2025 మొదటి వారంలో బస్తర్‌లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆయన బయటకు తీసిన వార్తలు ప్రభుత్వ దర్యాప్తుకు దారితీసిన ఐదు నెలల తర్వాత, ఆయన మృతదేహం రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన స్థలంలోని సెప్టిక్ ట్యాంక్‌లో దొరికింది.
అవినీతిని బహిర్గతం చేసినందుకు జరిగిన చంద్రార్కర్ హత్య, సహజంగానే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టుల పోరాటంతో ఎంత సన్నిహితంగా ముడిపడి ఉందో కొద్ది మందికే తెలుసు.
చంద్రాకర్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, 120 కోట్ల రూపాయల ఖర్చుతో , వేసిన శిథిలమైన ఆ రోడ్డును చూడడానికి వెళ్ళిన మరొక స్థానిక జర్నలిస్ట్ వికాస్ తివారీ ఆ సంబంధం సారాంశాన్ని గురించి కెమెరా ముందు ఒక్క ముక్కలో చెప్పాడు.
“మావోయిస్టులపై అంతిమ యుద్ధం” అని గత సంవత్సరం గృహ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, “నాలుగు దశాబ్దాలుగా మావోయిజం పట్టులో ఉన్న బస్తర్‌కు 2026 మార్చి 31 నాటికి విముక్తి లభిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా” అన్నాడు.
“అది ఎలా జరుగుతుంది?” అని వికాస్ తివారీ తనకు తాను ప్రశ్న వేసుకొని, “ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా” అని సమాధానం చెప్పాడు. ప్రాథమికంగా అతను రాజ్య వాదనను ఉదహరిస్తున్నాడు: “ఆ ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలు గ్రామానికి చేరుకునేలా రహదారుల నెట్‌వర్క్ ఏర్పడినప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకనే రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం”
“కానీ బహుశా ఒక్క బస్తర్‌లోనే ఇసుక, కంకర, తారుతో పాటు జవాన్‌ల రక్తంతో, ఇక ఇప్పుడు జర్నలిస్టుల రక్తంతో కూడా రోడ్లు వేస్తారు” అని వికాస్ తివారీ అన్నారు.
అభివృద్ధి, భద్రత అనే ముఖచిత్రం వెనుక రాజ్యం దూకుడుగా చేపట్టిన రోడ్డు నిర్మాణ కేంపెయిన్ దురాశతో నడుస్తోందని తివారీ వ్యాఖ్యానించారు. రోడ్డు వేసేవారికి భద్రత కల్పించడం కోసం నియమించిన పోలీసు సిబ్బంది, అవినీతిని బహిరంగం చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన పాత్రికేయులు, ఎవరి అభివృద్ధి కోసమని రోడ్లను వేస్తున్నారో వాటిని కోరుకోని అనేక గ్రామాల ప్రజల ప్రయోజనాన్ని పణంగా పెట్టి రాజకీయ నాయకులు-బిల్డర్‌లు-కాంట్రాక్టర్‌లు లాభం పొందుతున్నారు .
రహదారుల అనుసంధానా న్ని ప్రజలు కోరుకునే ఇతర ప్రాంతాలలోలాగా కాకుండా, బస్తర్‌లో, అడవి గుండా రోడ్డు వేస్తారంటే చాలా మంది ఆదివాసీ గ్రామస్థులు భయపడుతున్నారు; ఎందుకంటే ఆ వెనుకే సెక్యూరిటీ క్యాంపు వస్తుంది; రాజ్యానికీ, మావోయిస్టులకూ మధ్య అనివార్యంగా యుద్ధం తీవ్రతరమవుతుంది. మావోయిస్టులను తరిమికొట్టడం వెనుక రాజ్యానికున్న అంతిమ లక్ష్యం తమ భూములను ధ్వంసం చేసే గనుల తవ్వకం కోసం ఇవ్వడమేనని చాలా మంది భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలో క్రితం సంవత్సరం తీవ్రస్థాయిలో రక్తపాతం జరిగింది. 2024లో 217 మంది మావోయిస్టులను హతమార్చామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు – మావోయిస్టు నిరోధక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఒక సంవత్సర కాలంలో జరిగిన అత్యధిక మరణాల సంఖ్య ఇదే.
డిసెంబరులో, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు వచ్చినప్పుడు 2026 మార్చి నాటికి తిరుగుబాటును అంతం చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని షా విజయోత్సాహంతో పునరుద్ఘాటించాడు.
ఏ ఘర్షణలోనైనా గడువులను నిర్ణయించడం విపత్తును సృష్టించడమే. స్క్రోల్ రిపోర్టింగ్ చూపిన విధంగా ఇది అడ్డదారులకు, తప్పుడు పద్ధతులకు దారితీస్తుంది. కొన్ని పెద్ద సైనిక చర్యలలో భద్రతా బలగాలు మావోయిస్టు నాయకత్వాన్ని చాలా ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగలిగాయి. అయితే, అనేక ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు క్రింది స్థాయి కార్యకర్తలను, నిరాయుధులైన పౌరులను చంపి వారిని రివార్డు వున్న మావోయిస్టులుగా చూపినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల జరిగిన ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో నలుగురు పిల్లలు గాయపడిన ఘటన గురించి స్క్రోల్ లో మాలినీ సుబ్రమణ్యం రాసిన క్షేత్రస్థాయి నివేదిక ద్వారా- జరిగిన ఘటనలు ఎంత భయంకరమయినవో బయటపడింది. రాజ్యం దృష్టి నుండి చూసినా కూడా ఈ ఆతురత ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
మేం అక్టోబరులో రాసినట్లుగా, స్థానిక ఆదివాసీలను జిల్లా రిజర్వ్ గార్డులుగా పోలీసు బలగాలలో నియమించడం ద్వారా రాజ్యం క్రమంగా యుద్ధంలో ప్రయోజనాన్ని పొందింది. భూభాగం, సంస్కృతికి తెలియని దూర ప్రాంతాల నుండి వచ్చిన పారామిలిటరీ దళాల మాదిరిగా కాకుండా, ఈ స్థానికులు అడవిలో నివసించినవారు; మావోయిస్టుల మార్గాలు తెలిసినవారు. గెరిల్లా యుద్ధాన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు.
చివరకు, స్థానిక జనాభా ఏ వైపు నిలబడుతుంది అనేది ఏ తిరుగుబాటులోనైనా ముఖ్యమైన అంశం. ఆదివాసీలలో ఒక వర్గం ఇప్పుడు రాజ్యం తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉందని డిఆర్‌జిల నియామకం సూచిస్తోంది. కానీ, రాజ్యం వారిని నిరాయుధులపైన విచక్షణారహిత హింసాకాండకు ప్రేరేపించినట్లయితే, అది క్రమంగా సాధించిన లాభాలను పోగొట్టుకునే ప్రమాదం ఉంది.
అంతిమంగా, బస్తర్‌లో పెచ్చరిల్లుతున్న హింస ఆదివాసీ జీవితాలను తినేస్తోంది.
రోడ్డు ప్రాజెక్ట్ గురించి నిజాన్ని వెలికితీసినందుకు ముఖేష్ చంద్రార్కర్‌ను హత్య చేసిన వారంలోనే, భద్రతా వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేయడంతో అందులో వున్న ఎనిమిది మంది డిఆర్‌జిలు, ఒక డ్రైవర్ మరణించారు. ఆ ఆదివాసీ పోలీసులు ఐదుగురు ‘అనుమానిత’ మావోయిస్టులను, ఒక ఆదివాసీని చంపిన సైనిక చర్య నుండి తిరిగి వస్తున్నారు – “అనుమానితులు” అని ఎందుకంటున్నామంటే క్షేత్ర స్థాయి రిపోర్టింగ్ మాత్రమే వారు ఎవరన్నది చెప్పగలదు.
బస్తర్‌లోని క్షేత్ర స్థాయి నుండి రిపోర్టింగ్ చేయడాన్ని జాతీయ మీడియా దాదాపు పూర్తిగా వదిలేయడం ఒక విషాదం. ప్రధాన వార్తాపత్రికలలో చాలావరకు సమాచారం ఎక్కువగా పోలీసుల పత్రికా ప్రకటనలపై ఆధారపడి ఉంటాయి. బస్తర్ యుద్ధం గురించి దేశం ఇక ఏమాత్రం పట్టించుకుంటున్నట్లు లేదు.
కానీ చంద్రార్కర్ మరణం చూపినట్లుగా, సాహసికులైన స్థానిక రిపోర్టర్లు ప్రాణాలను పణంగా పెట్టి, తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నారు.
https://scroll.in/article/1077830/the-murder-of-a-journalist-and-the-forgotten-maoist-war-in-bastar