సాహితీలోకంలోకి ముందుగా చాలా మంది కవితల్తోనో, కథల్తోనో ఎక్కవగా ప్రవేశిస్తుంటారు. కాని గూండ్ల వెంకట నారాయణ మొదటగా నవల ప్రక్రియ ద్వారా అది కూడా డిగ్రీ చదివే వయస్సులో సాహితీలోకానికి ‘భూమి పతనం’ అనే నవల ద్వారా పరిచయం కావడం చాలా విశేషమైన విషయం.
గూండ్ల వెంకట నారాయణ తాను వ్యక్తికరించబోయే విషయాలకు తగిన ప్రక్రియగా నవల ఉండటం వల్ల నవల ప్రక్రియను వాహకంగా ఎన్నుకున్నారేమోనని భూమి పతనం నవలను చదివిన తర్వాత అనిపించింది. భూమి పతనం తర్వాత ఇయ్యాల ఊళ్ళో, గరికపాటోడి కథలు, కాపలాదారుని పాటలు, ద్రావిడమహాసముద్రం వంటి రచనలు చేసారు.
‘భూమి పతనం’ పుస్తకం కవర్ పేజీని చూడగానే ఏ రైతు బిడ్డనైన కలవరపడిపోతాడు. నవల చదువుతుంటే కౌలు భూమి చంద్రకొండలుకి రామయ్య తిరిగిచ్చేయాలని, తమ సొంత పొలంలో బోరు పడాలని పరిపరి విధాలుగా కోరుకుంటూ ఉండాల్సిందే. పొలంలో పంట వేసినప్పుడు వర్షం పడకపోతే వర్షం కోసం రైతులు మొక్కని దేవుళ్ళంటూ ఉండరు. ఎంత కరువు ఉన్న కూడా డబ్బులు జమ చేసి తిరునాళ్ళు చేయడం ఆపరు. అలాగని ఈ నవలలో కరువు వల్ల అవస్థతలు పడే రైతు కథాచిత్రణ మాత్రమే లేదు.
మతం పేరుతో దేవుడు అంటూ చర్చీల మీద చర్చీలను నిర్మిస్తూ కిరాణ కొట్టు వ్యాపారం లాగా వ్యాపారం చేసే పాస్టర్లను పరిచయం చేస్తుందీ నవల.
ఒక ఊరిలో మెట్టపొలాలను తల్లీగా, ప్రాణంగా భావిస్తూ పంటలు పండించే రైతు చంద్రకొండలు.
ఒక పంట వేసినప్పటి నుంచి ఆ పంట చేతికొచ్చేవరకు సాగిన ఈ నవల ఎన్నో సామాజిక సమస్యల్ని మన ముందుంచుతుంది.
చంద్రకొండలు భార్య నాగలక్ష్మి. వీళ్ళకున్న మూడెకరాల పొలం మెట్టభూమి కావడంతో నరసింహారావుకున్న పాతిక ఎకరాలలోని ఐదెకరాల పొలాన్ని ఐదెళ్ళుగా కౌలు చేస్తూండడం వల్ల పంటలు బాగా పండటంతో అప్పులన్ని తీర్చేస్తుంటారు.వీళ్ళు కౌలు చేసే ఐదెకరాలకు పక్కనున్న ఐదెకరాలను నాగలక్ష్మికు వరుసకు సోదరుడైన రామయ్య చేస్తుంటాడు. ఈ రామయ్య నరసింహారావుకు బాగా సన్నిహితంగా ఉంటూ, కొండలు కౌలు చేసుకుంటున్న ఐదెకరాల పొలాన్ని సైతం తానే చేసుకుంటానని నరసింహారావుకు ఒప్పించి , ఆ ఐదెకరాల పొలాన్ని నరసింహారావు రామయ్యకు ఇచ్చేటట్టు చేస్తాడు. నరసింహారావు ఆ పొలాన్ని ఎక్కువ కౌలు కోసం రామయ్యకు ఇచ్చేస్తాడు. తమ ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్న ఆ కౌలు పొలం వాళ్ళది కాదన్నదే ఎంతో బాధపెడుతుంది వాళ్ళకు. ఆ పొలం కోసం రామయ్యతో గొడవపడి, ఆ పొలంలోకి వెళ్ళి ఏకధాటిగా కొండలు తన కన్నీళ్ళను ధారపోసి వస్తాడు.
ఆ తర్వాత తమ సొంత పొలాన్ని చదును చేస్తారు. రామకృష్ణ దగ్గర్నుంచి అప్పు చేసి కరువు కాలంలో బోరు కొట్టిపిస్తారు. బోరు పడుతుంది. ఆనందంతో పొంగిపోతారు. నరసింహారావు పొలం పోతే పోయింది. బోరు అయితే తగిలిందనుకొని సంతోషిస్తారు.ఆ తర్వాత నర్రా సుబ్బయ్య పొలాన్ని కూడా కౌలుకు తీసుకుంటారు. ఆ తర్వాత నారు కోసం అప్పు చేయాల్సి వస్తుంది.
ఈ అప్పులను తీర్చడానికి మళ్ళీ ఒక లక్ష రూపాయలు తీస్కొచ్చి ఇస్తాడు. పంట పండితే ఆ వ్యాపారికి పంట అమ్ముతానని ఒక లక్ష రూపాయలు అప్పు తీస్కొని ఊర్లో ఉన్న అప్పుల్ని తీర్చుతాడు కొండలు. చివరికి చేతికొచ్చిన పంటను చేన్లో కుప్పగా పోస్తారు. ఆ రోజు సాయంత్రం వర్షం పడటం మొదలై రాత్రంతా పడుతూ పొద్దున వేళ వర్షమాగుతుంది. ఆ రాత్రంతా వర్షపు హోరు గాలిలో కొండలు , నాగలక్ష్మి లు పంటకుప్ప పైన పట్టను ఎంత కప్పిన , పట్ట మీద బండరాళ్ళనెంత పెట్టిన ఆగకుండా చివరికి పండిన మిరప పంటంతా వర్షపు నీటిపాలవుతుంది. ఆ దృశ్యాన్ని చూస్తే ప్రతి పాఠకుడు చంద్రకొండలు , నాగలక్ష్మిలకు సహయం కోసం వెళ్ళి వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న మిరపపంటను కాపాడుకోవాలని కోరుకుంటారు. కాపాడిన ఆ పంటతో చంద్రకొండలు చేసిన అప్పును సగమైన తీర్చడంలో సాయపడాలనుకుంటారు.
చివరికి చంద్రకొండలు అనారోగ్యంతో చనిపోతాడు. నాగలక్షి మానసికంగా బలహీనురాలై పిచ్చిదానైపోతుంది.
చంద్రకొండలు ఎంతో పుణ్యం వల్ల గానీ నేల తల్లి బిడ్డలుగా పుట్టినాం’ అని తన కొడుకు అనీలుకు నేర్పించినప్పుడు అనీల్ కూడా నాకు పొలమంటే ప్రాణమని అంటుంటాడు. కోడి పుంజును పెంచి చంపడానికి అమ్మేస్తున్నారా అని బాధపడ్తుంటాడు. తమ ఊర్లో ఆరు చర్చీలను కట్టి పంటభూముల్ని నాశనం చేయడమే కాకుండా అమాయక ప్రజల్ని దశమభాగమంటూ దోచుకుంటున్నారని బాధపడ్తుంటాడు. వ్యవసాయం నుంచే గొప్ప సంస్కృతి పుట్టిందని అవినీతి కరమైన సంస్కృతి పుట్టిందే వ్యాపారం నుంచి.అంటే ఖచ్చితంగా మతం నుంచే అని నమ్ముతుంటాడు.పని చేతగాకుండా పాస్టర్లుగా మారి దాన్నే బతకడానికి వృత్తిగా చేసుకున్న మార్తెమ్మను గాని, వార్డెన్ సార్ లను గాని చూస్తే కోపడ్డేవాడు. బైబిలు చదవమంటే నాకిష్టం లేదని చదవని వాడు. పంటభూములు దేవాలయాల కింద, చర్చీల కింద, మజీదుల కింద, పెద్ద పెద్ద భవనాల కింద వృధాగా పతనమవుతున్నాయని మొరపెట్టుకున్నావాడు.
మార్తెమ్మ తన కూమార్తెను పెళ్ళి చేసుకొని తన చర్చీకు పాస్టరైపోమ్మని అవకాశమిచ్చిన్నప్పుడు బైబిల్ చదవడం అలవాటు చేసుకోవటం, వాక్యాలు పలకడం, చివరికి అనీలు ఊసరవెల్లి రంగు మార్చినట్టు తన వ్యక్తిత్వాన్ని మార్చి పాస్టరైపోతాడు. కాని తన మిత్రుడు శామ్యూల్ మాత్రం అవేమి కాకుండా తన అమ్మమ్మ, తాతయ్యల లాగా తన ప్రపంచంలో కష్టపడి బతకడం నేర్చుకుంటాడు.
చంద్రకొండలు అప్పుల ఎక్కువ కావడం వల్ల అప్పులను చేతికందిన పంటతో తీర్చాలనుకున్నాడు.వర్షంలో ఆ పంట కోల్పోవడం వల్ల అనారోగ్యంతో చనిపోయాడు. చంద్రకొండలు తన వారసత్వాన్ని చివరి వరకు కొనసాగించాడు. తన తండ్రికిచ్చిన మాటను పాటించాడు.
ఎంత కష్టమొచ్చిన పొలాన్ని వదలకూడదని, వ్యవసాయం చేసి కడుపు నింపుకోవాలని చంద్రకొండలు అనీలు నేర్పిన కూడా చివరికి అనీలు కడుపు నింపుకోవడం కోసం తమ మూడెకరాల పొలంలో తన తండ్రిని ఖననం చేయకుండా, తన తండ్రికి గుడిని కట్టకుండా ఆ పొలంలో చర్చీని కట్టాడు. నీతులు చెప్పే అవినీతికరమైన పాస్టరైపోతాడు.పిచ్చిదైన తన తల్లిని బిచ్చదానిలా ఊర్లో పడేస్తాడు. అందరి కడుపు నింపిన రైతుగా జీవితాంతం కష్టపడిన ఆమె చి
వరికి అన్నం దొరకకుండా ఆకలితో చనిపోతుంది.
నరసింహరావు కూడా చాలా డబ్బులున్న వ్యక్తి అయిన కూడా చెడు అలవాట్లకి బానిసై , అనవసరంగా పంటభూమిలో గంగమ్మ గుడి కట్టడం వల్ల అప్పుల పాలై చివరికి ఆ గుడిలోనే చనిపోతాడు.
రామయ్య, నరసింహారావులు చంద్రకొండలు మరణానికి మూలకారణమైతే అనీలు మాత్రం నాగలక్ష్మి మరణానికి కారణమౌతాడు.
మార్తమ్మ , వార్డెన్ సార్ లతో పాటు అసలు బైబిల్ చదవడమిష్టం లేని అనీలు చివరికి పాస్టరెందుకు అయ్యారో ఈ భూమిపతనం నవల చదివితేనే తెలుస్తుంది.