దు:ఖం అమితవేగంతో వీస్తుంది

సూర్యుడు ప్రకాశించడు

గాలి ప్రపంచమంతా నిద్రలేని బాధాగీతం పాడింది

తిరగబడడం తెలిసిన ఆగాలికి కూడా

నమ్మసాధ్యం కాలేదు మాస్కోలో ఒక గదిలో

విప్లవానికి పుత్రుడూ జనకుడూ ఆయన

ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడని..

సమాప్తి..సమాప్తి..సమాప్తి..అంటూ కవిత్వం రాసిన ప్రసిద్ద రష్యన్‌ కవి వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ. ఇది లెనిన్‌ అస్తమించినపుడు తన్నుకొచ్చిన దు:ఖాన్ని కవిత్వంగా రాశాడు, దు:ఖమొక్కటే కాదు..లెనిన్‌ జీవితాన్ని, నాయకత్వాన్ని, ఆచరణాత్మక సామ్యవాదపాలనను, తన కలలరష్యాను కార్మిక కర్షక కాంతుల్ని ఈ కావ్యం నిండా పరిచారు. ఈ వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ రాసిన వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ కావ్యం మహాకవి శ్రీశ్రీ అనువదించారు.

మయకోవ్‌స్కీ గూర్చి తెలియని ప్రగతిశీలకవి ఉండడనే అనుకుంటున్నా. ఇంటర్మీడియేట్‌ చదివేరోజుల్లో  ఐలవ్‌ అనే పోయం కంఠతాచెప్పి ఈ కవి రష్యన్‌ కవి అని, ఈయన గూర్చి తెలుసుకురండని ఇంగ్లీష్‌ లెక్చెరర్‌ చెబితే ఆయన గూర్చి గూగుల్‌ లాంటి సౌకర్యాలు లేనిరోజుల్లో  లైబ్రరీ అంతా వెతికి కొంత సమాచారం రాబట్టిన రోజులింకా కళ్ళముందే దేవులాడుతున్నాయి. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం నా మదిలో నిండుగా నిక్షిప్తమైన కవి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రసిద్ద రష్యన్‌ కవి. కమ్యూనిస్ట్‌పార్టీలో చేరి లెనిన్‌ ఉద్యమాలతో అత్యంత ప్రభావితం పొంది, విప్లవం వల్లే ప్రజల అవసరాలన్నీ తీరి ఆర్థిక అసమానతలు అంతరాలు లేని గొప్ప సమాజం ఆవిష్కృతమౌతుందని బలంగా నమ్మి, వందలాది విప్లవకవితలు రాసి, ఆనాటి రష్యన్‌ ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసినవాడు మయకోవ్‌స్కీ. ఆయన లెనిన్‌పై ప్రసిద్దమైన కావ్యం రాశారు. ఆయన రాసిన ‘వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ కావ్యం’ అను కావ్యాన్ని శ్రీశ్రీ అనువదించారు. బహుశా శ్రీశ్రీ అనువదించాకే ఆ కవిత్వం విప్లవకవుల కరదీపికగా మారింది. లెనిన్‌ను ఉటంకించే ప్రతి సందర్భంలోనూ ఈ కవితల్ని ఉచ్చరించడం మనం చూస్తూనే ఉన్నాం.

ఎవడు బతికాడు మూడుయాభైలు అని శ్రీశ్రీ ఊరికే అనలేదు. ఈ కవితావాక్యాన్ని ఎందరెందరికో ఉదహరించినా మయకోవ్‌స్కీకి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. అతను సోషలిస్ట్‌ సమాజాన్ని నిర్మించడానికి తన కవిత్వాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. కవితావేశాన్ని, కవితాక్షరాలను రష్యన్‌ సమాజంకోసం లిఖించాడు. బహుశా లెనిన్‌ను ఇంతగా ప్రేమించిన కవి, ఇంతగా ఆరాధించినకవి ఎవ్వరూ ఉండకపోవచ్చు.

‘‘ఇదేఅదను లెనిన్‌ కథను రచించెదను నేను, లెనిన్‌ బ్రదుకు జనం కొరకు ధ్వనించెదను నేడు’’ అని తన దీర్ఘకవితను ప్రారంభించారు. నిజమే లెనిన్‌ బ్రతికినన్నాళ్ళు జనంకొరకే బతికారు. ఎర్రజెండా రెపరెపలున్నంత కాలం లెనిన్‌ బతికే   ఉంటాడు. మార్క్సీయసిద్దాంతాన్ని ఆచరణలో చూపినవాడు. అందుకే రష్యా నాజీవితంలో కల అంటూ ఆర్థిక అసమానతలు  లేని పెట్టుబడిదారీ వ్యవస్థలు లేని, సామ్రాజ్యవాద పన్నాగాలు లేని దేశనిర్మాణాన్ని మయకోవ్‌స్కీ కలగన్నాడు. చాలా తక్కువ కాలం బతికినా లెనిన్‌ పాలనను ఆధ్యంతమూ ఇష్టపడ్డవాడు. అందుకే నా కవిత్వం? లెనిన్‌కి తగ్గ కవిత్వం ధ్వనించాలంటే/ అనంతాకాశాన్ని చుంభించే అతని కిరీటాన్ని తాకాలంటే ఈ నా శక్తిలేని వాక్కులు ఆ మానవుణ్ణి అర్థం చేసుకోవద్దూ?

లెనిన్‌ ఆలోచన ఈ ప్రపంచానికి కొత్త దారులు పరచింది. అందుకే కవి అంత గొప్ప కవితావాక్యాలు రాయగలిగాడు.  ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచాడు. మన దేశానికి పూర్ణస్వరాజ్‌ కావాలని ఆనాడే బ్రిటీష్‌సామ్రాజ్యవాద వలస పాలనను వ్యతిరేకించిన మహోన్నతుడు లెనిన్‌. స్వరాజ్యపోరాటంలో ఉరికంబమెక్కిన భగత్‌సింగ్‌ ప్రాణాలొదిలే ఐదు నిమిషాల ముందు కూడా లెనిన్‌ రచనలు చదువుతూ గడిపాడంటే ఈ దేశయువతను ఎంతగా ప్రభావితం చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

లెనిన్‌ మరణాన్ని ఎవ్వరూ నమ్మలేదు. ఎవ్వరూ జీర్ణించకోలేదు. లెనిన్‌ గూర్చి మయకోవ్‌స్కీ తపనపడ్డాడు. కానీ ఊహకందని దార్శనికత లెనిన్‌ది. లెనిన్‌ వొక్కరష్యాకు కాదు ప్రపంచానికి అవసరమైన నాయకుడు. అందుకే లెనిన్‌ గూర్చి ఈ కవిత్వంలో విషాదాన్ని కూడా కవి ఇలా చెప్తాడు ‘‘ నేడో ఒక నిజమైన విషాదం మన/ హృదయాలను బద్దలు కొడుతోంది./ఈ మనుష్యుల భూమి మీద నివసించిన/మానవులందరిలో మానవత్వం/ మూర్తీభవించిన మహానుభావుణ్ణి/నేడు ఖననం చేస్తున్నాము అంటారు. అంతేకాదు ‘‘మానవులందరికన్నా మానవత్వం ఉన్న ఈ మనిషి’’ అన్నాడు మయకోవ్‌స్కీ. అందుకే ఈ ప్రపంచానికి అవసరమైనవాడు లెనిన్‌ అన్నాను.  రవీంద్రుడు రష్యాదేశాన్ని చూసి భారతదేశం కూడా ఇలా ఉండాలని లెనిన్‌లాంటి నాయకులు కావాలని, అతన్నే స్ఫూర్తిగా తీసుకోవాలన్నాడు. లెనిన్‌ నాయకత్వంలోని అక్కడ విద్యావిధానం చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నైనా ఉదహరించవొచ్చు.

ఈ కవిత్వం చదువుతున్నంతేసేపూ మయకోవ్‌స్కీ తెలుగులోనే రాశాడా అన్నంత గొప్పగా అనువదించారు శ్రీశ్రీ.  లెనిన్‌ గూర్చి మనందరి ముందు మయకోవ్‌స్కీ ఉప్పొంగేతరంగంలా ప్రత్యక్షంగా చదువుతున్నట్టే ఉంటుంది. ఈ కవితా వాక్యాలు చూడండి..

కావ్యవస్తువులకు నాకు కొరతలేదని తెలుసు మీకు/ కాని ప్రణయగీతాలు రాయడానికి సమయం కాదు/ ఓహో యుద్ద సన్నద్దమైన కార్మిక వర్గమా/ నిప్పులు కక్కే నాకవిత్వం నీ కోసం సంసిద్దం/ కమ్యూనిజం అంటే జడుసుకునే వాళ్ళకు ప్రోలేటేరియట్‌ అనే మాట కర్ణకఠోరంగా ఉండొచ్చు. బహుశా ఇంతటి అభివ్యక్తి ఎవ్వరూ చేయలేరు. లెనిన్‌ కంటే మయకోవ్‌స్కీ ఇరవైమూడేళ్ళు చిన్నవాడు. లెనిన్‌ నాయకత్వాన్ని, లెనిన్‌ రచనలను అమితంగా ఇష్టపడి కమ్యూనిష్టుపార్టీలో చేరినవాడు. విప్లవకవిత్వమే తనపంథాగా మార్చుకుని కార్మికకర్షకుల, పక్షాన పోరాడే ఆయుధంగా తన కలమెత్తి విప్లవకవిగా అవతరించినవాడు. ఎన్నో ప్రసిద్ద కవితల్ని ప్రపంచసాహిత్యానికి అందించినవాడు. ‘‘రాబోతున్నాడు చూడు కార్మికుల కన్నకొడుకు’’ ఈ వొక్క కవితావాక్యం చాలదా? లెనిన్‌ మహనీయుడి గూర్చి ఆ మహకవి రాసిన వాక్యం.

మయకోవస్కీ ఈ లెనిన్‌ కావ్యంలో మార్క్స్‌ గూర్చీ గొప్ప కవితావాక్యాల్ని రాశాడు..విద్యుత్కిరణాలు ఉక్కును తినేసినట్లు/పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి/ అప్పుడు కాలం కడుపుతో ఉండి కార్ల్‌మార్క్స్‌ని ప్రసవించింది/ కార్ల్‌ మార్క్స్‌ లెనిన్‌ పెద్దన్నయ్య/ కార్ల్‌ మార్క్స్‌ రూపం ప్రభవించింది. కార్ల్‌ మార్క్స్‌ జీవించిన కాలంలో పదమూడేళ్ళ బాలుడు లెనిన్‌. కానీ మార్క్సీయ సిద్దాంతాన్ని యావత్ప్రపంచానికే పరిచయం చేసి, దాన్ని ఆచరణలో పెట్టడంలో సఫలమైనవాడు లెనిన్‌. అందుకే మయకోవ్‌స్కీ కార్ల్‌ మార్క్స్‌ను కార్మికుల్ని వర్గపోరాటంలోకి నడిపించాడని, కార్ల్‌ మార్క్స్‌ రాసిన పుస్తకాలు దారి తెలియని కష్టజీవులకు క్రమశిక్షణ నేర్పిన గ్రంథాలని, విశ్వాసాన్ని వేగాన్ని సాధించి విప్లవమార్గాన ముందుకుసాగించే గ్రంథలంటాడు. కార్మికులను నడిపించాడని, వాళ్ళకు బోధించాడని, పోరాటాల్లో రక్తం చిందించండని   మార్క్స్‌ చెప్తాడని కవి ఈ కావ్యంలో చెప్తాడు.

ఈ కావ్యం నిండా లెనిన్‌ గూర్చేకాదు ప్రతి కమ్యూనిష్టుకార్యకర్త తను మార్క్సిజాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో కవిత్వంగా మయకోవస్కీ చెప్తాడు. ‘‘ఒంటరిగా పోరాడేవాడికి ఓటమితప్పదు’’ నిజమే ఏ ఉద్యమమైనా అంతే. ఉమ్మడిపోరాటాలు ఎప్పటికీ విజేతగానే నిలుస్తాయి. ప్రణాళికా వైఫల్యాలుంటే తప్ప, ఉమ్మడి పోరాటాలకు అపజయముండదు. అందుకే ఈ కవిత్వంలో మయకోవ్‌స్కీ ‘‘శత్రువునెదుర్కోవాలంటే శక్తివంతమైన పార్టీకావాలి./ సమస్త కార్మికవర్గాన్నీ ఒక బిగించిన పిడికిలిగా మార్చాలి’’ అందుకే మనం శత్రువులను జయించలేకున్నాం. ఓటమిని చవిచూస్తూనే ఉన్నాం. మతోన్మాదులకు రాజ్యాన్ని అప్పజెప్తున్నాం. స్వరాజ్యపోరాటంలో లేనివాళ్ళను స్వాతంత్య్రయోధులుగా నమ్మించే పాలకులు మననెత్తినున్నారు. అందుకే శక్తివంతమైన పార్టీనిర్మాణం తక్షణకర్తవ్యం.కార్మికకర్షకులందరినీ ఏకం చేసి బలమైన పార్టీనిర్మాణం జరగాలి. లేదంటే గోవులే దేవతలు, గోమూత్రమే అమృతము, గోపేడనే లేపనము అనే ప్రచారాన్ని ముమ్మరంచేసి, ఆంగ్లేయులకు అమ్ముడుబోయి చరిత్రహీనుడైన  సావర్కరుని జాతిపితని ప్రకటిస్తారు. అందుకే మనం లెనిన్‌ను చదవాలి. లెనిన్‌ గూర్చి తెలుసుకొవాలి. ఎందుకు చదవాలంటే మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు నెహ్రూ దేశాభివృద్దిలో భాగంగా పంచవర్షప్రణాళికలు ఎలా  ప్రవేశపెట్టాడు. ఎవరి సలహ సూచనలున్నాయి? పారిశ్రామికీకరణ ఇంత వేగంగా ఎలా సాధ్యమైంది? దాని వెనక లెనిన్‌   ఉన్నాడు. ఇది నగ్నసత్యం. ఇవేమి తెలియని మస్తిష్కం నిండా మనువాదాన్ని నింపుకున్న బిజెపీ నాయకులు లెనిన్‌ ఎవరంటారు. అందుకే పార్టీ గొప్పగా నిర్మించబడాలి. అందుకే మయకోవ్‌స్కీ లెనిన్‌ కావ్యంలో..పార్టీ అంటే ఏమిటి/ పదిలక్షల వేళ్ళ చెయ్యి/ ఈ వేళ్ళు ఒక పిడికిలిగా బిగిస్తే/ దానిదెబ్బకెదురులేదు/ ఒకమనిషి ఎంత ప్రముఖుడైనా గానీ/ పదిగజాల దుక్కని/ పైకెత్తలేడు/ పది అంతస్తుల ఇంటిమాట వేరే చెప్పాలా? పార్టీ అంటే అర్థం/ శత సహస్త్రబాహువులు మస్తిష్కాలు/మస్తిష్కాలు/నేత్రాలు/ఒకటిగా పెనవేసుకుని/ ఒకటిగా పనిచేసేవి/పార్టీలో చేరిమేము/పరస్పరం సహాయం చేసుకుంటూ/అందరాని ఆకాశానికి/ అనంతనిశ్రేణులు నిర్మిస్తాం/  సముద్రంలో మా నౌకను/ సరిగా నడిపించే దిక్సూచి పార్టీ/ సమస్త కార్మికవర్గానికి వెన్నెముక / పార్టీ మా ఆశయాల అమరత్వానికి చిహ్నం/ మా అచంచలమైన అజేయమైన/ విశ్వాసానికి ప్రతీక/ నిన్నటి బానిసలు/ నేడు సామ్రాజ్యాలనే పడగొడుతున్నారు/ మెదడు, బలం, తన వర్గపు వెలుగు అదీ మా పార్టీ/ లెనిన్‌, పార్టీ ఇద్దరూ కవల సోదరులు/ వారి తల్లి చరిత్ర/ ఇద్దరిలో ఆమెకెవరెక్కువ? లెనిన్‌, పార్టీ ఇద్దరూ ఏకరక్త బంధువులు/ఒక పేరు మీరెత్తితే అందులో రెండో పేరు స్ఫురించక తప్పదు.

పార్టీ గూర్చి ఏ కవి ఇంతలా చెప్పి ఉండకపోవచ్చు. ఏ కవి నిర్మాణాత్మకంగా మాట్లాకపోయివుండవచ్చు. పార్టీ ఎవరిపక్షాన నిలబడాలో ఇంత స్పష్టంగా ఎవరూ విశదీకరించిఉండకపోవచ్చు. కమ్యూనిష్టుపార్టీల పునాదులు ముమ్మాటికీ  మార్క్సిజం పునాదుల మీదే నిర్మితమై ఉన్నాయి. ఆచరణాత్మకమైన పార్టీనిర్మాణం లెనిన్‌వల్లే సాధ్యమైంది. అందుకే పార్టీ`లెనిన్‌  మయకోవ్‌స్కీ కవల సోదరులన్నాడు. ‘‘కమ్యూనిజం నిర్మిస్తున్నవాళ్ళ పార్టీ చిరకాలం వర్ధిల్లుగాక’’ అంటాడు. అలాంటి పార్టీ నిర్మాణమే తక్షణకర్తవ్యం.

(ఈ పుస్తకాన్ని  నాచేతిలో పెట్టి నాల్గక్షరాలు రాయమని పురమాయించిన శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వర్రావు గారికి ధన్యవాదాలు)

2 thoughts on “మన కాలానికి లెనిన్

  1. చక్కని వ్యాసం , విశదంగా రాశారు మోహన్ అభినందనలు 💐💐💐

Leave a Reply