మనం మనుషులతో సహా దేన్నైనా మామూలుగా దంద్వాలలో విలువ కట్టడం చేస్తూ ఉంటాం. మంచి, చెడు, తప్పు, ఒప్పు లాంటి తీర్పులు చెబుతూ ఉంటాం. అలాగే లింగపరంగా మనుషులను ఆడ, మగ అనే ద్వంద్వంలో వర్గీకరించడం కూడా పరిపాటిగా వస్తోంది.
కానీ మొదట ఒకే ముద్దగా ఉన్న చిన్న మానవ సమూహం సుదీర్ఘకాల చరిత్ర గతిలో ఎంతెంత విస్తరించి, ఎన్నెన్ని శకలాలుగా విభజితమైపోయిందో ఇదివరకెప్పుడో మనకు తెలిసి వచ్చింది. ఇటీవల కాలంలోనైతే అది మరింత వైవిధ్యపూరితంగానూ, వైరుధ్య పూరితంగానూ మన అనుభవంలోకి వస్తోంది.మరి ఈనాటి సామాజిక సందర్భంలో మనుషులను సామాజికంగా గాని, లింగపరంగా గాని కేవలం ద్వంద్వాలలో విలువ కట్టడం సరైనది అవుతుందా? ముఖ్యంగా “రెయిన్ బో -లైంగిక వైవిధ్యాలు” అనే ఈ విరసం పుస్తకాన్ని చదివితే సామాజిక వాస్తవికతను కేవలం ద్వంద్వాలలో చూడడం సరైనదసలే కాదని నిస్సందేహంగా చెప్పవచ్చును.
ఇంతకీ లైంగిక వైవిధ్యాలు, భిన్న లింగ అస్తిత్వాలు అనగానే మనకు స్థానిక హిజ్రాలే గుర్తొస్తారు. కానీ ఈ పాటికే గ్లోబల్ స్థాయిలో లెస్పియన్,గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్,క్వీర్ (ఎల్ జి బి టి క్యు ) మొదలైన రకరకాల లింగ అస్తిత్వాలు ఉనికిలో ఉన్నాయి. అయితే హిజ్రాలు,ఎల్ జి బి టి క్యూ ల మధ్య, వారి సాంస్కృతిక నిర్మాణాల మధ్య సంబంధాలను, రాజకీయ వ్యత్యాసాలను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అయితే భారతీయ స్థానిక సంస్కృతులన్నీ ప్రపంచాన్ని కేవలం లింగం/ అంగం వైపు నుండే చూస్తాయి, కానీ లైంగికతా కోణం నుండి చూడవు. నిజానికి లింగం, లైంగికత అనేవి ఒకటి కావు. అవి రెండూ వేర్వేరు. లింగ అస్తిత్వం సామాజికపరమైనది కాగా, లైంగికత జీవశాస్త్ర సంబంధమైనది.
సైన్స్ ప్రకారం చూస్తే ఆడ, మగ శరీరాలు కలిగి ఉండడానికి మూలకారణం జీవశాస్త్రపరమైనది. మానవుల్లోను, జంతువుల్లోనూ ఉండే క్రోమోజోముల్లోని జన్యువుల(genes)లో ఆ మూలకారణం ఉంటుంది. మగ జీవి నుండి ఒక వీర్య కణం, ఆడ జీవి నుండి ఒక అండం(గుడ్డు) కలయికతో ఒక శిశువు పుట్టుక ప్రారంభం అవుతుంది. తండ్రి నుండి విడుదలయ్యే వీర్యకణంలో 23 క్రోమోజోముల సముదాయం, అలాగే తల్లి నుండి విడుదలయ్యే అండంలో కూడా 23 క్రోమోజోముల సముదాయం ఉంటాయి. తల్లి అండంలో ఒకే రకమైన, అంటే ‘ఎక్స్’ క్రోమోజోములు ఉంటాయి. కానీ తండ్రి వీర్యం లో ‘ఎక్స్’, ‘వై ‘ అనే రెండు రకాలైన క్రోమోజోములు గల వీర్యకణాలు ఉంటాయి. ఆ విధంగా ఒక శిశువు తల్లిదండ్రుల నుండి 23 జతల క్రోమోజోములను పొందుతుంది. వాటిలో 23వ జత లోని క్రోమోజోములను బట్టే ఆ శిశువు ఆడ లేదా మగ అని నిర్ధారణ అవుతుంది. ఒకవేళ తండ్రి నుండి ఉత్పత్తి అయిన వీర్యకణంలోని ‘ఎక్స్’ క్రోమోజోము తల్లి అండంతో కలిస్తే, పుట్టే శిశువు క్రోమోజోములపరంగా ఆడ శిశువు అవుతుంది. లేదా తండ్రి వీర్యకణంలోని ‘వై’ క్రోమోజోము తల్లి అండంతో కలిస్తే, పుట్టే శిశువు క్రోమోజోములపరంగా మగ శిశువు అవుతుంది. అంటే,పుట్టే శిశువు లింగాన్ని (ఆడా,మగా అని) నిర్ధారించేది (అసంకల్పితంగా నైనా ) తండ్రె అవుతాడు. ఆ విధంగా ఆడ వ్యక్తిలో 23వ జతలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్ లే ఉంటాయి. మగ వ్యక్తిలో
మాత్రం 23 వ జతలో ‘ఎక్స్ -వై’ అనే క్రోమోజోములు ఉంటాయి. ఒక్కోసారి అండంలో గాని, వీర్యంలో గాని ఒకదానికి బదులు రెండు క్రోమోజోములు ఉంటే, పుట్టే శిశువుకు మూడు క్రోమోజోములు వస్తాయి. అవి XXY లేదా XYY గా ఉంటాయి. అలా పుట్టే శిశువులను ‘ఇంటర్ సెక్స్’ అంటారు.
ఒక్కొక్కసారి క్రోమోజోములపరంగా పురుషుడైన వ్యక్తి వీర్యాన్ని ఉత్పత్తి చేయకపోవచ్చు. Y క్రోమోజోమ్ లోనే వృషణాలు పెరగడానికి అవసరమైన జన్యు సమాచారం ఉంటుంది. కొంతమంది పురుషులలోని Y క్రోమోజోములో జన్యు సమాచారం మారిపోతుంది. దాని కారణంగా మగ శిశువులో వృషణాలు పెరగకపోవచ్చు. లేదా వృషణాలు పెరిగినా వీర్యం ఉత్పత్తి కాకపోవచ్చు. కాబట్టి డెలివరీ అయినప్పుడు వృషణాలు లేని అటువంటి శిశువును చూసి డాక్టర్లు ‘ఇంటర్ సెక్స్’ అని నిర్ధారిస్తారు. ఒకవేళ వృషణాలు కనబడితే మగ శిశువు అని నిర్ధారిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ క్రోమోజోములపరంగా శిశువు మగ అయినప్పటికీ, వీర్యం ఉత్పత్తి పరంగా ‘మగ’ కాదు. అంటే, మామూలు పరిశీలనతో డాక్టర్లు ఒక శిశువును ఆడ, మగ లేదా ఇంటర్ సెక్స్ అని నిర్ధారించినప్పటికీ, వాస్తవానికి తల్లి గర్భంలో జరిగే సంక్లిష్ట పరిణామాల వల్ల పెరుగుతున్న శిశువుకు ఆకృతినిచ్చే అంశాలు అనేకం ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి.
అసలు అండం, వీర్యం కలయికతో ఏర్పడే ఏక కణం ముఖ్యంగా పాలిచ్చే జీవులలో అనేక కణాలుగా విభజించబడి, క్రోమోజోముల నుండి వచ్చే జన్యు సమాచారంతో శిశువు రూపుదాలుస్తుంది. అంతేగాకుండా, కణంలోని అణువులు, తల్లి గర్భం నుండి వచ్చే హార్మోన్లు, ఇతర కారకాలన్నీ శిశువులో కొత్త జీవ పదార్థాలను తయారుచేస్తాయి. వీటిలో ఏదో ఒకదానిలో ఎక్కడైనా మార్పు జరిగితే పుట్టే శిశువు ఇంటర్ సెక్స్ గా ఉండవచ్చు. లేదా బైటికి చూడడానికి ఆడగానో, మగగానో కనిపించవచ్చు.
ఇలా రకరకాల అంశాలు క్రోమోజోముల లోపల, బయటా ఉండి శిశువు లైంగిక ధోరణి అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. మొత్తంగా సంక్షిప్తంగా చెప్పాలంటే– లింగం అంటే శిశువుల శరీరాలను బాహ్యంగా ఆడ లేదా మగగా చూడడం కాదు. బైటికి కనిపించే లింగానికి, అందుకు మూల కారణమయ్యే క్రోమోజోములకు సంబంధించిన లింగానికి తేడా ఉండవచ్చు. అది మళ్లీ వీర్యం ఉత్పత్తి పరంగా నిర్ధారించిన లింగానికి భిన్నంగా ఉండొచ్చు. అది హార్మోన్ల పనితీరు వల్ల వ్యక్తుల్లో కనిపించే లైంగిక లక్షణాలకు (గడ్డం,రొమ్ములు పెరగడం వంటివి) భిన్నంగా కూడా ఉండొచ్చు. ఈ విధంగా జీవశాస్త్ర సంబంధమైన సెక్స్ వెనక ఉండే విభిన్న కారణాల వల్ల, తల్లి గర్భంలో జరిగే సంక్లిష్టమైన అభివృద్ధి ప్రక్రియ వల్ల వ్యక్తులలో అనేక లింగ వైవిధ్యాలు ఏర్పడతాయి.
*ట్రాన్స్ జెండర్ వ్యక్తులు : ఇంటర్ సెక్స్ పిల్లలు తమకు కేటాయించిన లింగంతో సౌకర్యంగా పెరిగితే, వారిని ‘సిన్ జెండర్’ వ్యక్తులని పిలుస్తారు. ఒకవేళ ఇంటర్ సెక్స్ పిల్లలు తమకు కేటాయించిన లింగంతో సౌకర్యంగా ఉండకుండా పెరిగితే, వారిని ‘ట్రాన్స్ జెండర్’ వ్యక్తులని పిలుస్తారు.
కొంతమంది ట్రాన్స్ జెండర్ పిల్లలు చిన్న వయసులో, మరికొందరు యుక్త వయసులో, ఇంకా మరికొందరైతే జీవితంలో చాలా కాలం తర్వాత తమకు కేటాయించిన లింగానికి భిన్నమైన లింగంతో తమను తాము గుర్తించుకుంటారు. శరీరం ఉన్న స్థితికి, శరీరం గురించి మెదడు ఊహించే స్థితికి మధ్య ఉన్న ఈ అసమతుల్యతనే ‘జెండర్ ఐడెంటిటీ డిస్పోరియా’ అంటారు. జన్యు వైవిధ్యం వల్ల, తల్లి గర్భంలోని వాతావరణం వల్ల శరీరం, ఆ శరీర అనుభూతికి సంబంధించిన మెదడు సాధారణ పద్ధతికి భిన్నమైన మార్గాల్లో అభివృద్ధి చెందడం వల్ల ఈ అసమతుల్యత రావచ్చు. మనం ఈ డిస్పోరియాను సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు అనేక సమస్యలు ఎదురయి వారి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.
ఒక వ్యక్తి తనను తాను గుర్తించుకునే జెండర్ తో కాక తన శరీరం సూచించే జెండర్ తో గుర్తించబడితే, అది ఆ ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు తీవ్రమైన అసౌకర్యాన్ని, నిరాశను కలగజేస్తుంది. ఇదే డిస్పోరియాలోని కీలకమైన సామాజిక అంశం. ఈ సామాజిక డిస్పోరియాను తగ్గించాలంటే, మనం జెండర్ ను చూసే విధానం మారాలి. ట్రాన్స్ జెండర్ వ్యక్తులు తమను తాము ఏ జెండర్ తో గుర్తించుకుంటున్నారో, అ జెండర్ నే మనం స్వీకరించి గౌరవించాలి. అప్పుడు మాత్రమే వారు ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించగలుగుతారు.
కానీ మనది బ్రాహ్మణీయ పిత్ర స్వామిక సమాజం. అది ట్రాన్స్ జెండర్ వ్యక్తులను సహజంగా చూడదు. మన వ్యవస్థ ప్రజలందరికీ కులం, లింగం ఆధారంగా శ్రమ రూపాలను సూచించినట్లే, హిజ్రాలకు కూడా భిక్షాటన, సెక్స్ వర్క్ అనే అవమానకరమైన శ్రమరూపాలను కేటాయించింది. ఇలా హిజ్రాల జీవితాలను ఒక చట్రంలో బిగించి నిర్బంధించడమే మన సామాజిక రాజకీయార్థిక వ్యవస్థ లోని భూస్వామ్యపరమైన అంశం. వలసవాదం కూడా హిజ్రాలను నేరస్థ తెగలుగా వర్గీకరించి, వారు నేరం చేస్తే కఠినాతి కఠిన శిక్షలను సూచించింది.
అదే ట్రాన్స్ వ్యతిరేక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేటి మన స్వతంత్ర భారతీయ వ్యవస్థ కూడా ట్రాన్స్ జెండర్ వ్యక్తులతో అలాగే వ్యవహరిస్తోంది. ‘ప్రకృతి నియమానికి విరుద్ధంగా’ సెక్స్ ను నిషేధించిన 377 సెక్షన్ ను నేటికీ అమలుపరుస్తూ సామాజిక అణిచివేత చర్యలకు పాల్పడుతోంది. చాలా మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎదుర్కొంటున్న వివక్ష గురించిన అనుభవాలు నేటి స్త్రీవాద చర్చకు మరింత పదును పెడతాయి. ఈ ఉమ్మడి సంభాషణనే ‘ట్రాన్స్ ఫెమినిజం’ అంటారు. మన సమాజాన్ని, అధికారాన్ని అన్ని కోణాలలో అర్థం చేసుకునే విధానం మారడానికి ఈ ట్రాన్స్ జెండర్ సామాజిక దృక్పథం చాలా దోహదపడుతుంది.
మళ్లీ మనం హిజ్రాల విషయం దగ్గరకు వద్దాం. చాలామంది హిజ్రాలు ఇంటర్ సెక్స్ కాదు. వారు ట్రాన్స్ జెండర్ పురుషులో లేదా ట్రాన్స్ జెండర్ స్త్రీ లో అయి ఉంటారు. అంటే, హిజ్రా సమూహం అనేది ట్రాన్స్ జెండర్, ఇంటర్ సెక్స్ సమూహాల సభ్యులు అధికారికంగా కలిసి జీవించే, పరస్పరం సహకరించుకునే సాంస్కృతిక వ్యవస్థ. వారు తమకు( వైద్యులు/ సమాజంచే) కేటాయించబడిన లింగాన్ని కాదని, నచ్చిన మరో లింగాన్ని స్వీకరిస్తారు. ఉదాహరణకు- ట్రాన్స్ జెండర్ మహిళలైతే పుట్టినప్పుడు వైద్యులు /సమాజం ద్వారా కేటాయించబడిన లింగంతో బలమైన శారీరక సామాజిక అసౌకర్యాన్ని కలిగి ఉండి, తర్వాతి జీవిత క్రమంలో తమను తాము స్త్రీలుగా గుర్తుంచుకునేవారే. వారిని కర్ణాటకలో మంగళముఖి అని,తమిళంలో తిరునంగై/ అరవాణి అని, హిందీలో కిన్నర్ అని పిలుస్తారు. తమిళనాడులో పెరియారైట్ ఆత్మగౌరవ ఉద్యమం ద్వారా ట్రాన్స్ మహిళల కోసం ‘తిరుణంబి’ అనే గౌరవప్రదమైన పదం సృష్టించబడింది.
అలాగే ట్రాన్స్ జెండర్ పురుషులు కూడా పుట్టినప్పుడు వైద్యులు, సమాజం ద్వారా అమ్మాయిలుగా గుర్తించబడి, ఆ తర్వాత తమను తాము పురుషులుగా గుర్తించుకునే వారే. ట్రాన్స్ పురుషులను సూచించే పదాలు మాత్రం స్థానిక భారతీయ భాషలలో చాలా తక్కువే ఉన్నాయి. కన్నడలో ‘గండ బాసక’, తెలుగులో ‘శిఖండి’ వంటి పదాలు ఉన్నప్పటికీ, అవి అంత గౌరవప్రదమైన పదాలు కావు.
ఇంతకుముందు చెప్పినట్టుగా హిజ్రా వ్యవస్థలో ట్రాన్స్ జెండర్, ఇంటర్ సెక్స్ సమూహాల సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ కలిసి జీవిస్తారు. తమకు కేటాయించబడిన లింగాన్ని కాదని, నచ్చిన జెండర్ ను స్వీకరిస్తారు. అందుకు అనుగుణంగా కొందరు వైద్య పరమైన శస్త్ర చికిత్స చేయించుకుంటారు. వారు తమ సొంత కుటుంబాల నుండి, సమాజం నుండి తీవ్రమైన వెలివేతను, హింసను ఎదుర్కొంటారు. సహవిద్య నుండి, అన్ని రకాల సామాజిక కార్యకలాపాల నుండి బహిష్కరించబడి, నివాసం,ఆరోగ్య సంరక్షణ వంటి విషయంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటారు. చివరికి తమ జీవనోపాధి కోసం వారు భిక్షాటనపై, సెక్స్ వర్క్ పై ఆధారపడుతూ ఉండటం వల్ల కాలక్రమంలో అది వ్యవస్థీకృతమైపోయింది.
అయితే హిజ్రా వ్యవస్థలో నివసించని ట్రాన్స్ జెండర్ స్త్రీలు, ఇంటర్ సెక్స్ వ్యక్తులు కూడా చాలామందే ఉంటారు. కొంతమంది ట్రాన్స్ జెండర్ మహిళలైతే వారి స్త్రీలింగ గుర్తింపుకు అనుగుణంగా తమ శరీరాలను మార్చుకోవడానికి ఇష్టపడరు. ఎటువంటి శస్త్ర చికిత్సలు కూడా చేసుకోరు. అటువంటివారిని భారతదేశంలో ‘కోతీ’ అని పిలుస్తారు. వారు గనుక సగటు ఆడవాళ్ళ దుస్తులు ధరించి జీవిస్తే, వారిని ‘సట్ల కోతీ’ అని పిలుస్తారు. ఒకవేళ వారు ప్యాంటు, షర్ట్ ధరించి ఉంటే, వారిని ‘పంతి సట్ల కోతీ’ అని పిలుస్తారు. ఇటువంటి భారతీయ కోతీలనే ‘ఇంగ్లీష్ కోతీ’లని పిలుస్తారు. వారిని ఇంగ్లీషులో ‘గే’ లంటారు.
కోతీ-హిజ్రా ప్రాపంచిక దృష్టిలో పురుషులందరూ పురుష స్వలింగ సంపర్కులు గాని, ద్విలింగ సంపర్కులు (స్వలింగంతో పాటు వ్యతిరేక లింగం పట్ల కూడా ఆకర్షితులయ్యే వాళ్ళు) గాని అయి ఉంటారు. స్వలింగం పట్ల ఆకర్షణను సూచించడానికి ‘సమలైంగిక’ అనే పదం ఇటీవల వాడుకలోకి వచ్చినప్పటికీ, అది కృత్రిమ పదంగానే వాడబడుతోంది తప్ప సరైన పదం కాదు.
అలాగే ఇతర స్త్రీల పట్ల లైంగిక ఆసక్తి ఉన్న స్త్రీలైన లెస్బియన్ లకు కూడా మన భారతీయ భాషలలో స్థానిక పదాలు లేవు. మనది ప్రధానంగా పితృ స్వామిక, కుల సమాజం. ఈ సామాజిక వ్యవస్థ స్వకుల వివాహాలకు సహకరించేలా మహిళలను నియంత్రిస్తూ, కులాన్ని, ఆస్తిని సంరక్షిస్తుంది. స్త్రీలకు తమదైన లైంగికాసక్తులు, లైంగిక ప్రాధాన్యతలు ఉంటాయని అంగీకరించదు సరికదా కనీసం ఊహించను కూడా ఊహించదు.
అయితే విభిన్న లింగ వైవిధ్యాలను సూచించడానికి ఇంగ్లీషులో LGBTQ అనే సంక్షిప్త పదాన్ని ఇటీవలి గతం నుండే వాడుతున్నారు. కాని వేర్వేరు లింగ వైవిధ్యాలతో కూడిన వ్యక్తులను పిలవడానికి మనదేశంలో ఇంగ్లీషులో కంటే ఎక్కువ పదసంపద ఉందనే చెప్పవచ్చు. (పైన వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు పదాలు ఉన్నాయని పేర్కొన్న విషయం గమనించండి).
అంతేగాకుండా, చాలా పాశ్చాత్య దేశాలలో లేని విధంగా, మనదేశంలోని హిజ్రా సమూహం ట్రాన్స్ జెండర్, ఇంటర్ సెక్స్ కమ్యూనిటీల సమిష్టి నిర్మాణాన్ని, వాటి దృగ్గోచర అస్తిత్వాన్ని సృష్టించడం, వాటి పట్ల కొనసాగుతున్న హింస- వివక్షతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాలను చారిత్రక ప్రాధాన్యత గల అంశాలుగా పేర్కొనవచ్చును.
ఎందుకంటే– హిజ్రాలు పితృస్వామ్యాన్ని, కుల-మత- వర్గ సామాజిక నిబంధనలను ధిక్కరిస్తారు. వాళ్ళు ఒక కమ్యూన్ లో సమిష్టిగా జీవిస్తూ, శ్రమ చేస్తూ వారి కులవర్గ వారసత్వాన్ని తెంచి వేసుకుంటారు. అలాంటి సామూహిక జీవన వ్యవస్థ వారికి ఒక ప్రత్యామ్నాయ కుటుంబ వ్యవస్థను అందిస్తుంది.
*మరి జెండర్ నిర్మూలన సాధ్యమా?
చాలామంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు హిజ్రా సమాజం వెలుపలే నివసిస్తారు. వారి జీవితాలు ప్రాథమికంగా రెండు విషయాల ద్వారా ప్రభావితం అవుతాయి. ఒకటి-కుటుంబ అంగీకారం లేదా తిరస్కారం; రెండవది-అందరినీ ప్రభావితం చేసే కులం, వర్గం,వైకల్యం,ప్రాంతం, మతం వంటి నిర్మాణాలు. పెళ్లిళ్లు అయిపోయో, లేదా మరే కారణాల చేతనో ట్రాన్స్ జెండర్ స్త్రీలు తమ జెండర్ మారలేరు. హిజ్రా వ్యవస్థలోనూ చేరలేరు. కుటుంబాలలో పెరిగే ఇంటర్ సెక్స్ పిల్లలను ఒకవేళ వారి కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని వారిని అంగీకరించినప్పటికీ, సమాజం-
వైద్యులు వంటి ఇతర వ్యవస్థల వల్ల వారికి ఇబ్బందులు ఎన్నో ఎదురవుతున్నాయి. ఎందుకంటే-లోకం అటు మగ శరీరాన్నో, లేదా ఆడ శరీరాన్నో కలిగి ఉండాలని, అదే సహజమని భావిస్తోంది.
ట్రాన్స్ జెండర్ పురుషులు కూడా సమాజంలో కలవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సమాజం దృష్టిలో వాళ్ళు స్త్రీలు. కాని వారు తమను తాము పురుషులుగా గుర్తించుకుంటారు. కనుక వారు సామాజికంగా పురుషులుగా మారడం చాలా కష్టం. ఫలితంగా మన పితృస్వామిక వ్యవస్థ ట్రాన్స్ పురుషులను స్త్రీలుగా,బాలికలుగా చూస్తూ వారిని నియంత్రణలో ఉంచుకుంటూ పితృస్వామ్యాన్ని, కుల స్వచ్ఛతను కాపాడుకుంటుంది. అందువల్ల ట్రాన్స్ పురుషులు ట్రాన్స్ మహిళల వలె, హిజ్రాల వలె ఇళ్ల వెలుపల కనిపించరు. ఒకవేళ ఇళ్ళను దాటి వచ్చినప్పటికీ వారు సమూహాన్ని నిర్మించుకొని, సంబంధాలను ఏర్పరుచుకోవడం అత్యంత అరుదుగా జరుగుతుంది.
మనదేశంలోనే కాదు, అత్యంత అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం ట్రాన్స్ జెండర్ వ్యక్తుల పట్ల, స్వలింగ సంపర్కుల పట్ల వ్యతిరేకత బలంగా వుంది. పెట్టుబడిదారీ సమాజమే అయినప్పటికీ, అక్కడ మహిళల పట్ల కూడా తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి. మనదేశంలో వలె స్త్రీలకు శారీరక శిక్షల వంటి భూస్వామిక శిక్షలు వేయరు. కానీ అక్కడి పురుషుల పితృ స్వామిక ప్రయోజనాలకు అనుగుణంగా మహిళలకు ‘ఎంపిక’ స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అమెరికాలో పెట్టుబడిదారీ పితృస్వామ్యం ఉంటే, మన భారతదేశంలో భూస్వామిక పితృస్వామ్యం ఉంది.
ఏదేమైనప్పటికీ, జెండర్ న్యాయం కోసం జరిగే అన్ని ఉద్యమాలు మానవ ప్రపంచంలో రెండు సగాలనే /ద్వంద్వాలనే గుర్తిస్తాయి. పురుషులు, స్త్రీలు కలిసి ఉన్న ప్రపంచమే సహజమైనది అని భావిస్తాయి.
*మరి అటువంటప్పుడు అనేక రకాల లింగ వైవిధ్యాలను, లైంగిక వైవిధ్యాలను మనం ఎలా చూడాలి? వాటిని ఎలా కాపాడుకోవాలి?
కుల వివక్ష, కుల అణచివేతలు అంతరించాలంటే కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, అప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని అంబేద్కర్ చెప్పినట్టుగా –జెండర్ వివక్ష విషయంలోనూ మనం అదే విధంగా చెప్పగలగాలి. ఎందుకంటే- చాలా మంది అనుకుంటున్నట్టుగా లింగం/జెండర్ జీవసంబంధమైనది కాదు. కులం లాగే జెండర్ కూడా సామాజిక నిర్మాణమే. శారీరక చిహ్నమైన లింగం ఆధారంగా మనుషులకు భిన్నమైన మేధో సామర్థ్యాలను, వ్యక్తిత్వాలను ఆపాదించడం చాలా అశాస్త్రీయం. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలు శారీరక లింగాల మధ్య ఎటువంటి తేడాలను కనుగొనలేదు.
కాబట్టి వర్గ నిర్మూలన లాగా, కుల నిర్మూలన లాగా జెండర్ నిర్మూలన కూడా అసాధ్యం కాదు. కాకపోతే మనం లింగానికి సంబంధించిన ద్వంద్వ దృష్టి కోణంలోంచి బయటపడి, లైంగిక వైవిధ్యాలను గుర్తించి స్వీకరించగలగాలి. సామాజికపరమైన అన్ని జెండర్ వివక్షల నుండి విముక్తి చెంది, లైంగిక వైవిధ్యాలను కాపాడుకుంటూ భూస్వామ్య, పితృ స్వామిక, వర్గ వైరుధ్యాలను రూపుమాపే పోరాటాలను నిర్వహించాలి.
*********************-************