ప్రపంచ దేశాల రుణభారం ప్రమాదకర స్థాయిలో పెరగడం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 97 ట్రిలియన్‌ డాలర్ల రుణభారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పతి కంటే ఎక్కువ. 2023లో అభివృద్ధి చెందుతున్న దేశాలు 847 బిలియన్‌ డాలర్ల వడ్డీని చెల్లించాయి. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్య భవిష్యత్‌ ఆలోచనలను కార్యరూపం దాల్చేలా వ్యవహరించడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక మాంద్యం, మహమ్మారి లేదా ప్రకృతి విపత్తులు వంటి షాక్‌లకు ప్రభుత్వాలు శీఘ్రంగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తున్నాయని తాజాగా ఐఎంఎఫ్‌ నివేదిక వెల్లడిరచింది. ఇప్పుడు ప్రపంచం ముందు  పెరుగుతున్న రుణసేవల ఖర్చులు భారంగా మారాయి. రష్యా-యుక్రెయిన్‌, పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ యుద్ధం, షిప్పింగ్‌ సంక్షోభం, ప్రభుత్వ ఆర్థిక సంస్థలపై సైబర్‌ ఎటాక్‌లు తదితర సంక్షిష్ట సవాళ్లు వర్తమాన దేశాలను ఆర్థిక మాంద్యంలోకి నెడుతున్నాయి.

                వర్థమాన దేశాల ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారడంతో ప్రజా సంక్షేమాన్ని సాగించడానికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, వృద్ధుల బాధ్యతల్ని నెరవేర్చే ప్రయత్నాలను అడ్డుకుంటుంది. వరుస బడ్జెట్‌ కోతల తర్వాత అనేక దేశాల్లో ప్రజా సేవలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, రుణ భారాలు పెరుగుతున్నందున, ప్రభుత్వాలు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, ప్రాథమిక సేవలకు తగినంతగా నిధులు సమకూర్చడానికి ఎక్కువ రుణాలు తీసుకోలేక పోవచ్చని ఐఎంఎఫ్‌ నివేదిక అభిప్రాయపడిరది. ప్రభుత్వం తన రుణానికి తీర్చలేకపోతే ‘‘ఆకస్మిక’’ ఖర్చుల కోతలు, పన్ను పెంపుదల అమలు చేయవలసి వస్తుంది అని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ద్రవ్య విధాన కమిటీ మాజీ సభ్యుడు మైఖేల్‌ సాండర్స్‌ హెచ్చరించారు. అది సాధారణ ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతుందన్నారు. 2013-2023 మధ్యకాలంలో ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలలోని పలు దేశాల రుణభారం ఆ దేశాలలోని జిడిపిలో 60 శాతానికి పెరిగింది. జూన్‌ 4న ఐక్యరాజ్య సమితి ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యుఎన్‌సిటిఎడి) విడుదల చేసిన నివేదిక పెరుగుతున్న రుణం ప్రజల శ్రేయస్సుకు ప్రమాదకరంగా పరిణమించిందని హెచ్చరించింది. 

                అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత డిసెంబర్‌ 29 నాటికి దేశ రుణం 34 ట్రిలియన్‌ డాలర్లకు (రూ.2,832 లక్షల కోట్లు) చేరింది. ఒక్కో అమెరికన్‌ నెత్తిపై లక్ష డాలర్లు (రూ.83 లక్షలు) అప్పు ఉన్నట్టు తేలింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ తాజా నివేదికలో వెల్లడిరచింది. బడ్జెట్‌ లోటు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయినట్టు వివరించింది. కొవిడ్‌ కల్లోలం ముగియగానే ముసురుకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు.. వెరసి అమెరికాను అప్పుల కుప్పగా మార్చాయి. ఆఫ్ఘాన్‌, ఇరాన్‌తో యుద్ధాలు, 2008 మాంద్యం, 2019 కొవిడ్‌ వైరస్‌తో అమెరికా ఖర్చు దాదాపు 50 శాతం పెరిగింది. పన్ను రాయితీలు, ఉద్దీపన కార్యక్రమాలు, పెరిగిన ప్రభుత్వ సైనిక వ్యయం, విస్తృత నిరుద్యోగం కారణంగా పన్ను రాబడి తగ్గడం వల్ల ప్రభుత్వ రుణం తీవ్ర పెరుగుదలకు దారి తీసింది. ఏ దేశమైన జిడిపికి మించిన రుణం చేస్తే ప్రభుత్వం తన రుణాన్ని చెల్లించడంలో కష్టాలను ఎదుర్కొంటుంది. 2023లో అమెరికా జిడిపి 26.97 ట్రిలియన్‌ డాలర్లు ఉండగా రుణం 33.17 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. జిడిపి నిష్పత్తికి 123 శాతం రుణం చేసింది.

                పేద దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏకైక ధనిక దేశమైన అమెరికాకు సత్తా ఉండి కూడా ఎందుకు రుణాలు చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. కార్పొరేట్లకు దేశ సంపదలను కట్టబెట్టటంతో పాటు ప్రపంచం మీద ఎదురులేని పెత్తనం కోసం మిలిటరీ బడ్జెట్‌ను విపరీతంగా పెంచటం, మార్కెట్లు, వనరులను ఆక్రమించుకొనేందుకు చేస్తున్న దురాక్రమణలు, యుద్ధాలకు వెచ్చిస్తున్న ఖర్చు వంటి ప్రజావ్యతిరేక పనులే ప్రధాన కారణం అని గమనించాలి. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రుణాల అంశం కీలక భూమిక పోషించబోతుండటంతో.. సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు విధించి అప్పుల నుంచి బయటపడాలని బైడెన్‌ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా పన్నుల వసూళ్లలో కీలకమైన ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)కు బడ్జెట్‌ కేటాయింపులను పెంచింది. అయితే, రక్షణేతర రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకోవాలని రిపబ్లికన్‌ చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. ప్రజలపై పన్నుభారాన్ని మోపవద్దని, ఐఆర్‌ఎస్‌ కేటాయింపులను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

                అమెరికా ప్రభుత్వం లోటు బడ్జెట్లు, చేస్తున్న విపరీతమైన అప్పులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయని, అవి తక్షణమే పరిష్కరించబడాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌-ఐఎమ్‌ఎఫ్‌) హెచ్చరించింది. అమెరికా జాతీయ రుణం 35 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటోందని డేటా చూపిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ఫెడరల్‌ బడ్జెట్‌ లోటు 2022 ఆర్థిక సంవత్సరంలో 1.4 ట్రిలియన్‌ నుంచి 2023 సంవత్సరం 1.7 ట్రిలియన్లకు పెరిగింది. ద్రవ్యలోటు ఈ సంవత్సరం 1.9 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అమెరికాలోని అధికారిక ఆర్థిక పర్యవేక్షణ సంస్థ అయిన కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 7 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇటువంటి అధిక లోటులు, అప్పులు అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పెరుగుతున్న ప్రమాదాన్ని, అధిక ఆర్థిక ఫైనాన్సింగ్‌ ఖర్చులకు, పరిపక్వ బాధ్యతలకు మధ్య అగాధం పెరుగుతుందని అమెరికా ఆర్థిక విధానాలపై జరిపిన సమీక్షలో ఐఎమ్‌ఎఫ్‌ పేర్కొంది. ఈ దీర్ఘకాలిక ఆర్థిక లోటులు నిరంతర విధానపరమైన లోపాలను సూచిస్తాయి. వీటిని అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని అది తెలిపింది. జనవరి 2023లో చట్టబద్ధంగా 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా నిర్ణయించబడిన రుణ పరిమితిని అమెరికా అతిక్రమించింది.

                అమెరికా ట్రెజరీ నుండి ఆసన్న దివాళా గురించి నెలల తరబడి హెచ్చరికల తర్వాత అధ్యక్షుడు జో బైడెన్‌ జూన్‌ 2023లో రుణ బిల్లుపై సంతకం చేశారు. అది జనవరి 2025 వరకు రుణ పరిమితిని నిలిపివేసింది. ఇది ప్రభావవంతంగా వచ్చే ఏడాది వరకు పరిమితులు లేకుండా రుణాలు తీసుకోవడాన్ని ప్రభుత్వం అనుమతించింది. బిల్లు ఆమోదం పొందిన రెండు వారాలలోపే రుణభారం 32 ట్రిలియన్లకు పెరిగింది. అప్పటినుండి పెరుగుతూనే ఉంది. అమెరికా దూకుడు వాణిజ్య విధానాల పెరుగుదలను ఐఎమ్‌ఎఫ్‌ తీవ్రంగా విమర్శించింది. చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వ్యాపార పరిమితుల విస్తరణ, 2023 బ్యాంక్‌ వైఫల్యాల ద్వారా వెళ్లడైన దుర్బలత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, అమెరికా అధిక వ్యయంపై తాజాగా ఐఎమ్‌ఎఫ్‌ ఈ హెచ్చరిక చేసింది. అమెరికా రుణం-స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) నిష్పత్తి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా ఉందని మంగళవారం నాడు ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఇసిడి) పేర్కొంది. డెట్‌(అప్పు)-టు-జిడిపి నిష్పత్తిని ఒక దేశం చేసిన అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఓఇసిడి ప్రకారం గత సంవత్సరం అమెరికా రుణం దాని జిడిపిలో 123 శాతానికి పెరిగింది.

                సంపన్న జి-7 దేశాల రుణాలు జిడిపిలో జపాన్‌ రుణం 254.6 శాతం, ఇటలీ రుణం జిడిపిలో 139.2 శాతం, ప్రాన్స్‌ రుణం జిడిపిలో 111.6 శాతం, కెనడా రుణం జిడిపిలో 104.7 శాతం, బ్రిటన్‌ రుణం జిడిపిలో 104.3 శాతం, జర్మనీ రుణం జిడిపిలో 63.7 శాతం, అమెరికా రుణం జిడిపిలో 123 శాతంగా ఉంది. మొత్తం జి-7 దేశాల సగటు రుణం వాటి జిడిపిలో 128 శాతం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ రుణం చాలా ఉన్నత స్థాయిలకు చేరుకుంది. ఇది దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. అంతేకాదు ఈ స్థితి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సంకేతం. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఆర్థిక విధాన అసమానతలు, రాట్చెట్‌ (అవాంచనీయ విధానాలు) ప్రభావం అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలలో కూడ ప్రబలంగా నెలకొంది. దేశాలపై గణనీయమైన ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పు, అధిక రక్షణ వ్యయం, భౌగోళిక రాజకీయ వైరుద్యాలు ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. రుణాలపై వడ్డీ వ్యయం, స్థూల అస్థిరత, అధిక ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.

                సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ దేశీయ వినియోగాన్ని గాని, తమ స్వంత పెట్టుబడులను గాని కుదించుకుని మిగిల్చిన ఆర్థిక వనరులను మూడవ ప్రపంచ దేశాలకు రుణంగా ఇస్తున్నాయని చాలామంది అనుకుంటారు. మరి వాస్తవం ఏమిటి? మూడవ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి (ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌) రుణాలు తీసుకుంటాయి. విదేశీ ఎగుమతి, దిగుమతుల లావాదేవీలలో వచ్చిన ఆదాయం కన్నా చెల్లించవలసినదే ఎక్కువైనప్పుడు ఆ లోటును భర్తీ చేసుకోడానికి రుణం అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ తీసుకున్న రుణంలో లోటును భర్తీ చేయగా ఇంకా మిగిలిపోతే అప్పుడు ఆ మేరకు విదేశీ మారక ద్రవ్యం నిల్వలకు తోడవుతుంది. అప్పుడు దానిమీద చక్రవడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే మూడవ ప్రపంచ దేశాలు విదేశీ చెల్లింపుల్లో లోటు ఏ మేరకు ఏర్పడుతుందో ఆ మేరకే విదేశీ రుణం తీసుకుంటాయి. ఈ విదేశీ రుణం ఏర్పాటు చేయడానికి సంపన్న పశ్చిమ దేశాలు తమ వనరుల  నుండి కొంత భాగాన్ని నిధిగా ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌, ఇతర ద్రవ్య సంస్థల్లో పెడుతాయి. గనుక ఆ త్యాగానికి బదులు తీర్చుకోడానికి మూడవ ప్రపంచ దేశాలు వడ్డీతో సహా ఆ రుణాలను తప్పకుండా తిరిగి చెల్లించాలి. లేదా తమ వనరులను కారుచౌకగా కట్టబెట్టాలి. ఇది సామ్రాజ్యవాద దేశాలు, వారి తైనాతీలు వ్యవహరించే తీరు.

                అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను బలహీనమైన క్రెడిట్‌ రేటింగ్‌లతో రుణం లభించకుండా నిరోధిస్తున్నాయి. దీంతో ఆ దేశాలలో (పాకిస్థాన్‌, శ్రీలంక వగైరా) రుణ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఇవాళ 28 అభివృద్ధి చెందుతున్న  ఆర్థిక వ్యవస్థలు బలహీనమైన క్రెడిట్‌ రేటింగ్‌లు కలిగి ఉన్నాయి. 2023 చివరి నాటికి ఈ దేశాల రుణం జిడిపిలో 75 శాతానికి చేరుకుంది. ఏ ఒక్క మూడవ ప్రపంచదేశమూ సంపన్న దేశాలతో ప్రతిఘటించి తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధంగా రుణ బకాయిల చెల్లింపుల షరతులను తిరగరాయగలిగిన పరిస్థితి లేదు. కాని ఉమ్మడిగా అన్ని దేశాలూ కలిసికట్టుగా నిలవగలిగితే కొన్ని రాయితీలనైనా సాధించవచ్చు. ఉదాహరణకు: అన్ని దేశాలూ ఉమ్మడిగా పట్టుబడితే, రుణ బకాయిల చెల్లింపుకు ఇప్పుడు విధిస్తున్న గడువులకు బదులు, ప్రతీ దేశమూ తన ఎగుమతుల ద్వారా లభించే ఆదాయంలో ఒక్క శాతాన్ని రుణబకాయిల నిమిత్తం చెల్లించేట్టు కొత్త నిబంధనలు ఉండాలని ఒత్తిడి చేయవచ్చు. అలాగే చెల్లించవలసిన మొత్తాన్ని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది సాధ్యపడాలంటే రుణగ్రహీత దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగాలి. ఆ తర్వాత రుణదాతలతో బేరసారాలు జరగాలి.

                భారత్‌.. అధిక రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సిఎఇఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తా అన్నారు. దేశ జిడిపిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దాదాపు 82 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదంటూ మన ప్రధాని అవకాశం దొరికిన ప్రతిచోట ఊదరగొడుతున్నాడు. అదే సమయంలో దేశం అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేస్తున్నది. పదేండ్లలో కేంద్రం చేసిన అప్పులు 150 శాతం పెరిగాయని అప్పుల చిట్టాను బయటపెట్టింది. ఇక రాష్ట్రాల అప్పు ఏకంగా 200 శాతం పెరిగిందని తేలింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! దీన్ని బట్టి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ప్రగతి సాధించిన రంగం ఏదైనా ఉందా? అంటే అది ‘రుణ రంగం’ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ అప్పుల వల్ల దేశం మౌలిక వనరుల పరంగా, అభివృద్ధి పరంగా ఏమైనా సాధించిందా అంటే అదీ లేదు.

                2014 మార్చి చివరి నాటికి జిడిపిలో రుణం 23.2 శాతం ఉండగా 2023 మార్చి నాటికి 59 శాతానికి పెరిగింది. అంటే 2014 మార్చి నుంచి 2023 మార్చి వరకు భారత్‌ రుణం 174 శాతం పెరిగింది. 2014లో రూ.58.6 లక్షల కోట్లు అప్పు ఉండగా 2023 మార్చి 31 నాటికి 155.6 లక్షల కోట్లకు పెరిగింది. 2014 మార్చిలో తలసరి అప్పు రూ.43,124 ఉండగా 2023 మార్చి నాటికి 1,09,373కి పెరిగింది. ఈ అప్పుల వెనుక ఉన్న అసలు కారణాలు పరిశీలించాలి. 2016 నవంబర్‌లో అకస్మాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. మరుసటి ఏడాది జూలైలో హడావుడిగా తీసుకొచ్చిన జిఎస్‌టి మరింత దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. దీన్నుండి బయటపడేందుకు అప్పుల మీద అప్పులు చేయాల్సి వచ్చింది. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 62 శాతం అప్పులున్నాయని కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడిరచింది. ఇది 156 లక్షల కోట్లకు సమానం. ఈ రుణ భారం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతున్నదా అంటే అదీ లేదు.

                కరోనా కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారటం మొదలైంది. 2018 జనవరి నుంచే భారత్‌ వృద్ధి క్రమంగా పడిపోవటం మొదలైంది. యేటా దేశ జిడిపి వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. గతేడాది ఉన్న వృద్ధి ఈ యేడు లేదు. రెండేండ్ల కింద ఉన్నంత గతేడాది లేదు. ఈ అంతరం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని ఐఎంఎఫ్‌ వంటి ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో మోడీకి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తల ఆస్తులు ఎంతగా పెరిగిపోయాయో చూస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి. 2020 లెక్కల ప్రకారం ముఖేశ్‌ అంబానీ ఆస్తులు 350 శాతం, గౌతమ్‌ అదానీ ఆస్తులు ఏకంగా 700 శాతం  పెరిగాయి. ఈ మూడేండ్లలో మరింత పెరిగాయి. కరోనా సైతం వీరి వృద్ధిని ఏ మాత్రం అడ్డుకోకపోవటం వైచిత్రి. తెచ్చిన అప్పుల్లో సగానికి పైగా ఇలాంటి కార్పొరేట్ల రాయితీలకే ఖర్చు చేస్తుంటే వాళ్ల ఆస్తులు పెరగవా మరి! ఈ విధంగా దేశాన్ని రుణభారతంగా మార్చింది మోడీ ప్రభుత్వం.

                దేశంలో మౌలిక సౌకర్యాలను పెంచటానికో, ఏవైనా భారీ ప్రాజెక్టులు ప్రారంభించటానికో   ఈ అప్పుల్ని ఉపయోగించారా వీరు? అంటే అదేమి లేదు. ఈ పదేండ్లలో కొత్తగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లేవు, నెలకొల్పిన భారీ పరిశ్రమల్లేవు. నిరుద్యోగాన్ని తగ్గించింది లేదు. ప్రజల ఆదాయాన్ని పెంచిందీ లేదు. పేదోళ్ళ కడుపు కొట్టి కార్పొరేట్లకు పెట్టడంలో మన పాలకులకు మించినవారు మరొకరు లేరు. అధిక ధరలతో ప్రజల్లో కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో వస్తువులకు డిమాండు తగ్గింది. ఈ క్రమంలో భారత్‌లో పెటుబడులు 20 ఏళ్ల  కనిష్టానికి పడిపోయాయి. తయారీ రంగం కుంచించుకుపోయింది. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కుదేలయ్యాయి. నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్టానికి పెరిగింది. ఫలితంగా సామాన్యుల జీవితాలను మరింత హీనస్థితికి దిగజారుస్తున్నది మోడీ ప్రభుత్వం.

                భారత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న పరిస్థితిని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు కొంతకాలంగా ఎత్తిచూపుతున్నాయి. దేశంలో వృద్ధి పెరిగినా ఉపాధి లభ్యత లేదు. జిడిపి పెరిగినా ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. ఈ పరిస్థితులనే పేద సంపన్న దేశాలు నేడు ఎదుర్కొంటున్నాయి. రుణగ్రస్థ దేశాలు తమ బడ్జెట్‌లో 20 శాతానికి పైగానే వడ్డీ, అసలు చెల్లించడానికి కేటాయిస్తున్నాయి. పర్యావసానంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయవల్సిన నిధులో కోత పెడుతున్నారు. అంటే ప్రభుత్వ రుణాలు పెరిగితే ప్రజల వినియోగం తగ్గుతుంది. ఆర్థిక అంతరాలు పెరుగుతాయి. విద్య-వైద్యం-పౌష్టిక ఆహారానికి ప్రజలు దూరమవుతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుదల మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. ప్రజలు ఇంతకుముందు చేసిన పరిమాణంలో వస్తువులు, సేవలు కొనుగోలు చేయలేరు. ఫలితంగా ఉత్పత్తి స్తంభించి పోతుంది. ప్రభుత్వాలు రుణాలు చేయడం వల్ల పెట్టుబడిదారులకు నిధుల లభ్యత తగ్గుతుంది. పరిశ్రమల అభివృద్ధి కుంటు పడుతుంది. ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌లు ఆర్థిక స్థిరత్వం కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి రుణాలతో, సామాజ్య్రవాదుల సహాకారంతో చరిత్రలో ఏ దేశం అభివృద్ధి చెందలేదు. అందువల్ల సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయ సోషలిస్టు ఆర్థిక విధాన సాధనే ప్రజల దీర్ఘకాల దైనందిక సమస్యలకు పరిష్కారం అని అర్థం చేసుకోవాలి. వ్యవస్థాగత మార్పుల కొరకు కార్మికులు, కర్షకులు, యువత సంఘటితంగా ఉద్యమించాలి.

Leave a Reply