నేలన మనుషులున్నంత కాలం
విగ్రహాలెందుకు
మనిషి మనిషి తో మాట్లాడనప్పుడే
శిల్పాల సృష్ఠి మొదలు
మట్టితో మమేకమైన జనంకు
బొమ్మల లొల్లి పట్టదు
రుధిరం చెమట చుక్కై
నుదుటి నుండి రాలుతుంటే
చెక్కబడిన రాయి ధ్యాస వుండదు
నాలుగు వేళ్ళు లోనికి వెళ్లటమే
గగనమై పోతున్న చేతులకు
శిల్పానికి దండం పెట్టే తీరిక ఉండదు
వంగి వంగి నాట్లు వేస్తుంటే
వంగిపోతున్న నడుములు
నిటారుగా ఉన్న విగ్రహం చేతిలోని వరి వెన్ను ను కాంచ లేవవు
ఎవరు వచ్చి పొడిసేదేమీ లేదనే
ఇంగిత జ్ఞానం
సాయం కోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూడదు
తన చుట్టూ ప్రకృతి ని చూసే కళ్ళకు
ఆకుపచ్చని ముస్తాబు వికృతి గా తోచు
రాలుతున్న కన్నీటి చుక్కలే
మెడలో హారాలై జారుతుంటే
కంఠాభరణాల చిరునామా దొరకదు
లేని తల్లి ని
సృష్టించే ప్రక్రియలో
భూస్వామ్య అవశేషాలు పదిలం
ఊరికో తల్లి కాదు
ఇంటి తల్లిని చూడ నేటి ఆవశ్యకత!
Related