1
నది స్వప్నం
కొద్ది రోజుల్నించి
ఏరు కలలోకి వస్తోంది
కళ్ళలో తడిని ఒదలిపోతూ ఉంది
తీరైన వరుస లాగా
స్వప్నాల మీద స్వప్నాలు
వాటి మీద నదీ పాదముద్రలు
ఏరు మన్నులో కలిసిపోయిన అనేకానేక
జ్ఞాపకాలు
నేను నవ్వుతున్నప్పుడు
నా లోంచి
జలపాతంలా జారుతుంది నది
మౌనంగా ఉన్నప్పుడు
మైదానం పై పారుతున్నట్టు
నిలకడ పడుతుంది
నది నన్ను గుర్తు పెట్టుకుంది
నేను నదిని దేహం చేసుకొన్నాను
అందుకే నేను తన ఉనికిని
నది నా జీవితం
నదిది
ఓ సమకాలీన వాస్తవ ప్రవాహం
ఎండిపోని జ్ఞాపకాల స్రవంతి
పుట్టుకతో యవ్వనం నది మాత్రమే
పొందుతుంది
మరణించినట్టనిపించే
పునర్జన్మ దానిది
నదిని చంపేస్తామని
ఆయుధాలతో
బయలుదేరుతారు కొందరు
అలాంటివారు ఎందరు
కొట్టుకు పోయారో ప్రవాహంలో…
నది నా కలలోకి వస్తూనే ఉంది
ఒక్కోసారి ఉగ్ర రూపంతో..
ఒక్కోసారి ప్రశాంత వదనంతో..
****
2
పిల్లకాలువ!
ఎండలో మాగిన ఎడారి నాలుక
గుప్పిట పట్టుకు దొరకని
హృదయ స్పందన ఇసుక
జలధారకు కరిగిపారే మట్టిదేహం
ఒట్టిపోయిన లో ప్రవాహాల
లోయలాంటిది మనో నిబ్బరం
ఎంతో కొంత వాన
కావాలి అని తపన పడితే చాలదు
వాన కురవక పోతే
మనమే వానవ్వాలి
వాగవ్వాలి
ప్రవాహం ఒకటి జీవితం ఒకటా?
తడి ఉన్నవన్నీ తరలుతాయి
ఒక చోట ఉండకుండా పారుతాయి…
పుట్టిన చోటే ఉండిపోదు మబ్బు
ఉన్నచోటే కరగదు మేఘం
నువ్వు కరుగు మేఘంలా
పారుతూనే ఉండు పిల్ల కాలువలా!
***
3
ఆమెలోనే
ఆమె నన్ను
గెలవ లేదు
నేనే ఓడిపోయి నన్ను ఆమెకి ఇచ్చేశాను
ఓడిపోవడంలోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను
చంచల నా
అంతరాత్మకు ఒక హృదయం ఎందుకూ!?
రెండు హృదయాలలైనా ఆమె మోయగలదు
దయాహృదయులంతా ఆడవారై ఉంటారెందుకూ?
అందుకే నా హృదయాన్ని ఆమెకిచ్చేసి వచ్చాను
బండలాంటి మనిషిలో సున్నితమైనదేదీ ఉంచకూడదు!
హృదయం లేకపోతే
ఎలా బతకగలుగుతావు అని అంటారేమో,
మీకు కనబడుతున్నది
నా దేహం మాత్రమే
నిజానికి నేను జీవిస్తున్నది
ఆమెలోనే!
నది కవిత extraordinary expression. మిగతా రెండు బాగున్నాయి అభినందనలు మిత్రమా
Thank you very much