికి చేరుకున్నప్పుడు, ఒక గుంపు ఉందని నాకు తెలిసింది. 50-60 మందిదాకా వున్న ఆ గుంపు మసీదు ప్రాంగణంలోని గేటు తాళం పగలగొట్టి లేదా నిచ్చెనను ఉపయోగించి గోడ ఎక్కి లోపలికి ప్రవేశించిందని, బయటి-లోపలి గోడలపై శ్రీ భగవాన్ విగ్రహాలు, సీత, రాముడు మొదలైనవారి చిత్రలేఖనవున్న (పెయింటింగ్) విగ్రహాలను స్థాపించారు…. రామ్ దాస్, రామ్ శక్తి దాస్, మరో 50-60 మంది గుర్తు తెలియని వ్యక్తులు మసీదులోకి రహస్యంగా ప్రవేశించి, అపవిత్రం చేశారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అనేక ఇతరులు యిందుకు సాక్షులు. కనుక ఇది వ్రాసి నమోదు చేయబడింది.”
ఫైజాబాద్ డిప్యూటీ కమీషనర్ జె. ఎన్. ఉగ్రా సంతకం చేసిన 1950 ఏప్రిల్ 25 నాటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్రాతపూర్వక ప్రకటన ప్రకారం, “కేసు నడుస్తున్న ఆస్తిని బాబ్రీ మసీదు పేరుతో పిలుస్తారు; ముస్లింలు చాలా కాలంగా తమ ఆరాధనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. దీనిని ఎప్పుడూ శ్రీరామచంద్రుడి దేవాలయంగా ఉపయోగించలేదు. 1949 డిసెంబర్ 22 రాత్రి శ్రీరామచంద్రుడి విగ్రహాలను దొంగతనంగా, తప్పుడు పద్ధతిలో అక్కడ పెట్టారు.
1949 డిసెంబరు 22కి ముందు అరుగుపై ఆలయాన్ని నిర్మించాలనే అధికారుల ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. 1949 అక్టోబర్ 10 న నమోదు చేసిన సిటీ మేజిస్ట్రేట్ నివేదిక ప్రకారం: “మసీదు, ఆలయం పక్కపక్కనే ఉన్నాయి; హిందువులు-ముస్లింలు ఇద్దరూ తమ ఆచారాలు, మతపరమైన పండుగలను జరుపుకుంటారు… రామచంద్ర భగవానుడు పుట్టిన చోట ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాలని హిందూ సమాజం చాలా ఉత్సుకతతో వున్నది.” హింసను నివారించడానికి ఈ ప్రణాళికలను విఫలం చేశారు. ఈ విధంగా, 1949లో కూడా హిందువులు రాముడి జన్మస్థలంగా అరుగు పైన దేవాలయాన్ని కోరుకున్నారు. అయితే 2019లో సుప్రీంకోర్టు అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చింది.
అయోధ్య, ఆర్టికల్ 370, ముస్లిం పర్సనల్ లా కు సంబంధించిన ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి మూడు డిమాండ్లను నెరవేర్చడానికి మోడీ చట్టపరమైన మార్గాన్ని ఉపయోగించాడు. కానీ ఇది కూడా గడిచిపోతుంది. ఈ విషయంలో ముస్లింలకు విజయం సాధించే అవకాశం దొరకలేదు. వారు ఆ ఐదు ఎకరాలను కూడా తిరస్కరించాలి; హిందూత్వ బహుముఖ దాడులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి. మరి ఆ న్యాయమూర్తులు కూడా అలాగే చేయాలి. మనం విభజిత రాజకీయ వ్యవస్థలో జీవిస్తున్నాం; న్యాయమూర్తులు కూడా ఆ సుడిగుండంలో చిక్కుకున్నారు.
సుప్రీంకోర్టులో ఎన్నడూ లేనటువంటి గొప్ప న్యాయమూర్తి ‘లర్న్డ్డ్ హ్యాండ్’ (అమెరికాలో సీనియర్ న్యాయమూర్తి-1872-1961)కంటే మెరుగైన మార్గదర్శకత్వం వారికి ఎక్కడా దొరకదు.
న్యాయవ్యవస్థ “ఈ విధ్వంసక కొట్లాటలకు దూరంగా ఉండి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. దూరంగా ఉండకపోతే రెండు విధాలుగా తన స్వాతంత్య్రాన్ని కోల్పోతుంది. వారు సిద్ధాంత నిబద్ధతను కలిగి, నిజాయితీగా ఉంటే మాత్రం వారిని ఆపేస్తారు; కానీ వారు గాలి వాలుకు అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకోవడం నేర్చుకుంటే, ఇంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు.
లొంగిపోవడాన్ని ఆశించమని న్యాయమూర్తులు నేర్పించిన సమాజం లొంగిపోతుంది; లొంగుబాటు అనేది వివరణ గుల్ల (షెల్)లో కుళ్ళిపోవడం. ఒకవేళ న్యాయమూర్తి తాను ప్రేమించే ఈ విషయాన్ని చంపాలని అనుకుంటే అలా చేయనివ్వండి, కానీ పిరికివాళ్ళలా ముద్దులతో కాదు, ధైర్యవంతుల్లా కత్తులతో.
“కాబట్టి అంతిమ సారాంశంలో చెప్పాలంటే, న్యాయమూర్తులు స్వతంత్రంగా ఉండటమే మా న్యాయవ్యవస్థ విజయానికి షరతు; స్వతంత్రతను బలహీనపరచకపోవడం తమ రాజ్యాంగబద్ధ పనితీరుకు అవసరం అని నేను నమ్ముతున్నాను. కానీ నేను మళ్ళీ నొక్కిచెప్పేది ఏమంటే, ఈ కవచం విలువ ఏమిటంటే, (షేక్స్పియర్ మాటల్లో’మంచి చెడుల మధ్య జరిగే అంతులేని సంఘర్షణల మధ్యన న్యాయం ఎక్కడో వుంది’ అనే ప్రాథమిక సంఘర్షణలలో తుది నిర్ణయం చెప్పకూడదు. మన రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న నిష్పక్షపాతం-నిజాయితీల ప్రాథమిక సూత్రాలు ఏమి అవుతాయి అని మీరు అడగవచ్చు; ఈ సిద్ధాంతాలకు మద్దతు లేనప్పుడు అవి కేవలం సహనానికి సంబంధించిన సలహాగా మాత్రమే మిగిలిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నానా? ?
“అటువంటి పరిస్థితిలో ఆ సూత్రాలలో మిగిలేది ఏమిటో ఎవరూ చెప్పలేరని నేను అనుకోను; అవి కేవలం సలహాలుగా మిగిలిపోతాయో లేదో నాకు తెలియదు; కానీ నాకు తెలిసింది మాత్రం- ఇంతగా చీలిపోయిన, సహనం కోల్పోయిన సమాజాన్ని ఏ న్యాయస్థానమూ రక్షించలేదు; ఈ స్ఫూర్తి వర్ధిల్లుతున్న సమాజాన్ని కాపాడే అవసరం, ఏ న్యాయస్థానానికీ రాదు. ఒక సమాజం తన బాధ్యతల నుండి తప్పుకొని, వాటిని న్యాయస్థానాలకు అప్పగిస్తే ఆ భావన పెంపొందదు సరికదా, చివరకు ఆ భావననే నాశనం చేస్తుంది”. (స్వతంత్ర న్యాయవ్యవస్థకు సహకారంపై ఉపన్యాసం, 1941-(లెక్చర్ ఆన్ ద కాంట్రిబ్యూషన్ ఫర్ ఇండిపెండెంట్ జుడీషియరీ – 1941)
అలహాబాద్ హైకోర్టు ముస్లింలకు వారి మసీదులో మూడింట ఒక వంతు ఇచ్చింది. సుప్రీంకోర్టు వారిని అక్కడి నుంచి పూర్తిగా తొలగించింది. ఈ భూమిలో రామమందిరాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలతో మొత్తం భూమిని హిందువులకు ఇచ్చింది. చదవండి: “లోపలి ప్రాంగణానికి సంబంధించినంతవరకు, 1857లో బ్రిటీష్ ప్రభుత్వం అవధ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందు హిందువులు పూజలు జరిపారు అనేదానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో భవనం నిర్మించినప్పటి నుండి 1857 వరకు అంతర్గత నిర్మాణం మీద తమకు ఏకైక ఆధిపత్యం ఉందని సూచించే సాక్ష్యాలను ముస్లింలు సమర్పించలేదు… (450 సంవత్సరాల క్రితం నిర్మించిన మసీదును ముస్లింలు అన్యాయంగా కోల్పోయారు.)
“మా దృష్టిలో, సెక్షన్లు 6, 7 (ట్రస్ట్ చట్టం) కింద కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఉపయోగించి, ఒక ట్రస్ట్ లేదా నిబంధనల ప్రకారం ఏర్పరచబడే ఏదైనా ఇతర చట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం అవసరం. ఆర్డర్ 5 నిబంధనల ప్రకారం భూమిని అప్పగించాలి. కేసు సంఖ్య 5లోని ఆర్డర్. ఈ పథకంలో భూమిని కేటాయించబోయే ట్రస్ట్ లేదా నిర్మాణానికి నిర్వహణకు సంబంధించిన అధికారాలు; ఆ అధికారాలను మంజూరు చేయడానికి అవసరమైన అన్ని నిబంధనలు ఉండాలి.
“కేంద్ర ప్రభుత్వం, ఈ నిర్ణయం తీసుకున్న మూడు నెలలలోపు, ‘అయోధ్యలోని నిర్టిష్ట ప్రాంతాల స్వాధీన చట్టం, 1993′(అక్విజిషన్ ఆఫ్ సర్టెన్ ఏరియా ఆఫ్ అయోధ్య యాక్ట్ – 1993)లోని సెక్షన్ 6, 7 కింద ఉన్న అధికారాలకు అనుగుణంగా ఒక పథకాన్ని రూపొందిస్తుంది. ఆర్టికల్ 6 కింద ట్రస్టీల బోర్డుతో సహా ట్రస్ట్ లేదా ఇతర తగిన నిర్మాణం ఏర్పాటును ఈ పథకం పరిశీలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తయారుచేసే ప్రణాళిక ట్రస్ట్ లేదా ఆ నిర్మాణం పనితీరు, దాని నిర్వహణ, ట్రస్టీల అధికారాలు, ఆలయ నిర్మాణంతో సహా అన్ని తక్షణ, అనుబంధ విషయాలతో సహా అన్ని అవసరమైన నిబంధనలను రూపొందిస్తుంది. “(పేజీ.926)
మసీదును కూల్చివేయకుండా వుంటే కోర్టు ఈ ఉత్తర్వు ఇచ్చి ఉండేదా? లేదా ఇవ్వగలిగేదా? 1949, 1992 – ఈ రెండూ కూడా నీచమైన చర్యలు; శిక్షాస్మృతి ప్రకారం నేరాలు. “చట్ట పాలన”ను విచ్ఛిన్నం చేసేది రాజ్యం; రౌడీ మూక కాదు. లౌకిక రాజ్యానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం ఏ అధికారంతో, ఏ సముదాయానికైనా చెందిన ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని ఆదేశించగలుగుతుంది? అటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా, సుప్రీంకోర్టు సివిల్ దావాలో ఆస్తి వివాదాన్ని పరిష్కరించే హద్దులను, పరిమితులను అధిగమించింది. 1976 నాటి హెబియస్ కార్పస్ (ఈ ఉత్తరువు చట్టపరమైన ఆజ్ఞాపత్రం; ఒక వ్యక్తి నిర్బంధించబడడానికి గల కారణాలను విచారించడానికి ఆ వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచమని ఇవ్వబడే రిట్ ఉత్తరువు) ; కొన్ని ఇతర కేసుల విషయంలో కూడా అదే రీతిలో ప్రభుత్వ విధుల్లోకి ప్రవేశించి, మరోసారి తన ప్రతిష్టను దిగజార్చుకొంది.
సోమనాథ్ ఆలయ నిర్మాణంలో రాజ్య జోక్యాన్ని గాంధీ పూర్తిగా వ్యతిరేకించేవాడని జ్ఞాపకం చేసుకోండి. నేరాల ఫలితంగా నిర్మాణమైన రాముడి ఆలయం భారతదేశానికి, ప్రపంచానికి ఏ అద్భుతాన్ని సూచిస్తుంది? శ్రీరాముడుని శతాబ్దాలుగా మర్యాద పురుషోత్తముడుగా, నైతిక న్యాయానికి పరాకాష్టగా పరిగణిస్తారు. కానీ, బిజెపికి మద్దతిచ్చే ఒక రచయిత “1992 డిసెంబరు 6 నాటి ఘటనలు లేకపోతే రామమందిర నిర్మాణం సాధ్యమయుండేది కాదు” అని సగర్వంగా ప్రకటిస్తాడు.
ఆ సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఉన్న, హిందూ భక్తుడు మాధవ్ గాడ్బోలే భిన్న ఆలోచన కలిగినవాడు . “దర్శనానికి అనుమతిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి శాంతిభద్రతలు, ప్రతిపాదిత భూమిని స్వాధీనం చేసుకునే అంశాల సమీక్ష కోసం నేను 1992 డిసెంబర్ 29 న అయోధ్యకు వెళ్లాను. నాకంటే ముందు ఢిల్లీ నుంచి వెళ్లిన వెళ్ళినవాళ్లు, రాముడి గుడికి వెళ్లారు, పూజలు చేశారు. కానీ నేను అలా చేయలేదు, ప్రసాదం తీసుకోలేదు; నేను భక్తుడిని అయినప్పటికీ, మతం అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత విషయం అని నమ్ముతాను; నేను అయోధ్యను బాగా అర్థం చేసుకున్నాను; ఇంత మోసం, భీకరమైన హింసతో కూడిన ఆలయంలో దేవుడు నివసించడు అని నా హృదయాంతరాళంలో ఒక దృఢ నమ్మకం ఏర్పడిపోయింది.” (అన్ ఫినిష్డ్ ఇన్స్, పేజి 406)
భారతదేశంలోని అద్భుతమైన ఆలయ నిర్మాణ కళ ప్రపంచం అసూయపడేలా ఉంది. మసీదును కూల్చివేసి కట్టిన గుడిపై ఆ ప్రపంచం స్పందన ఎలా ఉంటుంది? మతోన్మాదం, అవకాశవాదం తగ్గినప్పుడు, బలవంతంగా, వంచనతో సృష్టించబడిన ఈ నిర్మాణాన్ని భారత ప్రజలు సిగ్గుతో తలవంచుకుని తిరిగి చూస్తారు.
రాబోయే సంవత్సరాల్లో ఏదో ఒక రోజు, ఆవేశాలు తగ్గినప్పుడు, భారతీయ ప్రజలు 1949, 1992ల నాటి ఘటనలను, వాటిని పవిత్రం చేసిన సుప్రీంకోర్టు 2019 తీర్పును 1976 ఆదేశాలలాగానే గుర్తుంచుకుంటారు; అప్పుడు భయానక వాతావరణాన్ని సృష్టించిన ఇందిరా గాంధీ నియంతృత్వం వుండింది.
1978లో, భారతీయ ప్రెస్ క్లబ్‌లో ఆ న్యాయమూర్తులలో ఒకరు “మేము పిరికివాళ్ళం” అని అంగీకరించాడు. ఆ న్యాయమూర్తే జస్టిస్ వై.వి.చంద్రచూడ్.
హిందీ అనువాదం : శైలేష్ శుక్లా
హిందీ నుంచి తెలుగు : పద్మ కొండిపర్తి)