గత కొన్ని సంవత్సరాలుగా, ఆదివాసీల ఐక్యత, పోరాటం, నిరంతరం పెరుగుతున్న బలం కారణంగా, వారి ప్రయోజనం కోసం అనేక చట్టాలు రూపొందాయి, ప్రభుత్వాలు కూడా వారికి రక్షణ కల్పించాలని ప్రకటిస్తూ వుంటాయి, కానీ నిజంగా ఈ ప్రయత్నాల ద్వారా ఆదివాసీలకు ఏదైనా మంచి జరిగిందా? పర్యాటకం కోసం పరిరక్షించబడుతున్న అటవీ ప్రాంతాలలో ఆదివాసీలు ఎంత సురక్షితంగా ఉన్నారు? భారతదేశంలో ఆదివాసీలు/మూల నివాసులకు అడవులతో ఉన్న సంబంధం సహ అస్తిత్వం సూత్రం పై ఆధారపడి ఉంది.

చారిత్రాత్మకంగా, అడవులు, అటవీ ప్రాంతాలు ఆదివాసీ తెగల సాంప్రదాయ నివాసంగా ఉండేవి. అయితే, జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘రిజర్వు ప్రాంతం’ అనే భావనతో వాటిని వారి సాంప్రదాయ నివాస స్థలాల నుండి తొలగించే పని సంవత్సరాలుగా కొనసాగుతోంది. 1865 లో భారత అటవీ చట్టం ద్వారా తీసుకువచ్చిన వలసరాజ్య అటవీ విధానం కారణంగా, అటవీ ప్రాంతంలో ఎక్కువ భాగం ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది, దీనివల్ల లక్షలాది అటవీ నివాసుల సాంప్రదాయ వాదనలు చట్టవ్యతిరేకం అయ్యాయి.

స్వతంత్ర భారత్ లో కూడా రక్షిత ప్రాంతాలను ప్రకటించే నియమాలను, విధానాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. భారత అటవీ చట్టం 1927లోని సెక్షన్ 4 నుంచి 20 వరకు సుదీర్ఘ ప్రక్రియ ద్వారా రక్షిత అడవిగా ప్రకటించాల్సి ఉంటుంది. కొన్ని భూములను రక్షిత అడవులుగా ప్రకటించాలన్న చట్టం కింద ప్రభుత్వం ప్రారంభ నోటిఫికేషన్ జారీ చేస్తుంది;  అటవీ నిర్వాహక అధికారి స్థానిక సముదాయపు అన్ని హక్కులను అంగీకరించడం లేదా తిరస్కరించడం ద్వారా వాటిని పరిష్కరిస్తాడు.

1927 భారత అటవీ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం గ్రామాలను గ్రామవనాలు అని పిలుస్తారు. ప్రభుత్వం గ్రామ సముదాయం ఉపయోగం కోసం ఏదైనా రిజర్వు అటవీ లేదా ఇతర భూమిని కేటాయించినప్పుడు, ఆ భూమిని గ్రామవన భూమిగా వర్గీకరిస్తారు. గ్రామ వనభూమి అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సమాజానికి చట్టబద్ధంగా బదిలీ చేసిన అడవి. కొన్ని సందర్భాల్లో గ్రామవన్ మరియు వన్‌గ్రామ్ అనే పదాలను పరస్పరం ఉపయోగిస్తారు, అయితే చట్టం ప్రకారం గ్రామవన్ ఒక చట్టపరమైన వర్గం, వన్‌గ్రామ్ ఒక పరిపాలనా వర్గం మాత్రమే.

2002లో, గోదా బర్మాన్ వి. భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు 1996 లో ఇచ్చిన తీర్పును అక్రమంగా ఉన్నవారిని “రిజర్వ్ ప్రాంతం”లోని అడవుల నుండి సకాలంలో తరలించాలని 2002లో అటవీ-పర్యావరణ మంత్రిత్వ శాఖ తప్పుగా అర్థం చేసుకుంది;అయితే సుప్రీంకోర్టు ఆక్రమణదారులను తరలించమని ఆదేశించలేదు. సుమారు 1.5 లక్షల హెక్టార్ల అటవీ భూములలో అటవీ నివాసులను తొలగించాలనే విషయాన్ని అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. 2002-2006 మధ్య కాలంలో సుమారు 3 లక్షల మంది గిరిజన కుటుంబాలను అటవీ ప్రాంతాల నుంచి బయటకు తీసుకొచ్చి కొత్తగా ‘రిజర్వ్డ్ ఏరియా’లను ఏర్పాటు చేశారు. కేవలం మధ్యప్రదేశ్ లోనే ఇప్పటివరకు 125 గ్రామాలను దహనం చేశారు.

అటవీ నివాసులను అటవీ ప్రాంతాల నుంచి బయటకు తీయడం అటవీ పరిరక్షణకు అవసరమని గతంలో భావించారు. పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు మొదటిసారిగా ‘అటవీ హక్కుల చట్టంలో’ మార్పులు చేశారు. అటవీ నివాసితులు అటవీ పర్యావరణంలో భాగం మాత్రమే కాదని, అటవీ సంరక్షణకు తప్పనిసరి అని ఈ చట్టం ప్రతిపాదనలో స్పష్టం చేసారు. ఆదివాసీ సముదాయానికి ఆహార భద్రత, జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశం ఈ చట్టంలో స్పష్టంగా ఉంది.

గతంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా ఆదివాసీలు, అటవీవాసులు తమ పూర్వీకుల భూములను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందని చట్టంలో అంగీకరించారు. ఆదివాసీలు, అటవీ నివాసుల యాజమాన్యం, యాక్సెస్ (అందుబాటు)హక్కుల చుట్టూ ఉన్న అభద్రతను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని సెక్షన్ 36 (ఎ) ప్రకారం, స్థానిక సముదాయంతో చర్చించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం సమీపంలోని ప్రాంతాలను ‘రక్షిత ప్రాంతాలు’ లేదా ‘రిజర్వేషన్ ప్రాంతాలు’ గా ప్రకటించవచ్చు. వన్య హక్కుల చట్టంలోని సెక్షన్ – 2 (డి) ప్రకారం, “వన్యభూమి” అంటే ఏదైనా అటవీ ప్రాంతంలో ఉన్న ఏదైనా భూమిని సూచిస్తుంది; ఇందులో “వర్గీకరించని అటవీ”, “అపరిమిత అటవీ” లేదా “అర్థమయ్యే అటవీ”, “రక్షిత అటవీ”, “కేటాయించిన అటవీ”, “అభయారణ్య”. “జాతీయ ఉద్యానవనం” కూడా ఉన్నాయి. అంటే, అన్ని రకాల అడవులలో అడవి నివాసుల సాంప్రదాయక హక్కులకు ప్రాప్యత ఉండేలా చూడాలి. కర్ణాటక లోని బి.ఆర్.టి. హిల్స్ అభయారణ్యం వన్యప్రాణుల, మానవుల సహజీవనానికి ఒక చక్కని ఉదాహరణ. వన్య ప్రాణులు మానవుల మధ్య సహజీవనం సాధ్యమేనని ప్రభుత్వం కూడా అంగీకరించింది.

2016లో ఆమోదించిన ‘పరిహార అటవీ నిధి’ (సిఎఎఫ్, క్యాంపా) లో అడవి నివాసుల భూమిపై మొక్కలు నాటడానికి ముందు వారిని సంప్రదించాలని పేర్కొంది. అయితే, అడవుల నిర్వహణ కోసం సముదాయ సమ్మతిపై అటవీ శాఖకు నమ్మకం లేదు; ఆదివాసీల పొలాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేబడుతుంది. అటవీ నివాసితులకు హక్కు పత్రం ఇచ్చిన లేదా అందుకు సంబంధించి తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న భూములు ఇవి. కాంపా నిధుల పంపిణీలో పెరుగుదల ఉన్నచోట, అటవీ నివాసితులు, అటవీ విభాగం లేదా ప్రభుత్వం మధ్య పరస్పర విరుద్ధమైన వాదనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇ-గ్రీన్ వాచ్ వెబ్‌సైట్ ప్రకారం, 10 రాష్ట్రాలలోని 2479 ప్రాంతాలలో వృక్షాలను నాటడం గురించి జరిగిన విశ్లేషణలో 70 శాతానికి పైగా వృక్షాలను నాటడం అటవీ రహిత భూమికి బదులుగా అటవీ భూమిపై జరిగిందని తెలుసింది.

వేగంగా పెరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల చోటుచేసుకుంటున్న నిర్వాసిత్వానికి పరిష్కారం చూపడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. వేగంగా పెరుగుతున్న స్థానభ్రంశం వల్ల దేశంలోని ఆదివాసీ సముదాయాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2016లో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 1950 నుంచి 1990 మధ్య కాలంలో దేశంలో మొత్తం నిర్వాసితులలో 40 శాతం అంటే 87 లక్షల మంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు.

అటవీ హక్కుల చట్టం, 2006 లోని సెక్షన్ 5 ప్రకారం, ఈ చట్టం కింద ఏదైనా అటవీ అధికారాలు ఉన్న ప్రాంతాలలో, గ్రామసభలు, గ్రామ స్థాయి సంస్థలు ఈ క్రింది వాటిని చేయగలవు.

(ఎ) వన్య జీవులు, అడవులు, జీవ వైవిధ్యం సంరక్షించడం.

(బి) నీటిపారుదల ప్రాంతాలు, నీటి వనరులు, ఇతర సున్నితమైన ప్రాంతాలకు తగినంతగా రక్షణ వుండేలా నిర్ధారించడం.

(సి) వారి సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని ప్రభావితం చేసే విధ్వంసక ప్రవర్తనల నుండి అటవీ ప్రాంతాలలో నివసించే షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల నివాసం సురక్షితంగా వున్నదని నిర్ధారించడం.

(డి) వన్యప్రాణులపై, అడవులపై, జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఏవైనా చర్యలను నివారించడానికి, సముదాయ అటవీ వనరులకు ప్రాప్యతను నియంత్రించడానికి గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు పాటించేలా చూడడం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం ఐదవ షెడ్యూల్ లోని నిబంధనలలో (సెక్షన్ 2) షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలలో రాష్ట్రాల కార్యనిర్వాహక శక్తిని సడలించారు. షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలనా వ్యవస్థలో గవర్నర్‌కు అత్యున్నత అధికారాలు ఇచ్చారు. ఐదవ షెడ్యూల్ లోని 5వ నిబంధన (1) గవర్నర్ కు శాసనసభ అధికారాన్ని ఇస్తుంది;  ఈ అధికారం రాజ్యాంగంలోని నిబంధనలన్నింటికీ అతీతంగా వుంటుంది. ఆదివాసీల నుంచి భూమి బదిలీ నియంత్రణ గవర్నర్‌కు ఉంటుంది.

ఇన్ని రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ, షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల జీవితాలు ఇంత అభద్రతలో ఉంటే, చట్టబద్ధమైన పాలన ఎక్కడ ఉంది?

వ్యాస రచయిత రాజ్ కుమార్ సిన్హా బర్గి ఆనకట్ట నిర్వాసితుల సంఘ సీనియర్ కార్యకర్త.

https://janjwar.com/janjwar-special/world-tribal-day-special-2024-from-2002-2006-till-now-about-three-lakh-tribal-families-have-been-driven-out-of-the-forest-and-new-reserved-areas-have-been-formed-so-far-125-villages-have-been-burnt-to-ashes-in-madhya-pradesh-alone-918847

Leave a Reply